[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]
కిం కులేన విశాలేన
విద్వాహీనస్య దేహినామ్ ।
దుష్కులీనోఽపి విద్వాంశ్చ
దేవైరపి సుపూజ్యతే ॥
ఆటవెలది :
జాతి హీను డగుచు జన్మ మెత్తిన నేమి
విద్య యున్న చాలు విపుల రీతి
జాతి మాట లేక జగతియందెపుడును
జ్ఞాని కూడ వాని గార వించు ౯౬
***
లోకయాత్రా నయో లజ్జా
దాక్షిణ్యం త్యాగశీలతా ।
పంచ యత్ర న విద్యంతే
న తత్ర దివసం వసేత్ ॥
ఆటవెలది :
బ్రతుకు తెరువు, లజ్జ, బలువైన న్యాయమ్ము,
భూత దయయు, త్యాగ బుద్ధు లనెడు
అయిదు గుణము లెపుడు అగుపించ నటువంటి అవని నుండ తగదు దివము కూడ ౯౭
***
శనైః పంథా శనైః కంథా
శనైః పర్వత లంఘనమ్ ।
శనైః విద్యా శనైః విత్తం
సంచైతాని శనైః శనైః ॥
ఆటవెలది :
కుట్టు కుట్టు వేసి కుట్ట వచ్చును బొంత
అడుగు అడుగు వేసి నడువ వచ్చు
ప్రాకు కుంటు దాట వచ్చును శైలమ్ము
ధనము విద్య నటులె తరలి వచ్చు ౯౮
***
సద్విద్యా శక్యతే లబ్ధుం
గురూణా ముపదేశతః ।
శీలం స్వాభావికం తత్తు
లభ్యతే నోపదేశతః ॥
ఆటవెలది :
గురుని బోధ వలన గురుతరమ్మగు విద్య
నేర్వ వచ్చు గాని నేర్పు తోడ
గురుని బోధ వలన గురుతరమ్మగు బుద్ధి
దొరక బోదు సుమ్ము తరచి చూడ ౯౯
***
పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్యా పునర్మహీ ।
ఏతత్ సర్వం పునఃప్రాప్యం
న శరీరం పునః పునః ॥
ఆటవెలది :
తిరిగి పొంద వచ్చు తరిగినట్టి ధనము
తిరిగి పొంద వచ్చు తరుణి నైన
తిరిగి పొంద వచ్చు తీరైన సఖులను
తిరిగి పొంద వచ్చు ధరను గూడ
తిరిగి పొంద వచ్చు తరలి పోయిన వన్ని
తరచి చూడ నెపుడు ధరణి యందు
ధర్మ సాధనమగు తనువు తరలి పోవ
తిరిగి రాదు సుమ్ము మరల మరల ౧౦౦