[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 42” వ్యాసంలో యనమదల లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, శ్రీ సీతారామస్వామివారి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]ప్ర[/dropcap]త్తిపాడు నుంచి 6 కి.మీ.ల దూరంలో వున్న యనమదల చేరేసరికి ఉదయం 8-15 అయింది. ఏ ఊరెళ్ళినా, ఊరెలా వున్నది వగైరాలన్నీ చూడము.. సమయం వుండదండీ. అందుకే నేరుగా మేము అనుకున్న ఆలయానికి వెళ్ళి పోతాము. ఈ ఊళ్ళో వీరభద్రస్వామి ఆలయం చాలా ప్రఖ్యాతి చెందింది అన్నారు. నేరుగా శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళాము.
శ్రీ వీరభద్రస్వామి ఆలయం
ఇక్కడ వీరభద్రస్వామి వెలిసిన తీరు విలక్షణమైనది. ఈయన ఒక భక్తుని కలలో కనిపించి తన ఉనికిని తెలియజేయటమేగాక, ఆర్ధిక స్తోమత లేని ఆ భక్తునికి ఆలయ నిర్మాణానికి తగిన ధనాన్ని కూడా సమకూర్చాడు. ఇలాంటి కథలు చాలా ఆసక్తిదాయకంగా వుంటాయి కదా. మరి ఆ కథా కమామీషూ ఆలయం వారు చెక్కించిన శిలా ఫలకాల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే…
క్రీ.శ. 1318 వరకు ఈ ప్రాంతంలో కుమార కాకతీయ రుద్ర మహరాయలవారు రాజ్య పాలన చేశారు. తర్వాత రెడ్డి రాజులు పరసవేది వల్ల బలవంతులై కొండవీటిలో గిరి దుర్గములను, స్ధల దుర్గములను నిర్మించుకుని ఆరు తరాలవారు వంద సంవత్సరాలపాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారిలో మొదటివారయిన ప్రోలయ వేమారెడ్డి రాజ్యపాలన చేస్తున్నప్పుడు ములుగు వీరన్న అనే వీర శైవాచార వ్రత సంపన్నుడు దక్షిణ దేశ సంచారము చేస్తూ ఒక ప్రాంతంలో ప్రవీణులైన శిల్పులున్నట్లు తెలుసుకుని, వారిచేత వీరభద్రస్వామి విగ్రహాన్ని చెక్కించి తమ నివాస స్ధలంలో ప్రతిష్ఠించాలని బండి మీద తీసుకుని తిరిగి వెళ్తూ యనమదల దగ్గరకు వచ్చేసరికి బండి ముందుకు కదలలేదు. వీరన్నగారు అక్కడ ఆగి, లింగార్చన చేసుకుని, ఆ రాత్రికి నిద్రించగా, వీరభద్రస్వామి ఆయన కలలో కనబడి, తనకా ప్రదేశం నచ్చిందని, తనకి అక్కడే ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. వీరన్న నేను బహుదూర సంచారం చేస్తూ వస్తున్నాను. దానివల్ల రిక్త హస్తాలతో వున్నాను. ఈ నూతన ప్రదేశంలో ద్రవ్యం సమకూర్చుకుని ఆలయం నిర్మించగలనా అని అడిగారట. అప్పుడు స్వామి ఆ ఏర్పాటు తానే చేస్తానని చెప్పాడుట. మర్నాడు వీరన్నగారు నీళ్ళు తాగటానికి దున్నపోతులను చెరువు దగ్గర వదిలారు.
చెరువులోకి దిగిన దున్నపోతులు కొంతసేపటికి గట్టుపైకి చేరుకున్నాయి. వాటి కొమ్ములకి తగులుకున్న తాళ్ళతో సహా లంకెబిందెలు రావటం చూసి ఆ భక్తుడు ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు. గ్రామ పెద్దలను పిలిచి లంకె బిందెలు భద్రపరచి కొండవీటి ప్రభువయిన ప్రోలయ వేమారెడ్డికి సమాచారం తెలియజేస్తారు. వేమారెడ్డి వెంటనే వచ్చి స్వామి మహిమకి సంతసించి, ఆ ధనముతో అక్కడ ఆలయం నిర్మింప చేసి వీరన్నగారితో విగ్రహ ప్రతిష్ఠకావిస్తారు.
క్రీ.శ. 1418లో రెడ్ల ప్రభుత్వం ముగిసిన తర్వాత గజపతి ప్రభుత్వానికి వచ్చి 1514 వరకు పాలించాడు. ఆ కాలంలో నరపతి సిహాసనాన్ని అధిష్టించి వుండగా విశ్వవిఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి కొండవీటి గిరి దుర్గం, స్ధల దుర్గం జయించి 1515లో జయస్తంభాలను స్ధాపించారు. ప్రతాప రుద్ర గజపతి కుమారుడైన వీరభద్ర గజపతిని పట్టుకుని, కొండవీటి దుర్గంనుండి సింహాచలం వరకు జయించాడు. తర్వాత ప్రతాప రుద్ర గజపతి సేవకుడు చినబొమ్మనాయుడు 1531లో ఈ ఆలయ ప్రాకారాన్ని మండపాలను నిర్మించాడు.
