తిరుమలేశుని సన్నిధిలో…-15

0
7

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ

[dropcap]తి[/dropcap]రుమల తిరుపతి దేవస్థానముల వారు 2005లో భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టును కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ.పి.వి.యన్.శర్మ చొరవతో ప్రారంభించారు. తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలను మే 17, 18 తేదీలలో (2019) తిరుపతి, తిరుమలల్లో ఘనంగా నిర్వహించారు. ఒక సాహిత్య సదస్సును ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో నేను వెంగమాంబ రచించిన భాగవతంపై ప్రసంగించి ప్రశంస లందుకొన్నాను.

వెంగమాంబ ప్రాజెక్టు:

2005లో స్థాపించిన ఈ ప్రాజెక్టుకు తొలి ప్రత్యేకాధిగారిగా ఆచార్య కె.జె.కృష్టమూర్తి నియమించబడ్డారు. 2019 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసేంత వరకు ఆ సంస్థ కార్యకలాపాలు చూశారు. 2005-10 మధ్య కాలంలో వెంగమాంబ రచనలు 20 దాకా పరిష్కరించి ప్రచురించారు. అదే సమయంలో నేను ఎస్.వి. రికార్డింగు ప్రాజెక్టు అధికారిగా ఉన్నప్పుడు వెంగమాంబ రచించిన కీర్తనలకు స్వరచన చేయించి జి.నాగేశ్వరనాయుడు తదితర కళాకారులచేత గానం చేయించి ఆడియో రికార్డింగులు తయారు చేశాము.

సహజ కవయిత్రి:

వెంగమాంబ పూర్వపు మొల్ల వలె సహజ కవయిత్రి. ఏ పాఠశాలలోనో. గురుకులంలోనో సంప్రదాయ పద్ధతిలో చదువుకోలేదు. ఆ రచయిత్రి స్మారకార్థం తిరుపతిలో సంగీత కళాశాలకు వెనుక భాగంలో నాలుగు రోడ్ల కూడలిలో వెంగమాంబ విగ్రహాన్ని 2007లో ఆవిష్కరించారు. తిరుమలలో వెంగమాంబ సమాధిని అధునాతనం చేసి యాత్రికుల దర్శనార్థం వసతి కల్పించారు.

ఆమె జన్మించిన తరిగొండలోని నృసింహస్వామి క్షేత్రాన్ని 2007లో తిరుపతి దేవస్థానం తమ పరిసర ఆలయ పరిధిలోకి తెచ్చి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తోంది. 2007 నుండి వెంగమాంబ రచనలకు విశేష ప్రాచుర్యం లభించింది. ఒకటి, రెండు విశ్వవిద్యాలయాలలో ఆమె రచనలపై పరిశోధన జరిగింది. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖవారి సీనియర్ ఫెలోషిప్‌తో నెల్లురుకు చెందిన ఆర్. హరనాధరావు నా పర్యవేక్షణలో పరిశోధన చేసి ‘తరిగొండ వెంగమాంబ’ అన గ్రంథాన్ని 2014లో విజయ దశమి నాడు ప్రచురించారు. ప్రస్తుతం వెంగమాంబ ప్రాజెక్టును అన్నమాచార్య ప్రాజెక్టు అధీనంలోకి మార్చారు.

ప్రాచుర్యం:

వెంగమాంబ జీవితాన్ని గూర్చి దేశంలో ప్రచారం గత దశాబ్ది కాలంలో జరిగింది. అన్నమాయ్య చిత్ర నిర్మాత దొరస్వామిరాజు దర్శకేంద్రుడు రాఘవేంద్రుని ఆధ్వర్యంలో వెంగమాంబ చలన చిత్రం నిర్మించారు. మీనా అనే నటీమణి వెంగమాంబ పాత్రను అద్భుతంగా పోషించింది.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో 2007-08 కాలంలో వెంగమాంబ సీరియల్ ధారావాహికంగా ప్రచారమై ఆదరణ పొందింది. ఏతా వాతా వెంగమాంబ ప్రసిద్ధిలోకి ఒకటి రెండు శతాబ్దాల తర్వాత వచ్చింది.

