[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది మొదటి భాగం. [/box]
[dropcap]”హ[/dropcap]లో స్నేహలతా! ఏం చేస్తున్నావ్. అంతా ఓకేయే గదా. అయినా నా పిచ్చిగాని అంతా ఆల్ ఈజ్ వెల్ కాకపోతే నువ్వు నిద్రపోతావా? కోరుకున్నట్లుగానే అటవీ శాఖలో కన్జర్వేటర్‌గా చిన్న వయసులోనే పని చేస్తున్నావు. కాన్ఫరెన్స్ కోసం రాజధానికి వెళ్లాలన్నావు పోయినసారి నేను ఫోన్ చేసి నప్పుడు. ఆ మాట నేను బాగా గుర్తు పెట్టుకున్నాను. ఇప్పుడు మేముండే సుల్తాన్‌పూర్‌కు రాజధాని ప్రాంతం చాలా దగ్గర. గుర్తుంచుకుని వెళ్లే దారిలో ఆగి ఒకసారి మమ్మల్ని చూసెళ్లు. అరుదుగా పూసే బ్రహ్మకమలం విరిస్తే ఎంత సంతోషమో నువ్వొస్తే నాకూ అంత సంతోషం కలుగుతుంది. అన్నట్లు మా ఇంటి తోటలో రోపో మాపో ఒక అర్ధరాత్రి బ్రహ్మకమలాలు విచ్చుకుని వాటి సువాసనలు నన్ను తట్టి లేపుతాయి. వాటిని చూస్తే నువ్వు ఎంత సంతోషపడతావో నేను ఊహించుకోగలను. అసలే అందమైన నీ కళ్లు మరింత విశాలమవుతాయి. నీ సన్నని పెదాల మీద చిరునవ్వు రేకలు పూస్తాయి” అంటుండగానే ఫోన్‌లో అట్నుంచి స్నేహలత బిగ్గరగా నవ్వేసింది.
“ఏంటి కథ సుమబాలా, చాలా సంతోషంగా వున్నట్లున్నావు. మీవారి కేమైనా అసోసియేట్‌గా ప్రమోషనొచ్చిందా. లేక నీ పరిశోధన గ్రంథం అవార్డయిందా? ఆ సందర్భంలోనేనా ఇంతగా కవితా భాష మాట్లాడుతున్నావు. నన్ను తెగ వర్ణించేస్తున్నావు. ఇంతకీ పిల్లలెలా వున్నారు. నీకు ప్రాణం కంటే ఎక్కువైన నీ పిల్లలాంటి మొక్కలెలా వున్నాయి. బ్రహ్మకమలాలను పోయినసారి బెంగుళూరు వెళ్లినప్పుడు తెచ్చానన్నావు కదా. నాకు గుర్తుంది. అవిప్పుడు పుష్పించబోతున్నాయన్న మాట. హౌ గుడ్. తమలపాకు తీగలు, సుగంధీ పాల తీగలు కూడా నాటి పెంచుతున్నావనుకుంటాను. ఒకటి ఆకులు వుపయోగపడితే, మరొకటి వేళ్లుపయోగపడతాయిగా. వాటన్నింటి పేర్లు చెప్పి నన్ను మాయ జేస్తున్నావు. పోయినసారి మా నీటి తొట్టెల్లో కోకిల పిట్టల్లాంటి నల్ల కలువలు పూస్తున్నాయి; మా పెరట్లో కాజు పిట్టలు కూస్తున్నాయి చూద్దువుగాని రా రమ్మంటూ ఫోన్లు చేసావు. అప్పుడెంత ప్రయత్నించినా రావటానికి కుదరలేదు. ఈ సారి మాత్రం వీలు చేసుకుంటాను. సరేనా” అంటూ మరోసారి సన్నగా నవ్వింది స్నేహలత.
