ఇంతకీ నువ్వెవరు?

2
3

[dropcap]పె[/dropcap]ళ్ళిచూపులకు బయలుదేరాడు రవీంద్రబాబు… సకుటుంబ సపరివార సమేతంగా…!

అమ్మాయి వాళ్ళ ఇంటికి నాలుగు ఇళ్ళ ముందు… కారు దిగాడు.

“ఏరా? డైరెక్ట్‌గా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా… ఇక్కడ దిగడం ఎందుకు?” తండ్రి ప్రశ్నించాడు.

“కాస్త మేకప్ అవుదామని” అన్నడు స్టయిల్‍గా స్మైల్ ఇస్తూ…

షేవింగ్ చేసుకుని… నీట్‌గా మేకప్ అయి… చక్కగా ఎక్కువగా పౌడర్ అద్దుకుని… సూటూ బూటూతో రవీంద్రబాబు… నిజంగా రవీంద్రబాబు… రాజాబాబులా వున్నాడు.

పెళ్ళి చూపులు…

అందంగా ముస్తాబైన అమ్మాయి రాధ వచ్చి అందరి ముందు కూర్చుని వినయంగా నమస్కరించింది.

రవీంద్ర తన వైపు చూస్తుంటే అందంగా వున్న రాధ కళ్ళు ఆనందంతో మరింత అందంగా మెరిసాయి. పున్నమి నాటి వెన్నెలలు తన కళ్ళలో ఒక్కసారిగా తొంగి చూసాయి.

‘అబ్బాయి బాగున్నాడు’ అనుకుంది రాధ.

‘అమ్మాయి బాగుంది’ అనుకున్నాడు రవీంద్ర.

కొద్దిక్షణాల తరువాత…

‘తను పూర్తి ట్రెడిషనల్‌గా వుంది’ మనస్సు లోనే అనుకునే బదులు బయటకే అనేశాడు.

తల్లి విని “ఏంట్రా?” అంది.

మాట్లాడలేదు రెండు క్షణాల పాటు.

రవీంద్రకి చిన్నసందేహం కలిగింది. తల్లికి చెప్పాడు.

పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తయి… వాళ్ల ఇంటికి బయలుదేరేలోపు తల్లి తెలుసుకున్న వివరాల తరువాత… తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్నాడు.

తాము ఎవరి ఇంటి నుండి అయితే మొదట బయలుదేరారో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అందరూ. ఆ ఇల్లు ఇరుపక్షాలకు మధ్యవర్తి మాధవరావు గారి ఇల్లు. మాధవరావు గారి అమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతోంది.

ఆ అమ్మాయి చెప్పిన ఓ విషయం విని ‘అలాగా’ అనుకుంటూ ఆశ్చర్యపోతూ… కన్ఫర్మేషన్ కోసమని మనస్సులో మరొక్కసారి మననం చేసుకున్నాడు.

“అబ్బాయికి బైక్ డ్రైవింగ్ రాదట నిజమేనా ‘నీరూ'” అంటూ తనని అడిగిందని నీరజ చెప్పింది.

ఆమ్మాయి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు. అంటే తను ‘మన గురించి ఇది వరకే వివరాలు సేకరించిందన్న మాట… పిల్ల తెలివైనదే’ అనుకున్నాడు.

* * *

సిటీకి వచ్చాక …

నేరుగా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మేనల్లుడిని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించాడు నాగేశ్వర్ రావు.

“మామయ్యా… నా చిన్నతనంలో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం… నేను ఇంతకాలం సైకిల్ తొక్కడం గాని, బైక్ డ్రైవ్ చేయడం గాని చేయలేదు. నీకు తెలుసు కదా నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పనని. మరి ఆ అమ్మాయి తనకి బైక్ డ్రైవింగ్ వచ్చిన అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని కోరిక వుందట… ఆ విషయం మీకు తెలుసు కదా! మరి ఎందుకు ఆ సంబంధం కోసమని పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు? ఈ నిర్ణయం నీదా? నాన్నదా? ఆఁ?” అడిగాడు.

“రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చావు కదా? అత్తయ్య చేతి కాఫీ తాగాక మాట్లాడుకుందాము.”

కాఫీ అనగానే… కోపం పుర్తిగా చల్లారిపోగా “ఓ.కే” అంటూ కుర్చీలో కూర్చున్నాడు.

