వైవిధ్యభరితమైన ‘క్రీడాకథ’లు

0
4

[dropcap]మ[/dropcap]న దేశంలో అన్ని రంగాల కంటే దారుణంగా నిర్లక్ష్యం చేయబడిన రంగం ఏదైనా ఉందా అని అంటే అది క్రీడారంగమేనని చెప్పాలి. విద్యాబోధనలో అవసరమైన వ్యాయామ విద్య ప్రాముఖ్యత గురించి అటు ప్రభుత్వం, ఇటు పంతుళ్ళు – తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. భావి క్రీడాకారులను స్కూల్ లెవెల్ నుండే తయారు చేయాలన్న సంగతిని అంతా మరిచిపోతున్నారు. పెద్ద పెద్ద ఆటగాళ్లు తమ పిల్లలకు ఐదవ ఏట నుంచే శిక్షణ ఇప్పిస్తారు. అలా కాకుండా ‘చదువు చెప్పమని బడికి పంపిస్తే ఆటలాడిస్తారా’ అని పంతుళ్ళను ప్రశ్నించే తల్లిదండ్రులు వున్నారు. ఆటలు కూడూ గుడ్డా పెట్టవని చాలామంది అభిప్రాయం. అందుకని ఏ ఆటల జోలికి పోకుండా కష్టపడి చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని సుఖంగా బ్రతకడమే ఒక లక్ష్యమైపోయింది. ఎవరైనా ఆటల మీద మక్కువ పెంచుకుంటే బాల్యంలో తల్లిదండ్రులు, పెళ్లయింతర్వాత భార్య నిరుత్సాహపరిచే పరిస్థితి కూడా వుంది. వీటన్నిటిని తట్టుకొని క్రీడాకారుడిగా ఎదిగితే అవకాశాలు రావు. రాజకీయాలు, సిఫార్సులు, లంచాలు వుంటే అనర్హులు కూడా పెద్ద పెద్ద టోర్నమెంట్‌లలో, ప్రపంచ పోటీలలో కూడా పాల్గొనవచ్చు.

పై చదువులలో, ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది. కాబట్టి చాలామంది ఓ.సి. విద్యార్థులు పోటీని తట్టుకోవడానికి ఆ కోటాలో రావడానికి ప్రయత్నిస్తారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకుంటే, పై అధికారికి ఆటల పట్ల ఆసక్తి లేకపోతే, వాడ్ని పనిచేయమని వేధించుకు తింటాడు. క్రీడా నైపుణ్యాలు గల ఆడవారిని పరువు, గౌరవ మర్యాదలు పేరిట తల్లిదండ్రులు, భర్త అణచివేయడానికి ప్రయత్నిస్తారు.

చదువు అంటే ఎంసెట్ ఒక్కటే చదువని ఎలా భ్రమ కలిగిందో, ఆటలంటే ఒక్క క్రికెట్ అనే భావన స్థిరపడిపోయింది. మన దేశంలో క్రికెట్ దాదాపుగా అన్ని ఆటలను మింగేసింది. ఈరోజు మన జాతీయ క్రీడ హాకీ అని ఎందరికి తెలుసు? క్రికెట్ బోర్డు, మీడియా కలిసి ఒక పథకం ప్రకారం క్రికెట్‌ను ప్రజల మీద రుద్ది బోలెడు డబ్బు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన ఇతర క్రీడలను, క్రీడాకారులను పట్టించుకోకపోవడం మామూలైపోయింది.

