నవ్వేజనా సుఖినోభవంతు! -1: అటో ఇటో ఎటో వైపు

4
3

[box type=’note’ fontsize=’16’] ‘నవ్వేజనా సుఖినోభవంతు!‘ శీర్షికన భావరాజు పద్మిని గారు సంచిక పాఠకులకు అందిస్తున్న హాస్యరచనలివి. ‘అటో ఇటో ఎటో వైపు’ అనే ఈ రచనలో ఓ పెద్దాయనని ఇంటర్వ్యూ చేసిన వైనాన్ని చమత్కారంగా అందిస్తున్నారు. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్యన ఓ పెద్దాయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను…

‘సార్! మీరు మొదటిసారి ప్రదర్శన ఏ వయసులో ఇచ్చారో చెప్తారా?’

‘నాకప్పుడు ఏడేళ్ళో, తొమ్మిదేళ్లో అనుకుంటా. మా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. అప్పుడు నాతో పాటు ఓ ఐదారుగురం కలిసి పాట పాడాము. అదే మొదలు, అంతా మెచ్చుకున్నారు.’

‘మరి స్కూల్ తర్వాత మీరు శాస్త్రీయ సంగీత కచేరి ఎప్పుడు చేశారు?’

‘మా గురువుగారు, 78లోనో 80 లోనో అనుకుంటా. వినాయక చవితికి మా ఊరిలో కచేరీ ఏర్పాటు చేశారు. అక్కడ తొలిసారి పాడిన గుర్తు.

అయితే అమ్మాయ్, మీ విలేఖరులు, పత్రికలు, మీడియా వాళ్ళంటే ఇక్కడే నాకు ఒళ్ళు మండుతుంది. ఆ మధ్యన మీలాగే ఒకరు ఇదే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పానా? మొదటి కచేరీ 78-80 మధ్య చేశానని రాసేసారు. గౌడి గేదే మీద నల్ల మార్కర్ తో రాసినట్టు ఇదేం అర్థం పర్ధం లేని రాతంట?

అంటే నేనా రెండేళ్ల పాటు అదే వేదిక మీద, అసమ్మతి నేతలా బైఠాయించి, నరాలు చిట్లేట్టు స్వరాలు పాడుతూనే ఉన్నాననా? తలతిక్క రాతలు మీరూనూ?’

నా గుండు మీద గుండు చెంబుతో మోదినట్టు నేను ఖంగుతిన్నాను.‌ ‘ఓరి నాయనో! ఈయన ఖచ్చితంగా ఏ సమాధానమూ తేల్చి చెప్పట్లేదు. పైగా అటో ఇటో అని చెప్పినప్పుడు, అల్పప్రాణి అయినా ఆ యొక్క విలేఖరి అలా ఎటోవైపు తేల్చేసి రాయడంలో తప్పేం ఉంది? రేపు నా తలరాత కూడా ఇలా డాక్టర్ల, డికెష్టివ్‌ల కోడి రాతలా మారి, వాతలు పెట్టుకోవాల్సిందేనా?’ అంతరాత్మ అంతర్గతంగా అల్లాడింది.

‘క్షమించాలి సార్. మీకా ఇబ్బంది రానివ్వను, జాగ్రత్తగా రాస్తాను. ఇక మీకు లభించిన ఉత్తమమైన ప్రశంస ఏమిటో చెప్పండి,’ స్వరంలో కలవరం ధ్వనించకుండా, కాన్ఫిడెన్సు కురిపిస్తూ, అడిగాను.

‘ఆ,ఆ. ప్రశంస అంటే ఓసారి 85 లోనో 88 లోనో అనుకుంటా. హైదరాబాదు త్యాగరాజ గాన సభలోనో, రవీంద్రభారతిలోనో అనుకుంటా…’

నా అంతరాత్మ ఆనంద తాండవం మొదలెట్టింది… ‘అయ్యా! ఇమేజినేషన్ కయినా ఒక లొకేషన్ శాంక్షన్ చేయండి. రవీంద్ర భారతి నుంచి త్యాగరాజ గాన సభ దాకా పాకాలి అంటే, మధ్యలో డిస్టెన్స్, హైదరాబాద్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ చాలా ఉంది కదా!’

‘ఆ విధంగా నేను కచేరీ చేస్తున్నప్పుడు ఒక కృతి పాడుతున్నానా, అప్పుడు ఓ 500 మందో వెయ్యి మందో శ్రోతలు వచ్చారనుకోండి…’

నా అంతరాత్మ అంతరాళలో ఆరున్నొక్క రాగం ఆలపించి, ముళ్లపూడి వారి బుడుగును గుర్తుచేసుకుంది, ‘ ఒరేయ్ పెద్దవాడులారా! ఇటు రా నీకు కాస్త గానం పంచుఠా.

