పేదవాడి గారడీ

0
4

[dropcap]రా[/dropcap]మవర్మ చాలా పేదవాడు. ఒక చిన్న గ్రామంలో వుంటాడు. అతడు శుద్ధ పల్లెటూరివాడు. ఎక్కడికైనా వెళ్లి ఏదైనా పని చేయటామూ తెలీదు. తాతముత్తాల నుండి చేస్తున్న కులవృత్తులు చేయటమూ రాదు. ఇంట్లో ఎక్కవగా పస్తులు వుండాల్సి వచ్చేది. పెళ్లి మాత్రం చేసుకున్నాడు. తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి సరియైన బట్టలు లేక అతని భార్య ఎప్పుడూ చిరాకుగా కోపంగా వుండేది.

“ఏమయ్యోవ్! పని పాటా రాకుండా, ఏమీ చేయకుండా ఈ ఊళ్లో ఎన్నాళ్లని ఇలా పడి వుంటాం? నీ సంగతి తెలిసి ఎవరూ ఏ పనీకీ పిలవటం లేదు. చాలా మంది దగ్గరున్న పట్నాలకు వెళ్లి ఏదో ఒక విదంగా పనలు సంపాదించుకుంటున్నారు. ధనాన్నీ పోగు చేసుకుంటున్నారు. నువ్వు కూడా పట్నం వెళ్లు. పని చేసి డబ్బుసంపాదించు” అని భర్తతో చప్పింది రామవర్మ భార్య.

“నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఆపైన భగవంతుని దయ” అన్నాడు రామశర్మ.

ఆ మాటలకు భార్య సంతోషించింది.

“దుకాణానికి వెళ్లి పిండి తీసుకునిరా. రొట్టెలు తయాలు చేసి ఇస్తాను. దారిలో తిందువుగాని. ఆకలివేస్తే ఎవరినైనా పెట్టమని అడగటం కూడా నీకు రాదు” అన్నది.

రామశర్మ సంకోచిస్తూ అటూ ఇటూ చూశాడు. “పిండి కొనుక్కురావటానికి నా దగ్గర డబ్బుల్లేవ్” అన్నాడు.

“మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండి ఏడిచాయ్‌గాని, ఈ మంగళ సూత్రం తీసుకో దీనినమ్మి పిండీ, నూనే కొనుక్కురా, ఇంతకు మించి మరో దారి లేదు. మిగతా వస్తువులన్నింటినీ ఇంతకుముందే అమ్మేసుకున్నాంగా” అన్నది ఆమె.

రామవర్మకు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. బాధతో గొంతు బరువెక్కింది. ఆ బాధతోనే భార్య చేతిలోని మంగళ సూత్రాన్ని తీసుకున్నాడు. త్వరత్వరగా దుకాణానికి వెళ్లాడు. అప్పటికే బాగా రాత్రయింది. దుకాణాదారుడు కొట్టు కట్టేసే పనిలో వున్నాడు. నిద్రకళ్లతో వ్యాపారి సరిగా చూసుకోకుండా మైదాపిండికి బదులుగా పాషాణమబడే విషపూరిత పిండిని పొట్లంకట్టి ఇచ్చాడు. చూడటానికి అదీ మైదాలాగానే తెల్లగా వున్నది. తన పరిస్థితికి కళ్లలో నీరు తిరుగుతుండగా రామవర్మ కూడా అది మైదా అవునా కాదా అని సరిగా చూడలేదు. వ్యాపారి ఇచ్చిన పొట్లాన్ని ఇంటికి తీసుకొచ్చి భార్యకిచ్చాడు.