ప్రపంచంలో అతి పెద్ద క్రీడల పండుగ ఒలింపిక్స్. విశ్వవ్యాప్తంగా వందలాది దేశాలు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని ఈ పోటీలలో మనం ఏ స్థాయిలో వుంటున్నామో గమనించాలి. ఒలింపిక్స్‌లో చాలా క్రీడాంశాలలో కనీస అర్హత కూడా సాధించలేని స్థితి. కరణం మల్లేశ్వరి కంచు పతకం, పీవీ సింధు రజత పతకం తప్ప మరొక పతకం సాధించలేక పోయాము. 2018లో కామన్వెల్త్ క్రీడలలో మూడవ స్థానం మనది. ఆసియాడ్‌లో కూడా మన పరిస్థితి అంతంత మాత్రమే. రాబోయే ఒలింపిక్స్, ఆసియా క్రీడలలో, వివిధ ప్రపంచ స్థాయి పోటీలలో ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి? ఏ అంశాలపై దృష్టి సారించాలి? వంటి విషయాలపై కనీస స్థాయిలో సమీక్ష కూడా లేదేమో అనిపిస్తుంది. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియాడ్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లపై ముందస్తుగా దృష్టి సారించి పతకాల లక్ష్య సాధనే ధ్యేయంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలి. అప్పుడే మనం క్రీడారంగంలో తలెత్తుకు తిరుగగలం.

క్రీడల పట్ల దేశంలో ఇంత నిరాశాపూరిత వాతావరణం ఉన్న నేపథ్యంలో, క్రీడల మీద వచ్చిన కథలు చాలా తక్కువ ఉంటాయని భావించాను. కానీ అది నిజం కాదని నిరూపిస్తూ కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ 23 కథలతో ‘క్రీడాకథ’ అని పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆటలను కేంద్రబిందువుగా చేసుకొని అల్లిన కథలు మాత్రమే ఇందులో ఉండడం విశేషం.

ఇందులో – ఏది దొరికితే అది, ఎలా పడితే అలా ఆడుకోవడం పసిపిల్లల సహజలక్షణమని నిరూపిస్తూ భూపాల్ ఒక కథ రాయగా, గ్రామీణ క్రీడల అన్ని కనుమరుగవుతున్నాయని ఆవేదన కవికొండల వెంకటరావు కథలో కనిపిస్తుంది. చాగంటి తులసి ‘మాంజా దారం’ కథలో ఇంట్లో వండడానికి బియ్యం లేవు, కాని మావయ్య ఒక్క రూపాయి అప్పు తెచ్చి గాలిపటం మాంజాలకు ఖర్చుపెట్టి పెద్దలకు బోలెడు వినోదం చేకూర్చుతాడు. అంత ఆనందాన్ని ఇచ్చిన గాలిపటం వేడుకను దండగ అనడానికి ఎవరికీ నోరు రాదు.

బాక్సింగ్, కుస్తీ పోటీలు క్రమంగా ప్రేక్షకులలోని హింసాప్రవృత్తిని రెచ్చగొడతాయి అని ఎన్నార్ చందూర్ తన కథలో చెబుతారు. ఈ పోటీలలో వాళ్లు ఎంతసేపు తన్నుకుంటే అంత వినోదం. సులభంగా ఓడిపోతే ఒప్పుకోరు. కొన్ని సార్లు ఓడించడమే కాదు, ప్రత్యర్థిని చంపివేయమని ప్రేక్షకులు కేకలు వేస్తూ తమ కోరికను తెలియజేస్తారు. ఇలాంటి వారి కోసం కొంతమంది అనధికారికంగా అండర్‌గ్రౌండ్ పోటీలను ఏర్పాటు చేసి, పోటీదారులు చచ్చేంతవరకు పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో పాల్గొనే వారికి భారీ ఎత్తున పారితోషికం ఇస్తారు. టిక్కెట్లకు కూడా ఎక్కువ ధరను నిర్ణయిస్తారు. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్. పోటీలు అలాంటివే.

