[box type=’note’ fontsize=’16’] “ప్రయత్నమంతా ఈ కృత్యాద్యవస్థకే. మొదలు పెట్టటానికే అన్ని సందేహాలు. ఒకసారి మొదలు పెట్టాక సాగుతూ ఉంటుంది” అంటున్నారు అనంతలక్ష్మి ఈ వారం ‘దిశ‘ కాలమ్‌లో. [/box]
[dropcap]ఎ[/dropcap]న్నో కోరికలుంటాయి, ఆదర్శాలుంటాయి, ఆశయాలున్నాయి. అవన్నీ ఆలోచనలకే పరిమితం. కాని, క్రియ మాత్రం శూన్యం. ఎందుకంటే, నూటికి 99 మందికి ఉద్దేశాలు మంచివే. అందులోనూ కొద్దిగా ఆలోచించటం వచ్చిన వారి విషయం చెప్పనక్కర లేదు. “మాటలు కోటలు దాటుతాయి గాని, కాలు మాత్రం గడప దాటదు” అన్న సామెత చాలామంది విషయంలో వాస్తవం. దానికి కారణాలు రెండు. రేపు చేద్దాంలే అనే అలసత, చేయకపోతే మునిగి పోయిందేముంది? అనే నిర్లక్ష్యం ఒక కారణమైతే, చెయ్యగలమా? విఫలమైతే….? అనే భయం మరొకటి. ఇది ఎట్లా ఉంటుందంటే సముద్రం దగ్గరకెళ్లి, అలలు తగ్గాక స్నానం చేస్తానన్నట్టు ఉంటుంది. అవెప్పటికి తగ్గాలి? సముద్రమంటేనే అలలు. ఆ మాటంటే స్నానం చెయ్యను అని చెప్పినట్టే.
చాలామందిని ఏదైనా కొత్త పని మొదలు పెట్టమంటే ఇంట్లో సమస్యలు తగ్గాక మొదలు పెడతాం అంటారు. సమస్యలు ఒక దాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం కానీ, అవి సమస్యలు కావు. సద్దుబాటు కుదరక పోవటాలు మాత్రమే. ఇది సాధారణంగా పుస్తకాలు చదవటానికి, ఏదైనా సాధన ప్రారంభించటానికి, మంచిపని మొదలు పెట్టటానికి చెప్పేమాట. అసలు విషయం ఏమంటే మొదలుపెడితే మిగిలిన పనులు, సమస్యలు అప్రయత్నంగా సద్దుకుంటాయి. ఒకసారి మునిగాక అలల గురించిన భయం ఉండదు. ఈ వెనకాడటం అంతా కొన్ని రకాలైన పనులకి మాత్రమే. అదే సినిమాకి వెళ్ళటానికో, షికార్లకో, పిచ్చాపాటీ కబుర్లకో, ఇంకేదైనా తనకి ఇష్టమైన పనికో అయితే ఇంతగా ఆలోచించటం ఉండదు. అప్పుడు సమస్యలు, ఇబ్బందులు ఏమైనట్టు? అప్పుడు ఎక్కువ నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ఉండక పోవటం ఆకర్షిస్తుంది.
ప్రయత్నమంతా ఈ కృత్యాద్యవస్థకే. మొదలు పెట్టటానికే అన్ని సందేహాలు. ఒకసారి మొదలు పెట్టాక సాగుతూ ఉంటుంది. నల్లేరు మీద బండి నడక కాకపోవచ్చు. కానీ, ఒడిదుడుకులతో, ఇబ్బందులతో, ఎదురీదినట్టే నెమ్మదిగా అయినా కదులుతూనే ఉంటారు, భాగ్యనగరంలో రద్దీలో ఇరుక్కుపోయిన వాహనం లాగా.
అలసత్వం, అంటే బద్ధకం అయితే దానిని వదిలించుకోవటానికి చాలానే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. కడుపు నిండా తిని, కదలకుండా కూర్చోటం సుఖం అనే అభిప్రాయం ఉంటుంది చాలా మందిలో. చురుకుగా ఉండటంలోని ఆనందాన్ని వాళ్ళకి తెలియచేయవలసిన అవసరం ఉంది. పిల్లల విషయంలో ఆ బాధ్యత పెద్దలది. పెద్దలలోనే ఈ లక్షణం ఉంటే…. ఆలోచించాల్సిందే. వాళ్ళు రేపు అని గోడ మీద రాసి రోజు చూస్తూ ఉంటారు. రేపు అన్నది ఎప్పటికీ రాదు కదా. దానిని నేడుగా అనువాదం చేసుకోవలసి ఉంటుంది. అదే కదా అసలు భయం. రేపు అంటే సుఖం – ఈ రోజుకి చెయ్యనక్కరలేదు అని. ఇది ఒకరకంగా వాయిదా వేయటం.
ఈ బద్ధకాన్ని మించింది భయం. దాన్ని అధిగమించటానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవలసి ఉంటుంది. అది లేకపోవటం వల్లనే పరిస్థితి ఇట్లా ఉంది. పిల్లలు హోమ్ వర్క్ వాయిదా. ఆఫీస్‌లో తను చెయ్యవలసిన పని వాయిదా. ఇంటి పనులు కూడా అంతే. నెత్తి మీదకి వచ్చి తప్పనిసరి అయితే ఎట్లాగో అట్లా పూర్తి చేస్తారు. అప్పటి దాకా ఉండాలా? అప్పుడు కూడా సమస్యలు అనుకునే అలలు ఉండనే ఉంటాయి కదా. మనం చేద్దామనుకునే పనులు మరెవ్వరో చేసి, పేరు పొందే ముందు మనమే చేస్తే ఎంత బాగుంటుంది? సముద్రంలో అలలు తగ్గవు. ఒక సారి మునిగితే అవేమీ చెయ్యవు.