జానేదేవ్-9

0
3

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ భాగం. [/box]

[dropcap]ఫో[/dropcap]న్ మోగింది….

ఫోను ఎత్తిన వాసుదేవ్… “చెప్పు..” అన్నాడు.

“సార్… వీడు… సంతోషం… సన్‌డే ఎన్‌జాయ్ చేయడానికి ఖుషి హోటల్‌కి వెళుతున్నాడు… వాడి సంతోషానికి అవధులు లేకుండా ఉంది సార్… నేను కాఫీలు పట్టుకొని వాడి క్యాబిన్‌లోకి వెళుతుంటే… వాడు అంటున్న మాటలు విన్నాను….. ‘మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం జాస్మిన్… మనకి అడ్డు వచ్చే వాళ్లు ఎవరు లేరు’ అని పొంగిపోతున్నాడు…”

“ఈ రోజే సంతోషంకి ఆఖరి సంతోషం. రేపటి నుండి చూస్తావుగా… దేభ్యంమొఖంతో మూలన నక్కిన పిల్లిలా ఓ మూల కూర్చుంటాడు…”

“సంతోషంని తక్కువ అంచనా వేయకండి సార్. వాడు మాములు వాడు కాదు… వాడు ప్లేటు మార్చేస్తాడు.”

“నువ్వేం కంగారు పడకు… అంతా నేను చూసుకుంటాను…. మంచి ఇన్ఫర్‌మేషన్ ఇచ్చావు. ఇక సంతోషం ఆట కట్టించడం చాలా సుళువు… ఉంటాను…” అని ఫోను పెట్టేసి… అనసూయకు ఫోను చేసాడు.

“అమ్మా… నేను శివని… సార్ గారి గురించి ఇన్ఫర్మే,న్ వచ్చింది… ఈ రోజు ఎలాగైనా ఈ అవకాశాన్ని మనకి అనుకూలంగా చేసుకొని సార్ గారి కళ్లు తెరిపించాలి. మీరు నేను చెప్పిన అడ్రస్ దగ్గరకు వెళ్ళండి. నేను జాన్‌కి అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాను…. ‘అంతా నేను చూసుకుంటాను… నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను… మేడమ్‌గారిని వచ్చేయమనండి’ అన్నాడు” అని అనగానే కంగారుగా అంది అనసూయ.

“శివా… నా గురించి నీకు తెలుసు… ఊరి నుండి వచ్చిన దానిని… ఏదో గుళ్లు గోపురాలు… సామాజిక సేవలంటే వెళ్లిపోగలను…. కాని క్లబ్‌లు… అలాంటి చోటుకి వెళ్లడం కంగారుగాను, భయంగాను ఉంది. కాసేపు మాట్లాడితే నాకు కాస్త ధైర్యం వస్తుంది. నేను ఫోను చేసినప్పుడు జాన్‌ని రమ్మని చెప్పు” అంది.

ఒక్క నిమిషం కంగారు పడ్డాడు….

“మాట్లాడవేం శివా?” అంది.

“అలాగే అమ్మా, ఇప్పుడే జాన్‌తో చెబుతాను….” అన్నాడు వాసుదేవ్.

ఏం చేయాలో తెలియక ఆలోచనల్లో పడ్డాడు. ఏం అయితే అది అయింది. నిజం చెప్పేస్తాను. ఆఫీసుల్లో అందరిని జలగలా పీల్చుకుతింటున్నాడు… బుద్ది చెప్పాలనుకున్నాను అని నాన్నగారి విషయం కూడ చెప్పేస్తాను అని నిర్ణయానికి వచ్చాడు వాసుదేవ్…

సాయంత్రం ఆరు దాటినాక అనసూయ దగ్గర నుండి వాసుదేవ్‌కి ఫోను వచ్చింది.

“బాబూ… జాన్… సాయిబాబా గుడి దగ్గర ఉంటాను… అన్నట్లు మెరూన్ రంగు చీర కట్టుకుంటాను. గుడి దగ్గరకు రాగానే ఫోను చెయ్యి బాబు…”

“అయ్యో మెరూన్ రంగంటే చాలా మంది ఆడవాళ్లు కట్టుకోవచ్చు…”

“కుడి వైపు ముక్కుకి ఆరురాళ్ల ముక్కుపుడక, తన నిండా పూలు ఉంటాయి. ఈ కాలంలో నాలా ఎవరూ తయారు కారులే. అందరూ జుత్తు విరబోసుకుంటారు. అన్నట్లు చెంపల దగ్గర తల నెరసి ఉంటుంది. ఆ మనిషిలా నేను తలకి రంగు వేయను” అంది.