“ఈసారి నువ్వు తప్పకుండా రావాలి స్నేహలతా. ఎందుకంటే కొత్తగా డెవలప్ అయ్యే ఏరియా ఇది. ఎక్కడెక్కడి పంట పొలాలన్ని ప్లాట్లుగా మారిపోయే రోజులు గదా ఇవి. ఆ ప్లాట్లలో ఇళ్లు, అపార్టమెంట్లు త్వరత్వరగా రూపుదిద్దుకుంటున్నాయి. మా ఇంటికి దగ్గర్లో వృద్ధదంపతులుంటారు. వాళ్లకు ఆస్తిపాస్తులున్నాయి. కాని పిల్లల్లేరు. వాళ్ల పొలం కూడా మా ఇంటి వైపే వున్నది. ఒక రెండెకరాలో వాళ్లు గుడి కట్టించారు. గుడకి చుట్టూ వాళ్ల పొలమే వున్నది. మెయిన్ రోడ్డు నుండి గుడిలోకి రావాలంటే దాదాపు అరకిలోమీటరు దూరం రావాలి. అయితే రాకపోకలకు వీలుగా కచ్చా రోడ్డు వున్నది. మున్సిపల్ కమీషనర్‌తో ఇక్కడి స్థానిక ఎమ్.ఎల్.ఎ.తో మాట్లాడి పక్కా రోడ్డు వేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశమేంటంటే గుడికి వెళ్లే దారికి రెండు వైపులా వృక్షాలు పెంచుదామని చెప్పాలని వున్నది. అలాగే గుడి బాగా ఖర్చు పెట్టి విశాలంగానే కట్టిస్తున్నారు. కల్యాణమండపం, భోజనశాల వగైరా కట్టడాలు జరుగుతున్నాయి. దాంతో పాటు దేవాలయానికి అనుబంధంగా ఒక కాలనీని ఏర్పాటు చేయమని చెప్పాలని వున్నది. మనం వృక్ష శాస్త్ర అభిమానులం. మనం చుదువుకున్న చదువు మన నరాల్లో జీర్ణించుకుపోయిందిగా. ఏయే చెట్లను నాటిస్తే బాగుంటుంది నాకొంత ఐడియా ఉన్నది. అందులో ఇప్పుడు నా పరిశోధనా గ్రంథం ఔషధవిలువలు మొక్కలు చెట్లు గదా. నేనెంతగా పిహెచ్‌డి కోసం విషయాన్ని సేకరించుకుంటున్నా నీకింకా మంచి మంచి ఆలోచనలొస్తాయి. వాళ్లొప్పుకుంటే మనమే మొక్కల్ని తెప్పించి ఇద్దాం. వాటిని సంరక్షించమని మాత్రం అడుగుదాం. అటవీశాఖ అధికారిగా వాళ్లకు ఎన్నో మంచి మంచి సలహాలనివ్వగలుగుతావు. రేపటి రోజున పూర్ణిమ తిథి నుండి పూర్ణిమ వరకూ వాళ్లు గుడి దాతలతో సహా కలసి సత్సంగం లాంటిది పెట్టుకుని గీతా పారాయణం చేస్తారు. ఆ గీతను చదివి చెప్పేది కూడా రిటైర్డ్ బ్యాంక్ మెనేజరే. ఆమె బాగా ఆకట్టుకునేలాగా చెప్తారు. నేనొకసారి విన్నాను. ఇప్పుడు నువ్వు నా మాటలన్నీ విన్నావుగా. నా ఉద్దేశం నీకు అర్థముయి వుంటుంది. ఇది చాలా చిన్న పనే కావచ్చు. నువ్వైతేనే దానిని కార్యరూపంలో పెట్టించగలవు. ఈ పని కోసం నిన్నొకసారి మరలా కలిసినట్లుంటుదని రమ్మని చెప్తున్నాను.”
“నా మీదున్న నమ్మకానికి థాంక్స్ సుమా. ఈ పని నువ్వు చేయిగలవు. ఎక్కడ వీలైతే అక్కడ మొక్కల్ని నాటించి సంరక్షించటమే నా బాధ్యతనుకుంటాను. పని చిన్నదే కాని ఆశయం పెద్దది. నువ్వు నాకొక అవకాశం ఇస్తున్నట్లే. తప్పకుండా వచ్చి వాళ్ల నొపిపంచటానికి ప్రయత్నిస్తాను. బై.”
***
అనుకున్న ప్రకారం మర్నాడుదయమే స్నేహలత సుల్తాన్‌పూర్ వచ్చింది. జీపును నెమ్మదిగా పోనివ్వమని ఏరియానంతా పరిశీలనగా చూస్తూ వచ్చింది. అక్కడక్కడ ఇళ్లు బాగానే కనుపిస్తున్నాయి. ‘కొత్తగా ఏర్పడ్డ ఈ ఏరియాకు సూల్తాన్‌పూర్ అని పేరు పెట్టుకున్నట్లున్నారు. ఏరియా అంతా మంచి వెల్తురుగా వుంది. గాలి బాగా వీస్తున్నది. పక్కా రోడ్లు పడి, డ్రైనేజ్ సౌకర్యం, వీధి దీపాల వంటివి ఏర్పడితే మంచి పాష్ లొకాలిటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే టైమ్ పడుతుంది. పార్క్, జిమ్, స్టేడియమ్ లాంటివి కూడా సమకూర్చుకోగలిగితే ఇక్కడుండే వాళ్లకు బాగా వసతులు పెరిగినట్లవుతుంది’ అని ఆలోచిస్తూ సుమబాల వాళ్ల ఇంటి అడ్రస్సు కోసం వెతికే డ్రైవర్‌కు సుచన లివ్వసాగింది. “అబ్దుల్ దూరంగా వున్న గుడి కనిపిస్తుంది చూడు, దాని వెనగ్గా వెళ్లి రెండో క్రాస్ రోడ్‌లోకి వెళ్లాలి మనం.”
