కాజాల్లాంటి బాజాలు-25: అంతేనంటారా!

3
5

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పట్లాగే పొద్దున్నే పనయ్యాక వదినకి ఫోన్ చేద్దామనుకుంటుంటే వదినే ఫోన్ చేసింది. హలో అనే నా మాట పూర్తికాకుండానే “ఊరగాయలు పెట్టేసేవా!” అనడిగింది.

“ఇంకా ఎక్కడ వదినా.. ఆ సంగతే నీతో మాట్లాడాలనుకుంటున్నాను..” అన్నాను. “అయితే వెంటనే బయల్దేరి వచ్చేసై. ఇక్కడ నేనన్నీ చూసుకుంటున్నాను..” అంటూ ఫోన్ పెట్టేసింది.

హమ్మయ్య.. వదిన బాధ్యత తీసుకుందీ అంటే ఇంక మనం నిశ్చింతగా ఉండొచ్చు. తన వెనకాలుంటే చాలు అనుకుంటూ పదకొండుగంటలకల్లా వదినింటికి వెళ్ళేను.

ఎప్పుడూలేనిది వీధితలుపు ఓరగా తీసే ఉంది. తలుపు నెమ్మదిగా తోస్తూ ముందు తల లోపలికిపెట్టి చూసేను. నాకళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.

హాల్లో మధ్యగా ఉండే సోఫా సెట్టు ఓ గోడనానుకుని వరసగా సెటిలైపోయింది. మధ్యలో టీపాయ్ లోపల ఏ బెడ్ రూమ్ లోకి వెళ్ళిందో అక్కడెక్కడా కనిపించలేదు. టీవి ఓ మూలకి జరిపేసుంది. అదికాదు నన్ను అంతలా ఆశ్చర్యపరిచింది.. హాలుకీ వంటింటికీ మధ్యలో వున్న గోడనానుకుని ఓ నలుగురు మహిళలు తీరుబడిగా ముందు గుట్టలా ఉన్న మామిడికాయలు అక్కడే ఉన్న బకెట్లో నీళ్ళతో కడిగి, తుడిచి పెడుతున్నారు. మరోవైపు గోడనానుకుని ఇంకో ఇద్దరు మహిళలు ఒకబ్బాయి చేత దగ్గరుండి తుడిచిన మామిడికాయలని ముక్కలు కొట్టిస్తున్నారు. ఇటువైపు ఇంకో నలుగురు కొట్టిన ముక్కల్లో జీడి తీసి బాగుచేస్తూ, ముక్కల్ని శుభ్రంగా తుడిచి పక్కనే ఉన్న పెద్ద బకెట్లో వేస్తున్నారు. వదినకానీ ఆవకాయ ఫాక్టరీ పెట్టిందా అనుకుంటూ లోపలికి వెళ్ళేను. వంటింట్లో వదిన, ఇంకో ఆవిడ రెండు పెద్ద పెద్ద రైస్ కుక్కర్లో కొలతలు చూసుకుంటూ ఏవో వండేస్తున్నారు.

నన్ను చూడగానే వదిన, “రా రా స్వర్ణా, ఇంకా రాలేదేవిటా అనుకుంటున్నాను. చూడూ, ఇదిగో ఈ పుస్తకంలో ఆ పిల్లాడు ఎన్ని కాయలు ముక్కలు కొట్టేడో, కాయకి రెండురూపాయిల చొప్పున కొట్టిన కాయలన్నింటికీ ఎంతవుతుందో రాయి..” అంటూ నా చేతికొక నోట్ బుక్కూ, పెన్నూ ఇచ్చేసి, హాల్లోకి పంపేసి తను మళ్ళీ వంటింట్లోకి దూరిపోయింది. నేను సిన్సియర్ గా వాడిముందు సెటిలైపోయి కాయలు లెక్కెట్టడం మొదలెట్టేసేను. పనవగానే డబ్బులిచ్చి కాయలుకొట్టేవాణ్ణి పంపించేసేం.

