[dropcap]“ఏ[/dropcap]నుగుపైని నవాబు
పల్లకి లోని షరాబు
గుఱ్ఱము మీద జనాబు
గాడిద పైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కటే
నడిపే వానికి అందరొకటే”
ఇది భుజంగ రాయశర్మగారు ‘రంగుల రాట్నం’ అనే చిత్రానికి వారు రాసిన రచన.
ఈ ఒరవడిలోనే సంస్కృత పండితులు అనంతరాయ శర్మగారు, వారి శిష్యులు అవధాని రామశర్మగారు పుష్యమాసం గయ తదితర తీర్థయాత్రలకు శ్రీకాళహస్తి నుండి బయలుదేరారు.
రైలు సాయంత్రం 6-30ని తిరుపతి నుండి శ్రీకాళహస్తి చేరుకున్నది. గురుశిష్యులు ఎస్1 కంపార్టమెంట్‌లో వారికి కేటాయించిన 16, 20 బెర్తుల్లో సామాన్లతో పైకెక్కి స్థిరపడ్డారు. మరచెంబుతో నీళ్లు పట్టుకురావడానికి శిష్యుడు ప్లాట్‌ఫారం వైపు దూసుకు పోయాడు. ఈలోపున గురువుగారు వారి బెడ్డింగ్ బెల్ట్‌లు విప్పి వారి బెడ్ మీద పరచి ఓ దుప్పటీ దిండూ కాడా అవసరానికని పక్కన పెట్టుకున్నారు. కూడా తెచ్చుకున్న తినుబండారాలను ప్రక్క సామాన్ల హేంగర్‌కి తగిలించి కట్టుకున్న పంచి సరిగా సవరించుకుని వారి బెర్తులో కూర్చున్నారు. రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వినిపిస్తుంటే శిష్యుడు ఆయసపడుతూ… గబా గబా కంపార్టమెంట్‌లోకి దూసుకువచ్చాడు. గురువుగారి ఎదురు బెర్త్ పై అలసటగా కూర్చున్నాడు. రైలు వేగం పుంజుకుంది. గురుశిష్యులకు ప్రక్కగల ఓ సైడ్ లోయర్ బెర్త్‌లో శిఖామణి అనే ఖద్దరు వస్త్రాలు ధరించిన ఓ రాజకీయవాది కూర్చున్నాడు. ఇక కాలక్షేపానికి గురువుగారు వారి సంస్కృత భాషలో ముందుగా ‘నమస్కారః’ అంటే అతనికి అర్థంగాక ఎటో శిఖామణి చూస్తుంటే వెంటనే శిష్యుడు “అయ్యా మా గురువుగారు నమస్కారమండీ అంటున్నారు” అన్నాడు. వెంటనే ఆ శిఖామణి కూడా పెద్ద అర్థమయినట్లు ‘నమస్కారః’ అన్నాడు.
తిరిగి గురువుగారు “భవతః నామకిం” అన్నారు. వెంటనే శిష్యుడు “అంటే మీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు” అని చెప్పాడు.
వెంటనే తెలుగులో ‘శిఖామణి’ అన్నాడు.
వెంటనే గురువుగారు “మమ నామ అనంతరాయశర్మః భవత్యాః గృహే సర్వేకుశలంవా?” అని అడిగారు.
శిష్యుడు శిఖామణిగారిలా – “ఆం! మమ గృహే అపి సర్వే కుశలం (అంతా క్షేమం)” అని చెప్పాడు.
గురువుగారు “సముచితం” అన్నారు.
వెంటనే గురువుగారు “భవతి కిం కరోతి?” (ఏం చేస్తున్నారు?)” అని అడిగారు.
శిష్యుడు శిఖామణిని తెలుగులో అడిగి “అహం శిక్షకా భవాన్ కిం కరోతి” (ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను) అని బదులిచ్చాడు.
వెంటనే గురువుగారు “మమ జ్యేష్ఠబ్రాతా ఆపితం త్రగ్జః వారణాసిః” అన్నారు.
వెంటనే శిష్యుడు శిఖామణితో “మా గురువుగారి అన్న కాశీలో ఇంజనీరుగా చేస్తున్నారట” అని చెప్పాడు.
