[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
పాపానాం పాపనార్థాయ ప్రార్థతాసి మహాపగే।
తస్మాత్ పావయ పావని మా ప్రణాశం ప్రజాషుగే ॥
కశ్యపుడు పార్వతీ దేవిని వితస్త నదిగా ప్రవహించి కశ్మీరాన్ని పవిత్రం చేయమని అభ్యర్థించాడు. పార్వతి శివుడి ఆజ్ఞ మేరకు వితస్త నదిగా మారింది. కానీ అందరి పాపాలను ప్రక్షాళన చేయటం తనకన్నా లక్ష్మీదేవి అయితే బాగుంటుందని సూచించింది.
కశ్మీరాన్ని పార్వతి అంటారు. కైలాసం శంకరుడిది. హిమాలయాలు అతని నివాసం. హిమవన్నగ తనయ పార్వతి. అంటే కశ్మీరం మొత్తం శివమయం అవుతోంది. కానీ శివకేశవులకు అభేదప్రతిపత్తి. అందుకని కశ్మీరం ఏర్పాటులో విష్ణువు సహాయం చేశాడు. విష్ణువు, శివుడు పరాచికాలు ఆడుకున్నారు. ఇప్పుడు ప్రజలందరి పాపాలను ప్రక్షాళన చేయటం తన ఒక్కర్తికీ సాధ్యం కాదు కాబట్టి లక్ష్మీదేవిని కూడా నదిలా మారి ప్రవహించమంటోంది. అంటే, ఏదైతే శివకేశవుల నడుమ భేదాలు చూపి శివభక్తులని, విష్ణుభక్తులని వైరాలు పెంచుకునే వీలుందో అలాంటి వీలు లేకుండా ముందరి కాళ్ళ బంధం వేస్తోందన్నమాట నీలమత పురాణం. ఫలితంగా ఉత్తర భారతంలో శివకేశవుల నడుమ ఎలాంటి భేదభావం లేని ఒక సమన్వయ పరిస్థితి నెలకొంది. అంతే కాక లక్ష్మి అన్నా, పార్వతి అన్నా శివుడు అన్నా విష్ణువు అన్నా అంతా ఒకటే అన్న భావనను ప్రజల మనస్సులలో నాటడం కూడా నీలమత పురాణంలో చూడవచ్చు. ఒకే సత్యాన్ని పలువురు భిన్నంగా దర్శిస్తారన్నా, నదులు ఏ వైపు ప్రవహించినా అన్నిటి గమ్యం సముద్రమే అన్నా – శివుడు, విష్ణువు, లక్ష్మి, పార్వతి నామరూపాలు ఏమైనా భావం ఒక్కటే – శక్తి ఒక్కటే. అన్నీ ఒకటే.
పార్వతి సూచనను అనుసరించి కశ్యపుడు లక్ష్మీదేవిని నదిగా మారి కశ్మీరులో ప్రవహించి కశ్మీరాన్ని పవిత్రం చేయమని అభ్యర్థించాడు. లక్ష్మీదేవి కి గోవిందుడి అనుమతి లభించింది. అయితే లక్ష్మీదేవికి ఓ సందేహం ఉంది. ‘నాకన్నా ముందు సతి నదిలా మారి ప్రవహిస్తోంది. ఇప్పుడు నేను తన తరువాత నదిలా మారి ప్రవహించినా, అందరి పాపాలను ప్రక్షాళన చేసిన ఖ్యాతి అంతా సతికే దక్కుతుంది. కాబట్టి నేను నదిలా ప్రవహించినా నా గొప్ప ఏమీ ఉండదు’ ఇదీ ఆమె సందేహం.
ఆమె సందేహాన్ని అర్థం చేసుకున్న కశ్యపుడు ఆమెకి ధైర్యం చెప్పాడు. హామీలిచ్చాడు.
“మాతా… నువ్వు సర్వశక్తి సంపన్నురాలివి. పలు రూపాలలో దర్శనమివ్వగల శక్తిమంతురాలివి. సముద్రకన్యకా, అతి పవిత్రమైన నువ్వే కశ్మీరానివి. నువ్వే ఉమ. సకల దేవతల రూపాలలో ప్రకటితమవుతున్నది నువ్వే కదమ్మా! వితస్త నీటితో నీ నీరు కలవటం తేనె అమృతం కలిసినట్టుంటుంది. ఎంతటి భయంకర పాపాత్ములైనా మీ పవిత్రధారలో పవిత్రులయిపోతారు. కాబట్టి కరుణించి, సంశయాలు వీడి నదీరూపంలో కశ్మీరాన్ని పవిత్రం చేయి తల్లీ” అని అభ్యర్థించాడు.
దాంతో లక్ష్మీదేవి ప్రసన్నురాలయింది.
‘నా ప్రభువు ఆజ్ఞాపించాడు. కశ్యపుడు అభ్యర్థిస్తున్నాడు. కాబట్టి నేను సందేహించి లాభం లేదు’ అనుకుంది.
నది రూపంలో మారింది.
“సతీదేవి నదీరూపంలో ఈ ప్రాంతానికి వచ్చే కన్నా ముందే నువ్వే ప్రవహించి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయి తల్లీ. అందరూ నిన్నే తలుస్తారు” అన్నాడు కశ్యపుడు.
