[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, కథకులు డా॥ పాపినేని శివశంకర్ సాహిత్యానుశీలనపై పలువురు సాహితీవేత్తలు వ్రాసిన వ్యాసాల సంకలనం ఇది. బండ్ల మాధవరావు సంపాదకత్వం వహించారు.
***
“నలుగురు కలిసిన చోట నాలుగు మాటలై వాక్యాలై నలుగురి నోళ్ళలోను నానుతున్న ప్రఖ్యాత కవి, కథకుడు, విమర్శకుడు, ఒక అనంత అన్వేషి అయిన పాపినేని శివశంకర్ గురించి ఆ నలుగురూ చెప్పిన మాటల కలబోతే ఈ ‘అన్వేషణ’.
నిత్య విద్యార్థిగా అధ్యాపకుడిగా, కవిగా, కథకుడుగా, విమర్శకుడుగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పాపినేని తన చుట్టూ జరుగుతున్న అనేక పోరాటాలను జీవన వైఫల్యాలను, అతి దగ్గర నుంచి పరిశీలించి జరుగుతున్న దేమిటో, జరగాల్సిందేమిటో తరచి తరచి చూసుకుంటూ సృజన శీలిగా ఫలాలను మనకందిస్తాడు.
శివశంకర్ గారి సాహిత్యాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి అనేక కోణాలలో ప్రముఖులైన సాహిత్యకారులెందరో రాసిన వ్యాసాలు ఈ ‘అన్వేషణ’లో వున్నాయి. ఆయనను అతి దగ్గర నుండి చూసిన వాసిరెడ్డి నవీన్, దర్భశయనం శ్రీనివాసాచార్య శివారెడ్డి లాంటి వారు వ్యక్తిగతంగా కాస్తంత దూరంగానూ, సాహిత్యపరంగా అత్యంత సమీపం నుంచి చూసిన ఎ.కె. ప్రభాకర్, కె.పి. అశోక్ కుమార్, కత్తి పద్మారావు లాంటి వారు, సన్నిహిత మిత్రులైన పెనుగొండ లక్ష్మీనారాయణ, గరికపాటి నరసింహారావు, గొడవర్తి వెంకట సుబ్రహ్మణ్యం లాంటి వారు, గురువులు, గొల్లపూడి ప్రకాశరావు, ఒంగోలు సాంబయ్యలాంటి వారు, శిష్యగణం బి. ధర్మారెడ్డి, నన్నపనేని రవి, ఎమ్వీరామిరెడ్డి లాంటి వారు, ఇంకా ఎందరో ఎన్నో కోణాలనుంచి పాపినేనిని ఆవిష్కరించిన వ్యాసాలు ఈ ‘అన్వేషణ’లో వున్నాయి. పాపినేని జీవితకాలపు రచనా వ్యాసాంగానికి తూకపు రాళ్లు ‘అన్వేషణ’లోని వ్యాసాలు. కొలిచి తూచిన వారందరికి కృతజ్ఞతలు” అన్నారు బండ్ల మాధవరావు “నలుగురు కలిసిన చోట” అనే ముందుమాటలో.
***
“అతని కథల్లో అక్కడక్కడ కవితాశైలి, కవితల్లో అక్కడక్కడ కథనరీతీ కనపడుతుంది. ఆ లక్షణం ఆయా రచనలకు అదనపు కాంతే అయింది కానీ బలహీనత కాలేదు. ‘సముద్రం’ లాంటి కథ చదివినా, ‘తోటమాలికి వీడ్కోలు’ లాంటి కవిత చదివినా ఈ విషయం అవగతమవుతుంది. బహు ప్రక్రియల్లో సాధన చేసే సృజనశీలి ప్రయాణం సులభతరమైంది కాదు. జాగ్రత్తలవసరమైన ప్రయాణం. ఆ జాగరూకత శివశంకర్‌కు ఉంది.