“అలాగే అమ్మా” అని ఫోను పెట్టేసాడు. చిన్నగా తనలో నవ్వుకున్నాడు వాసుదేవ్…

నీలాంటి మంచి మనిషికి అలాంటి జల్సారాయుడు భర్త కావడం దురదృష్టం అని అనుకుంటుండగానే సెల్ రింగ్ అయింది…

నెంబరు చూసి చిరాగ్గా అన్నాడు…

“చెప్పు…”

“ఏంటి దేవ్… నేను ఫోను చేస్తే నీకు చిరాగ్గా ఉన్నట్లుంది… అవునులే నాలాంటి పిచ్చిది, నీ వెనకాల వెంటబడుతుంటే చీప్ కాకపోతే ఇంకేం అవుతాను…”

“వసూ… అసలు విషయం చెప్పు…”

“చెబుతాను బాబూ… చెప్పడానికి పోను చేసాను. ఈ సన్‌డే మనిద్దరం కలుసుకోవాలి…”

“ప్రత్యేకించి చెప్పాలా…”

“చెప్పాలి… ఎప్పటిలా మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరితో కలసుకోవడం కాదు…”

“మరి…”

“మరి… వాళ్లు ఎవరు రారు… నేను నువ్వు సినిమాకి వెళ్లి, అటునుండి డిన్నర్‌కి వెళ్లి సరదాగా గడిపి బోలేడు విషయాలు మాట్లాడుకోవాలి.”

“క్రొత్తగా ఈ ప్రోగ్రాం ఏమిటి?…”

“ఏమిటో అక్కడకు వచ్చాక చెబుతాను…”

“ఒక పని చెయ్యి కార్తీక్, ఫణిని కూడా రమ్మని చెప్పు చాలా రోజులయింది… అందరం కలిసి…”

“అందరం కలిసి గంగలో దూకుదాం… ఒక ఆడపిల్ల నోరు తెరిచి ఏదో మాట్లాడాలంటుంది… అని ఆలోచించవేం… మనం రేపు కలుస్తున్నాం, ఇంకేం మాట్లాడకు” అంది కోపంగా వసుంధర.

భారంగా నిట్టూర్చి…. “వాచిపోయింది. సరే” అన్నాడు.

“హమ్మయ్య… నిన్ను ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది… అది సరే… వాచిపోయింది అని అన్నావు. ఏమిటది… డెంటల్ ప్రోబ్లమ్ అయితే మండే రా… డెంటల్ డాక్టరుకి చూపెడతాను…”

“డెంటల్ ప్రోబ్లమ్ కాదు… బుర్ర వాచిపోయిందన్నాను…”

ఒక్క క్షణం ఆలోచించి… “యూ” అంది కోపంగా.

“ఇక ఫోను పెట్టేస్తాను.”

“రేపు నీ పని చెబుతాను…”

ఏదో గుర్తు వచ్చిన వాడిలా… “రేపా… మైగాడ్, రేపు చాలా ముఖ్యమైన పని ఉంది… కుదరదు…”

“కుదరదా… ఏం… రేపటి పని ఎల్లుండికి వాయిదా వెయ్యి…”

“కుదరుదు… రేపు కచ్చితంగా నేను వెళ్లవలసిందే… ఎందుకంటే ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. తరువాత కలుద్దాంలే…” అని ఫోను పెట్టేసాడు.

‘దుర్మార్గుడా… నీ వెనకాల వెంటబడి చీప్ అయిపోయాను… చూస్తాను… ఆరు నూరయినా, నూరు ఆరైయినా… నువ్వు నా వాడివని ఫిక్స్ అయిపోయాను. నాది ఉడుం పట్టు…. అసలు రేపు నువ్వు రాననడానికి కారణం ఎదరింటి పిల్ల కాదు కదా… ఏమో…డౌటే… డౌట్‌తో రాత్రంతా జాగారం చేసే బదులు రేపు దేవ్ వాళ్ల ఇంటికి వెళితే సరిపోతుంది కదా… దేవ్ అలాంటి వాడు కాదు… ఒక వేళ అలాంటిదేమైనా ఉన్నా మొఖం మీదే చెప్పేస్తాడు… అనవసరంగా నిన్ను అనుమానిస్తున్నాను రా… నువ్వు…. బంగారం రా… కాని…’ అని మనసుని సమాధనపరచుకుంది వసుంధర.

***

“ఏంటి నాన్నా… అంత హడావిడిగా తయారై బయటకు వెళుతున్నావు. ఫ్రెండ్స్‌ని కలవడానికా?” అంది సుమిత్ర.