ఆమె ఆ విషపూరితమైన పిండితో పూరీలు చేసి పొట్లాం కట్టి ఇచ్చింది. అవి తీసుకుని ప్రొద్దున్నే బయలుదేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రామశర్మ పట్నానికి నడవసాగాడు. పగలంతా నడుస్తూనే వున్నాడు. ఒక సత్రములో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. పూరీలు కొద్దిగానే వున్నాయి. వెళ్లాల్సిన దూరం చాలా వున్నది. అందుకని పూరీలను తినకుండా దాచి వుంచాడు. బయలుదేరేటప్పుడు కడుపునిండా తిని వచ్చాడు. దాంతోనే ఆ రోజంతా గడిపాడు. ఆయినా ఆకలితో పడుకోవటం రామవర్మ దంపతులకు అలవాటే.

మర్నాడు ఉదయాన్నే లేచి బయలుదేరాడు. సూర్యుడు పై కొచ్చేసరికి ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు. ఆకలి అనిపించింది. సరే చెరువులో స్నానం చేసి వద్దామని తన బట్టల్ని పూరీలు పొట్లాన్ని ఒడ్డున వుంచి స్నానానికి చెరువులోకి దిగాడు. స్నానం చేస్తూ కళ్లు మూసుకుని సూర్యాష్టకం, అంజనేయ దండకం చదువుతూ ప్రార్థన చేసుకోసాగాడు.

ఆ సమయంలో ఇరవై నాలుగురు దొంగలు రాజ భవంతిలో దొంగతనం చేసి దొంగ సొత్తును తమతో మోసుకుని వచ్చి ఆ చెరువు దగ్గరే ఆగారు. వాళ్లు అలిసిపోయారు. బాగా ఆకలితోనూ వున్నారు. చెరువు ఒడ్డున పూరీల పొట్లం చూశారు. చూటంతోనే తలా కాస్త పంచుకుని పూరీలు తిన్నారు. తినీ తనక ముందే కళ్లు తేలవేసి ఇరవైనలుగురూ చనిపోయారు.

రామవర్మ స్నానమూ, ప్రార్థనా మగించి చెరువులో నుంచి పైకి వచ్చాడు. తన బట్టలు, పూరీల పొట్లం కోసం చూశాడు. పూరీల పొట్లం లేదు. ఇరవై నలుగురు దొంగలు చచ్చిపడున్నారు. వాళ్ల పక్కనే దొంగిలించిన సొమ్ము నింపిన సంచులు మోస్తూ గాడిదలు నిలబడి వున్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో సంపద వున్నది. రామవర్మకు తల తిరిగిపోయింది. ఈ డబ్బుంతా ఏం చేయాలి అని ఆలోచించసాగాడు. ఆ ఆలోచనలో వుండగా రాజభటులు వస్తూ దూరాన్నుంచి కనుపించారు. వెంటనే దొంగల దగ్గరున్న కత్తి తీసుకొని దొంగల తలను మొండాన్నించి వేరు చేశాడు ధనాన్నేమోసే సంపదున్న గాడిదలన్నింటినీ ఒక చోటకు చేర్చి కాపలా కాస్తున్నట్లుగా చేతిలో కత్తి పట్టుకుని కాపాలా కాస్తున్నాడు.

రాజభటులు దగ్గిర కొచ్చారు. “మేం రాజభటులం. ఈ దొంగలు మా రాజభవనంలో జొరబడి దోచుకొచ్చారు. మేం వీళ్లను పట్టకోవాలని వెంటబడ్డాం. తప్పించుకున్నారు నీవొక్కడివే వీళ్లందరినీ ఎలా చంపగలిగావు. అంతా మాయగా వున్నదే?” అన్నారు. రామవర్మ చాలా గంభీరంగా చూస్తూ “నేనీ విషయాలన్నీ మీ రాజుగారితోనే చెప్తాను నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లండి” అన్నాడు రాజభటులతో.

రాజుగారు రామవర్మను చూసి చాలా సంతోషించాడు. “మీరు మాకు చాలా సహాయం చేశారు. దానికి బదులుగా నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేది అడిగినా అదిస్తాను” అన్నాడు రాజు.