‘తాయ్ చి’ ప్రాచీనమైన చైనీస్ యుద్ధకళ. ఇందులో ప్రవీణుడైన ‘తాయ్ చి మాస్టర్’ అలసిపోడు. శత్రువులు అలసిపోయేట్టు చేస్తాడు. తాను టెన్షన్ పడడు. ఎదుటి వాడికి పిచ్చెక్కిస్తాడు. బొక్కలు విరగ్గొట్టడు. విరగ్గొట్టుకునేలా చేస్తాడు. చంపడు, చచ్చేలా చేస్తాడు. హార్దిక రాసిన ఈ కథలో నూకరాజు చిన్నప్పుడు పారిపోయి జపాన్ వెళతాడు. అక్కడ చిల్లర మల్లర పనులు చేసుకుంటూ, కరాటే నేర్చుకొని బ్లాక్ బెల్ట్‌తో వైజాగ్ తిరిగి వస్తాడు. అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్న తమ్ముడు నాగరాజును చేరదీసి, కరాటేలో ఎక్స్‌పర్ట్‌గా తయారుచేసి ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పి, వాడిని స్ట్రీట్ ఫైటర్‌గా తయారు చేస్తాడు. అన్న దానకర్ణుడిలా, తమ్ముడేమో అండర్ వరల్డ్ దాదాగా బిల్డప్ లిస్తారు. నాగరాజు తన ప్రవర్తనతో, క్రూరత్వంతో అందర్నీ భయభ్రాంతులను చేస్తూంటాడు. విశాఖలో తాయ్ చి శిక్షణా సంస్థను మూసివేయించిన కారణంగా తాయ్ చి మాస్టర్ రెనాల్డ్ నాగరాజును పబ్లిక్‌గా ఫైట్ చేద్దామని ఆహ్వానిస్తాడు. బలిష్ఠుడు, క్రూరుడు అయిన నాగరాజును పోటీలో ఘోరంగా ఓడించి ‘తాయ్ చి’కి ప్రతిష్ఠను తెచ్చి పెడతాడు. బ్రూస్‌లీ నటించిన ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’ మొదలుకొని ఇలాంటి కథలతో చైనా హాంకాంగ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. ‘తాయ్ చి హీరో’ పేరుతో ఏకంగా ఒక సినిమానే వచ్చింది.  విలన్ కూడా – ‘ఫైట్ టు డెత్’, ‘ఫైట్ టూ ఫినిష్’ సినిమాలలో కనిపించే భయంకరత్వం, క్రూరత్వంతో నిండి ఉంటాడు. ఇలాంటి వీధి పోరాటాలు, ఆదిక్యతా పోరాటాలు మన దగ్గర వేరే విధంగా ఉంటాయి. కానీ నప్పకపోయినా ఈ కథను మన నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దడంలో రచయిత సక్సెస్ కాగలిగారు.

కొంతమంది ఆటగాళ్లకు ఆట ఒక వ్యసనంగా తయారవుతుంది. వాళ్లను ఆట నుండి దూరం చేస్తే భరించలేరు. దారిద్ర్యంలో తిండి కోసం వెతుక్కుని పరిస్థితులలో వుండి, చస్తే పీడా పోతుంది అనుకున్న రమణ – ‘కేరం బోర్డు’ కనిపిస్తే చాలు, ఆ ఆటలో మునిగి సర్వం మరిచిపోవడాన్ని పూసపాటి కృష్ణంరాజు ఆసక్తికరంగా చిత్రీకరించారు. సంసారం, ‘చదరంగం’ ఒకే ఒరలో ఇమడవు అని గుర్తించిన ఆటగాడు చదరంగం కోసం భార్యను, ఉద్యోగాన్ని, డబ్బును, అన్ని వదిలేసుకుంటాడని శ్యామల గారు తన కథలో తెలియచేశారు.

సి.రామచంద్రరావు రాసిన ‘టెన్నిస్ టోర్నమెంట్’లో, టెన్నిస్ ప్లేయర్ అయిన భార్య కమలను ఆటకు దూరం చేసి, తనను తాను చాంపియన్ అనుకునే భర్త గిరికి తగిన గుణపాఠం చెప్పడానికి వేసిన ప్రణాళిక మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చదరంగం మీద వచ్చిన మంచి కథ అంటే శ్రీపాద వారి ‘వడ్లగింజలు’ గురించే చెప్పుకుంటారు. అంతకంటే వైవిధ్యభరితమైన కథ యామిజాల పద్మనాభస్వామి గారి ‘తోసిరాజు’. రాజులతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వాళ్లకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం. ఆనంద గజపతి రాజులవారు, కూరెళ్ళ శాస్త్రులవారు గంటలు గంటలు చదరంగం ఆడుకునే మంచి స్నేహితులు. ఒక్కసారి చెప్పి మరీ రాజుగారి ఆటకట్టించిన శాస్త్రులవారికి దేవిడీమన్నా జరగడంతో శాస్త్రిగారికి తాను చేసిన పొరపాటు తెలిసి వస్తుంది.