నేనూ, వదినా కాక ఇంకా పదిమంది ఆడవాళ్ళున్నారక్కడ. వాళ్ళు కాక ఇంకో ఇద్దరు తెలిసిన ఆడవాళ్లని రోజుకింతని డబ్బులిచ్చి పెట్టింది. ముక్కలన్నీ శుభ్రం చేసి, కొలతలు చూసుకుంటూ మూడు పెద్ద ప్లాస్టిక్ బకెట్లనిండా ఆవకాయ కలిపి, వాటిని జాగ్రత్తగా వంటింట్లో ఓమూల సర్దేసరికి ఒంటిగంట దాటిపోయింది.

అప్పుడు లోపల రైస్ కుక్కర్లలో వదిన చేసిన ఉప్పుపిండి అందరికీ పెట్టింది వదిన.

అది తింటుంటే చెప్పింది వదిన సంగతేవిటో. ఎవరికి వారే ఊరగాయ పెట్టుకోవాలంటే ఒక్కరికీ ఇంట్లో చేసుకుందుకు కష్టంగా ఉంటోందనీ, అందులోనూ ఈ రోజుల్లో పిల్లలు బీపీలు పెంచే ఆ ఊరగాయలు పెట్టక్కర్లేదంటున్నారనీ, ఒకవేళ అలవాటు మానలేక ఏ కొంచెమో పెట్టుకోవాలన్నా, మార్కెట్లో ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయనీ, ఏ చెయ్యాలో తెలీటం లేదనీ అందరూ అంటుంటే విన్న వదిన ఒక ప్రపోజల్ పెట్టిందిట. ఒక పదిమంది కలిస్తే ఒక్కొక్కింటికీ 50 కాయల చొప్పున హోల్‌సేల్‌గా కొనుక్కుని, కారాలూ, నూనె కూడా అలాగే హోల్‌సేల్‌ గానే కొనుక్కుని, ఒకచోట నలుగురూ కలిసి పెట్టుకుంటే డబ్బూ కలిసొస్తుంది, శ్రమా తెలీదు అందిట. అంతగా కావాలంటే సాయానికి డబ్బులిచ్చి ఇద్దరు ఆడమనుషులని పెట్టుకుందాం అని కూడా సలహా ఇచ్చిందిట వదిన. ఒక్కొక్కరూ ఆటోవాడికీ, కాయలు కొట్టేవాడికీ విడివిడిగా ఇచ్చేకన్నా కలిసి చేసుకుంటే ఎలాగైనా తక్కువే పడుతుందికదా అని అందరూ చాలా సంతోషంగా దీనికి ఒప్పుకున్నారుట. కానీ, ఎక్కడ పెట్టుకోవడం అనే ప్రశ్న వచ్చినప్పుడు, అన్నయ్య వారం రోజులు టూర్ వెడుతున్నాడు కనుక ఇక్కడే కలుద్దాం అందిట వదిన. అంతే, నిన్నరాత్రే అందరూ సరేనంటే సరే అనుకున్నారుట. ఒక్కొక్కరూ అయిదువేల చొప్పున డబ్బు తెచ్చి వదినకి ఇచ్చారుట. పొద్దున్నే ఓ ముగ్గురు కాయ నాడెం తెలిసినవాళ్ళు కొత్తపేట హోల్‌సేల్‌ మార్కెట్‌కి వెళ్ళి, బేరాలాడి హోల్‌సేల్‌గా 400 కాయ కొన్నారుట. ఆఖరున వాడి దగ్గర ఓ యాభైకాయి మిగిలిపోతే వాడిని కిందా మీదా పెట్టి మాగాయకైనా గీకి పడెయ్యొచ్చుకదాని అవి కూడా గోతాంలో పడేయించేర్ట.

అవన్నీ చెయ్యగలమా అనుకున్నార్టకానీ, పదిమందీ కూర్చుని మూడువందలకాయల ముక్కలూ బాగుచేసుకోవడం అంతా ఆడుతూ పాడుతూ హాయిగా అయిపోయింది. ఆవకాయ కలిపేసి ఓ పక్కన పెట్టేసేటప్పటికి అందరి మొహాల్లోనూ ఆనందం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇదంతా చూస్తుంటే మా వదిన మీద అభిమానం రెట్టింపైపోయింది నాకు.

