జీవన రమణీయం-57

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

ఆయన నా సినిమాలే కాదు, ఏ భాషలో సినిమాలు చేసినా ‘మధుమాసం’ తర్వాత నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు. అలా కొన్ని సంవత్సరాల సావాసం. ఆయన పోయినప్పుడు మరోసారి తండ్రిని పోగుట్టుకున్న అనుభూతితో ఏడ్చాను నేను! ఇప్పటికీ చిత్రపురిలో వున్న నా ఇంటికి నానక్‌రామ్‌గుడా, రామానాయుడు స్టూడియో దాటి వెళ్తున్నప్పుడల్లా కళ్ళనీళ్ళొస్తాయి! ఆ అభిమానం కేవలం డబ్బులు ఇచ్చినందువల్ల రాదు!

ఓనాడు నన్ను పిలిచి, “రమణీ… మద్రాసులో వీరాస్వామీ, కనకలింగం వాళ్ళు నీకు అన్ని ఏర్పాట్లూ చేస్తారు… అక్కడే వుండి డైలాగ్ వెర్షన్ రాసుకుని రా! సత్యానందం రాసినా, నీదీ వుండాలి” అన్నారు.

నేను అప్పటికి ఒక్కసారే విమానం ఎక్కాను. అదీ, ‘బాయ్‌ ఫ్రెండ్’ హీరో సాయికృష్ణ జెమినీ టీవీలో ‘ఇలవేల్పు’ అనే సీరియల్ చేస్తూ, ‘ఆరని దీపమమ్మా… అనంత శక్తివమ్మా’ అనే టైటిల్ సాంగ్ నా చేత రాయించి, ఫ్లయిట్ టికెట్స్ పంపిస్తే, నేనూ, మా చిన్నవాడు కృష్ణా మొదటిసారి ఆ రికార్డింగ్, పిక్చరైజేషన్ చూడ్డానికి ఫ్లయిట్ ఎక్కాం. మళ్ళీ రెండవసారి రామానాయుడుగారు ఎక్కించారు. ఆ తరువాత నేనెప్పుడూ బస్సులూ, రైళ్ళూ ఎక్కి ప్రయాణం చేసిన గుర్తు లేదు నాకు! ఆ చెయ్యి అలాంటిది!

మద్రాసులో వళ్వార్ కొట్టంలో వున్న ఆయన ఇల్లు చాలా బాగుంది. ఎంత అందంగా అలంకరించి వుండేదో! మేనేజర్ వీరాస్వామి వాళ్ళూ, పెద్ద బెంజ్ కార్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. వంట చెయ్యడానికి సరసు అనే ఆవిడా, కారు డ్రైవ్ చెయ్యడానికి ఆమె భర్త సెల్వం ఉండేవారు. లంకంత బంగళాలో, నేనొక్కదాన్నే. వెనుక ఔట్ హౌస్‌లో సరసూ, ఆమె భర్త వుండేవాళ్ళు! పిల్లలు లేరు వాళ్ళకి.

నేను జీవితంలో తిన్న అద్భుతమైన వంటల్లో సరసు చేతి వంట కూడా ఒకటి! పగలల్లా నేను రాసుకునేదాన్ని, సాయంత్రం నాయుడు గారు ఫోన్ చేసి, “ఏం రాసావ్?” అని అడిగి, “ఎక్కడికైనా పోయి చూసిరా! బీచ్‍కి వెళ్ళు” అనేవారు. నేను రోజూ వెళ్ళేదాన్ని కాదు. ఓసారి బీచ్‌కీ, ఇంకోసారి మా సాయికృష్ణ అమ్మానాన్నలొస్తే వాళ్ళతో బాటు వాళ్ళింటికీ వెళ్ళాను. నేను బెంజ్ కార్లో వెళ్ళడం నాకే ఆశ్చర్యంగా వుండేది! ఎక్కడి స్కూల్ టీచర్… ఎక్కడి రామానాయుడి గారిల్లూ, బెంజ్ కారూ అని!

వాళ్ళ అమ్మాయి లక్ష్మిగారు (నాగచైతన్య తల్లి) ప్రతి రోజూ వచ్చేది. నేనున్నానని ఆమెకి తెలుసు. నేనూ ఎప్పుడూ ఆవిడ వచ్చినప్పుడు నా గదిలోంచి బయటకి వెళ్ళలేదు. ఎందుకంటే నాయుడుగారు చెప్పారు “మా అమ్మాయి పెద్దగా ఎవరితో మాట్లాడ్డానికి ఇష్టపడదు రమణీ… ఏమీ అనుకోకు” అని. అది ఆవిడ స్వభావం. ఆయన కూడా చాలా భయంగా మాట్లాడేవారు ఆమెతో. ఆయన ఓపెన్‌గా “నాకు కొడుకుల కన్నా, నా కూతురి మీదే ఎక్కువ ప్రేమ” అని చెప్పేవారు. నిజమేగా… తండ్రికి కూతురు మీదే ఎక్కువ ప్రేమ వుంటుంది. మా నాన్నగారికీ అంతే… నా మీదే ఎక్కువ ప్రేమ వుండేది.

