[dropcap]ఋ[/dropcap]తుమార్పిడులను చక్కగా తెలుసుకొంటావు!
వేసవొస్తుందని ముందు ఊహిస్తావు!
భూమధ్య రేఖకు దూరముగ వస్తావు!
ఉత్తరాంధ్రలోను తిష్ట వేస్తుంటావు!
ఏమి ముందు చూపు కోకిల! ఏ పక్షి సాటి రాదు నీకిల!!
నీ తల్లి గ్రుడ్డప్పుడే నిన్ను వదలి పోయింది!
పరుల గూటిలోన పదిలముగ దాచింది!
ఎవరి తోడు నీడ నీకు లేకున్ననూ
ఈశ్వరుని కరుణుంటే లోటు లేదనుచును
ఇలలోనే చాటితివి కోకిల! ఏ పక్షి సాటి రాదు నీకిల!!
అందానికి చందమామ! రామచిలుక, పాలపిట్ట
గానమధుర శ్రావ్యములో నీముందవి కొరగావు
ఏమి గొంతు నీదమ్మ కోకిల! ఏ పక్షి సాటిరాదు నీకిల!!
మావి చిగురు మనిషి తింటే, మాటలు బొంగురు బోవు
మావిచిగురు తిన్న నీకు! మంచి స్వరము జాలువారు!!
ఏమి నోము నోస్తివమ్మ కోకిల! ఏ పక్షి సాటి రాదు నీకిల!!
ఏ గురువు చెప్పలేదు ఏ వాద్యపు మ్రోత లేదు
అపశ్రుతుల బాధ లేదు! లయతప్పిన భయము లేదు!!
ఏమి పూర్వపుణ్యఫలము కోకిల! ఏపక్షి సాటి రాదు నీకిల!!
ఆమని వెన్నెల యామినిలో లోకాలను పులకరించు
నీ కూ అను కూత వినుచు ఆబాల గోపాలం ఆనందమ్మున మునుగు
ఏమి జన్మ నీదమ్మ కోకిల! ఏ పక్షి సాటి రాదు నీకిల!!