శిఖామణి జేబులోంచి ఓ షోటో తీసి చూస్తూ ఆ శిష్యుడితో తెలుగులో చెప్పగా, అతను గురువుగారితో – “తత్ర మమ పితా మహోదయస్య చాయా చిత్రం అస్తి” అన్నాడు.
వెంటనే గురువుగారు “భవత్యాః పితాకుత్ర అసి?” (మీ నాన్నగారు ఏం చేస్తారు) అని అడిగారు. శిష్యుడు వెంటనే దానికి జవాబు అడిగి గురువుగారితో “మమ పితా కార్యాలయే అస్తి” అన్నాడు.
వెంటనే దానికి గురువుగారు “భవంతః సర్వే ఏకత్ర వసంతివా?” (అంతా కలిసే వుంటారా) అని అడుగగా, శిష్యుడు జవాబుగా శిఖామణి చెప్పిన ఏకవాక్యం ఇలా “భవంతః సర్వే ఏకత్ర వసంతివా” (అంతా కలిసే వుంటాం).
గురువుగారు “ఆం వయం ఏకత్ర వశామః (కలిసే వుంటాం) పరంతు మమ కనిష్ట పిత్రవ్యః అన్యత్ర వసంతి” (వేరే చోట వుంటారు) అని చెప్పారు.
శంకర్ శిఖామణి మాటల్లో “భగవాన్ సర్వత్ర అస్తి భాలో” అన్నాడు.
గురువుగారు “ఆం. భగవాన్ సర్వత్రి అస్తి” (భగవంతుడు అన్ని చోట వుంటాడు) అన్నారు.
శిఖామణి శిష్యుడితో సంస్కృతంలో చెప్పాలని తెలుగులో “ఇక వుంటాను” అనగా శిష్యుడు గురువుగారితో “సముచినం అహం గచ్చామి. విలంబనం అభవత్” అని సంభాషణకు స్వస్తి పలికాడు.
ఇలా గురుశిష్యులు తోటి ప్రయాణీకుడు శిఖామణిల సంభాషణ సాగింది.
***
తదుపరి ఇంతలో విజయవాడ స్టేషన్‌లో ఉదయాన్నే తమలపాకులు అమ్మకానికి రావడంతో గురువుగారి కోరిక మీర శిష్యుడు ఓ మోద తమలపాకులు కొని తెచ్చాడు. గురువుగారికి ప్రతీ గంటకీ తాంబూలం వేసుకోవడం అలవాటు కనుక 30 రూపాయలు గురువుగార్ని అడిగి మోద కొన్నాడు. అందులో ఎన్ని ఆకులు వున్నయోనని వాటిని గురువుగారు లెక్క పెట్టుతున్నారు.
ఏకం, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చదుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ (ఒకటి నుండి పంతోమ్మిది వరకు); 20 వింశతి, 30 త్రిశత్. 40 చత్వారింశత్, 50 పంచాశత్, 60 షష్టిహి, 70 సప్తతిః, 80 అశీతిః, 90 నవతిః, 100 శతం (ఇరవై ముప్పై నలభై మొదలైనవి); 21 ఏకవింశతి, 22 ద్వావింశతి, 23 త్రయోవింశతిః, 24 చతుర్వింశతిః, 25 పంచవింశతిః, 26 షడ్వింశతిః, 27 సప్తవింశతి, 28 అష్టావింశతి, 29 నవవింశతిః (ఇరవై ఒకటి, ఇరవై రెండు మదలైనవి); 100 శతం, 200 ద్విశతం 300 త్రిశతం, 400 చతుశ్శతం, 50 పంచశతం, 600 షట్ఛతం, 700 సప్తశతం, 800 అష్టశతం, 900 నవశతం (వంద, రెండు వందలు మొదలైనవి);
100 సహస్ర, 2000 ద్విసహస్ర, 3000 త్రిహస్ర, 4000 చతుర్ సహస్ర, 5000 పంచ సహస్ర, 6000 షట్ సహస్ర, 7000 సప్తసహస్ర, 8000 అష్టసహస్ర, 9000 నవసహస్ర (వెయ్యి రెండు వేలు, మూడు వేలు మొదలైనవి)
10000 దశ సహస్ర, 20000 వింషతి సహస్ర, 30000 త్రిశత్ సహస్ర, 40000 చత్వారింశత్ సహస్ర, 50000 పంచాశత్ సహస్ర, 60000 షష్టిహి సహస్ర, 70000 సప్తతి సహస్ర, 80000 అశీతి సహస్ర, 90000 నవతి సహస్ర (పది వేలు ఇరవై వేలు మొదలైనవి); లక్ష(లక్ష) దశలక్ష (పది లక్షలు), కోటి (కోటి), శత కోటి(వందకోట్లు)… అలా గురువుగారు వారి సంఖ్యా శాస్త్రాన్ని తమలపాకుల లెక్కతో పునశ్చరణ చేసుకున్నారు.