తాళ్లపాక లాలి – తరిగొండ హారతి:

వెంగమాంబ తిరుమల చేరిన నాటి నుండి ప్రతి రోజూ స్వామి వారి ఏకాంత సేవ సమయంలో ఆలయంలో కర్పూరహారతి అందించేది. అంతకు ముందుగా అన్నమాచార్య లాలిపాటను అన్నమయ్య వంశీకులు గానం చేస్తారు. ఈ సంప్రదాయం ఆనంద నిలయంలో ఈ నాటికీ కొనసాగడం విశేషం. ఆమె తాను పెంచిన తులసీ బృందావనానికి నీటి కోసం ఒక దిగుడు బావిని త్రవ్వించే పని మొదలు పెట్టించింది. ఎంత లోతు తవ్వినా అందులోంచి నీటి వూట బయటపడలేదు. అడుగున పెద్ద బండరాయి అడ్డుపడింది. ఆమె లోపలికి దిగి ఆశువుగా గంగాభవానిని ఒక కీర్తనతో స్తుతించింది.

ఓ తల్లీ గంగా భవానీ! రావే

ఖ్యాతిగ ఇచటికి కపటము మాని   ॥ఓ తల్లీ॥

అలా నాలుగు చరణాలలో గంగను ప్రార్థించింది. ఇంతలో గునపము, గడ్డపార ధరించిన ఒకానొక వృధ్ధుని రూపంలో ఆంజనేయుడే వెంగమాంబ వద్దకు వచ్చి ఆ బండను త్రవ్వి తొలగించాడని ప్రతీతి. వెంటనే నీరు పుష్కలంగా వచ్చింది.

తులసీ బృందావనం:

ఒక కుష్ఠు వ్యాధిగ్రస్తుని వ్యాధిని వెంగమాంబ తుంబురు కోన గుహలో వుండగా నయం చేసింది. అతడు పుష్కరిణిలో స్నానం చేయగానే వ్యాధి తొలగిపోయింది. ఆ వార్త తెలిసి మహంతు మంగళవాద్యాలతో వెళ్లి వెంగమాంబను సాదరంగా తిరుమలకు తీసుకు వచ్చారని చరిత్ర చెబుతోంది. అక్కడ తాళ్లపాక వంశీకులు ఆమెకు మఠంలో నివాసం కల్పించారు. కుష్ఠువ్యాధి పీడితుడైన చంద్రశేఖరుని స్మారకంగా వెంగమాంబ తులసీ బృందావనం తిరుమలలో నిర్మించింది. ఆ బృందావనం ఆమె సమాధి స్థలంగా ఈనాడు పూజలందుకొంటుంది.

జీవన రేఖలు:

వెంగమాంబ చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు మండలంలో తరిగొండ గ్రామంలో కానాల కృష్ణయ్య – మంగమ్మ దంపతులకు క్రీ.శ 1730 ప్రాంతంలో జన్మించింది. అదే జిల్లాకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో పెద్దలు వివాహం జరిపించారు. కాపురం చేయకముందే అతడు మరణించాడు,

మదనపల్లె వాస్తవ్యులు రూపావతరం సుబ్రమణ్యశాస్త్రి వద్ద కొంత కాలం విద్యాభ్యాసాన్ని వెంగమాంబ చేసింది. 20 సంవత్సరాల పాటు ప్రాథమిక దశలో తరిగొండలో నివసించింది. అక్కడి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఎక్కువ కాలం గడిపేది.

ఎనిమిదేళ్ల వయసులో సుబ్రహ్మణ్య యోగి నుంచి తారకోపదేశం పొందింది. 12వ ఏట వివాహమైనా రమానాథుడైన వెంకటేశ్వరునే తన నాథుడని ఆమె భావించింది. శోభనం రాత్రి భర్తకు వెంగమాంబ దుర్గామాత వలె గోచరించింది.

భక్తమీరా వలె ప్రవర్తించే ఆ చిన్నపిల్లకు పిచ్చి పట్టిందని లోకులు హేళన చేయసాగారు. తరిగొండ నృసింహ స్వామి సన్నిధిలో రహస్య యోగసాధన చేస్తుండగా అర్చకుడు అడ్డుపడ్డాడు. 20 ఏళ్లు నిండాయి. తిరుమలకు బయలుదేరి వెళ్ళింది. అప్పటి మహంతు ఆత్మరామ్ ఆమెకు తిరుమల ఆలయం తూర్పు మాడవీధిలో ఒక పూరిల్లు నివాసానికి ఏర్పాటు చేశాడు.

తుంబుర కోన:

తిరుమలలో తన యింటికి పక్కనే వున్న అక్కారాం వెంకటరామ దిక్షితులు ఆమెకు పరిపరి విధాలుగా ఇబ్బందులు కలిగించాడు. విసుగు చెందిన ఆమె అక్కడికి 10 మైళ్ల దూరంలోని తుంబుర కోనలో ఒక గుహలో తీవ్ర తపాన్ని చేసింది. దాదాపు 16 సంవత్సరాలు అక్కడ వుంది.

