[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]
[dropcap]”ప్రే[/dropcap]మ అంటే ఏంటి సార్?” నరసింహం అడిగాడు.
సుందరం కళ్ళు మూసుకున్నాడు.
“చెప్పండి సార్, ప్లీజ్”
సుందరం కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు.
“చెప్పరేం?” అడిగాడు సింహం.
“చెప్పేసాను”
“అదేంటి?”
“రామకృష్ణ పరమహంసను పరమాత్మ గురించి అడిగినప్పుడు కళ్ళు మూసుకుని వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయారు. బుద్ధుడిని అడిగారు. ఆయన అంతే. కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు. జీసస్ కూడా అంతే. దీనిని బట్టి ఏమర్థమైంది?”
“ప్రేమకు అర్థం లేదని తెలుస్తోంది”
“అలాక్కాదు. మిర్చీ తింటున్నప్పుడు చాలామంది కళ్ళు మూసుకుంటారు. ఎందుకో తెలుసా?”
“కారం ఎదురు తన్నుతుందనే భయం ఉండవచ్చు”
“కాదు. మిర్చీ అనేది బాహ్యప్రపంచాన్ని మరపింపజేస్తుంది. మనిషి అంతర్ముఖుడై ఆత్మానందని లోలోన ఎక్కడో అనుభవిస్తాడు”
“ఒక్కమాట సార్”
“చెప్పండి”
“నేను ప్రేమ గురించి అడిగాను”
“నేనూ ప్రేమ గురించే చెబుతున్నాను”
“ఓ… చెప్పండి”
“ఒకరిని ప్రేమించినప్పుడు, లేదా ఒకరి చేత ప్రేమించబడినప్పుడు మన చుట్టూతా ఉన్న ప్రపంచం మాయమైపోతుంది”
“ఎక్కడికెళ్ళిపోతుంది సార్?”
“అది ఎక్కడికీ వెళ్ళదు. ఆ యొక్క ప్రపంచంలో మనకి అర్థవంతమైనది ఏదీ కనిపించదు”
“ఓ. ప్రేమ అంత గొప్పదా సార్?”
“అవును. ఏ అర్థమైనా ప్రేమించిన వారిలోనే కనిపిస్తూ ఉంటుంది”
“కరెక్ట్”
“అంటే?”
“నాకూ అలాగే కనిపిస్తోంది సార్”
“బస్సులోంచి దిగే అమ్మాయి లోనే ప్రపంచం యావత్తు గుండ్రంగా తిరుగుతోంది”
“యస్. అలాగే తిరగాలి. తిరగలి తిరిగితే కాని పప్పు పిండి అవదు. అలా కొన్నాళ్ళు తిరగనీయాలి”
“తిరుగుతూనే ఉన్నాను. ఫలితం లేదు సార్”
“భయపడకు. సుడైనా తిరగాలి, మనమైనా తిరగాలి”
“నన్ను ప్రేమించదేమోననే భయం పట్టుకుంది సార్”
“తొంభై వచ్చే కుర్రాడు భయపడతాడు, ఫెయిల్ అయ్యేవాడూ భయపడతాడు. భయం అనేది ప్రేమ కోసం ఖచ్చితంగా కావలసిన వ్యంజనం”
“అంతే అంటారా?”
“ముమ్మాటికిన్నూ. ఇంతకీ అమ్మాయి ఏవంటోంది?”
“ఏమీ అనటం లేదు సార్. అక్కడే సమస్య ఎక్కువగా ఉంది”
“బస్సు లోంచి దిగి ఏం చేస్తోంది?”
“నన్ను అదోలా చూస్తుంది”
“అదోలా అంటే?”
“అర్థం కాదు”
“కాకుడదు. అయితే అంతా అయిపోయినట్లే”
“అలా చూసీ చూడనట్లు చూసేసి మిర్చీ బండి వైపు వెళుతుంది”
“తనతో పాటు మరో అమ్మాయి ఉంటుందా?”
“తప్పకుండా. ఇద్దరూ నములుతారు బజ్జీలను. ఏవేవో మాట్లాడుకుంటారు”
“ఎప్పుడైనా విన్నారా?”
“అన్నీ గుసగుసలే”
“అలా చేస్తున్నప్పుడు మీ వైపు ఓ చూపు ఏదైనా బాంబులా తగులుతుందా?”
“ఒకటా? వంద పైన తగులుతాయి. తట్టుకోలేకుండా ఉన్నాను”
“ఇది సామాన్యమైన ప్రేమ కాదు. మీరు అసాధ్యులు”
“అది సరే సార్. అలా ఎందుకు చూస్తారో తెలియదు కదా?”
“మీకో సంగతి చెప్పాలి”
“ఓకే”
“మిర్చీ తినే ప్రతీ వాళ్ళకీ చూపు సరైన చోటున నిలుస్తుంది – అసలు అనవసరమైనవి వాళ్ళకు కనిపించవు”
“నన్ను నవ్వులాట పట్టిస్తున్నారనిపిస్తోంది”
“లేదు. మీ కోసమే వాళ్ళు అక్కడికి వస్తున్నారు. తేలిపోయింది. మీరు లేనప్పుడు వాళ్ళు అక్కడ ఆగుతారా?”
“ఎలా చెప్పగలం సార్? నేను లేనప్పుడు ఎవరు చూడాలి?”
