[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 48” వ్యాసంలో నాగులపాడు లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]తా[/dropcap]రకాసురుని వధించి లోకాలను కాపాడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొందరికే ఇలవేలుపైనా, అందరూ కొలిచే స్వామి. నాగుల చవితికీ, నాగుల పంచమికీ, సుబ్రహ్మణ్య షష్టికీ, పుట్టలో పాలు పోసి పిల్లా పాపలను చల్లగా కాపాడమని కోరని మహిళలు అరుదేమో. ముఖ్యంగా వివాహాలు సకాలంలో జరగటానికి, సంతతి కోసం ఈ స్వామిని ఆరాధిస్తారు. అలాగే పొలం పనులు చేసుకునే రైతులు పొలాల్లో తిరిగేటప్పుడు స్వామి పుట్ట కనబడితే మొక్కుతూ వుంటారు. వాటితో సహ జీవనం చేస్తూ వుంటారు కదా మరి. ఎంతో మహిమాన్వితుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొమ్మూరుకి అతి సమీపంలో వున్న నాగులపాడులో వున్నది.
దక్షిణ భారత దేశంలో ప్రసిధ్ధి చెందిన అనేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలలో ఇది కూడా ఒకటి. పచ్చని చెట్లతో అలరారే నాగులపాడులో అత్యంత సుందరమైన ఆలయం ఇది. విశాలమైన ప్రాంగణంలో వున్నది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపు ముందుగా కనుపించిన విఘ్నేశ్వరుని ఉపాలయంలో విఘ్నరాజుని సేవిస్తారు భక్తులు. గర్భాలయంలో ఐదు రజత పడగలతో సుబ్రహ్మణ్యేశ్వరుడు విరాజిల్లుతున్నాడు.
గర్భాలయం బయట వున్న విశాలమైన మందిరంలో స్వామి కళ్యాణం జరుగుతూంటుంది. ఆలయ ప్రాంగణంలో వున్న పెద్ద రావి చెట్టుకి భక్తులు ముడుపులు కడతారు.
ప్రాంగణంలో వున్న పుట్ట చుట్టూ 216 నాగుల విగ్రహాలు ఆలయ పవిత్రతను పెంచుతున్నాయా అన్నట్లున్నాయి. భక్తులు ఈ నాగులకు కూడా పాలు పోసి పూజ చేస్తారు. ఈ పుట్టకి వున్న గోపురం పైన శివుని విగ్రహం వున్నది.
ఆలయ ప్రాంగణంలో ఇంకా కాళి, దుర్గ, గదాధారియైన ఆంజనేయ స్వామి వగైరా దేవతల ఉపాలయాలు వున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం, కొన్ని ఉపాలయాలు తెరిచి వున్నాయి.
సమయంతో పందెం వేసి పరుగెత్తక పోతే ఎక్కువ ఆలయాలు చూడలేము గనుక, అక్కడ ఆలయం గురించి చెప్పేవారు ఎవరూ లేరు కనుక ఇంక అక్కడనుంచి బయల్దేరాము.