[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ భాగం. [/box]
[dropcap]కా[/dropcap]లేజికి టైమ్ కావడంతో వాసుదేవ్ హడావిడిగా మోటారు బైక్ స్టార్ట్ చేసి గేటు తీసుకొని వీధిలోకి వెళ్లగానే “ఎన్ని సార్లు చెప్పాను… కారు సర్వీసింగ్‌కి ఇవ్వమని… నా మాట పెడ చెవిన పెట్టావు… ఏమైంది కారుకి?” అని కోపంగా డ్రైవర్‌ని అడుగుతుంది నీలవేణి…
గేటు దగ్గర నిలబడి ఉన్న జగన్నాధంగారు ఒక సారి డ్రైవరు వేపు, నీలవేణి వైపు చూసి అన్నారు…. “క్రొత్త కారు కొంటానంటే ఒప్పుకోవు….”
“ఎందుకు తాతయ్యా కొత్త కారు?” అని అంటుండగానే వాసుదేవ్ మోటారు బైక్ ఆపి…. “కారు స్టార్ట్ కావడం లేదా… నేను కాలేజికే వెళుతున్నాను…. డ్రాప్ చేస్తాను” అనగావే…
“థాంక్స్ వాసూ” అని డ్రైవర్ వైపు చూసి “రామూ ఈ రోజు సర్వీసింగ్‌కి ఇచ్చేయ్…” అని వాసుదేవ్ వెనకాల మోటారు బైక్ మీద కూర్చుంది నీలవేణి.
మోటారు బైక్ వెళుతుంది…
ముందు రోజు వసుంధర తనతో అన్న మాటలు గుర్తు వచ్చి ఒక్క నిమిషం కంగారు పడింది.
“కారు కొని ఎన్నాళ్లయింది నీలూ? చాలా క్రొత్తగా ఉంది…”
“ప్చ్ … అది పాత కారయినా తిరిగిన మైళ్ళు పది వేలు కూడా లేవు. అదొక పెద్ద కథ…”
“కథా…”
“అవును వాసూ… తాతయ్యగారికి కారు ఉండేది. అది చాలా పాతది అయిపోయిందట… కొత్త కారు కొనలనుకుంటున్న సమయంలో అమ్మకి జాజ్ వచ్చిందట. ‘నాన్నా… నా శాలరీతో కారు కొంటాను… అప్పటి వరకు పాత కారు అమ్మకండి… ప్లీజ్’ అందట… ‘నువ్వు కారు కొనడం ఏమిటమ్మా…’ అని తాతయ్య అంటే ‘ఏం నాన్నా పిల్లలు సరదాగా పేరంట్స్‌కి కొనకూడదా’ అని కొన్నాళ్లలో అమ్మే కారు కొందట… అమ్మ సరదాపడి కొన్న కారుని ఎలా అమ్మాలనిపిస్తుంది…”
“మంచి పని చేసావు నీలూ… చాలా వస్తువులు పాతబడిపోయాయి అనుకుంటాము, కాని అవి చూసినప్పుడు బోలెడు మంచి అనుభూతులను గుర్తు చేస్తుంటాయి.”
“అన్నట్లు చెప్పడం మరిచాను వాసుదేవ్… వసూ చాలా మంచి అమ్మయి మీరిద్దరూ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అట… చాలా క్లోజ్ అట కదా… ఒకరిని ఒకరు చూసుకోకుండా ఎన్ని రోజులో ఉండలేరట కదా” అంది నవ్వుతూ నీలవేణి.
“ఎవరు చెప్పారు?”
“ఇంకెవరు తనే… నిన్న మీ ఇంటికి వచ్చిందట, ఆంటీ నువ్వూ లేరని మా ఇంటికి వచ్చింది… నా గురించి నువ్వు వసూతో చెప్పావట కదా…”
‘అమ్మ రాక్షసి…’ అని మనసులో అనుకున్నాడు.
నవ్వుతూ అంది నీలవేణి… “మీ ఇద్దరూ మనసంతా నువ్వే, హలో సినిమాల్లోలా చైల్డ్‌హుడ్ నుండి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టంట, ఆ ఇష్టం ప్రేమగా డెవలప్ అయిందట… వసూ పొంగిపోతు మీ ఇద్దరి ప్రేమ కబుర్లు చెప్పింది…”
గభాలున సడన్ బ్రేక్‌తో మోటారు బైక్ ఆపి “ఏంటి మనసంతా నువ్వే, హలో సినిమాల్లోలా అని వసూయే చెప్పిందా…” అన్నాడు.
