[dropcap]”ర[/dropcap]చయిత్రుల సమావేశానికి విచ్చేసిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రెండు రోజుల సమావేశం ముగింపు దశకు వచ్చింది కదా, ఇప్పుడు స్వాగతం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మీకో ప్రత్యేక క్రీడాకారిణిని… ఎవరెస్ట్ ఎక్కిన పోలీస్ అధికారిణిని పరిచయం చేయబోతున్నాం. అందుకే వారికి స్వాగతం చెబుతున్నాను. ముందుగా ఎవరెస్టుని అధిరోహించిన రాధిక గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం” అనగానే అందరం ఉత్సుకతతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించాం.
పాతిక సంవత్సరాల మహిళ చుడీదార్‌లో వచ్చి చలాకీగా స్టేజి ఎక్కింది. ఇంత చిన్న ఆమెనా, పోలీస్ అధికారిణి అంటే కొంచెం మధ్య వయస్సు అనుకున్నాం, వెరీ గుడ్ అనుకున్నాం.
ఆమె అందరికీ అభివాదం చేసి “నా పేరు రాధిక. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ఉన్నతంగా పెంచారు. నాకు ఐపీఎస్ అంటే ఇష్టం అని ఆ రంగంలో ప్రోత్సహించారు. సాహసాలంటే నాకు అభిరుచి, అందుకే పర్వతాలు అధిరోహిస్తూ వుంటాను. పర్వతారోహణం అంటే అంత సులువు కాదు. ఈమధ్య చేసిన పర్వతారోహణ విశేషాలు చెప్పమని అడిగారు కాబట్టి అవి చెబుతాను. పర్వతాల అధిరోహణ ప్రధాన అవరోధం వాతావరణం. క్షణక్షణానికి మారిపోతూ వుంటుంది. ఉన్నట్టుండి వానా, గాలులు. మా గైడ్‌తో పాటు ఇరవై మందిమి పైకి ఎక్కాక చిక్కుబడిపోయాము.
మేము పట్టుకెళ్ళిన ఆహార పదార్థాలు అడుగంటుతున్నాయి. కాలక్షేపం లేదు. అప్పటికి వారం దాటింది. మాలో మేము ఇన్ని కబుర్లు చెప్పుకోగలం? అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది మీ రచయితలే! ఆశ్చర్యపోతున్నారా? మా ముందు శిఖరం ఎక్కిన వాళ్లు బరువు అని వదిలేసిన పుస్తకాలు మాకు ఉత్సాహాన్నిచ్చాయి. లేదంటే మాకు పిచ్చి ఎక్కేది, సందేహం లేదు. నీళ్లు లేక స్నానం లేదు. ఆహారం కొద్ది గానే వుంది. వాతావరణం అనుకూలంగా లేదు. ఇన్ని అవరోధాల మధ్య మమ్మల్ని కాపాడింది మీలాంటి రచయితలు రాసిన పుస్తకాలే. ఆ చక్కటి పుస్తకాలు చదివి మాలో మేము వాటి గురించి చర్చించుకుంటూ కాలక్షేపం చేశాం. ఒక దశలో తిరిగి వస్తామా అని కూడా అనుకున్నాం. భగవంతుని దయవలన పరిస్థితి చక్కబడగానే ఆ పుస్తకాలు మాలాగే వచ్చిన వాళ్లకి ఉపయోగపడతాయని అక్కడే వుంచి తిరిగి వచ్చాం. మా కర్తవ్యంలో మరింతగా రాణించడానికి ఆ పుస్తకాలు మాలో ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణని, స్ఫూర్తిని నింపాయి. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. అమ్మగారు కూడా రచయిత్రే. ఈ సభ లోనే వున్నారు” అనగానే నిర్వాహకులు ఆమెను పైకి పిలిచి తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ సన్మానం చేశారు.
“చాలా బాగుందండి! మీ అనుభవాలు మాకు ప్రేరణ, మా రచయితల రచనలు మీకు ప్రేరణ! చాలా సంతోషం! మా ప్రయత్నం ఫలించింది. పరస్పర ప్రేరకాలు మనం ఒకరికి ఒకరం. ఇప్పుడు ప్రత్యేక క్రీడాకారిణి ‘స్ఫూర్తి’ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం” అనగానే ఒక ఇరవై ఏళ్ల అమ్మాయిని వీల్ చైర్‌లో స్టేజ్ మీదకి తీసుకు వచ్చారు. ‘ఎంత అందంగా ఉందో, ఇంత అందమైన అమ్మాయికి ఇంత లోపం ఎందుకు పెట్టాడో భగవంతుడు’ అని అందరం నిట్టూర్చాం.