6. నువ్వు పధో ముప్ఫయ్యో చాక్లెట్లు ఇస్తే పర్లేదు. కానీ నన్ను ఐధో ఫదో మార్కులు తెచ్చుకో మనకు. నాకు వలకరం వేస్తుంది.
12. నువ్వు రేపో మొన్నో నాకు జటకా బండి ఎక్కడానికి డబ్బులిస్తే ఫర్లేదు. కానీ బైఠికెళ్ళి, నాలుగు పచ్చిమిరగాయలు తెమ్మని నాకు చెప్పకు. నేను నాలుగే తెచ్చాననుకో, మళ్ళీ నువ్వు ‘హారి భడవ!’ అని నవ్వుతావు. నాకు ఖోపం వస్తుంది.
35. నీ కన్నా ఆ సీగాన పెసూనాంబను ఎత్తుకుపోయిన రాచ్చసుడే నయం! ‘పదమూడో ఎక్కం చెబ్తే చాలు’, అన్నాడు. నువ్వేమో ఏది థేల్చి చెప్పావుగా! థేల్చి చెప్పడం అంటే ఏంటో నాకు తెలియదు. మన చిన్నప్పుడు, వానొత్తే లెక్కల నోట్ బుక్ చించి, కాగితం పడవలు చేసి నీళ్లలో వేయిస్తాం‌ ఖదా! అప్పుడవి థేలి థేలి పోతాయి కదా! ఆ తర్వాత పుస్తకం ఏదిరా అని‌ మాట్టారు మన వీపు మీద ప్రైవేటు చెప్ఫేస్తారు ఖదా! అదేనేమో!
2. నేనసలే లెక్కల్లో వీక్. అంకెలు చూస్తే నాకు అంకమ్మ శివాలెత్తాలనిపిస్తుంది. అంటే మనం లెక్క తప్పు చేస్తే మాస్టారు ఆకాశమంత ఎత్తు ఎగురుతూ గుండు మీద పాఠం చెప్పేస్తాడు చూడు, అదేనట. బాబాయ్ చెప్పాడు. అయినా మా పిల్లలకి అన్ని కూడించి, తీసి వేయించి, భాగించి, గుణించి, ఫ్రెండుగాడవడం తెలీదు. ఆరోజు చాక్లెట్ ఇచ్చిన వాడే మాకు చార్లీ చాప్లిన్, తాయిలం ఇచ్చిన వాడే తాంతియాతోపే. ఇంకా నీకు అర్థం కాపోతే జాటర్ డమాల్.

‘అమ్మాయ్, ఇదిగో అమ్మాయ్ ఉన్నావా? ఊ అనమ్మా, ఏది ఊ అను… ‘ అవతల పెద్దాయన లీలగా అరవడంతో, ఇహలోకంలోకి వచ్చాను.

‘ఆ, వింటున్నానండి. రికార్డ్ అవుతోందా, లేదా అని చూస్తున్నాను, చెప్పండి,’ అన్నాను కవరింగ్ ఇస్తూ.

‘అలా నేను పాడుతున్నప్పుడు ఆ రోజున నా వెనుక ఫిడేలో, మృదంగమో వాయిస్తున్నతను, లయ తప్పాడు. అయినా నేను తాళం తప్పలేదు. అప్పుడు ఆ సభకు వచ్చిన ఒకతనో ఒకావిడో గుర్తులేదుగాని, మోహన రాగమో భూపాళమో పాడినందుకు నన్ను ఎంతగానో మెచ్చుకుని, శాలువానో కండువానో ఏదో కప్పారు. ఈ లోపున…’

నా అంతరంగం‌ జాతర్లో పోతరాజులా జుట్టు విరబోసుకుని, రేసుగుర్రం సినిమాలో శృతిహాసన్ లాగా లోలోపలే (అంటే ఇన్సైడ్) వికటాట్టహాసం చెయ్యసాగింది. చివరకు ఎఎన్ఆర్ లాగా ‘హిహహహాహ’ అని కర్ణభేరి విబేధనం పొందేలా నవ్వి, ఇలా వాపోయింది

‘అటో ఇటో ఎటో వైపు అన్నారు కదా అని ఆ రాజకీయ సర్వేలాయన లాగా, ఏదోటి చెప్పేసి, ఓ పదిహేనిటో అటో వెయ్యమంటే ఎలాగండి? అసలొకటి అటో ఇటో వేస్తేనే ప్రభుత్వాలు మారిపోతాయ్. జాతకాలు తిరగబడతాయ్. బడ్జెట్లు బండలవుతాయ్…. అయినా నేను రోడ్డు అటునుండి ఇటు దాటడానికి మెట్రో మెట్లెక్కి, పంచర్ పడ్డ సైకిల్ టైరాట ఆడుకుంటూ వెళ్ళాలి కదా. మరా కపాల్ ఏంటి అలా అంటాడు? అసలతనికి ఓట్లేసిన ఆ 3037 మంది కోసం గజ ఈతగాళ్ళని పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు కదా. కావచ్చుగాక! హే పప్పు, హే నిప్పు ! ఎవరక్కడ, ఆ యొక్క నటుడిని గ్లాసులో పోసి తీసుకురండి. చెప్పు నాయనా, నటులంతా అస్మదీయులు, నాయకులంతా తస్మదీయులు… అరెరే, తసమదీయులు కాదు నాయనా, తస్మదీయులు. అయినా, మీ ఫామిలీకి రాజకీయాలు అచ్చిరాలేదు కానీ, వేసుకో తండ్రీ ఓ వీరతాడు, చూసుకో బాబు ఇంకో సినిమా ఛాన్సు… ముక్కోణపు ప్రేమ పోరుల్లో ఇప్పుడు నీకు బాగా అనుభవం వచ్చిందిగా! ఇక తెలుగువారికి తకిటతధిమి తందానానే. హమ్మో, ఇక నాకు టైమయ్యింది. నేను ట్రంపు మామతో సద్యోహిందూ నేత ప్రమాణ స్వీకారానికి వెళ్ళి, తొక్కుడుబిళ్ళాట ఆడుకోవాలి. ఆంఫట్ స్వాహా!’

‘అమ్మాయ్, ఉన్నావా? ఇంతకీ నా ఇంటర్వ్యూ ఎప్పుడొస్తుంది?’

‘ఈ జన్మలోనో వచ్చేజన్మలోనో ఖచ్చితంగా వేస్తాను సార్. ‘

‘ఆ… !’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here