“అటు వేపున చాలా ఇళ్లు కనబడుతున్నాయి మేడం. మరో దారి వుండివుంటుంది. కాని మన మొచ్చిన ఈ బాట వెహికల్ రావటానికి వీలుగా వున్నది” అంటూ అబ్దుల్ జీప్‌ను ‘ప్రభాత’ అన్న పేరు వ్రాసున్న ఇంటి ముందు ఆపాడు.
సుమబాల భర్త గోవర్ధన్ టౌన్‌లో వున్న టి.జే డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్. సుమబాల కూడా అక్కడే బోటనీ లెక్చరర్‌గా పని చేస్తూ ప్రస్తుతం పి.హెచ్.డి పూర్తి చేసే పనిలో వున్నది. వాళ్ల పని చేసేది ఎలాగూ ఎయిడెడ్ కాలేజీయే. ట్రాన్స్‌ఫర్లేమీ వుండవు కనక ఈ ఏరియా బాగుందని ఈ మధ్యన ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. సుమబాల పిల్లలు అరవింద్, సేవంతికలు, ఇద్దరి పేర్లూ పువ్వులకు సంబంధించినవే. సుమబాల ఎంతో ఇష్టంగా ఆ పేర్లు పెట్టుకున్నది. ఇంట్లో అంతా వాళ్లని అవే పేర్లతో పిలుస్తారు. వాళ్లకింకా వేరే ముద్దు పేర్లుంటూ ఏవీ లేవు. “నా పేరు కూడా గోవర్ధన్ అయిపోయింది. గోవర్ధనమనే పేరుగల చెట్టు దానికి సువాసన ఇచ్చే పూలూ ఉండబట్టి నేను బతికిపోయాను. లేకపోతే నీ పేరు మొక్కల సంబంధంగా లేదని నన్ను పెళ్లే చేసుకునే దానివి కాదేమో సుమా” అంటూ గోవర్ధన్ భార్యను ఆటపట్టిస్తూ వుంటాడు. ఏడు వందల ఏభై గజాల చోటు కొనుక్కున్నారు ఇక్కడ. “ఈ చోట్లో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ పది పడతాయి. విశాలంగా కూడా వుంటాయి. ప్లిన్త్ ఏరియా 1700 చదరపు అడుగుల దాకా వస్తుంది. లేదా 1650 చదరపు అడుగులైనా వస్తుంది. దీన్ని డెవలెప్‌మెంట్‌కివ్వండి. మీకు బాగా లాభమొస్తుంది. మీ వాటాకు నాల్గు ప్లాట్స్ వస్తాయి. సింగిల్‌గా ఒకటో, లేకపోతే రెండు కలపి డూప్లెక్స్ మోడలు కట్టించుకోండి. మిగతా రెండూ అమ్మకుంటే సైటు మీద పెట్టిన దాని కంటే ఎక్కువ లాభమొస్తుంది. మామాట వినండి” అంటూ కొంతమంది సలహా ఇచ్చారు. ఈ విధానం గోవర్ధన్‌కు నచ్చింది. కాని సుమబాల ససేమిరా ఇష్టపడలేదు.
“నాకెప్పటి నుంచో ఒక కోరికున్నది. చుట్టూ తోటను పెంచుకుని తోట మధ్యలో ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడది వీలు పడకపోతే తర్వాత అస్సలు అలా ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులూ, బాధ్యతలు అన్నీ పెరుగుతాయి. ఇప్పడిక్కడ స్థలం రేటు కాస్త తక్కువకే కొన్నాం. ముందు ముందు బాగా పెరిగిపోతాయి. మన ఇష్టాఇష్టాలను చంపుకుని కేవలం డబ్బు లాభం కోసమే బతకలేం గదా” అన్నది.