ఉప్పుపిండి తిని కాస్త టీ తాగేసరికి మళ్ళి అందరికీ ఒంట్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది, కూర్చుని మిగిలిన మామిడికాయలకి చెక్కు తీయడం మొదలుపెట్టేరు. కొంతమంది చెక్కు తీస్తుంటే ఇంకొంతమంది ముక్కలు కొయ్యడం మొదలుపెట్టారు. పెద్దముక్కలని కొందరూ, కాదు చిన్న ముక్కలని ఇంకొందరూ, అవేమీ కాదు కోరేద్దాం అని మరికొందరూ కాసేపు వాదులాడుకున్నారు. వదిన కల్పించుకుని ఎక్కువ కాయలు మాగాయి ముక్కలకీ, కొంచెం తక్కువ కాయలు చిన్నముక్కలు తరగడానికీ అని డిసైడ్ చేసేసి అలా అందరికీ పనులు వంతులు వేసేసింది. చకచకా మామిడికాయలు పెద్దముక్కలూ, చిన్నముక్కలూ అయిపోతున్నాయి. మిషన్ కూడా అంత బాగా చెయ్యదేమోనన్నంత బాగా చేసేస్తున్నారు అందరూ. అందరూ పనిమంతులే. మర్చిపోయిన ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకుని మరీ ఓ నాలుగు ప్లాస్టిక్ బకెట్లనిండ ముక్కలు కోసేసేరు. వాటిలో సరిపడ ఉప్పూ, పసుపూ వేసేసి గట్టిగా మూతలు పెట్టేసి, వంటింట్లో ఆవకాయ బకెట్ల పక్కనే పెట్టేసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అప్పుడు వదిన అందరితో చెప్పింది. మర్నాడు డబ్బులిచ్చి పని చేయించుకునేవాళ్ళిద్దరి చేతా పొద్దున్నే మాగాయముక్కలు, చిన్నముక్కలూ టెర్రస్ మీద ఎండబెట్టించి, సాయంత్రంలోపలెట్టేస్తారనీ, అందుకని మర్నాడు అందరూ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుని, మూడోనాడు పదకొండుగంటలకల్లా ఎవరి డబ్బాలు వాళ్ళు తీసుకువస్తే ఆవకాయ తిరగేసి, అందరికీ తూచి పంచేస్తాననీ చెప్పింది. ఆవకాయ పంపకం అయిపోయాక మాగాయ, చిన్నముక్కలూ కూడా ఇంగువనూనె కాచి పోసుకుని రెడీ చేసేసుకోవచ్చనీ, మధ్యాహ్నానికి అందరూ ఊరగాయలు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోవచ్చనీ, డబ్బులెక్కలన్నీ కూడా అప్పుడే తేల్చేస్తాననీ చెప్పింది. పిల్లలు కాలేజీనుంచొచ్చే టైమయిందని అందరితోపాటు నేను కూడా ఇంటికి వచ్చేసేను.