రామవర్మ కొంచెం ఆలోచించి మాట్లాడటం ప్రారంభించాడు. “రాజా మీ దగ్గర ఆరులక్షల మంది సైనికులు వున్నారు. ఎందుకూ దండగ వారిని పోషించటం. అందులో రెండు లక్షల మందిని తీసేయండి. వారికిచ్చే జీతం నాకివ్వండి” అన్నాడు.

వాళ్లందరి తిండి ఖర్చు తగ్గుతుందని రాజు సంతోషించాడు. అలాగే చేస్తానన్నాడు. కాని మంత్రి ఒప్పుకోలేదు. రాజుగారు మంత్రి మాట వినలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదని మంత్రి నిశ్శబ్దంగా వుండిపోయాడు.

కొన్ని రోజులు గడిచినవి. ఒక రోజు ప్రజలు కొంత మంది రాజుగారి దగ్గరకొచ్చారు. తమను కాపాడమని మొరపెట్టుకున్నారు. విషయమేమిటంటే ఒక మదించిన సింహం అడవి చుట్టూ పక్కలున్న ఊళ్ళలోకి వచ్చి కనుపించిన మనుష్యుల్నీ, పశువుల్నీ చంపి తింటుంది. ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు అని తెలియజేశారు.

రాజుగారు మంత్రిని పిలిచి ఆజ్ఞాపించాడు “మంత్రీ మన సైన్యాన్ని పంపించి ఆ సింహాన్ని పట్టి చంపించండి.”

“మహారాజా మన రామవర్మ వుండగా వేరే సైనికులెందుకు? రెండులక్షల మంది సైన్యానికి బదులుగా తానొక్కడే పని చేస్తున్నాడుగా. ఆ వీరుణ్ణే పంపుదాం” అని మంత్రి సలహా ఇచ్చాడు.

రాజుకు ఈ సలహా బాగా నచ్చంది. వెంటనే రామవర్మను పిలిపించి సింహాన్ని చంపమని ఆజ్ఞాపించాడు. రామవర్మ వణికిపోయాడు. భయాన్ని పైకి తెలీయనీకుండా “అలాగే మహారాజా” అన్నాడు. “నాకు ఇరవై నాలుగు కత్తులు కావాలి” అని వాటిని తనతో తీసుకెళ్లి ఒకఎత్తైన చెట్టు మీద కూర్చున్నాడు. ఆ దారిలోనే సింహం తిరుగుతుందని అక్కడి ప్రజలు చెప్పారు. బిక్కు బిక్కుమంటూ చెట్టు మీద కూర్చోన్న రామవర్మను సింహం చూడనే చూసింది, గర్జించింది. రామవర్మ ప్రాణాలు పైనే పోయాయి. సింహానికి మాత్రం వేట దొరికిందని అనిపించి పైకి ఒక్క ఎగురు ఎగిరింది. ఇదే అదనుగా రామవర్మ ఒక కత్తిని సింహం మీదకు విసిరాడు. అదృష్టవశాత్తు వంట్లో కత్తి గుచ్చుకున్నది. అదే అదను అనుకుని రామవర్మ ఒక్కొక్క కత్తీనీ బలంగా దాని మీదకు విసిరాడు. పదునైన కత్తులేమో సింహం వంట్లో చాలా దిగబడ్డాయి. అది కూలబడిపోయింది.

మర్నాటి ఉదయం రామవర్మ చెట్టుదిగి వచ్చ సింహాన్ని అటూ ఇటూ కదిపి చూశాడు. నిజంగానే చచ్చిపోయింది అని తెలిసింది. ఒక పెద్ద బండి మాట్లాడుకుని దాని మీద సింహాన్ని వేయించుకుని ఊరేగింపులా రాజుగారి దగ్గరకు చేరుకున్నాడు. అది చూసిన మంత్రిగారికి మాత్రం అనుమానంతో కనుబొమలు ముడిపడ్డాయి. రాజుగారికి మాత్రం చాలా సంతోషం కలిగింది.