తుంబర కోన నుండి మహంతు తీసుకొని రాగా ఉత్తర మాడవీధిలో తాళ్లపాక చిన్నయసూరి వంశస్థులు ఏర్పరచిన రాతి యింటింలో నివసించింది. మురాషావలీ అనే మహమ్మదీయునికీ, శ్రీకృష్ణమాచార్యుడనే జిజ్ఞాసువుకు తన తల్లిదండ్రులకు తత్వోపదేశం చేసింది. ముముక్షువుగా ప్రసిద్ధికెక్కి ఈశ్వరనామ సంవత్సరం (1817) పరమపదించింది. దాదాపు రెండు శతాబ్దాలు వరకు ఆమె సాహిత్యానికి ప్రాచుర్యం లభించలేదు. దాదాపు 18 రచనలు చేసింది. అందులో శ్రీ వేంకటాచలమహత్య కావ్యం ప్రసిద్ధం.

తుంబుర కోన నుండి తిరుమల వచ్చిన నాటి నుండి తాను పరమపదించిన 83వ సంవత్సరం వరకు 50 సంవత్సరాలు తిరుమలలో సాధుజీవనం కొనసాగించింది. సజీవసమాధి పొందింది.

‘ఓ’యని పలికిన వెంకటేశ్వరుడు:

వెంగమాంబ పరమ భక్తురాలు. తిరుమలలో బృందావనంలో ఒక రాయి వీద కూచోని ఆనందనిలయ శిఖరాన్ని దర్శిస్తూ ధ్యానంలో వుండేది. ఒక రోజు ఒక తెల్లని సర్పం తన పడగను ఆమెకు నీడగా పట్టింది.  వెంకటేశ్వరుడు ఆమె సమీపానికి వచ్చి యక్ష గానాలు వినేవాడట. ఒక రోజు స్వామివారు ఆమె ద్విపద భాగవతాన్ని ఆనంద పరమవశుడై ఆలకిస్తున్నాడు. ఇంతలో సుప్రభాత సేవకు వేళ అయిన సన్నాహాలు వినిపించాయి. త్వరపడి స్వామి ముందుకు నడిచాడు. వెంగమాంబ స్వామి ఉత్తరీయాన్ని పట్టుకొని ఆపింది. స్వామి ఉత్తరీయంలో కొంత భాగం ఆమె చేతిలో మిగిలిపోయింది.

చిరిగిన ఉత్తరీయాన్ని అర్చకస్వాములు వెంటనే గ్రహించారు. ఆ  తర్వాత అది వెంగమాంబ చేతికి చిక్కిందని ధృడపరచుకొన్నారు.

ఒక రోజు వెంగమాంబకు తలనొప్పి అధికమైంది. స్వామివారిని తలచుకొంది. వెంటనే స్వామి అక్కడకు వచ్చి నారాయణవనంలో తనకొక భక్తుడు సమర్పించిన సరిగంచు ధోవతి చించి ఆమె తలకు గట్టిగా కట్టి వెళ్లిపోయాడు.

మర్నాడు నైవేద్యసమర్పణ సమయంలో అర్చకుడు అది గమనించి ఎవరో ధోవతి దొంగిలించారని ఆరోపించారు. ఆమెయే ఆ దొంగయని శిక్షించబోయారు.

ఇంతలో ఓ అర్చకునికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అది తగ్గిస్తే వెంగమాంబను నిర్దోషిగా ప్రకటిస్తామన్నారు. ఆమె అతనిని చూడగానే నొప్పి తగ్గిపోయింది.

నిలిచిపోయిన రథం:

ఉత్సవ సమయంలో వెంగమాంబ ఇంటి ముందు స్వామివారి రథం నిలిచిపోయింది. ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ముందుకు సాగలేదు. విధవరాలు హారతి యియ్యరాదని నిర్బంధించిన పెద్దలు ఆరోజు ఆమెను బ్రతిమాలారు. ఆమె రథం ముందు నిలిచి హారతు లందించింది. రథం ముందుకు సాగింది. అక్కడి పెద్దలు క్షమార్పణ వేడుకొన్నారు. అంతకు పూర్వం పుష్పగిరి పీఠాధిపతులతో జరిగిన సంవాదంలో కూడా వెంగమాంబ భక్తి వెల్లడి అయింది. శారదామాత కృపతో ఆమె అనేక యక్షగానాలు వ్రాసింది. స్వామిపై కీర్తనలు రచించింది. భక్త కవయిత్రి అయి తరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here