అలా శ్రీ వీరభద్రుడు, తను ఇక్కడ వుండాలని కోరుకోవటమేకాక, తన ఆలయ నిర్మాణానికి కావలసిన సొమ్ము కూడా తానే సమకూర్చాడు. అంతేకాదు, తర్వాత కాలంలో ఈ స్వామి అనేక మహిమలను చూపించటంతో స్వామిని అమిత మహిమాన్వితుడుగా భక్తులు భావిస్తారు. ఈయన్ని పూజించటంవల్ల కోరిన కోరికలు త్వరగా తీరుతాయని అత్యంత భక్తి శ్రధ్ధలతో ఈయన్ని ఆరాధిస్తారు.
ఆలయంలో వీరభద్రస్వామికి ఎడమవైపు ప్రత్యేక ఉపాలయంలో భద్రకాళి అమ్మవారు. బయట కుడివైపు శివలింగం. మేము వెళ్ళేసరికి అక్కడ అభిషేకం జరుగుతోంది. ముందు మరో ఉపాలయంలో సుబ్రహ్మణ్యస్వామి.
అక్కడనుంచీ ఆ ఊళ్ళోనే వున్న మరో పురాతన ఆలయం శ్రీ సీతా రామాలయానికి బయల్దేరాము.
శ్రీ సీతా రామస్వామి ఆలయం
ఈ ఆలయాన్ని1823 వ సంవత్సరంలో శ్రీ గొల్లపూడి పట్టాభిరామారావు, శ్రీ గొల్లపూడి లక్ష్మణ్ నిర్మించారు. ఈ దేవాలయాన్ని రెండవ భద్రాద్రి అంటారు. కారణం ఏమిటో తెలుసా? భద్రాచలం ఆలయంలో మాదిరే ఇక్కడ కూడా రాములవారి వామాంకంపై సీతాదేవి కూర్చుని వుండటం. కుడి పక్కన లక్ష్మణస్వామి, ఎదురుగా ఆంజనేయస్వామి వుంటారు. ఈ విగ్రహాలు గ్రామంలో వున్న చెరువు తవ్వకాలలో లభించాయిట. రథం, వాహనాలు వగైరాలన్నీ తర్వాత చేయించారు.
ఈ స్వామిని సేవిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సంతానం లేనివారు అంకురార్పణ జరిగే రోజు గరుడ ముద్దల ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ప్రసాదం కోసం గుంటూరు జిల్లా నుంచే కాక, ఇతర ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు.
ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రత్యేక ఉపాలయం వున్నది. ఆలయం కోసం జరిపే తవ్వకాలలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయల్పడిందిట. ఆ సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఒక భక్తునికి వంటిమీదకి వచ్చి తనని సీతారామస్వామి ఆలయంలోనే ప్రతిష్ఠించవలసినదిగా ఆదేశించారనీ, అందుకే ఇక్కడే ప్రతిష్ఠించారనీ తెలిసింది.
ఆలయం బయట మరో ఉపాలయంలో శ్రీ వీరాంజనేయస్వామి వున్నాడు. ఈ ఆలయం 12వ శతాబ్దంలోనిది. దీనికి సంబంధించిన వివరాలు కైఫియత్‌లో, జిల్లా శాసనాలు అనే పుస్తకంలో వున్నాయి. తర్వాత 1556లో శ్రీ కృష్ణ దేవరాయల వంశంలోని రామరాజు అనే రాజు ఈ ఆలయ నిర్వహణకి భూ దానాలిచ్చాడని చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
పురాతనమైన ఈ ఆలయానికి తర్వాత ఆలయ నిర్వహణ కోసం, అభివృధ్ధికోసం కొందరు దాతలు అనేక ఎకరాల పంట భూములను స్వామికి సమర్పించారు. కానీ వీటిలో చాలామటుకూ అన్యాక్రాంతంగా వున్నాయి. దీనితో పూర్వం ఇక్కడ జరిగే ఉత్సవాలు అన్నీ జరిపించలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం ఎండౌమెంట్స్ వారి అధీనంలో వుంది. ఆలయాలు సర్కారు వారి అధీనంలోకి వచ్చాక అయినా వాటి గురించి విచారించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలేమైనా చేశారా? అలా స్వాధీనం చేసుకుంటే ఈ ఆలయాలన్నీ గత వైభవంతో వెలుగొందుతాయికదా.
ఆలయాల ప్రస్తుత పరిస్ధితిని చూస్తూ, గత వైభవాన్ని తలచుకుంటూ అక్కడనుంచి మా తర్వాత మజిలీ వైపు బయల్దేరాము.