రవీంద్ర బి.టెక్ చదివి.. ఓ ప్రైవేట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

“మామయ్యా… కాఫీ అయితే ఓ.కే గాని… సంబంధం మాత్రం కాదు” అన్నాడు.

అమ్మ చెప్పింది నిజమే… అమ్మాయి ఎప్పుడూ కేవలం ట్రెడిషనల్ డ్రెస్సెస్‌లో అంటే లంగా, ఓణీలలో మాత్రమే వుంటుందట. అదేమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని అలాగే పెంచారట… కానీ తనకి జీన్స్, టీ షర్ట్స్‌లో వుండే మోడ్రన్ అమ్మాయిలంటే ఇష్టం. తను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో తన ఫ్రండ్స్ అలాగే వుండేవారు. చూస్తూ చూస్తూ పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలా? డిగ్రీ చదువుకుంది, మోడ్రన్‌గా ఉండడం తెలుసుకోవద్దూ అనుకుంటూ తనలో తాను గొణుక్కున్నాడు.

“రవీంద్రా” గట్టిగా పిలిచిన మామయ్య పిలుపుకి ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చాడు.

భార్య అందించిన కాఫీ అందుకున్న నాగేశ్వర్ రావు ఆలోచనలు గతం లోకి దారి తీసాయి.

 * * *

“రవీంద్రా! అప్పుడు నువ్వు సెవెంత్ క్లాస్ చదువుతున్నావు. నీకు సైకిల్ తొక్కడం నేర్పేవాడిని నేను. ఒక రోజు నేను లేని సమయంలో నువ్వు సైకిల్ బయటకు తీసావు. అదే సమయంలో నేను మన వీధి మలుపు తిరుగుతున్నాను. అనుకోకుండా ఎదురైన నన్ను చూసి కాస్త ఖంగారు పడి నాకు డ్యాష్ ఇచ్చావు. మన ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. సైకిల్‌కి మాత్రం ఏమీ కాలేదు. ఆ రోజు నీ వలన నాకు కూడా దెబ్బలు తగిలాయని హాస్పిటల్ లో నాకు మాట ఇచ్చావు – ‘ఇక ముందు సైకిల్ తొక్కన’ని. కాని తరువాత నీకు సైకిల్ నేర్పించాలని నేను ఎంతో ప్రయత్నించాను. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోమని నీకు ఎన్నోసార్లు చెప్పాను.  కాని నువ్వు ఇంట్రెస్ట్ చూపలేదు.”

 కొద్ది క్షణాలు ఆగి.. కాస్త బలం గా ఊపిరి పీల్చుకుని…

“ఇప్పుడు నేర్పిస్తాను ఓ.కే.నా?”

“ఏంటి? సైకిల్ తొక్కడమా?”

“కాదు. బైక్ రైడింగ్” అన్నాడు నాగేశ్వర్ రావు సంతోషంగా మేనల్లుడి వైపు చూస్తూ…

* * *

అలా ఇద్దరూ కలసి ఆ రోజు నుండి బైక్ రైడింగ్ నేర్చుకోడానికి ఊరు చివర వున్న గ్రౌండ్‌కి బయలుదేరారు. ఓ నాలుగు రోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టాడు రవీంద్ర బైక్ డ్రైవింగ్ నేర్చుకోడానికి. మామయ్య బైక్‌ని చేతుల్లోకి తీసుకున్నాడు.

“ఒరేయ్ జాగ్రత్త రా!” అంటున్న మామయ్య వైపు నవ్వుతూ చూస్తూ… ఒక్క కిక్ ఇచ్చాడు.

రెండో కిక్ ఇద్దామంటే… కాలు కేదో తేడా అనిపించి కిందకు చూసాడు.

కిక్ రాడ్, కాలితో బలంగా విపరీతమైన వేగంగా కొట్టడంతో… అసలే పాతదైన ఆ కిక్ రాడ్ విరిగి ఎక్కడో పడింది. ఇద్దరూ కలసి బైక్ నెట్టుకుంటూ ఇంటికి బయలుదేరారు. కిలోమీటరు నెట్టాక మామయ్య తూలి కిందపడబోతుంటే… తను మరికాస్త దూరం నెట్టాడు.