నవ్వుతూ అంది నీలవేణి… “ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు వాసూ. Anyway you are lucky… నిన్ను వసూ తన ప్రాణంలా ప్రేమిస్తుంది…. అఫ్‌కోర్స్ నీకు తనంటే ప్రాణం అని చెప్పింది.”
“గాడిద గుడ్డు.”
“అదేంటి అలా అనేసావు… తను నిన్ను ఎంత సిన్సియర్‌గా లవ్ చేస్తుంది… నీకు తనంటే అంతే ప్రేమ ఉందని చెప్పింది…”
“ఏడ్చింది…”
కంగారుగా అంది, “ఏంటి వాసూ…. తనంటే నీకు ఇష్టం లేదా తన మాటలు వింటుంటే చాలా గొప్ప ప్రేమ అనిపించింది.”
“అసలు ఈ వయసులో జీవితంలో సెటిల్ కాకుండా ప్రేమ ఏమిటి… నాకు చిన్ననాటి ఫ్రెండ్స్ కార్తీక్, ఫణీ, వసూ, వీళ్లందరూ అంటే ఇష్టమే… కనీసం నెలకొకసారయినా అందరం కలుసుకోకపోతే అదోలా ఉంటుంది. అందరి కన్నా తను… వసు ఇంకా నాకు క్లోజ్… నేను ఏదంటే తను అంటుంది… నిజం చెప్పాలంటే నాకు సెంటిమెంట్లు… అలాంటివి తక్కువ. ఐరన్ లాంటి వాడిని. మాగ్నెట్‌లా వచ్చి నన్ను అతుక్కుపోతుంటుంది… ఇవన్నీ చెబుతున్నానని వసూ అంటే ఇష్టం లేదని కాదు…”
నవ్వుతూ అంది. “అదే ప్రేమ వాసూ..”
“అందరూ ఇదొక పేరు పెట్టేస్తారు.”
“ఆ… ఆ… నా కాలేజి వచ్చేసింది…” అంది నీలూ.
బైక్ ఆగింది…
“థాంక్స్ వాసూ బై” అని చెప్పేసి వడి వడిగా అడుగులు వేస్తూ… ‘ఎప్పుడూ ఆశ అనేది మనిషి పెట్టుకోకూడదు. అనుకోకుండా జరిగేదాని కోసం ఎదురు చూడడం తప్ప ఆశ పెట్టుకుంటే అగాధంలా కనబడుతుంది జీవితం’ తనలో అనుకుంది నీలవేణి…
“రోజు రోజుకి… వసూకి ప్రేమ పిచ్చి ఎక్కవై పోతుంది… నీలూ… తన ప్రేమకి మధ్యలో అడ్డుపడుతుంది ఏమో అని తెలివితేటలు ప్రదర్శించి…. ఇంటికి వెళ్ళి మరీ ప్రేమ కథ చెప్పింది…” అని వాసు ఆలోచనలతో ఉండగానే కాలేజి వచ్చింది.
***
డైనింగ్ టేబిల్ మీద డిన్నర్‌కి అన్నీ పెడుతుంది సుమిత్ర.
టి.వి చూస్తున్న వాసుదేవ్ గభాలున వెళ్లి గ్లాసులు ప్లేటులు అన్నీ టేబిల్ మీద పెట్టడం చూసి… “ఎందుకు నాన్నా నీకవన్నీ… నేనున్నానుగా” అంది సుమిత్ర.
“ఎందుకమ్మా…. మీలాంటి ఆడవాళ్లు అన్నీ పనులు మావే అన్నట్లు తమకి తామే శిక్ష వేసుకుంటారు…. ఈ కాలం అమ్మాయిలు ఎంత మారిపోయారో చూడు…. ఇంటి పనులు సగం అబ్బాయిలతో చేయిస్తున్నారు…” అన్నాడు.
నవ్వుతూ “చాల్లేరా….” అని, “ఎప్పుడు లేనిది ఇంత వేళయినా మీ నాన్నగారు రాలేదు…. కొంచెం కంగారుగా ఉంది…” అని సుమిత్ర అంటుడగానే వీధిలో కారు హారన్ వినిపించింది.