“నిజంగా నీవు చాలా గొప్ప వీరుడవు. ఈ సారి ఏం కోరుకుంటావు? అది ఏదైనా నీ కోరిక నేను తీరుస్తాను” అని రాజగారు రామవర్ముకు మరొక అవకాశం ఇచ్చాడు. “మహారాజా సింహాన్ని చంపటానికి కెళ్లేముందు ఇతను రెండులక్షల మంది సైనికులకు బదులుగా పని చేస్తున్నాడని మంత్రిగారు అన్నారు. అదిప్పుడు ఋజువైంది. నేనిప్పుడు నాలుగులక్షల మంది సైనికులకు సమానం. కాబట్టి మరో రెండులక్షలమంది సైన్యాన్ని తొలగించండి. వారి జీతం నాకే ఇవ్వండి” అన్నాడు రామవర్మ.

‘మంచిది, అలాగే చేస్తాన’న్నాడు రాజు.

నాలుగులక్షల మంది సైనికులు ఒక మనిషి కారణంగా పనేమీ లేకుండా పోయారు. వారు కోపంతో మండిపడ్డారు. పొరుగు రాజ్యాపు రాజుగారి దగ్గర కెళ్లి “రాజా మా రాజు ఇప్పుడు బలహీనపడ్డాడు. సైన్యం కూడా కేవలం రెండులక్షల మంది మాత్రమే వున్నది. తప్పకుండా మీకు జయం లభిస్తుంది. వెంటనే మా రాజ్యం మీద దాడి చెయ్యండి. మేము మీ పక్షాన సైనికులుగా పని చేస్తాము” అని చెప్పివచ్చారు.

అది నమ్మిన పొరుగురాజు యుద్ధాన్ని ప్రకటించాడు. కొత్తగా వచ్చి చేరిన సైన్యంతో శత్రురాజు బలపడి ఉత్సాహంగా వున్నాడు. దండెత్తి వచ్చి ఇరురాజ్యాల మధ్య వున్న కాలువ దగ్గర డేరాల్ని వేయించాడు. ఆ కాలువ రెండు రాజ్యాల మధ్య సరిహద్దులాగా వున్నది.

రాజుగారు రామవర్మ మంత్రినీ మిగతా ఉద్యోగులనూ పిలిపించాడు, అందరూ కలిసి ఆలోచించారు. “మన సైన్యం మేం బలహీనమయినది, పిరికిది కాదు. కాని నాలుగు లక్షల మంది శత్రుసైన్యంతో వెళ్లి చేరారు. వాళ్లు బలపడ్డారు” అని వివరించారు.

వాళ్ల మాటలకు రాజుగారికి భయమేసింది.

“మహారాజా రామవర్మ నాలుగులక్షల మంది సైనికుల అదనంగా జీతం తీసుకుంటున్నాడు. మీరు అతన్నే వెళ్లి యుద్ధం చెయ్యమని చెప్పండి” అని మంత్రి సలహా ఇచ్చాడు.

రామవర్మ రాజుగారికి ధైర్యం చెప్తూ “రాజా మీరేం భయరపడకండి నేనొక్కడినే వెళ్లి యుద్దం చేస్తాను” అని మాట ఇచ్చాడు.

రాత్రియింది. అమావాస్య కావడం వలన చీకిటిగా వున్నది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో రామవర్మ లేచాడు. ఒలిచి వుంచిన సింహం చర్మాన్ని తీసుకన్నాడు. అప్పుడు దొంగల దగ్గర తీసుకున్న ఇరవై నాలుగు కత్తుల్నీ దగ్గర వుంచుకున్నాడు. బయలుదేరాడు. రెండు రాజ్యాల మధ్యలో వున్న కాలువ దగ్గర కొచ్చి దాన్ని దాటి వెళ్లాడు. అక్కడ శత్రు పక్షం వైపు ఏనుగులు కట్టి వేయిబడివున్నాయి. పశువులశాలల్లో ఎక్కడా వెలుతురు లేదు. సైనికులందరూ నిద్రలో వున్నారు.