“కాని సుమా! ఉద్యోగాలు చెయ్యడం కోసం ఇద్దరం బయటి కెళ్లాల్సిన వాళ్లం. ఇంత పెద్ది ఇంట్లో ఇల్లూ, మొక్కలూ చూసుకోవాలంటే టైం సరిపోతుందా. పైగా నీ పి.హెచ్.డీ వర్కొకటి. అదేన్నేళ్లు పడుతుందో తెలియదు. అన్నింటికీ మించి ఇండివీడ్యువల్ హౌస్ ఈ రోజుల్లో అంత సేఫ్టీ కూడా కాదు. ఆలోచించు” అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు.
“మనసుంటే మార్గ ముంటుందండీ. మనకు శాలరీస్ పెరుగుతాయి. డబ్బు ఇబ్బంది వుండకపోవచ్చు. ఇతరత్రా లగ్జరీస్ గురించి ఏమీ ఆలోచించను. నా వ్లల కాకపోతే ఔట్ హవుస్ లాంటిది కట్టించి చిన్న ఫ్యామిలీని పనిలో పెట్టుకుందాం. తోటను మాత్రం పెంచుకోవాలన్న కోర్కెను వదులుకోలేను.”
“కొన్నాళ్లుపోతే నీకే తెలిసి వస్తుంది. ఇంటా బయటా ఇబ్బందుల్ని ఫేస్ చెయ్యాల్సిన దానివి” అంటూ సుమబాల మాట ప్రకారం ఇండివిడ్యువల్ హవుసే కట్టుకున్నారు.
స్నేహలత ఉదయాన్నే వచ్చేటప్పటికి అరవింద్ సేవంతికా, గోవర్ధన్ అందరూ ఇంట్లోనే వున్నారు. వాళ్లిద్దర్నీ కూర్చో బెట్టుకుని గోవర్ధన్ హోమ్ వర్క్ చేయిస్తున్నాడు. సుమబాల వంట ఇంట్లో వున్నది. స్నేహలతను చూడగానే గోవర్ధన్‌తో పాటు పిల్లలిద్దరూ లేచి నిలబడి ‘నమస్తే ఆంటీ’ అన్నారు. గోవర్ధన్‌కు విష్ చేసి పిల్లలిద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుని “బాగా చదువుతున్నారా. మీకు ఓరియో, డార్క్ ఫాంటసీ బిస్కెట్స్, బ్రిటానియా కేక్ ఈ మూడూ ఇష్టమట కదా. వీటిని మీ ఇద్దరూ తీసుకోండి. చాకోలెట్స్ ఇద్దరూ ఇష్టపడకపోవటం మంచిదే. కాని బిస్కెట్స్ కూడా కొంచెమే తినండి. ఫ్రూట్స్ ఎక్కువ తినండి. ఆ బాగ్‌లో ఫ్రూట్స్ వున్నాయి. మీక్కావలసినవి తీసుకోండి” అంటూ వాళ్లిద్దర్నీ చెరో పక్కన కూర్చో పెట్టుకున్నది.
ఈలోగా సుమబాల లోపల్నిండి హడావిడిగా వచ్చింది. “చెప్పినట్లుగానే బాగా ఎర్లీగా వచ్చేశావు. నీకు ట్రబులిచ్చానా” అన్నది.
“ఛ… ఛ… అదేం లేదు. నువ్వు చెప్పిన విషయం నాకు ఇంటరెస్ట్ వున్నదేగా. మీ ఇంట్లో మొక్కలు బాగా పెరిగాయి. నువ్వు చెప్పిన దాని కంటే ఎక్కువగా వత్తుగా కనుపిస్తున్నాయి. బావుంది గోవర్దన్‌గారు, చుట్టూ తోట, తోట మధ్యలో ఇల్లు. బాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. సుమబాలా మీ ఇంటికొచ్చినట్టుగా లేదు. ఏదో పెద్ద గార్డెన్ కొచ్చినట్లుగా వున్నది” అంటూ కిటికీ నుంచి బయటకు పరిశీలనగా చూసింది. అటు వైపున ఏపుగా పెరిగిన అరటి సపోటా లాంటివి కనుపిస్తున్నాయి.
“ఈ తోట పెంపకమంతా మీ ఫ్రెండ్ ప్లానే నండి. పిల్లలకూ, తనకూ, నాకూ అందరం చేసినా టైమ్ సరిపోవటం లేదు. ఏదో ఒక మూల పని మిగిలిపోతూనే వున్నది” అన్నాడు గోవర్ధన్.