లోపలికి వచ్చిన నిరంజనరావు చేతిలోని స్వీట్స్ ప్యాకెట్టు వాసుదేవ్‌కిస్తూ… “నీ కిష్టమైన స్వీట్స్… మీ అమ్మ నోరు కూడా తీపి చెయ్యి…” అన్నారు.
ఆశ్చర్యంగా, సంతోషంగా అంది సుమిత్ర – “మీరు… మీరు… స్వీట్లు తేవటమా… నమ్మలేకుండా ఉన్నానండి.”
“ఎప్పుడు వాడే స్వీట్లు కొని తేవాలా…. నేను తేకూడదా” అన్నాడు నవ్వుతూ…
“మీరు ఏదో దాస్తున్నారు… ప్రమోషన్ వచ్చిందా?” అని అడిగి “అన్నట్లు పవిత్ర ఫైనల్ సెమిష్టర్ జరిగాయి” అంది. “పవిత్ర ఫోను చేసిందా…” అడిగింది.
“విషయం చెప్పకపోతే ఉరుకునేలా లేవు…. అనుకోని పరిణామం జరిగింది… మా ఎం.డి. సంతోషం…. గౌతమ బుద్ధుడికి బోధివృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్లు… ఎవరో మహానుభావుడు కలలో కనబడి శేష జీవితం మంచి పనులు చేస్తూ నాలుగు మంచి మాటలు చెబుతూ ముగించమన్నాడుట… ఆశ్చర్యకరమైన విషయం… తలకి మీసాలకీ రంగు వేయకుండా సగం తెల్ల జుత్తు, సగం నల్లజుత్తుతో, రంగు రంగుల బట్టలు మానేసి…. అయ్యప్ప దీక్ష తీసుకొని కాళ్లకి చెప్పులు లేకుండా…. అన్నట్లు తనలో తను మాట్లాడుకుంటూ… నిట్టూర్పులు విడుస్తూ కనిపించాడు… ఏం జరిగిందో, సనడ్‌గా ఎందుకు ఎం.డి. ఇలా మారిపోయాడో తెలిక అందరూ తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు. అంతమందిలో నన్ను దగ్గరకు పిలిచి…. యూ ఆర్ గ్రేట్ నిరంజనరావు… యూ ఆర్ గ్రేట్ అన్నాడు… చూస్తున్నది కలో నిజమో అర్థం కావడం లేదు సుమిత్ర… అంతే కాదు నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బ్రహ్మాండంగా వ్రాసాడు…”
వాసుదేవ్ ముఖం సంతోషంతో నిండిపోయింది.
“నేను చెబుతూనే ఉన్నాను కదండి… మనకి అన్యాయం చేయడు ఆ భగవంతుడని… రేపే వెళ్లి మొక్కు తీర్చుకుంటానండి… అన్నట్లు మీరు కూడా రావాలి…” అంది సంతోషంగా.
“చూసావా నాన్నా… ఆ భగవంతుడిని నమ్ముకుంటే అన్యాయం ఎప్పటికి చేయడు” అని సుమిత్ర అంటుండగానే వాసుదేవ్ సెల్ రింగ్ కావడం… “వాసుదేవ్ బాగున్నావా బాబూ….” అన్న అనసూయ గొంతు విని కంగారుగా లేచి “చెప్పండి మేడమ్… బాగున్నారా?” అని సెల్ తీసుకొని బాల్కనీలోకి నడిచాడు.
“నేను నీకేం చెప్పాను వాసుదేవ్?” అంది…
“ఏం చెప్పారు?” అని కాసేపు కంగారు పడి “సారీ… గుర్తు లేదు మేడమ్…” అన్నాడు.
“అదిగో మేడమ్ అంటున్నావు మళ్లీ… అమ్మ… అమ్మ అని పిలువయ్యా… నాకొక ఆణిముత్యం లాంటి కొడుకున్నాడని సంతోషడనీ… ఈ వయసులో మనసుకి ఇలాంటి సెంటిమెంట్స్ బూస్ట్‌లా పని చేస్తాయి.”
“అమ్మా… ష్యూర్… అమ్మా అనే పిలుస్తాను.”