“ఓ పని చేద్దాం. మీరు మిర్చీ బండి అతనికి మీ ఫోన్ నెంబరు ఇవ్వండి”
“ఇచ్చి?”
“వాళ్ళు ఆగారో లేదో కనుక్కోండి”
“ఓకే, ఇది బాగుంది”
***
ఫోన్ మ్రోగింది.
“హలో”
“సార్, సింహం”
“శభాష్! ఏమైంది?”
“సార్, మిర్చీ బండి అతనికి నంబర్ ఇచ్చాను”
“వెరీగుడ్”
“వాళ్ళని గమనించమన్నాను”
“శభాష్”
“ఎప్పటిలాగే వాళ్ళు బస్సు దిగారుట”
“దిగి?”
“చుట్టూరా వెతికారు”
“శభాష్! మీ కోసం వెతికారంటే ప్రేమ పాకాన పడుతోంది. మీరు చాలా అదృష్టవంతులు”
“ఏమోగానీ మిర్చీ బండి దగ్గరకు వచ్చారుట”
“అతన్ని మీ గురించి అడిగుంటారు”
“లేదు. మిర్చీలు ఆర్డర్ చేసారు”
“అవి తిన్నాకా అడిగారా?”
“లేదు సార్. ఆ మిర్చీ బండి అతనితో ఏవేవో ముచ్చట్లు చెప్పారుట”
“ఏం చెప్పారు?”
“అతను చెప్పనన్నాడు సార్”
“ఓహో! అమ్మాయిలు మరొకరిని కోరుకున్నప్పుడు ఎవరైనా అలానే బాధపడతారు”
“అంటే? నాకు తెలియకుండా మిర్చీ బజ్జీ వాడు నేను కోరుకుంటున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడా?”
“అలా అనుకోకూడదు. మూడు ముక్కలాట తప్పదు”
“అలా చాలా సేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారుట”
“మీ గురించి అడగలేదా?”
“లేదు”
“సిగ్గు పడి ఉంటుంది అమ్మాయి. అయినా అంతగా ఆరాధిస్తున్న వ్యక్తి గురించి మిర్చీ బజ్జీ వాళ్ళ దగ్గర, కిరాణా షాపులోనూ అమ్మాయిలు అడుగుతారనటం కరెక్ట్ కాదు”
“మీరే కదా మరి అలా చెయ్యమన్నారు?”
“ప్రేమను మిర్చీ లాగా కొరికి చూడాలి మిత్రమా!”
“సార్, నా ప్రేమ విఫలమై కేవలం మిర్చీ ఖర్చు మిగిలేటట్లుంది”
“నో… ధైర్యే, సాహసే, జ్యోతిలక్ష్మి అన్నారు”
“మిమ్మల్ని నమ్ముకున్నాను”
“మరి కాస్త నమ్మమంటున్నాను”
“ఆశ చావడం లేదు”
“అది అమరం మిత్రమా”
“ప్రేమ చంపుతోంది”
“తప్పకుండా. అది ఎంత చంపుతుంటే అంత కమ్మగా ఉంటుంది”
“రేపు ఎలా ఉంటుందో తెలియడం లేదు సార్”
“ఇంతకీ చూసారా, ఒక్క రోజు కనిపించకపోయేసరికి అమ్మాయి ఎంత బాధపడి ఏమీ మాట్లాడలేదు. చూసారా?”
“ఏమో సార్”
“రేపు సూటిగా మీ దగ్గరకే వస్తుంది. చూస్తూ ఉండండి”
“అంతే అంటారా?”
“ముమ్మాటికిన్నీ. విరహం కూడా సుఖమే కాదా…”
“ఊర్కోండి సార్”
“అసలు ఈ సమయానికి అమ్మాయి మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సందేహం లేదు”
“నేను మటుకు అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను”
“తప్పకుండా అదే చెయ్యాలి”
“సార్…”
“చెప్పండి”
“గంట తర్వాత మిర్చీ బండి అతను ఫోన్ చేసాడు”
“చూసారా? అతను అసలు సంగతి ఫిల్టర్ చేసాడు. జెలసీ. మీ గురించి చాలా అడిగి ఉంటుంది”
“లేదు సార్”
“మరి ఏమన్నాడు?”
“మిర్చీ డబ్బులు నా దగ్గర తీసుకోమన్నది సార్”
“శభాష్. అదిరింది”
“ఏంది సార్? నా పరిస్థితి ఇలా తయారయింది?”
“పాజిటివ్ మిర్చీపతీ అనుకోండి”
“అంటే?”
“వినలేదా? సగం కిటికీ మూసి ఉంది కాదు, సగం తెరిచి ఉంది అనుకోవాలి. అమ్మాయి అంతేనే ఆలోచన!”
“డబ్బులైపోతున్నాయి సార్”
“నో. డబ్బుదేముంది? తాను తిన్న మిర్చీ డబ్బులు మిమ్మల్ని ఇవ్వమన్నదంటే…”
“అంటే?”
“ఇంతలోనే అంత చనువు తీసుకుంది. యు ఆర్ గ్రేట్ సింహం… నాకు అప్పుడే.. నూనె లోంచి ఇప్పుడే తీసిన వేడి వేడి బజ్జీలు తింటున్నట్లుంది…”
“సార్”
“నో.. అయిపోయింది. తరువాత ఏం చేయాలో నేను చెబుతాను”.
00000