అతడి మాటలు వింటూనే సంతోషంతో, విచారం వదిలి లక్ష్మీదేవి నదిలా మారింది. అందుకే ఆ నదిని విశోక అంటారు. విశోక అంటే శోకం లేనిది అని అర్థం.
లక్ష్మీదేవితో కశ్యపుడి సంభాషణ విన్న సతీ సంతోషంతో విశోక రాక కోసం ధౌమ్యుడి ఆశ్రమం వద్ద ఎదురు చూడడం ఆరంభించిది.
నదీరూపం ధరించిన లక్ష్మీదేవి రసాతలం నుండి వెలుపలికి వచ్చే మార్గం కోసం అన్వేషిస్తుంటే, ఆమెకు ‘అఖు’ వద్ద మార్గం కనిపించింది. ఆ మార్గం గుండా భూమి వెలుపలికి వచ్చింది విశోక.
కానీ అప్పటికే వితస్త అక్కడ ఆమె కోసం ఎదురుచూస్తోంది. సంతోషంతో విశోక వితస్తను కలిసింది.
కాని అక్కడ వితస్త ముందే చేరి ఉండడం వల్ల ప్రజలు విశోకను గుర్తించలేకపోయారు. ఖ్యాతి అంతా వితస్తకే వచ్చింది.
ఇది లక్ష్మీదేవికి కోపం కలిగించింది.
దాంతో విశోక కశ్మీరాన్ని శపించింది.
“మీరు మోసంతో నన్ను భూమిపైకి రప్పించారు. నా రాక గురించి సతీకి ముందే చెప్పారు. దాంతో వితస్తలో నేను కలిసిపోయాను. కాబట్టి మీరంతా అబద్ధం చెప్పేవారు, మలిన మనస్కులు, వేతనం కోసం పనిచేసే సేవకులు అయి, విశ్వవ్యాప్తంగా అపఖ్యాతి పొందుతారు” అని శపించింది. అంతేకాదు, “వితస్తలో నేను కలిసిపోవటంలో నాకు అవమానం ఏమీ లేదు. ఎందుకంటే నేనే సతి, సతే నేను” అంది. వితస్తతో కలిసి ఆనందంగా నదీరూపంలో ప్రవహించడం ఆరంభించింది.
ఇదొక అద్భుతమైన గాథ.
రెండు నదుల కలయిక భారతీయ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. అలాంటి అత్యంత పవిత్రమైన ఘట్టం ఇది. లక్ష్మి పార్వతులు నదీరూపంలో మిళితమై ప్రవహించటం ఎంతో రమ్యమైన సన్నివేశం. అయితే కశ్మీరు చరిత్రను చూస్తే ఇక్కడ అద్భుతమైన వ్యక్తుల నడుమ అతి సామాన్యమైన తక్కువస్థాయి వ్యక్తులు కనిపిస్తారు. కశ్మీరం అధికంగా అల్లకల్లోలవటం కనిపిస్తుంది. ధర్మరక్షణ కోసం నిరంతరం పోరాటం కనిపిస్తుంది. అత్యద్భుతమైన వ్యక్తిత్వాల సరసన అత్యంత నీచులు కనిపిస్తారు. లక్ష్మీదేవి శాపం ఈనాటికీ కశ్మీరాన్ని పట్టి పీడించడం మనం చూస్తున్నాం. ఒక ప్రాంతం వ్యక్తిత్వాన్ని, ప్రజల జీవన విధానాన్ని ఊహించి, దానికి కారణాలను ప్రకటించి భవిష్యద్దర్శనం చేసిన రీతిలో పురాణాన్ని రచించటం పరమాద్భుతం అనిపిస్తుంది.
అయితే కశ్మీరాన్ని అతి పవిత్రం చేయాలన్న కశ్యపుడి తపన కశ్మీరాన్ని ఈనాటికీ రక్షిస్తోందనిపిస్తుంది. లక్ష్మీదేవి శాపం ఒకవైపు ప్రభావం చూపిస్తున్నా, మరోవైపు కశ్మీరం దైవనిర్మితం కావటం, దేవతలంతా కశ్మీరంలో కొలువై ఉండడం కశ్మీరాన్ని అతి పవిత్రం చేస్తూ రక్షిస్తోంది అని నీలమత పురాణం సూచిస్తోంది.
అందుకే లక్ష్మీ పార్వతుల సంగమ రూపం అయిన వితస్తలో దేవతల మాత అయిన అదితి ‘త్రికోటి’ నదిలా మారి కలిసింది. కశ్మీరాన్ని మరింత పవిత్రం చేసింది. చంద్రావతి నది రూపంలో దితి, హర్ష పథ రూపంలో ఇంద్రుడి భార్య శచి వితస్తతో వచ్చి కలిశారు. ఇలా దేవతలు నదుల రూపంలో వచ్చి వితస్తలో కలిశారు. కశ్మీరాన్ని, కశ్మీరు ప్రజలను అత్యంత పవిత్రులుగాను, అదృష్టవంతులుగాను చేశారు. ఇలా ప్రవహిస్తూ వితస్త గంగ, సింధు నదులతో కలవటంతో కశ్మీరం మరింత పవిత్రం అయింది. వితస్త సింధు నదుల కలయిక పాలు తేనె, అందం ఆనందం, విజ్ఞానం సౌమనస్యం కలగలిసినట్టుంది.
(ఇంకా ఉంది)