టిఫిన్ కార్యక్రమం పూర్తయింది. పిల్లలూ గోవర్ధన్ లంచ్ బాక్సులు తీసుకుని వెళ్లిపోయ్యారు. ఉదయం పది గంటలకల్లా స్నేహలతా, సుమబాలలు గుడి దగ్గరకు చేరుకున్నారు. సుమబాల ముందే చెప్పటం వలన సత్సంగ సభ్యులందరూ అప్పటికే చేరుకున్నారు. వారితో గుడి దాతలూ వున్నారు. కొత్తగా రూపు రేఖలు దిద్దుకునే ఏరియా. కాని చాలా కుటుంబాలు నివాస మేర్పరుచుకున్నాయి, కుటుంబాలలో పెద్దల్తో పాటు చిన్న పిల్లలూ వున్నారు. ఎలాగు గుడి కట్టిస్తున్నారు. గుడి ఆవరణలోనే జ్ఞాన సరస్వతి ఉపాలాయాన్ని కూడా ప్రతిష్ఠించితే ఉపయోగంగా వుంటుందన్న సూచనను ఒక స్వామీజీ ఇచ్చారుట. ఆ సలహా బాగా నచ్చింది. పిల్లకు అక్షరాభ్యాసాలు చేసుకోవటానికి వీలుగా ముందుగా జ్ఞానసరస్వతి ఆలయాన్ని పూర్తి చేశారు. భవిష్యత్‌లో మరి కొందరు దేవుళ్ల ప్రతిష్ఠా చేయాలన్న ఆలోచన వున్నది. గర్భగుడిలో సరస్వతీ దేవి వీణాపాణియై కొలువు దీరి వున్నది. గర్భగుడి ముందు విశాలంగానే పెద్ద హాలున్నది. ఆ హాల్లోనే ఇప్పుడు ప్రతి పూర్ణమకూ, పర్వదినాల్లోను ఇంకా అవకాశమున్నప్పుడల్లా గీతా పారాయణ జరుగుతున్నది. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌గారు భగవద్గీతతో పాటు మంచి మంచి విషయాలనూ విడమర్చి చెప్తున్నారు. ఆరోజు కూడా గుడిదాతలతో సహా సత్సంగ సభ్యులందరూ వచ్చారు.
సుమబాల తన స్నేహితురాలను వాళ్లందరికీ పరిచయం చేసింది. “ఈమె నా స్నేహితురాలు. పేరు స్నేహలత. నేను తనూ ఆంధ్రాయూని వర్శిటీ విశాఖపట్నంలో యమ్మెస్సీ చదివాం. ఆ తర్వాత తను IFS పూర్తి చేసింది. చదువుకునే రోజుల్నుండీ మా ఇద్దరికీ మొక్కలంటే ప్రాణం. కొత్త కొత్త మొక్కల్ని కనిపెట్టాలనీ ఔషధ విలువలున్న వాటిని తెచ్చి వనరక్షణ చేయ్యాలనీ, తర్వాత ప్రజలకు మేలు చేయాలనీ ఆలోచించే వాళ్లం. నేను బోటనీ లెక్చరర్ నయితే తను పట్టుదలగా IFSకు ఉత్తీర్ణురాలయ్యి సెలక్టయింది. ట్రైయినిగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు మన జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్‌గా పని చేస్తున్నది. ఎంతో పెద్ద ఉద్యోగంలో వున్నప్పటికీ మనతో కాసేపు గడపాలని వచ్చింది. మీ అందరితో ముఖ్యంగా ఈ గుడి దాతలతో మాట్లాడాలనుకుంటున్నది” అంటూ స్నేహలత పరిచయం పూర్తిచేసింది.
“ఇక్కడి కొచ్చి ఇలా మీ అందరి మధ్యా గడపటం చాలా సంతోషంగా వున్నది. ఎందుకంటే రోజూ ఉద్యోగాల ధ్యాసలో వుంటూ మధ్య మధ్యలో ఇలా సత్కాలక్షేపాల జరిగే చోటుకు వస్తుంటే మా మనస్సుల క్కూడా హాయి ప్రశాంతంగా వుంటుంది. ఇక్కడి కొచ్చే ముందు సుమబాల కుటుంబ మొక్కటే నాక పరిచయం. ఆత్మీయమైనది కూడా. కాని ఇక్కడకొచ్చాక ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత ఈ చోటంతా పవిత్రమైనదిగా, నాకు మీరుంతా నా బంధువుల్లాగా అనిపిస్తున్నారు. బంధువులు కనిపిస్తే ఎవరికైనా సంతోషమే కలుగుతుంది కదా. అవునా?” అని ప్రశ్నించింది స్నేహలత అక్కడ కూర్చున్నవారిని.