రామవర్మ సింహపు చర్మాన్ని ఏనుగుల మధ్యాగా విసిరి వేశాడు. ఏనుగులు సింహం వచ్చిందన్న ఆలోచనతో సంకెళ్లు తెంచుకుని ఘీంకరిస్తూ పారిపోసాగినాయి. పరుగెత్తుతూ పరిగెత్తుతూ పశువులశాలను పెకిలించి వేసినాయి. ఇదంతా చూసి శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారనుకుని ఆ చీకటిలో తమ సైనికుల్ని తామే చంపుకోసాగారు. నెత్తురు వరదలై పారింది. చాలామంది మైదానాన్ని వదిలి పారిపోయారు.

ఈ గడబిడలో రామవర్మ శత్రురాజు శిబిరంలోకి వెళ్లాడు. అక్కడ సైనికులు కాని రాజుగారి కాపలాదారులు కాని ఎవరూ లేరు. వారంతా వెళ్లి యుద్ధం చేయటం కాని యుద్ధంలో చనిపోవటామే లేక పారిపోవటమో జరిగింది. రాజు తాగిన మత్తులో పడి గాఢనిద్రలో వున్నాడు. రామవర్మ నిద్రించే రాజును తేలిగ్గా చంపేసి వచ్చాడు.

ఉదయాన చూస్తే శత్రుమైదానంలో ఒకటి రెండు శిబిరలే వున్నయి, కాని సైనికులు లేరు. రామవర్మ ఒక్కడే అంత పెద్ద మైదానాన్ని అవలీలగా జయించేశాడు.

రాజుగారికి రామవర్మ పరాక్రమం చూసి పట్టరానంత సంతోషం కలిగింది. “ఇప్పుడేం కోరుకుంటావో కోరుకో రామవర్మా. నువ్వు నిజంగా నాలుగులక్షల మంది సైనికులకు సమానమే” అంటూ రాజు రామవర్మకు మరో అవకాశం ఇచ్చాడు.

“ధన్యుణ్ణి రాజా! ఆపద సమయంలో సరైన సలహా ఇవ్వని మంత్రి మీకెందుకు? ఇతను వట్టి పనికిమాలినవాడు. అతణ్ణి తీసివేసి నన్ను మంత్రిగా నియమంచుకోండి” అన్నాడు రామవర్మ.

రామవర్మ మాటలకు మంత్రికి చాలా కోపం వచ్చింది. కాని సమయం అనుకూలంగా లేదని మౌనంగా వుండిపోయాడు. రాజు మాత్రం రామవర్మనే మంత్రిగా నియమించుకున్నాడు.

ఆ శుద్ధ పల్లెటురి వాడే నాగరికత తెలీని రామవర్మే ఈనాడు ఆ రాజ్యానికి మంత్రి అయ్యాడు. గొప్ప ధనవంతుడూ అయ్యాడు. అదృష్టం కలిసివచ్చింది. ఊరికెళ్లి తన భార్యనూ పిలుచుకొచ్చాడు. భార్య ఎదుట మాత్రం రామవర్మ ఇప్పటికీ వణుకుతూనే వుంటాడు. ప్రజలు మాత్రం అతణ్ణి పరాక్రమవంతుడని చెప్పుకుంటారు. ఇంట్లో మాత్రం తోకముడుచుకుని పారిపోయే పిల్లితో సమానం. ఇంతటి అదృష్టం పట్టినా ఇంత ధనికుడైనా ఇప్పటికీ ఆమె భర్తతో ప్రేమగా మాట్లాడదు. వెనుకటి లాగే కరుగ్గా పటపటలాడుతూనే వుంటుంది. అది ఆమె కలవాటయిపోయింది. పాపం రామవర్మ.

హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి

తెలుగు సేత – దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here