ఏం చెప్పాలో తెలియక ఒక్క నిమిషం కంగారుపడి… “చిన్న పని ఉంది… లేటయినా కంగారు పడకు. నేను ఫోను చేస్తాలే అమ్మా” అన్నాడు…

“సరే నాన్నా… మా ఫ్రెండ్ దగ్గరకు వెళడాం అనుకున్నాను… రేపు వెళతాలే… మీ నాన్న చాలా వర్రీలో ఉన్నారు… ఆఫీసరు… రేపు ఎలాగైనా పార్టీ ఇవ్వలని ఏవేవో కోరడట… వాడిని ఏమీ చేయలేక కారలు మిరియాలు నూరుతున్నారు…”

చిన్నగా నవ్వి అన్నాడు వాసుదేవ్ – “ఫ్రీగా మందు తాగడం సంతోషం అలవాటు… అందుకే నాన్నగారిని సిగ్గు లేకుండా అడిగాడు. వాడికి లివర్ పాడై చస్తానన్న భయం కూడా లేదు. రేపటి నుండి వాడు సారోఫుల్ మూడ్‌లో ఉంటాడు…. నేను అనుకోవడం సంతోషం సంతాపసభకు వెళ్లిన వాడిలా ఇక మీదట ఉంటాడు….”

ఆశ్చర్యంగా అంది సుమిత్ర… – “వాడి గురించి ఇదంతా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? కొంపదీసి వాడితో వెళ్లి గొడవ పెట్టుకుంటావా ఏమిటి? నాన్నా… అలాంటి పని చేయకు… ఎవరి పాపానికి వాళ్లే పోతారు… ఆ మాటకొస్తే మీ నాన్నకు నేను ఒక సలహా ఇచ్చాను… నాలుగు మాటలు గట్టిగా వాడి కళ్లు తెరుచుకునేలా అడగండి అని…”

“నాలుగు మంచి మాటలు చెబితే మారిపోవడానికి వాడేం నాలుగేళ్ల పసివాడునుకుంటున్నావా. చిన్నప్పటి నుండి కూడా వాడు పరాన్నజీవి అయిఉంటాడు. అందరి మీద పడి తిని ఇలా తయారయ్యాడు.”

“మరి రేపు వాడు నాన్నగారిని పార్టీ అడగడని ఎలా చెప్పగలవు దేవ్?”

కంగారుగా అన్నాడు – “అలా అనిపిస్తుందమ్మా…”

“అలాగా… ఇది అంతా ఎందుకు. వాడడిగిందేదో పడేస్తే మనశ్శాంతిగా ఉండొచ్చు కదా అంటే వినరు.”

“ప్చ్… ఏంటమ్మా నువ్వు చెప్పేది. ఇష్టంలేని పని చేసాక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది. పోనీ ఆ మనసనేది ఎక్కడో దూరంగా ఉంటే బావుండను. మనిషిలోనే ఆ మనసు ఉండి ఆ మనసుతోనే ఇష్టంలేని పని, చేసి తిరిగి ఆ మనసునే ప్రశాంతంగా ఉండమంటే ఆ మనసుకి మనశ్శాంతి ఎలా ఉంటుందమ్మా? మనకు ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉంటేనే కదా మనశ్శాంతి ఉంటుంది.”

తన చేతులతో పెంచిన తన చిన్నారి తండ్రి ఎంత మంచి మాట చెప్పాడు… ఇప్పుడే కాదు ఎప్పుడు వాడి నోటిలో నుండి ఆలోచించ తగ్గ మాటలే అంటాడు. కాని ఎవరు అర్థం చేసుకోరు… అసలు ఎంత మంది ఇంత నిక్కచ్చిగా కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడగలరు. ‘నువ్వు గ్రేట్ రా నాన్నా’ అని మనసులో అనుకుంది సుమిత్ర.

కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవి కనబడడం ఇష్టం లేనట్లు “ఇప్పుడే వస్తానుండు.. నాన్నగారికి కాఫీ ఇచ్చి…” అని గబగబా వంట గదిలోకి నడిచి, కాఫీ తీసుకొని నిరంజనరావు గదిలోకి వెళ్లి కాఫీ ఇచ్చి గభాలున కళ్లలో నిండిన కన్నీటిని తుడుచుకోవడం చూసి కంగారుగా అన్నాడు నిరంజనరావు.

“ఏం జరిగింది కొంపదీసి సీరియల్ చూసావా?”

కోపంగా అంది సుమిత్ర – “మీకు తెలుసుగా నేను సీరియల్స్ చూడనని అయినా… చూస్తే మాత్రం సీరియల్‌లో కష్టాలు చూసి ఏడ్చే పిచ్చిదానిని కాను. దేవ్… నా కొడుకు ఎంత మంచి వాడండి వాడి మనసు…”

“నాకు తెలుసు సుమిత్రా… వాడి మనసు బంగారం అని అంటావు… కాని అవొక్కిటి ఉంటే మనిషి బ్రతకలేడు కదా.”