మూడోనాడు పదకొండుగంటలకి నేను వెళ్ళేటప్పటికి అప్పటికే అక్కడ ఓ నలుగురైదుగురు ఉన్నారు. అందరూ వచ్చేదాకా ఉండి వదిన ఆవకాయ వాటాలు వేసింది. ఎక్కడినుంచి తెప్పించిందో బరువులుతూచే మెషిన్ తెచ్చింది. ఆవకాయంతా తిరగకలిపి, పన్నెండువాటాలూ వేసింది. ఎక్కడా వీసమెత్తు తేడా లేకుండా అందరిముందూ, అందరికీ తృప్తి కలిగేలా వాటాలు వేసింది. వాళ్ళ డబ్బాల్లో నిండిన ఆవకాయ చూసుకుని వాళ్ల మొహాలు వెలిగిపోయేయి. అవన్నీ ఓ పక్కన పెట్టి మాగాయ, చిన్నముక్కలూ ఇంగువనూనె కాచి వేసి, మెంతిపొడీ, కారం కలిపి అందరి అజమాయిషీలోనూ చేయించింది వదిన. అది కూడా అక్కడే అప్పటికప్పుడే పన్నెండువాటాలూ వేసేసింది. అందరూ డబ్బాలన్నీ సర్దుకున్నాక, కాయకెంతయిందో, కారాల కెంతయిందో, పనికి పెట్టిన ఆడమనుషులిద్దరికీ ఎంతిచ్చిందో, ఆటోలు, అన్నీ కలిపి లెక్కచూస్తే ఒక్కొక్కరికీ వాళ్ళిచ్చిన అయిదువేలలోనూ నాలుగువేల అయిదొందల యాభైరూపాయలు మాత్రమే ఖర్చయినట్టు తేలింది. వెంటనే ఒక్కొక్కరికీ వారి వాటా ఊరగాయలతోపాటు మిగిలిన నాలుగువందల యాభైరూపాయలూ కూడా వెనక్కిచ్చేసింది. అందరికీ కూడా ఖర్చయిన ప్రతిపైసా లెక్క రాసిన చీటీలు కూడా ఇచ్చింది. ఎవరికైనా సందేహముంటే తప్పకుండా మళ్ళీ అడగొచ్చని చెప్పింది. ఆ పదిమంది ఆడవాళ్ళూ ఎంత సంతోషించేరంటే వదిననిఎంతో గొప్పగా పొగుడుతూ వాళ్ల ఊరగాయలు తీసికెళ్ళారు.

ఇంక నేను కూడా ఇంటికి వెడతానని చెపుతూ నా వాటా నాలుగువేల అయిదువందల యాభై వదిన చేతిలో పెట్టేను. “ఇదెందుకూ!” అంది. “నా వంతు డబ్బు..” అన్నాను.

వెనక్కిచ్చేస్తూ, “ఏమక్కర్లేదు. ఆ పదిమందీ ఇచ్చిన డబ్బే పన్నెండు వాటాలకీ సరిపోయింది. ఇంకా మిగిలింది కూడా కదా, చూసేవుగా.. వాళ్లకే ఇచ్చేసాం” అంది.

“అలా ఎలా వదినా, డబ్బు లివ్వకుండా వాటా ఎలా వేస్తావు!” అన్నాను.

“నీకు బిజినెస్ విషయాలు కొన్ని తెలీవు, విను. పెట్టుబడి పెట్టిన వాళ్ళు కాకుండా బిజినెస్‌లో వేరే పార్ట్‌నర్స్ కూడా కొందరుంటారు. అలాగే నేను వర్కింగ్ పార్ట్‌నర్‌ని అన్నమాట. ఆవకాయ పెట్టుకుందుకు నా ఇల్లు ప్లేస్ చూపించేను. మధ్యలో తినడానికి కాస్త పెట్టేను. టీ ఇచ్చేను. రెండోరోజు దగ్గరుండి ముక్కలన్నీ ఎండబెట్టించి, ఎత్తిపెట్టించి సూపర్‌వైజ్ చేసేను. దీనిని నేను పెట్టుబడిగా పెట్టుకున్నా నన్న మాట.. “

“నువ్వు సరే, నీ ఇల్లిచ్చేవు, టిఫిన్ పెట్టేవు. మరి నేనేం చేసేనూ! అందరిలాగ అంత పని కూడా చెయ్యలేదే, మరి డబ్బు పెట్టకుండా నాకు వాటా ఎందుకు పెట్టేవు!”

“బిజినెస్‌లో వర్కింగ్ పార్ట్‌నర్‌ లాగే స్లీపింగ్ పార్ట్‌నర్‌ అని కూడా ఉంటాడు. నువ్వు అదన్న మాట. అందుకని ఇంక ఈ యేటికి ఈ వదిన మాట విని స్లీపింగ్ పార్ట్‌నర్‌ కిందుండి, ఊరగాయలు హాయిగా ఎంజాయ్ చెయ్యి..” అంది వదిన.