ఆటగాళ్లపై కొనసాగే వివక్ష- అణచివేతలను, ఆట వెనుక ఉన్న రాజకీయాలను తెలియజేసే కథలు కూడా కొన్ని ఉన్నాయి. అయాచితం స్పందన రాసిన ‘ఆమె గెలిచింది’ కథలో పరువు, గౌరవ మర్యాదల పేరిట తల్లితండ్రులు పల్లవిని బాడ్మింటన్ ఆడడాన్ని నిషేధిస్తారు. దాంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా ఫైనల్లో ఆడడానికి బొంబాయి వచ్చేస్తుంది. విషయం తెలిసి తల్లిదండ్రులు వచ్చి తిట్టి అమ్మాయిని తీసుకు వెళతారు. అదే పల్లవి ఆటల మీద ఇష్టంతో తన కూతురిని చాంపియన్‌గా తీర్చిదిద్దుతుంది. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫర్ ఉమెన్ ఫైనల్స్ లో గెలిచిన మైథిలి “నా గైడ్, నా టీచర్, నా కోచ్ – మా అమ్మ” అని అందరికీ గర్వంగా పరిచయం చేస్తుంది.

క్రీడా రాజకీయాల గురించి రాచపూడి రమేష్ రాసిన ‘సాహసక్రీడ’ కథ వివరిస్తుంది. క్రీడలను ప్రోత్సహించడానికి నెలకొల్పిన స్పోర్ట్స్ స్కూలు రాజకీయాలకు నెలవు. నాయకుల సిఫార్సు, లంచాల వల్ల అనర్హులను పోటీకి పంపడం ఉంటుంది. ఉద్యోగం అవసరమై రైల్వేలో చేరితే ఆటలకు సమయం వెచ్చించడం పనికిమాలిన పని అని అతడికి వెసులుబాటునివ్వరు. కొత్త ఆఫీసర్ శోభనాద్రి వచ్చి అతడిని ప్రోత్సహిస్తాడు. రాజకీయాలు, లంచగొండితనం, సిఫార్సులు లేక అతనికి చాలావాటికి అవకాశం దొరకదు.  తరువాత తన ప్రతిభతో పోటీలలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందుతాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం వారి ‘క్రీడారత్న’ అవార్డుకు పక్కన పెట్టేయడంతో, ఈ రాజకీయాలతో విసిగిపోతాడు.

క్రికెట్‍లో చోటుచేసుకున్న రాజకీయాలను వివరించిన కథ కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘మర్డర్ కానీ మర్డర్’. యూరోపియన్ దేశాలలో జరిగే ఆటల పోటీలలో బ్లాక్స్, ఆఫ్రికన్స్ పాల్గొని తమ ప్రతిభను చాటుకుని వర్ణవివక్షతను అధిగమించాలని తలుస్తారు. భిన్న జాతులు, భిన్న సంస్కృతులమయమైన మన దేశంలో మాత్రం వర్ణం, మతం, కులం, ప్రాంతం ఆధారంగానే విజేతను గుర్తించే స్థాయికి దిగజారిపోయాం. చిలుకూరి దీవెన రాసిన కథలో కూడా ప్రతి ఏడూ జూనియర్ కాలేజీల మధ్య జరిగే జిల్లా స్పోర్ట్స్ మీట్‌లో చాలా ఆటల్లో ఫైనల్స్ గెలిచి చాంపియన్‌షిప్ అందుకోబోయే కురుగంటి కాలేజీ అమ్మాయిలు నల్లగా, పొట్టిగా ఉన్నారని అసహ్యించుకునే అనంతపురం కాలేజీకి చెందిన తన కూతురిని క్రీడాస్ఫూర్తి అలవరచుకోమని తల్లి చెబుతుంది. బ్లాక్స్ చేస్తున్న కృషిని గుర్తించిన యూరోపియన్ దేశాలు వాళ్లని ప్రోత్సహించి తమ దేశాల తరపున ఆడించి పతకాలు గెలుచుకుంటున్నాయి. అలాగే మన దేశంలో కూడా దళితులు, బహుజనులను ఉపయోగించుకోవాలని రచయిత్రి సూచించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ మన ప్రభుత్వం ఈ దిశగా అని ఆలోచించి గిరిజనులలో నుండి ఎంపిక చేసినవారిని విలువిద్యా పోటీలలోకి తీసుకుని ప్రత్యేక శిక్షణలు ఇస్తున్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి.