ప్రొద్దున్నే టీ తాగింతరువాత ఆ కాశీ విశాలాక్షి దేవిని (అన్నపూర్ణదేవిని) మనస్పుర్తిగా స్మరించుకుంటున్నారు:
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాన్ దేహిచ పార్వతి
మాతచ పార్వతి దేవి పిత దేవో మహేశ్వరః
భాందవా శ్శివ భక్తాస్చ స్వదేశో భువనత్రయం
తెలుగులో భావం: “అమ్మా అన్నపూర్ణా! శంకరునికి అత్యంత ప్రియరాలివి కూడా అయిన సదాపూర్ణా పార్వతీదేవీ… జ్ఞానవైరాగ్యాల కోసం నిన్ను వేడుకుంటాను.. నాకు పార్వతిదేవి అమ్మతోను, మహేశ్వరుడు తండ్రితోనూ సమానం. అలాగే శివ భక్తులందరూ నా బంధువులు మరియు నా స్వదేశమే ముల్లోకాలు.”
అంటూ గురువుగారు మనసులోనే శరీర సంప్రోక్షణ మంత్రోచ్చారణతో గావించి సంధ్యావందనానికి ఉపక్రమించారు. శిష్యుడు కూడా గురువుగార్ని అనుకరించాడు. శ్రోత్రీయ బ్రాహ్మణులు నిత్యకర్మలు మానకూడదుగా.
ఇలా వారి రైలు ప్రయాణం సాగుతోంది. కూడా తెచ్చుకున్న అటుకులు, పులిహోర, ఖర్జూరాలు అల్పాహారం చేసి మళ్లీ నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో బీహారీ వాళ్లు కొందరు మొండిగా కంపార్ట్‌మెంటులోకి ప్రవేశించి గురుశిష్యులను లేపి కూర్చోబెట్టారు. రైల్వే రూల్సు వాళ్లకి వర్తించవు. బలవంతునిదే రాజ్యం. ఇక వీళ్ళ పాట్లు వర్ణనాతీతం.
ఏం సుఖం? బెర్తు, సీటు రిజర్వ్ చేయించుకున్నా ఓ మూలకు నక్కి కూర్చోవలసి వచ్చింది. ఎప్పుడు కాశీలో దిగుతామా అని ఆ విశ్వేశ్వరుణ్ణి జపం చేయడం తప్ప అన్య మార్గం గోచరించడం లేదు. చివరికి అల్పాచయనానికి పోవాలన్నా మనిషి మీద మనిషి కిక్కిరిసి వుండడం వల్ల ఆకాశమార్గమే దారి అయింది. ఇలాంటి కుంభమేళా రోజులలో బయలుదేరటం కైలాసానికి దారి వెతుక్కున్నటే అనిపిస్తుంది. సరదాగా మొదలైన ప్రయాణం చివరికి శరీర దురద వదిలించుకున్నట్టేయింది. రైలు దిగుతూ వేయి జన్మలకీ ఈ రైలు ప్రయాణం వద్దురా భగవంతుడా అంటూ మూటా ముల్లె భూజానికి తగిలించుకుని గురుశిష్యులు తదుపరి కార్యక్రమానికి ఉపక్రమించారు.
తరువాత గయలో కూడా స్నానం ఆచరించి తీర్తయాత్ర సంపూర్తి చేసుకున్నారు. ఇదే ఓ సంస్కృత పల్లకీ అని గురువుగారు అభివర్ణించారు.
శుభం భూయాత్
ఏ భాష అయినా జీవన గమనానికి భావమొక్కటే! అదే భిన్నత్వంలో ఏకత్వం.