వారంతా అవునట్లుగా చిన్నగా నవ్వారు.
“మరిప్పుడు నాకు అలాంటి సంతోషమే కలుగుతున్నది. ఈ జ్ఞానసరస్వతీ దేవి పట్ల ఎంతో భక్తి కలుగుతున్నది. ఆ సరస్వతీ దేవి మీ పిల్లలందరకూ ఎంతో చదువునూ, మీ కందరికీ ఎంతో జ్ఞానాన్నీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడి పిల్లలందరకు బాగా చదువు రావాలన్న ఆలోచనతోనూ అలా చదివే ముందు మంచి ప్రారంభం జరగాలన్న మంచి ఉద్దేశంతో దాతలు ముందుగా ఇక్కడ జ్ఞానసరస్వతిని ప్రతిష్ఠింపజేశారు. వారి దూరదృష్టిని, మంచి ఆశయాన్ని మనందరం మనసారా అభినందించాలి. ఇంకా కొన్ని రోజులుపోయిన మరి కొందరు మూలవిరాట్టులనూ మంచి ఆలయాలనూ అమర్చుతామని చెప్తున్నారు. ఇదంతా ఏర్పాటు చేస్తున్న దాతల దాతృత్వన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే.
పోతే మీరంతా చేరి ఇక్కడ ఏమేం చేస్తూవున్నారు ప్రస్తుతం?” అంటూ అడిగింది.
“ముఖ్యంగా గీతా పారాయణం చేస్తున్నాం. అప్పుడప్పుడూ ఏమైనా పెద్దవాళ్ల బోధనల గురించీ చెప్తాను.”
“వెరీ గుడ్. ఈ మేడమ్ గారు చేసే పని చాలా బావుంది. భగవద్గీతా పారాయణం చాలా మంచి విషయం. గాంధీజీలాంటి మహావ్యక్తి తనకే సమస్య వచ్చినా గీతను పఠించి ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటానని చెప్పేవారు. మనకున్న ఒత్తిడులను అధిగమించి మనసును ప్రశాంతంగా వుంచుకోవటం కోసం ఈ గీత ఎంతగానో వుపయోగపడుతుందని మా నాన్నగారు తరుచూ అంటుంటారు. కేవలం ఇంటి పనులతోనే కాలక్షేపం చెయ్యకుండా ఇటువంటి సత్కాలక్షేపం చేస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి.
మా తాతగారు ఫారెస్టు రేంజరు. వాళ్ల దగ్గర చిన్న తనంలో గడపటం వలన నాకు అడవితో మొక్కలతో, చెట్లతో పరిచయం కలిగింది. ఆ పరియమే ఇష్టంగా మారింది. ఆ ఇష్టాన్ని ఒక ఆశంయింగా మార్చుకున్నాను. ఆదేంటంటే ఎక్కువగా మొక్కల్నీ చెట్లనీ పెంచాలనీ వాటిని సంరక్షించాలనీ. ప్రొద్దున వస్తూ చూశాను. మీ అందరి ఇళ్లలో కూరగాయల మొక్కలూ, పూల మొక్కలూ ఏవో ఒకటి ఎక్కువగానే కనపడ్డాయి. మరి ఈ గుడిలో మాత్రం పెంచరా?”
“ప్రహారీ గోడలు గుడి కట్టటం పూర్తయ్యాక పెంచుతాం. రకరకాల పూల మొక్కల్ని వేస్తాం” అంటూ చెప్పారు.
“వెరీ గుడ్. మీరందరూ చెప్పమంటే ఈ మొక్కల్ని గురించి అంటే ఎలాంటి మొక్కల్ని పెంచాలో ఒక ఐదు నిముషాలు మాట్లాడుతాను. ముఖ్యంగా దేవాలయ దాతల అనుమతి కూడా కావాలి” అన్నది.
“చెప్పండి తప్పకుండా వింటాం” అన్నారు.
“చాలా సంతోషం తప్పకుండా చెప్తాను” అంటూ మొదలు పెట్టింది.
“చెట్లకూ, భగవంతునికీ అవినాభావ సంబంధం మున్నదని పెద్దలు చెప్తారు. ఏ దేవుడి పటం కానీ, విగ్రహం కాని పువ్వు లేకుండా అంటే పువ్వులతో అలంకరించకుండా మనక్కనిపిస్తుందా్?”
“లేదు పువ్వులతోనే పూజ చేస్తాం.”