అలా ఉట్టినే తీసుకోడానికి నా మనసొప్పుకోలేదు. నేను తీసుకోనన్నాను. వదిన విసుక్కుంది. “నువ్విలా గొడవ చేస్తే ఎలా! లెక్కంతా సెటిలైపోయాక మళ్ళీ మొదలెట్టడం నాకిష్టం లేదు. నువ్వు తీసికెళ్ళు. ఏం పరవాలేదు..” అంది. నేనలాగే కూర్చున్నాను. ఇంక వదిన రాజీ కొచ్చింది. “అమ్మా తల్లీ, చెపితే వినకపోతే ఎలా! మళ్ళీ ఈ లెక్కలవీ ఏం చెయ్యగలను! సరేలే, అయితే ఓ పని చెయ్యి. ఈ డబ్బు ఇలా ఇయ్యి. వచ్చేది జూన్ నెల కదా.. చాలామంది స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్ కావల్సుంటాయి. కొని పెడతాను. సరేనా! ఇంక తీసికెడతావా తల్లీ!” అంది. అప్పుడు నాకు సంతోషమనిపించింది. వదిన సంగతి నాకు తెలుసు. ప్రతి జూన్ నెలలోనూ స్కూల్ పిల్లలకి ఏవో కొనిస్తూంటూంది. హమ్మయ్య, నేనేమీ ఉట్టినే తీసికెళ్ళటం లేదు. డబ్బు లిచ్చే తీసికెడుతున్నాను. ఆ డబ్బులు వదిన మంచిపనికే ఉపయోగిస్తోంది అనుకుంటూ ఊరగాయలని వరాలుగా ఇస్తున్న మా వదిన మంచితనాన్ని మెచ్చుకుంటూ, యేడాదికి సరిపడా ఊరగాయలు తీసుకుని ఇంటికి బయల్దేరేను.

కానీ వెనక్కి వస్తుంటే నాలో ఒక ధర్మసందేహం తలెత్తింది. ఇప్పుడు నేనిస్తున్న డబ్బులు వదిన స్కూల్ పిల్లలకి ఇస్తోంది కదా, అవి ఒక మంచిపనికే ఉపయోగపడుతున్నాయి కదా, మరి అలాంటి మంచిపనికి ఉపయోగపడుతున్నప్పుడు వచ్చే పుణ్యం చిత్రగుప్తుడు ఎవరి ఖాతాలో జమ వేస్తాడూ అని.

డబ్బులు నావి కనక నా ఖాతాలో వేస్తాడా, లేక వదిన ఇస్తోంది కనక వదిన ఖాతాలో వేస్తాడా, అదీ కాకపోతే ఊరగాయలకు డబ్బులిచ్చిన వాళ్ళందరి ఖాతాలో వేస్తాడా అని. ఒకవేళ వాళ్ళ ఖాతాలో వేస్తే నేనిచ్చిన డబ్బుకి ఆవగింజలో అర్ధభాగం కూడా రాని పుణ్యం వాళ్ళందరికీ పంచితే ఒక్కొక్కరికీ ఎంత పుణ్యం రావచ్చూఅని మరో ధర్మ సందేహం.

నా సందేహాలని వెంటనే వదినకి ఫోన్ చేసి మరీ అడిగేసేను. “నీకీ అఖ్ఖర్లేని ఆలోచనలు పోవా..” అంటూ నన్నోసారి విసుక్కుంది. అయినా సరే నేను పట్టు వదలకుండా. “ప్లీజ్ వదినా, చిత్రగుప్తుడు ఈ పుణ్యం ఎవరి ఖాతాలో వేస్తాడంటావూ.. అది తేలితే కానీ నాకు నిద్ర పట్టదు..” అని బతిమాలుకున్నాను. వదిన చెప్పింది.

“అయితే విను. ఆ చిత్రగుప్తుడు పుణ్యం నీకూ వెయ్యడు, నాకూ వెయ్యడు. అలాగని ఊరగాయలకి డబ్బిచ్చిన మిగిలినవాళ్లకీ వెయ్యడు. ఎవరి ఖాతాలో వేస్తాడంటే నువ్విప్పుడీ రాసిన ఆవకాయ ప్రహసనాన్ని ఎవరైతే ఓపిగ్గా చదువుతారో వాళ్ళ ఎకౌంట్లో వేస్తాడు. సరా! ఇంక పెట్టెయ్యి.” అంటూ ఫోన్ టక్కున పెట్టేసింది. అంతేనంటారా!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here