[box type=’note’ fontsize=’16’] “మాట కన్నా చేత ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మరి, దానికోసం మనం ఏం చేస్తున్నాం?” అని అడుగుతున్నారు అనంతలక్ష్మి ఈ వారం ‘దిశ‘ కాలమ్‌లో. [/box]
[dropcap]అం[/dropcap]దరికి సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలనే ఉంటుంది. దానికోసం ఏం చేస్తున్నాం? సుఖేచ్ఛ ఉంది కాని, దాని కోసం చేసిన ప్రయత్నం మాత్రం శూన్యం. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే…. మనం చేస్తున్నది ఏదీ కూడా అందరికి సుఖాన్ని కలిగించేది కాదు అని అర్థం అవుతుంది. తన వరకు తాత్కాలికంగా సుఖం అనిపిస్తుంది. చిత్రమేమంటే ఈ విషయం అందరికి తెలుసు. నాకు సుఖం కలిగించేది ఇతరులు చెయ్యాలి. నేను మాత్రం నా సుఖం ఒక్కటే చూసుకుంటాను. ఇంకా విశేషం ఏమంటే నా సుఖం కోసం కూడా నేను ప్రయత్నం చెయ్యను. అది కూడా కష్టమే కదా! ఇతరుల సుఖంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ మాటలు పైకి అనక పోయినా చేసే పనులు అట్లాగే ఉంటాయి.
మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. అంతే! చెత్త వదిలించుకోటానికి ఎక్కడో అక్కడ పడేస్తాం. అది పొరుగిల్లు కావచ్చు. నడివీధి కావచ్చు. పక్కవాళ్ళు కూడా అట్లాగే ఉంటే? అప్పుడు మనలో ఉన్న సామాజికస్పృహ మేలుకుంటుంది. ఇదే మొదలు అన్ని సమస్యలకి.
వాతావరణ కాలుష్యాన్ని గురించి మాట్లాడే మనం వాహనాల విషయంలో ఏ మాత్రం జాగ్రత్త వహిస్తున్నాం? ఒక ఇంట్లో వాళ్ళు ఒకే వైపు వెడుతున్నప్పుడు కూడా ఎవరి వాహనం వారు తీసుకు వెడతారే కాని, కొద్దిగా సద్దుబాటు చేసుకుని ఇద్దరో ముగ్గురో ఒకే వాహనంపై వెడితే ఎన్ని ఉపయోగాలో కదా! మనుషులకి డబ్బు ఆదా. దేశానికి పెట్రోలు ఆదా. పర్యావరణానికి హాని ఉండదు. సహజ వనరులని వృథా చెయ్యక పోవటం వల్ల ప్రకృతికి పట్ల గౌరవాన్ని ప్రదర్శించటం కూడా జరుగుతుంది. ఓజోన్ పొర గురించి ఊదర గొట్టగలం కాని, అనవసరంగా ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం తగ్గించామా? కాలుష్యకారకాలని ఉపయోగించటం తగ్గించామా?
వాతావతరణం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా కలుషితం చేసే వాటిని వాడటం మానలేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు సర్వసాధారణ మైపోయాయి. పేపర్ కప్పులలో వేడి వేడి టీ గాని, కాఫీ గాని తాగుతుంటే ఆ వేడికి కాగితం మీద పైపూతగా పూసిన మైనం వంటి పదార్థం నెమ్మదిగా కరిగి తాగే వాటిలో కలిసిపోయి లోపల చేరి పేరుకుపోవటం జరుగుతుంది.
ఒక్క గుడ్డసంచీ కాని, నారసంచీ గాని జేబులోనో, బాగులోనో పెట్టుకుని ఉంటే ప్లాస్టిక్‌తో చేసిన కారీ బాగుల వాడకం తగ్గించవచ్చు కదా! ఇప్పుడు విదేశాల్లో అందరు కాగితం సంచులే వాడుతూ ఉండటం గమనార్హం.
మన పిల్లలు ఆదర్శప్రాయంగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. దొంగతనాలు చెయ్యకూడదు. పెద్దలని, అంటే మమ్మల్ని మాత్రమే, గౌరవించాలి. బాగా చదువుకోవాలి. కానీ అట్లా ఉండటం నేర్పుతున్నామా, వాళ్ళకి? నోటితో చెప్పినదాని కన్న కంటితో చూసినది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళ మీద మంచి ప్రభావం ఉండేట్టు మన ప్రవర్తన ఉంటోందా? మనమేమో పెద్దవాళ్లని వృద్ధాశ్రమాలలో పెడతాం. పిల్లలకి మనమీద గౌరవం ఉండాలి. ఎట్లా కుదురుతుంది?
పిల్లల ఎదురుగా చెడుమాటలు మాట్లాడటం అబద్ధాలాడటం దెబ్బలాడుకోవటం మానలేరు. చెప్పినదాని కన్న చేసినదాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. “నేను ఇంట్లో లేనని చెప్పు?” అని పిల్లలకి చెప్పిన తరవాత వాళ్ళ ప్రవర్తనని సరిదిద్దే అధికారాన్ని కోల్పోయినట్టే! మాట కన్నా చేత ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మరి, దానికోసం మనం ఏం చేస్తున్నాం?????