విస్తారమైన జీవితాన్ని కొద్దిపాటి శబ్దజ్ఞానంతో చెప్పడంలో చాలా పరిమితులుంటాయి. వస్తువునే తప్ప శిల్పాన్ని పెద్దగా పట్టించుకోని రచయితల్లో ఈ పరిమితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. శబ్దం మీద ధ్యాస పెట్టే అలవాటున్న శివశంకర్ దానికి దృఢత్వం ఇవ్వగలిగాడు తన రచనల్లో. అలాగే శబ్ద పునరావృతిని అధిగమించడానికి కొత్త కొత్త శబ్దరూపాల్ని సృజించడం ఆయన కృషిలోని ప్రధానాంశాల్లో ఒకటి” అన్నారు దర్భశయనం శ్రీనివాసాచార్య “సృజన మహాదృఢం, అతి మృదులం” అనే వ్యాసంలో.
***
“పాపినేని శివశంకర్ చాలా గొప్ప భావనాబలమున్న కవి. భావచిత్రాల బలమే భావనలకి బలం. మంచి భావాలు మాత్రమే ప్రకటించే మామూలు కవిత్వం కాదు తనది. ప్రతి కవితలో ఊహాబలం ఉంది. అద్భుతమైన భావనాశక్తి ఉంది. కవిత్వ వ్యక్తీకరణలో ఉపమ, ఉత్ర్పేక్ష, రూపకాలతో పాటు అవసరమైనప్పుడు కంఠస్వరంలో వక్రత, వ్యంగ్యత ఉంది. భావచిత్రాల మధ్య పాఠకుణ్ణి నడిపిస్తూ అపూర్వమైన భావనాశక్తితో ఒక స్టేట్‌మెంట్ లాంటి వాక్యాన్ని రూపొందిస్తాడు. ఆ వాక్యం ఒక సూక్తి లాంటిది. అదొక మహాకవి ఉవాచ” అన్నారు నన్నపనేని రవి “పాపినేని కవిత్వంలో భావ-భావన-భాషాబలాలు” అనే వ్యాసంలో.
***
“సంకేతాత్మక భాషను వాడటంలో శివశంకర్ సిద్ధహస్తుడు. ఆ భాషతోనే విలక్షణ కవితా నిర్మాణశైలిని ఏర్పరుచుకుని, నేరుగా పాఠకుల్లో మాట్లాడతాడు. పాఠకుడు ఏ దృక్పథంతో చూసినా కొత్తకొత్తగా కన్పించడం శివశంకర్ కవిత్వంలోని విలక్షణత. శివశంకర్ కవిత్వంలోని కొన్ని పదచిత్రాలు, అభివ్యక్తులూ జ్ఞాపకాలై మనల్ని వెంటాడతాయి. ఆలోచనకు పదును పెడతాయి. అంతర్ముఖుల్ని చేస్తాయి” అన్నారు డా. బీరం సుందరరావు “రైతుకవి మట్టి వాసన” అనే వ్యాసంలో.
***
“జీవిత వైశాల్యాన్నీ ఆ వెలుగు నీడల్నీ, తన కథల్లో ప్రతిఫలింప జేయటానికి ఎంతో సమన్వయంతో, సంయమనంతో, నిర్మోహతతో రచన చేస్తారు పాపినేని. జీవన వైచిత్రిలో ఎంతటి వైవిధ్యం గోచరిస్తుందో ఎన్నెన్ని వెలుగునీడలు ప్రత్యక్ష మవుతాయో, అంతటి వైవిధ్యం వారి కథల్లో గోచరిస్తుంది. మనిషి సమాజం- దేనికదిగానూ, మనిషీ వర్సెస్ సమాజం-సంఘర్షణా శక్తులుగానూ, ఎంతటి రాపిడీ, ఒరిపిళ్లకి గురవుతున్నారో అంతటి వైవిధ్యాన్నీ పాపినేని కథలు అందిస్తాయి” అన్నారు విహారి “జీవముద్ర కలిగిన కథాశిల్పి, ప్రయోగశీలి” అనే వ్యాసంలో.
***
‘అన్వేషణ’ – పాపినేని శివశంకర్ సాహిత్యానుశీలన
సంపాదకులు: బండ్ల మాధవరావు
ప్రచురణ: సాహితీ మిత్రులు, విజయవాడ
పేజీలు: 382, వెల: ₹ 150
ప్రతులకు: సాహితీ మిత్రులు 28-10-16, అరండల్‌పేట విజయవాడ-520002. ఫోన్: 0866-2433359. ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.