కొంతమంది ఆటగాళ్ళు ఓటమిని జీర్ణం చేసుకోలేరు. టెన్నిస్ ఆటగాళ్లలో కొందరు ఒక సెట్ ఓడిపోయినప్పుడు కోపం పట్టలేక రాకెట్ విరగ్గొడుతుంటారు. అంపైర్లను తిట్టడం, రాకెట్లు విరగ్గొట్టడం, నిబంధనలను అతిక్రమించడం చేస్తే ఆటలో ఉండి బహిష్కరిస్తుంటారు. సాయి బ్రహ్మానందం గుర్తి రాసిన ‘లవ్ ఆల్’ కథలో అభి మంచి టెన్నిస్ ప్లేయర్. వింబుల్డన్ జూనియర్స్ నెగ్గాక ప్రో అవుదామని నిర్ణయించుకుంటాడు. ర్యాంకింగ్ సరిపోక మొదట్లో కొన్ని క్వాలిఫైయింగ్ రౌండ్లు ఆడాల్సిరావడం, అందులో రాకెట్లు విరగ్గొట్టడం చూసి బహిష్కరిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్‌కు వెళ్లి, ముందు జెట్‌లాగ్ పోవడానికి వేసుకున్న మందుబిళ్ళలలో నిషిద్ధ ఉత్ప్రేరకాలు వుండడంతో బహిష్కరణకు గురికావలసి వస్తుంది. దాంతో అభి టెన్నిస్ ఆడడం మానేస్తాడు. చాలాకాలానికి ఆట నేర్పమని వచ్చిన మలివై పరిచయంతో అభిలో మునుపటి ఉత్సాహం వస్తుంది. కానీ తన పాత ప్రవర్తనను మార్చుకోలేక పోతాడు. కరీబియన్ దీవులు తిరిగిన తరువాత అభి ప్రవర్తనలో మార్పు వస్తుంది. అక్కడ టెన్నిస్ రాకెట్లు తయారుచేసే ఫ్యాక్టరీ తిరిగి చూస్తాడు. ఎన్నో ఏళ్లు టెన్నిస్ రాకెట్‌లన్ని మెషిన్‌తో తయారు చేస్తారని అనుకున్నానని, కానీ అవన్నీ ఎంతో కష్టపడి చేత్తో తయారు చేస్తారని తెలిశాక తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది అర్థమై బాధపడతాడు. ఎంతో కష్టపడితే కాని రాకెట్టు తయారు కాదని, ఒక్కోటి తయారుచేయడానికి పది గంటలకు పైగా పడుతుందని,  అటువంటిది నిముషంలో ఒక చిన్న పాయింట్ రాలేదని విరగ్గొట్టడం గుర్తొచ్చి బాధపడతాడు. పైగా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వికలాంగుడు తాను స్వయంగా చేసిన రాకెట్ తీసుకోవడం కూడా అభిలో ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. దాంతో అభి పూర్తిగా మారిపోతాడు. ఇప్పుడు అభి వింబుల్డన్ గెలిచినా, గెలవకపోయినా రాకెట్లు మాత్రం విరగవని ఖచ్చితంగా చెప్పవచ్చు అని రచయిత కథ ముగిస్తారు.