“సంతోషం వాసుదేవ్! మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. అన్నట్లు నేను నిన్ను ఒక హెల్ప్ చేయగలవా అని అడగడానికి ఫోన్ చేసాను… మా పనిమనిషి కొడుకు నాలుగేళ్ల వయసుంటుంది… పాపం వాడికి పుట్టినప్పటి నుండి జబ్బులే. వాడి హాస్పిటల్ రిపోర్సు అన్నీ తెచ్చి చూపించింది… నాకేం అర్థమవుతుంది… వాడికి ఆపరేషన్‌కి చేయడానికి రెండు మూడు లక్షలు ఖర్చువుతుందట… జెమినీలో ‘మేము సైతం’ అని ప్రోగ్రాం వస్తుంది చూడు ఆ ప్రోగ్రామ్ వాళ్లతో నువ్వు మాట్లాడి పసివాడికి సహాయం చేస్తావని ఫోను చేసాను వాసుదేవ్” అంది.
ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, సహాయం చేయాలన్న ఆవిడ ఆలోచనకు సంతోషించి “ష్యూర్ అమ్మా… వాళ్లని కనుక్కొని తెలిసిన వెంటనే చెబుతాను” అన్నాడు వాసుదేవ్.
కడుపులో బిడ్డ పడగానే ఉద్వేగానికిలోనై సంతోషంతో ఆనందంతో బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ నవమాసాలు సుళువుగా మోస్తుంది తల్లి.
తన ఒడిలో పుట్టిన బిడ్డలు కొందరు దేశాన్ని ఉద్ధరిస్తాం అంటూ, ప్రజలే నా ఊపిరి… నా బలం, వాళ్లకే నా జీవితం అంకితం అంటూ ఎన్నో వేల కోట్ల కుంభకోణంలో పట్టుపడిపోవడం, పెద్ద పెద్ద స్కాంలో పట్టుబడిపోవడం, ప్రతిపక్షాల కుట్ర అని ప్రజలకు అభివాదం చిరునవ్వుతో సిగ్గు లేకుండా చేస్తూ, కొత్త అల్లుడు అత్తారింటికి వెళ్తునట్లు,. జైలుకి వెళ్లి దర్జాగా వెనక్కి వస్తున్న వాళ్లని… నిర్భయ చట్టం ప్రభుత్వం ప్రవేశ పెట్టినా నిర్భయంగా ముక్కు పచ్చలారని పసి బిడ్డల దగ్గర నుండి కాటికి కాళ్లు చాపుకున్న స్త్రీలను కూడా వదలకుండా లైంగికంగా వేధించి, ఆనక సజీవ సమాధి చేయడమో, లేక యాసిడ్ దాడి చేస్తున్న కీచకులను, కంటికి రెప్పలా తమ శక్తినంతా ధారబోసి పెంచిన కన్న బిడ్డలు, కన్న వాళ్లన్న కనికరం లేకుండా కఠినంగా దూరంగా వృధ్ధాశ్రమాల్లో పడేస్తున్న యువతను చూస్తూ నిస్సహాయంగా రోదిస్తుంది పుడమి తల్లి…
ఎప్పటి లాగే మంచి చెడు అన్యాయాలు, అక్రమాలు, పుట్టుకలు, గిట్టుకలు వేటితోను తనకి సంబంధం లేనట్లు కాలచక్రం తన పని తను చేసుకుపోతుంది.
***
వాసుదేవ్ ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్‌లో పాస్ కావడం నిరంజనరావు, సుమిత్రలకు ఎంతో సంతోషాన్నిచ్చింది…
నిరంజనరావు ప్రమోషన్ రావడం, ఆ తరువాత కొన్ని నెలలకి రిటైర్ కావడం జరిగింది.
రూఫ్ గార్డెన్‌లో బుట్ట పట్టుకొని చెట్లకి కాసిన కాయగూరలు కోస్తుంది సుమిత్ర,
“ఏం చేస్తున్నావు సుమిత్రా…” అని వచ్చిన భర్తని చూసి ఆశ్చర్యంగా అంది.
“ఏవండి… నమ్మలేకుండా ఉన్నాను… మీరు గార్డెన్‌లోకి వచ్చారు… ఎన్నోసార్లు గార్డెన్ ఎంతో బాగుంది చూడడానికి రమ్మంటే ఎప్పుడోగాని వచ్చేవారు కాదు.”