ఆ అమ్మాయి వీల్ చైర్‌లో కూర్చునే మాట్లాడింది.
“నా పేరు స్ఫూర్తి. మీ రచయిత్రుల అందరికీ నమస్కారం. ఇంతమంది రచయిత్రులను కలుసుకోవడం నాకు చాలాల ఆనందంగా వుంది. మా నాన్నగారు వైద్యులైనా, నేను నా జన్యు లోపం వల్ల కుర్చీకే పరిమితం అవుతానని అనుకున్నాను. కానీ నాన్న, అమ్మ, తమ్ముడు నన్ను ప్రోత్సహించి జావలిన్ త్రో లో తర్ఫీదు ఇప్పించి జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించేలా చేశారు. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నా పరిస్థితి చూస్తున్నారు కదా, చాలా నిస్తేజంగా వుండేదాన్ని. అమ్మా, నాన్న, తమ్ముడు నాలో స్ఫూర్తి నింపి పర్సనల్ ట్రైనర్‌ని పెట్టి శిక్షణ ఇప్పించి ఈ స్థాయికి తీసుకు వచ్చారు. సంకల్పబలం వుంటే చాలు, కాళ్లు సహకరించకపోయినా, చేతులు సహకరించకపోయినా విజయాలు సాధించవచ్చు అని నిక్ వుయ్ చిచ్ లాంటి వాళ్లని చూపించి స్విమ్మింగ్‌లో అతని ప్రదర్శన వీడియోలు చూపించి నాలో స్ఫూర్తిని నింపారు. ఒక కాలు, ఒక చేయి లేని అతను ఎవరెస్టు ఎక్కిన వీడియోలు చూపించి నేను కూడా సాధించగలను శ్రమిస్తే అని ప్రేరణనిచ్చారు. సాధన కొత్తలో చేయి చాలా నొప్పి వచ్చేది. ఏడ్చేదాన్ని. ‘మయూరి’ సినిమా చాలాసార్లు చూశాను. ఇంత మంది విజయం సాధించారు కదా, నేను సాధించగలను అని మొండిగా సాధన తీవ్రతరం చేశాను. ఇలా మీ ముందు మీకు స్ఫూర్తి నివ్వడానికి రమ్మంటే నేను మీకు స్ఫూర్తిని ఎంతవరకు ఇవ్వగలను అని అనుమానించాను. కానీ మీ రచనల ద్వారా నాలాంటి ‘స్ఫూర్తి’లకి మీరింత స్ఫూర్తిని అందించడంలో నేను కూడా భాగం కాగలుగుతాను అనిపించి వచ్చాను. చదువు ఒకటే కాదు, క్రీడలలో అభిరుచి వున్న పిల్లల్ని ప్రోత్సహించండి. మన దేశ ఖ్యాతిని దశదిశలా చాటేలా వారిని తీర్చిదిద్దండి. ఏమో ఎవరు చెప్పగలరు, ఒక కరణం మల్లేశ్వరి, పి టి ఉష, సానియా మీర్జా, హారిక, పుల్లెల గోపీచంద్, ఆనంద్, మేరీ కోమ్ లాగా మీ పిల్లలు చరిత్ర సృష్టిస్తారేమో, భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? చదువుతోపాటు క్రీడలు కూడా తప్పనిసరిగా ఆడించండి. జాతి మెచ్చే రత్నాలుగా తీర్చిదిద్దండి. ఓటమికి భయపడవద్దు అని చెప్పండి. ప్రయత్నం మానవద్దు అని చెప్పండి. ఓటమి విజయానికి తొలిమెట్టు అని నేర్పండి. వీటన్నిటి గురించి రాయండి. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతకి కనువిప్పు కలిగించండి. ఇష్టపడకుండా ఏది రాదు, ఇష్టపడి చేయమనండి. ఉక్కు సంకల్పంతో విజయ కేతనాన్ని ఎగరవేయమనండి” అంటూ ముగించింది స్ఫూర్తి.
హాలు చప్పట్లతో మారుమ్రోగింది.