చెమటలు పట్టగా తుడుచుకుంటూ… “సారీ మామయ్యా” అంటున్న మేనల్లుడి వైపు ప్రేమగా చూస్తూ “ఇట్స్ ఆల్రైట్” అన్నాడు.

మెకానిక్ బాగుచేసిన బైక్ తీసుకుని మళ్ళీ గ్రౌండ్‌కి బయలుదేరారు. కొద్ది సేపు బాగా డ్రైవ్ చేసాడు రవీంద్ర. తిరిగి ఇద్దరు ఇంటికి బయలుదేరారు.

“మామయ్యా! నేను డ్రైవ్ చేస్తాను” అన్నాడు రవీంద్ర.

“సరే! జాగ్రత్తగా డ్రైవ్ చేయి” అంటూ బైక్ మేనల్లుడి చేతికి ఇచ్చాడు.

మామయ్య ఇస్తున్న సూచనలు పాటించకుండా… వేగంగా బైక్ నడపసాగాడు.

తను ఊహించిన దానికంటే వేగంలో మార్పు రావడంతో… ఆందోళనగా గేర్లు మార్చుతూ “మామయ్యా!” అంటూ గట్టిగా అరిచాడు. అతికష్టం మీద బైక్ ఆపాడు.

“ఈ బైక్ రైడింగ్ నా వల్ల కాదు మామయ్యా” అంటున్న రవీంద్రకి ధైర్యం చెప్పాడు మామయ్య.

అలా మరో మూడు రోజులు ప్రాక్టీస్ చేసాక… తిరుగు ప్రయాణమవుతున్న రవీంద్రకి తను కొత్తగా బుక్ చేసి కొన్న హోండా బైక్ న్యూ మోడల్… ఇచ్చి, నేర్చుకోడానికి మరో రోజు లీవ్ పొడిగించమని చెప్పి… డైవింగ్ నేర్పించాడు.

“చిన్నతనంలో తెలిసీ తెలియక చేసిన తప్పును ఇప్పటికీ మర్చిపోకుండా వున్నవంటే నువ్వు గ్రేట్ రా! నువ్వు మాకు మేనల్లుడివే అయినా నా బిడ్డలు కిరణ్, చరణ్‌లా… నువ్వు మా పిల్లొడివేరా!” అంటున్న మామయ్య వైపు కృతజ్ఞతగా చూసాడు రవీంద్ర.

* * *

ఆ రోజు… ఆదివారం… కొత్తగా కొనుక్కున్న KTM DUKE పై బయటకు బయలుదేరుతూ… ఆగిపోయాడు రవీంద్ర. బైక్ ఇంట్లో పెట్టేసి… బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్, పింక్ కలర్ టీ షర్ట్ వేసుక్కున్న ఆమ్మాయి అటుగా వెళుతుంటే… ఆ అమ్మాయిని నడకతోటే వెంబడించాడు.

కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హూందాగా నడుస్తుంది.

‘అతిలోక సుందరివో, అందాల అప్సరసవో… నన్ను చేరగా వచ్చిన దేవకన్యవో…’ అనుకుంటూ ..అలా అలా ఊహల్లో తేలిపోతూ,తన వెంటే నడుస్తున్నాడు.

‘ఓ మై డియర్ మోడ్రన్ గర్ల్… I LOVE YOU… నా మనస్సు మూగగా, కొత్త రాగమేదో ఆలపిస్తుంది… నిన్ను చూడగానే’ అనుకుంటూ లిరిక్స్ తనే అల్లుకుంటూ పాట ఏదో పాడుకుంటున్నాడు.

“హల్లో” అన్నాడు పలకరింపుగా నవ్వుతూ…

అతడిని పట్టించుకోకుండా… గేట్ తీసుకుని తమ ఇంటికి కాస్త దూరంలో వున్న ఇంట్లోకి వెళ్ళిపోయింది మోడ్రన్ గర్ల్.

తను అక్కడే నిలబడి తన కలలరాణి వెళ్ళిన దిశగా చూస్తుండిపోయాడు. కొద్ది క్షణాల తరువాత… కిటికీ లోంచి తను బయటకు చూడడం గమనించాడు.

‘అంటే’ అనుకుంటూ… ఆ పైన ఆలోచించలేక… ఇంటికి వెళ్ళిపోయి… దుప్పటి కప్పుకుని కలలలో తేలిపోయాడు.