నవ్వుతూ అన్నాడు – “ఇక మీదట రోజు వస్తాను… ఇన్నాళ్లు ఆఫీసు… ఎం.డి. సతాయింపులు…దేవ్ భవిష్యత్ ఎలాగుంటుదో అన్న భయం… యుఎస్‌ఎ నుండి పవిత్ర వచ్చినాక పెళ్ళి చేసి అత్తారింటికి పంపాలన్న ఆలోచనలు… రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లు పిల్లల భవిష్యత్‌కి సరిపోతాయా అన్న లెక్కలు… వీటన్నిటితో కాస్త టెన్షన్‌గా ఉండేవాడిని…. అన్నింటి కన్నా సంతోషం కలిగించే విషయం వాసుదేవ్ డిస్టింక్షన్‌లో పాసవుతుండడం…”
“నేను చెబుతూనే ఉన్నాను కదండి… భగవంతుడు మనకి అన్యాయం చేయడండి అని… చీకటి పడుతుంది… పదండి వెళదాం” అంది సుమిత్ర…
“కాసేపు ఉందాం… అన్నట్లు ఎదురింటి జానకిగారు ఇప్పుడెలా ఉంటున్నారు… పాపం చిన్న పిల్ల నీలవేణి… అంత బాధను ఎలా తట్టుకుంటుందో…”
భర్త అలా ఎదురింటి వాళ్ల యోగక్షేమాలు అడగడం సంతోషమనిపించింది….
“నీలు సంతోషానికి అవధులు లేవండి… వాళ్ల అమ్మలో మార్పు రావడానికి నేను, దేవ్ కారణం అంటుంది. జానకి కూడా… మమ్మలను చూడగానే చిన్న పిల్లలు తల్లిని చూడగానే దగ్గిరకు చేరినట్లు నా దగ్గరకు, దేవ్ దగ్గరకు వచ్చేస్తుంది… ఏవో చెప్పాలనుకుంటుంది. కాని చెప్పలేదు…. అప్పుడప్పుడు నేను, దేవ్… జానకిని నీలునీ అలా బైటకు తీసుకువెళ్తున్నాం కదా… సంతోషంగా అన్ని దిక్కులు చూస్తుంది… మీకు చాలా ఋణపడి ఉన్నాను ఆంటీ, దేవ్ అంటుంది నీలవేణి…”
“నువ్వు చెప్పిన దాని బట్టి చూస్తే ఆవిడ తప్పకుండా కొద్ది రోజుల్లో మనలోకి వస్తుందనిపిస్తుంది” అన్నాడు…
“నాకు అలానే అనిపిస్తుందండి… కాని మొన్న బిర్లా టెంపుల్‌కి తీసుకు వెళ్లాం… ఎవరో సాధువు మా దగ్గరకు వచ్చి బిక్షం అడిగాడు… అంతే భయంతో వణికిపోతూ, ఆ తరువాత కోపంతో కాళికలా అయి వాడి చెంపలు వాయగొట్టింది… అంత బలం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు… జానకిని వాడిని కొట్టకుండా ఆపడానికి చాలా కష్టం అయింది…”
“చాలా ఆశ్చర్యంగా ఉంది… ఆవిడకు సాధువంటే భయం ఉంటే వేరే విధంగా ఉంటుంది… వాడిని చూసి పారిపోవడమో లేక మీ అందిరి మధ్యకు వచ్చి దాక్కోవడమో… ఏదో ఒకటి చేయాలి…”
“అచ్చం ఇలాగే దేవ్ ఒకటికి పదిసార్లు అన్నాడు… ఆవిడతో నిజం చెప్పించాలని చూసాడు… కాని ఆవిడ ఏం చెప్పలేకపోయింది…”
“తండ్రి లేక తల్లి అలా… ఇంట్లో తనతో ఆప్యాయంగా మాట్లాడేవారు లేక పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. ఇంతకీ నీలూ గురించి నీ అభిప్రాయం?” అన్నాడు నిరంజనరావు…
గభాలున… భర్త అలా అడిగేటప్పటికి ఆశ్చర్యపోయింది సుమిత్ర..
“ఏంటి అంత కష్టమైన ప్రశ్న అడిగానా?” అన్నాడు నవ్వుతూ…
“నేనే కాదు… నీలు గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా సరే… చాలా మంచి అమ్మాయి… ఈకాలంలో పిల్ల కాదు అంటారు…” అంది.