సరసు రసం తిన్నాకా, ఆమెని అడిగి ఆ వంటకం ఎలా చేస్తుందో నేర్చుకోకుండా వుండలేకపోయాను! అంత అద్భుతంగా వుండేది! మా పిల్లలు ఇప్పటికీ ‘ వళ్వార్ కొట్టం రసం చేస్తావా?’ అంటారు. కూరల్ని పొరియల్ అనేది. తెలుగు కొద్దిగా వచ్చు, నాకు అరవం అస్సలు రాదు. ఇద్దరం ఆ పది రోజుల్లో ఒకరి భాష ఒకరం కొద్ది కొద్దిగా నేర్చుకున్నాం! ప్రొద్దుట పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ వడా, లేదా దోశా వుప్మా ఏవో రెండు చేసేది, వద్దన్నా వినేది కాదు. భోజనం లోకి పప్పూ, రెండు కూరలు, సాంబారూ, రసం… నేను అవన్నీ తినలేను అని గోలపెట్టి క్రమంగా ఒక కూరా, ఓ సాంబారా లేదా రసంలోకి తీసుకొచ్చాను. నైట్ పుల్కా చేసేది!

నా వంట చేసాకా, నాయుడుగారి అమ్మాయి కోసం నాన్‍వెజ్ వంటలు చేసేది. ఆమె అత్తగారు వాళ్ళు బ్రాహ్మిన్స్‌ట. ఆమె ఇవి ఇక్కడే తినేవారు. నా కోసం కూడా ప్రిజ్‌లో ఏం కూరలున్నాయో, పాలూ, పెరుగూ అన్నీ చాలినంత వున్నాయో తెలుసుకుని, సరసుకి కావలసిన సరుకులకి డబ్బులిచ్చి వెళ్ళేవారావిడ. నేను అక్కడ వుండగానే, ఓసారి రానా వచ్చి రెండు రోజులుండి వెళ్ళాడు. వెంకటేష్ గారొచ్చి, గురువుగారితో వుండి వెళ్ళారు. వీళ్లు మాత్రం నేనున్నానని తెలిసి చక్కగా పలకరించారు. “భోజనం చేసారా? ఏవైనా కావాలా?” అని కూడా అడిగారు.

నాయుడుగారు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం సరసుకి ఫోన్ చేసి, నేను తిన్నానా లేదా కనుక్కునేవారు. ఓ రోజు నేను బ్రేక్‍ఫాస్ట్ చెయ్యలేదని చెప్తే, సరసుని తిట్టారట – “నువ్వు సరిగ్గా వంట చెయ్యడం లేదేమో” అని. ఆమె నాతో చెప్పి బాధపడింది. మళ్ళీ ఎప్పుడూ నేను మానెయ్యలేదు. ఆయన ఆప్యాయత అలాంటిది. నేను వచ్చేసేముందు సరసుని తీసుకెళ్ళి రెండు చీరలు కొనిపెట్టా.

నాయుడుగారొస్తే, ఎదురొచ్చిన వాళ్ళకల్లా వంద రూపాయలు ఇస్తూ వచ్చేవారు. జనవరి ఒకటో తారీఖునా, ఆయన పుట్టినరోజు నాడు కూడా అంతే, మొత్తం స్టాఫ్‍కి, వేలమంది ఇండస్ట్రీ వాళ్ళకి వంద కాయితం ఇచ్చేవారు. పరుచూరి బ్రదర్స్, పెద్ద పెద్ద డైరక్టర్స్ బి.గోపాల్ గారి నుండి అందరూ వచ్చి తీసుకెళ్ళేవారు. ఎనిమిదేళ్ళు నాకూ రుణం ఆ ‘వంద’ రూపాయల నోట్లు!

నేను వచ్చేసేముందు చంద్ర సిద్ధార్థని తీసుకుని నాయుడు గారొచ్చారు. ఆయన రాగానే విందులే విందులు. మమ్మల్ని పెద్ద లీ మెరీడియన్ హోటల్‌కి తీసుకెళ్ళారు. పెద్దగా నవ్వులు, తన మొదటి సినిమా నుండీ జరిగిన ముచ్చట్లు, కబుర్లే కబుర్లు. పెళ్ళివారిల్లులా వుండేది.

తర్వాత ఆయన వైజాగ్ స్టూడియో కట్టినప్పుడు కూడా, ‘నేనేం చిన్నపిల్లనా?’ షూటింగ్‌కి నేనూ వెళ్ళాను. నాకు మెయిన్ బిల్డింగ్‌లో స్పెషల్ రూమ్. నా వెజిటేరియన్ భోజనం గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.

నేను మద్రాసు నుండి వచ్చేసే రోజు వాళ్ళావిడ వచ్చారు. నాకు చీరా, జాకెట్టు పెట్టి ఆడపిల్లని పుట్టింటి నుండి పంపినట్లు పంపారు.

స్క్రిప్ట్ కూడా బాగా వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here