* * *

మరుసటి రోజు ఉదయం… తమ ఇంటిదగ్గరలో వున్న బస్ స్టాప్ దగ్గర సడన్ బ్రేక్‌తో బైక్ ఆపాడు. నీలి రంగు జీన్స్, రక రకాల కలర్స్ షేడ్స్‌తో ఆరెంజ్ కలర్ టీ షర్ట్, కూలింగ్ గ్లాసెస్‌తో అందంగా వుంది తను. గోళ్ళకి వేసిన నైల్ పాలిష్ అందంగా సూర్యకాంతి పడి మెరుస్తుంటే… ఎర్రగా మెరుస్తున్న నునుపైన అధరాలపై వేలు పెట్టుకుని… స్టైల్‌గా నిలబడింది.

“లిఫ్ట్ కావాలా?” అడిగాడు.

“నో” అంది రెక్లెస్‌గా…

తను, తన రిక్వెస్ట్ రిజెక్ట్ చేసిందని కూడా గ్రహించే స్థితిలో లేడు. తన పెదవులు పలికిన పదం… వీణ మీటినట్లుగా అతనికి తన్మయాన్ని కలిగించింది.

కొద్దిక్షణాలు ఆగి… “జస్ట్! అలా బేకరి దాకా వస్తారా… మీతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను” అన్నాడు.

 KTM DUKE బైక్ కదలడానికి సిద్ధంగా వుంది.

“ప్లీజ్ ..” అంటూ తనకే వినిపించేలా అతడు బ్రతిమిలాడుతుంటే… అలాగే అన్నట్లుగా తలూపింది.

కదులుతున్న మోడ్రన్ ఇయర్ రింగ్స్ వైపు చుస్తూ “వావ్ ..!” అనుకున్నాడు.

బేకరి ముందు బైక్ ఆపాడు. బేకరి లోకి వెళ్ళారు ఇద్దరు. టేబుల్ ముందు కుర్చున్న తన వైపు కళ్ళర్పకుండా చూస్తూ… “మీరు నాకు చాలా నచ్చేసారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ వివరాలు తెలుసుకోవచ్చా?” అని అడిగాడు.

మౌనంగా వుండి పోయింది.

“may I know your good name please?”

 “అనూ…”

“వావ్… మీ పేరు చాలా బాగుంది. అచ్చు మీలాగే” అన్నాడు నవ్వుతూ…

కూలింగ్ గ్లాసెస్ సర్దుకుంటున్న తన వైపు తన్మయంగా చుస్తూ.. “మళ్ళీ ఒకసారి చెబుతున్నాను… నాకు నచ్చావు” అన్నాడు.

“ఇప్పుడు కూడానా? ” అంది గ్లాసెస్ తీసేస్తూ..

“మీరు…!” అంటూ బోలెడంత ఆశ్చర్యపోతూ…

“అవును… రాధనే!” అంది హాయిగా నవ్వుతూ…

“మరి అనూ అని చెప్పారు?”

“అవును .. నా పేరు అనూరాధ” అంది ముసిముసిగా నవ్వుతూ …

“నాకు పిచ్చి పిచ్చి గా నచ్చేశావు. I LOVE YOU” అన్నాడు రవీంద్ర… అది బేకరి అన్న విషయం కూడా మర్చిపోయి. అందరూ తమ పనులు మానేసి… కొద్దిక్షణాల పాటు అతడి వైపు వింతగా చూసినా… అతడు మాత్రం ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేడు.

అతడి కళ్ళ నిండా… నిండిపోయిన రూపం… అనూరాధ!

అలా ఓ గంట సేపు మాట్లాడుకున్న తరువాత… బిల్ పే చేసి… తన చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకువెళ్ళి… డ్యూక్ బైక్ స్టార్ట్ చేసి.. ఐ మాక్స్ థియేటర్ వైపు దూసుకెళ్ళాడు.

తనకి ఈ ఇడియా ఇచ్చిన నాగేశ్వర్ రావు బాబాయికి మనస్సులోనే ‘థ్యాంక్స్’ చెప్పుకుంది అనూరాధ.

వెనుక నుండి అతడిని పట్టుకుని కూర్చుంది ‘మోడ్రన్ గర్ల్ ‘ అనూరాధ.. సారీ!…. మిస్. అను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here