“అంటే ఈ కాలం అమ్మయిలు మంచివాళ్లు కాదంటావా… విన్నారంటే నిన్ను…” నిరంజనరావు అనేంతలో… గభాలున అంది…
“నేను… కాదండి… చాలా మంది… ఈ కాలం అమ్మాయిల గురించి… కాస్త నెగిటివ్ గానే అంటున్నారు…”
“అంటే?” అన్నాడు ఆశ్చర్యంగా…
“ఆడవాళ్లకు స్వాతంత్రం ఉండాలి… మగవాళ్లతో సమాన హక్కులుండాలి… అవన్నీ కరక్టే…. కాని కొంతమంది ఆడపిల్లలు కావలసిన దాని కన్నా ఎక్కువ స్వాతంత్రం తీసుకుంటున్నారు… పబ్‌లు… క్లబ్‌ల కల్చర్ ఎక్కవైపోయింది… పగలు… రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నారు… అబ్బాయిల చేతుల్లో మోసపోయి, నమ్మంచి మోసం చేసే అబ్బాయిల వలన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు… మరి కొంతమంది పెళ్లయిన నెలలోనో నాలుగు, ఐదు నెలల్లో భర్తల తీరు నచ్చలేదని డివోర్సు ఇచ్చేస్తునారు… కాలం మారిపోయింది… మగవాడికి లొంగి బ్రతకవలసిన కర్మ లేదంటున్నారు. ఇది అంతా చూస్తుంటే … వివాహ వ్యవస్థ కొన్నాళ్ళలో అంతరించిపోతుంది ఏమో అని భయంగా ఉందండి…”
“మైగాడ్… సుమిత్ర… ఏదో వంట చేసి పిల్లలను చూసుకుంటూ హాబీగా గార్డెన్ వర్క్ చేస్తున్నావు అనుకున్నాను…. గుడ్… ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పనేలేదు…”
“నీలు… చాలా మంచి అమ్మాయండి… మీరూ చూస్తున్నారుగా…”
“చూస్తున్నాను కాబట్టే అడిగాను… మన దేవ్‌కి నీలునిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనిపిస్తుంది నా మనసుకు… నువ్వేమంటావ్…. ఇంకా పెళ్లికి చాలా టైముందనుకో… అయినా వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో…”
సుమిత్రకి చటుక్కున వసుంధర గుర్తు వచ్చింది… ఇన్నాళ్లు వసూ, వాసు చిన్ననాటి ఫ్రెండ్స్ అందుకే క్లోజ్‌గా ఉంటున్నారనుకుంది…. దేవ్‌లో వసూ పట్ల ఎటువంటి మార్పు కనిపించలేదు… కాని వసూలో మాత్రం దేవ్ పట్ల ప్రేమ పెంచుకుంటుందనిపిస్తుంది… స్టడీస్‌లో బిజీగా ఉండి కూడా దేవ్‌తో టచ్‌లోనే ఉంటుంది…
“ఏంటి సుమిత్ర… దేవ్‌కి అప్పడే పెళ్లి ఏమిటని కంగారు పడుతున్నావా… ఇంకా చాలా టైముందిని చెప్పాను కదా. నీలూ…. చాలా మంచి అమ్మాయిని…”
“అబ్బే… అదేం కాదండి… ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది కాని… వసూ… వసుంధర…” అని సుమిత్ర అంటుండగానే…
“వసూ… ఆ అమ్మాయి ఎం.బి.బి.యస్ చదువుతోంది… చిన్నాటి ఫ్రెండ్స్…. క్లోజ్‌గా ఉంటే…”
“అయ్యో లేదండి… దేవ్ అంటే…. చాలా ప్రేమ పెచుకుంది… ఎన్నో సంఘటనల ద్వారా అర్థమయింది… అంతే కాదు నీలుని దేవ్ ఎక్కడ ఇష్టపడతాడో అని జాగ్రత్తలన్నీ తీసుకుంది… అమాయకంగా నీలూ నాతో చెప్పి… వసూ మీ కోడలట కదా… చాలా అందంగా ఉంటుంది…” అని చెప్పింది…
“అమ్మా…” అంటూ గబగబా గార్డెన్‌లోకి వస్తున్న వాసుదేవ్‌ని చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.
(సశేషం)