“అలాగే పూవ్వులు, ఆకులూ లేకుండా ఏ శుభకార్యమూ జరగదు కదా. అసలు చెట్లే ఒక దేవత అనీ ఆమెను వనలక్ష్మీ అనీ పిలుస్తారు. కాబట్టి చెట్టూ ఆకులూ, పువ్వులూ అన్నీ భగవంతుని ప్రతిరూపాలే. ఇక్కడ మీరు ఎలాగు జ్ఞానసరస్వతిని ప్రతిష్ఠించుకున్నారు. శ్రీ మహా సరస్వతీ వ్రతాన్ని గురించి స్కందపురాణంలో చప్పబడింది.”
“ఇక్కడ పూజారి గారు వుండే వుంటారుగా?”
“వున్నారు. రోజూ వారే పూజ చేస్తారు.”
“వారిప్పుడు ఇక్కడుంటే నన్ను క్షమించాలి. వారి కన్ని విషయాలూ తెలిసే వుంటాయి. వారి ముందు నేను మళ్లీ అన్నీ చెప్పటం అంత బాగుండకపోవచ్చు.”
“ఫర్వాలేదు చెప్పండి.”
“సరస్వతీ వ్రతాన్ని చేసిన రోజులు పూర్వ కాలంలో పోయిన రాజ్యాన్ని పొందారనీ, సంతానాన్ని పొందారనీ సరస్వతీ వ్రతాన్ని చేసే విధానం మునులు ప్రజలకు తెలియజేశాలనీ చెప్తారు. కవి పండితుల నాల్కల మీద వుండేది సరస్వతీ దేవేగా. ఆమె బ్రహ్మదేవుని సృష్టి. పవిత్రమైన నవరాత్రులు సరస్వతీ పూజ ప్రముఖంగా చేయిటం మీకందరకూ తెలుసు. పోతే సరస్వతీ పూజకూ, వ్రతానికీ కావలసిన పూలను నాకు గుర్తున్నంత వరకూ చెప్తాను. నందివర్ధనం, మల్లె, గన్నేరు, పొగడ, పొన్న, మొగలి, జాజి, మందార, నల్లకలువలు. ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కో పువ్వు నంచుతారు. నల్ల కలువల్ని మా సుమబాల తనింట్లో నీటి తోట్టెల్లో పెంచుతున్నది. మీరూ మొక్కలన్నీ పెంచుకోండి. ఆయా పూలను పూంయించి ఆపులతోనూ దేవిని అర్చించుకోండి.”
‘సరస్వతీ దేవి పూజ కిన్ని పూలు అవసరమా. ఈ మేడమ్ చెప్పే విధానం కొత్తగా వుందే?’ అన్న అభిప్రాయం వాళ్ల ముఖాల్లో కనపడింది.
స్నేహలత మరలా మాటలు కొనసాగించింది.
“మరొక పెద్ద ప్రధాన ఆలయమో లేక ఉపాలాయమో పూర్తయిన తర్వాత మిగతా రకాల పూల మొక్కలు సేకరించుకుని పెంచుకోండి. పోతే మరొక్క ప్రధానమైన విషయం చెప్తాను. దేవాలయాలున్న చోట వనాలు పెంచటం పరిపాటయ్యింది. సాధ్యం కాని చోట్ల వదిలేస్తారు. కాని మీకు అన్ని వసతులూ వున్నాయి. చక్కగా పెంచండి. వెనకటి రోజుల్లో మహాపురుషులున్న ప్రదాశాలు ఏదో ఒక వనమేనని చెప్తారు. అదెలాగంటే సీతాదేవి అశోకవనంలోనే వున్నది. భాగవతంలోనూ కృష్ణుడ్ని ఎక్కువగా బృందావనంలోనే వున్నట్లుగా చిత్రీకరించారు. భారతంలోనూ ఎన్నో వనాల ప్రస్తావన వస్తుందిగా. అసలు శ్రమహావిష్ణువే వటపత్రశాయి అంటూ పాలసముద్రంలో మఱ్ఱి ఆకు మీదే మహావిష్ణువున్నట్లుగా చదువుకున్నాం. ఇప్పటి విషయాని కొస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు ఎన్ని వనాలను పెంచుతున్నారో మీకు తెలియందిగాదు. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ అక్కడకు వెళ్లి వొచ్చినవాళ్లేగదా. తిరుపతిలోని నారాయణ వనానికున్న ప్రసిద్ధి మీకందరికూ తెలుసు.”