“సరేలెండి… మీకు వాడెప్పుడు అర్థం కాడు. వాడి గురించి మీతో చెప్పడం దండగ…” అంది.

“అమ్మా రెడీ అయ్యావా? ఆంటీ దగ్గర నిన్ను డ్రాప్ చేసి నేను వెళతాను” అన్నాడు వాసుదేవ్.

“వద్దలే నాన్నా… నేను ఆటోలో వెళతాను…. నాన్నగారిని డ్రాప్ చేయమన్నా చేస్తారు… ఆయన మూడ్ బాగోలేదు… అలాంటప్పుడు ఆయన్ని అడగడం ఎందుకుని…”

“అమ్మా…. ముందు బయలు దేరు… నువ్వు వస్తున్నట్లు ఆంటీకి చెప్పి ఉంటావు…. పాపం నీ కోసం తప్పకుండా చూస్తుంది ఉంటుంది.”

“కరక్టుగా చెప్పావు…. ఫ్రెండ్స్ అయినా రెలెటివ్ అయినా ఎవరైనా వస్తారని తెలిసినాక రాకపోతే చాలా నిరాశగా ఉంటుంది… ఈ పాటికి విమల నాకోసం చూస్తూనే ఉండుంది… పద నాన్నా… ఒక్క నిమిషం” అని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లలోగా వాసుదేవ్… “ఆంటీ కోసం ఏం చేయలేదా?….” అని అడిగాడు.

చిన్నగా నవ్వుతూ అంది… “గోంగూర పచ్చి రోయ్యలు కూర అంటే చాలా ఇష్టం. చేసి ఫ్రిజ్‌లో పెట్టాను…” అని గబగబా బాక్స్ తీసి కవరులో పెట్టి… డైనింగ్ టేబుల్ మీద ఉన్న రెండు చిన్న టిఫిన్ బాక్స్‌లు కూడ కవరులో పెట్టి “పద నాన్నా… నీకు లేటువుతుంది” అంది.

అమ్మా మనసు ఎంతో గొప్పది… ఫ్రెండ్ కోసం ఇంత తాపత్రయపడుతుంది… ఇక తన వాళ్ల కోసం… వాసుదేవ్ ఆలోచటనలో ఉండగానే….

“ఎక్కడికి వెళతున్నావు దేవ్… ఫ్రెండ్స్‌ని కలవడానికా… తర్వగా వచ్చేయ్ నాన్నా” అంది.

“అమ్మా… చాలా ముఖ్యమైన పని ఇప్పుడు నన్నేం అడగవద్దు…”

“నాన్నా… ఒక్కటి గుర్తు పెట్టుకో… నాన్నగారికి నీ భవిష్యత్ గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నారు… సివిల్ సర్వీస్ నీతో వ్రాయించాలని ఆయనకు ఉంది… కాని నువ్వు శ్రద్ధ పెట్టగలవో లేవో అని ఆలోచిస్తున్నారు.”

“నిజం చెప్పాలంటే నాకు సివిల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం… నాకు సైన్స్ కన్నా…. ఆర్ట్స్ అంటే ఇంట్రస్తు…”

“ఆ మాటే నేను నాన్నగారితో అన్నాను… నా కోసం ఎంట్రన్స్ వ్రాసాడండి… ఇప్పుడు సివిల్ సర్వీస్‌కి ప్రిపేరుకమ్మని చెబుదాం అంటే… అలాంటి పిచ్చి పని చేయకు… ముందు డిగ్రి పూర్తి చేయనీ అన్నారు… ఇది అంతా ఎందుకు చెబుతున్ననంటే ఏది పట్టించుకోకుండా బాగా చదువు నాన్నా” అంది.

మాటల్లోనే అమృత నిలయం వచ్చింది… పేరు చూసి వాసుదేవ్ మనసులో… ‘కన్నవాళ్లని… ఆత్మీయులను, ఫ్రెండ్స్‌ని, అలవాటయిన పరిసరాలని అన్నీ వదులుకొని ఏకాకిలా.. ఒంటరిగా… విభిన్న మనస్తత్వాల మధ్య గుండె నిండా బాధ నింపుకొని ఏం ఉండగలరు… పేరుకి మాత్రమే అమృత నిలయం. కాని వాళ్లకి అండమాన్ జైలులాగే ఉంటుంది’ అనుకున్నాడు.

“ఏంటి నాన్నా ఆలోచిస్తున్నావు… సరే వెళ్లు” అని వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లింది సుమిత్ర.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here