క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ ఆటగాళ్లకు అందరికీ అభిమానులు ఉంటారు. వారి అభిమానం కొన్నిసార్లు ఆరాధనకు దారితీస్తుంది. దేవుడిలా చూస్తారు. అంత వేగంగా ముక్కు ముఖం తెలియని వాళ్ళ మీద కేవలం ఆట చూసి పెంచుకున్న అభిమానం ఎంతసేపు ఉంటుంది? ఆ ఆట ఆడినంతసేపే. వాళ్లు బాగా ఆడినంతసేపు అభిమానులు వుంటారు. వాళ్లు బాగా ఆడలేకపోతే, రిటైర్ అయిపోతే మరచిపోతారు. అప్పుడు ఎవరు బాగా ఆడితే, వారి చుట్టూ తిరుగుతుంటారు. ఆ అభిమానాలు, హర్షధ్వానాలు ఎప్పుడు ఉంటాయనుకుంటే, అది అత్యాశేనని యర్రంశెట్టి శాయి కథ ‘అవుట్’ తెలియజేస్తుంది.

అసలైన అభిమానం అంటే ఏమిటో తెలియజేసిన యండమూరి వీరేంద్రనాథ్ ‘టాస్’ కథ బాగుంది. ఇందులో అరివీర భయంకరమైన వెస్టిండీస్ జట్టుతో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా మొదటిసారి మైదానంలోకి దిగిన ప్రకాష్ బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్ లోనూ విఫలమవుతాడు. అది చూసిన అతని ప్రేయసి శైలజ, తన స్నేహితురాళ్ళంతా అతని ఆట చూసి ఎగతాళి చేస్తున్నారని నిందిస్తుంది. రెండవ ఇన్నింగ్స్‌లో పుంజుకున్న ఫ్రకాష్ బ్యాటింగ్‍లోనూ, బౌలింగ్‌లోనూ అదరగొట్టి టెస్ట్ డ్రా చేసి అందరి అభిమానాలను చూరగొంటాడు. అప్పుడు అభినందించడానికి వచ్చిన శైలజతో “నేను నిన్ను ప్రేమించింది నువ్వు నా దుఃఖంలో పాలు పంచుకుంటావని, అంతేగాని నా గెలుపులో కాదు. ఐ యామ్ సారీ శైలజా! నేను నిన్ను ప్రేమించలేను” అని తిరస్కరిస్తాడు. అతడికి తెలుసు, తన గెలుపుకిది ప్రారంభం అని. తను కనుక్కోలేడు ఎవరు తనని నిజంగా ప్రేమిస్తున్నారో? ఎవరు తన గెలుపును ప్రేమిస్తున్నారో? ఎంత బాధామయ స్థితి ఇది.

ఆటలో గెలుపు ముఖ్యమైనప్పుడు, గెలవటం కోసం ఎంతటి నీచానికయినా వెనుదీయని మనుషులుంటారు. చదరంగం పోటీలలో పాల్గొనే ఇద్దరిలో ఒకరు ఏ కారణం చేతనయినా అంటే… పిచ్చి వల్ల గానీ, మరణం వల్ల గానీ, విదేశీ పయనం వల్ల గాని, మరే కారణం చేతనయినా గాని పోటీలో పాల్గొనలేకపోతే, రెండో వ్యక్తి ఆ సంవత్సరం ఇండియన్ చెస్ మాస్టర్‌గా నిర్ణయించబడతాడు. ఈ లొసుగును అర్థం చేసుకున్న నాయర్, పోటీలో వినోద్‍ను ఎలాగూ గెలవలేనని భావించి, అతడ్ని అడ్డు తొలగించుకోవడానికి చంపి సముద్రంలో పడేస్తాడు. చస్తూ వినోద్ అతన్ని పోలీసులకి ఎలా పట్టించాడో తెలుసుకోవాలంటే మల్లాది రాసిన ‘చదరంగంలో హత్య’ చదవాల్సిందే.

ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఎన్ని విధాలుగా అణగదొక్కాలో అన్ని విధాలుగా అణగదొక్కడమే కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్‌తో అతడ్ని అడ్దు తొలగించుకుంటారు. కస్తురి మురళీకృష్ణ రాసిన ‘మర్డర్ కాని మర్డర్’ కథ ఒక విధంగా క్రికెట్ రాజకీయాలను తెలియజేస్తుంది. ఆటలపై పందేలు కాసి, పోలీసులకు దొరికి ఉన్నవాళ్ళు పరువు పోగొట్టుకుంటారు. అప్పులు చేసి, ఉన్నవి లేని అన్నీ అమ్ముకుని పందేలు కాసి బికారులయ్యేవారు కూడా వుంటారని పి. బాల రాసిన ‘పందెం’ కథ తెలియజేస్తుంది.

ఒక వస్తువుకు వున్న ఉపయోగాలు చరిత్ర క్రమంలో బయటపడతాయని మార్క్స్ చెప్పినదాన్ని వసుంధరగారు ‘అబ్బాయి హాకీ ఆడాడు’లో నిరూపిస్తారు. ఇందులో కొడుకు హాకీ ఆడాలని తండ్రి ఎంతో ఇష్టంగా హాకీ స్టిక్ కొనిస్తాడు. హాకీ ఆడటం తప్ప, ఆ హాకీ స్టిక్‌ను ఇంటా-బయటా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో, ఆ అబ్బాయి అన్ని రకాలుగా దాన్ని వాడుకుంటాడు. తల్లి దానికి ఊలు చుట్టడంతో దాన్ని మూలకు పెట్టేయాల్సి వస్తుంది. చివరకు క్రికెట్ బ్యాటుతో అబ్బాయి  హాకీ ఆడుతుంటే చూసి, తన కోరిక ఇలా నెరవేరిందా అని తండ్రి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.

టీవీలలో వస్తున్న ఆటల పోటీలలో వెయిట్ లిఫ్టింగ్ గురించి తెలుసుకున్న మామ, మన పల్లెల్లో సేద్యగాళ్ళంతా అలాంటి బరువులు ఈజీగా మోసేస్తారు, అంతే చులాగ్గా బండ్లలోకి విసిరేస్తారు, మరి వాళ్ళకు కూడా పారితోషికాలు ఇచ్చి సన్మానిస్తే, మన ‘దేశగౌరవం’ పెరుగుతుంది కదా అంటే, ఎవరూ సమాధానం చెప్పలేకపోతారు. ఇందులో మొదటి కథ పూర్తి హాస్య ధోరణిలో వుంటే, రెండో కథను రాప్తాడు గోపాలకృష్ణ వ్యంగ ధోరణిలో తీర్చిదిద్దడం విశేషం.

‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు’ అనే పద్యపాదాన్ని గుర్తుకు తెచ్చే కథ జంపన పెద్దిరాజు రాసిన ‘ఫౌల్… ఫౌల్’. సహజత్వానికి దూరమై, ఆదర్శవాద ధోరణిలో వచ్చిన కథ ఇది. దీనితో పాటు ‘నా ఒలింపిక్ కల’, ‘క్రికెట్… క్రికెట్’ లాంటి పేలవ కథలు ఈ సంకలనంలో లేకుంటేనే బాగుండేది.

1935 నుంచి 2019 వరకు వచ్చిన కథలలో నుండి 23 ఎంపిక చేసిన కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. వీటిలో ‘ఆటపట్టు’, ‘సాహసక్రీడ’ కథలో అన్ని విషయాలను ఒకే దగ్గర చెప్పాలన్న తపన కనబడుతుంది. ‘చదరంగంలో హత్య’, ‘మర్డర్ కాని మర్డర్’ రెండూ మంచి డిటెక్టివ్ కథలు కాగా, ‘తోసిరాజు’, ‘టెన్నిస్ టోర్నమెంట్’ కొసమెరుపు కథలు. వైవిధ్యభరితంగా ఉన్న ఈ కథలన్నీ ఆసక్తికరంగా చదివింపజేస్తాయి. సంపాదకుల కృషి ప్రశంసనీయం.

***

క్రీడాకథ (కథా సంకలనం)
ప్రచురణ: సంచిక – సాహితీ
పుటలు: 176, వెల: 100/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520004. ఫోన్: 0866-2436643

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here