ఈ స్నేహలత ఎక్కడి నుంచెక్కడికి తీసుకుపోతున్నది విషయాన్ని. చెట్లకూ, భగవంతునికీ బాగా లంకె పెట్టి వినేవాళ్ల మనసుల్ని ఆకట్టుకునేటట్లు చేస్తుంది. వాళ్ల నాన్నగారి నుంచి ఈ భోదనా పటిమ తన కబ్బినట్లుంది అనుకున్నది సుమబాల.
“మనలో రెండు చెట్లునాటి పెండ్లి చేస్తూ వుంటారు. అవేంటో చెప్పగలరా?” అంటూ ప్రశ్నించింది స్నేహలత.
“వేప చెట్టు,రావి చెట్టు” అని కొందరు చెప్పేశారు.
“అవును… రావి చెట్టు స్త్రీతత్వానికి ప్రతీక. వేప చెట్టు పురుషతత్వానికి గుర్తు. ఈ రెండు చెట్లకూ పెండ్లి చేసి వాటి నీడన నాగబంధాన్ని కూడా ప్రతిష్ఠిస్తూ వుంటారు.ఇంకా ఉళ్లలో రచ్చబండను నిలబెట్టి ఆ బండచుట్టూ చెట్లను నాటించటం ఈ నాటికీ మనం చూస్తున్నాం. మరి రావి చెటు కిందే గౌతమడు బుద్ధుడయ్యాడు. ఇంకా ఎంతో మంది దేవతలకు ఎన్నో పూలతో చెట్లతో సంబంధమున్నది. ఒకప్పటి సంగతి కాకున్న ఇప్పుడు మన కాలంలో తిరుపతిలో ఉద్యానవనాలు, ఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్, ఊటీ, కలకత్తాలలో వృక్ష శాస్త్ర సంబంధమున్న తోటలు, ఇంకా కాశ్మీరులోని పూలతోటలు ఇలా ఎన్నింటినో అభివృద్ధి చేస్తూనే వున్నారు. వ్యాపారం కోసం పెంచే పూలతోటలెన్నో వున్నాయిగదా. చాలా ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు. సందర్భం వచ్చింది గదా అని మీతో నాలుగు విషయాలు తెలియాలనీ చెప్తున్నానను. ఇంతకీ అసలు విషయమేంటంటే ఈ దాతలు కూడా ఇక్కడ గుడికి అనుబంధంగా ఒక వనాన్ని పెంచితే అన్ని విదాలా బాగుంటుందనీ నాకు సుమబాలకు కోరిగ్గా వున్నది. అలాగే గుడికి వచ్చే దారిలో రోడ్డు పొడువునా రెండు వైపులా ఎన్నో వృక్షాలను పెంచుకోవచ్చు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణ మొస్తుంది. రేపెలాగూ మీరు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకుంటారు. తొలి పూజలు చేస్తారు. ఆ గణపతికి 21 రకాల పత్రి కావాలని మీకందరకూ తెలుసు. మీ ఆగమ పండితుల నడిగి తెలుసుకోండి. నవగ్రహాలకు సంబంధించిన వనాలూ, రాశులకు సంబంధించిన వనాలు, నక్షత్రాలకు, సంబంధిచిన వనాలూ వుంటాయి, తులసీవనమనీ, నందనవనమనీ సంతానవనమనీ, సప్తర్షివనమనీ ఇలా ఎన్నో రకాలుంటాయి. పండితులు ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ గ్రహం ఏ ఋషికి సంబంధిచినదో చెప్తారు. ఆ ఋషికి సంబంధిచిన వృక్షమేదో కాదో చెప్తారు. వాటిని బట్టి మీరు ఆలోచించుకుని, మీ వీలుని బట్టి వనాన్ని పెంచుకోండి. మీరీ పనిని చేసి చూపిస్తారని నాకు గట్టినమ్మకం. ఎందుకంటే ఇంత భక్తితో గుడిని కట్టించినప్పుడు ఆయా రాశీ భూతమైన, నక్షత్ర సంబంధిత వృక్షల్ని నాటుకుని ఆయా దేవతలకు ప్రతీకరమైన పూలతో పండ్లతో అర్చించకుండా వుంటారా. పూజలకు పూజలు, అందానికి అందమూ లభిస్తుంటాయి. అంతే కాకుండా మూలికా గుణాలున్న చెట్లువుంటాయి కాబట్టి ఆరోగ్యమూ కలుగుతుంది. సరేనా ఇంకా మిమ్మల్ని విసిగించను. మీరంతా చాలా మంచివాళ్లు. ఏ పని చేసినా శ్రద్ధగా నమ్మకంతో చేస్తారని నాకొక అభిప్రాయం ఏర్పడింది” అంటూ ముగించింది.
(ఇంకా ఉంది)