[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
క ఆచారశ్య నీలేన చంద్రదేవాయ భార్గవ।
పురా ప్రోక్తశ్య తాన్ మహ్యం కథయస్వ మహామతే॥
[dropcap]ఆ[/dropcap]రు నెలల తరువాత, చైత్రమాసం అయిపోగానే ప్రజలు వరదలా కశ్మీరంలోకి రావటం ప్రారంభమయింది. అన్ని వైపుల నుండి ప్రజలు పర్వతం నుండి పొంగే నదిలా కశ్మీరంలోకి ప్రవహించారు. ‘విరోదయ’ అనే రాజు గుర్రాలు, ఏనుగులు చుట్టూ ఉండగా కశ్మీరంలోకి ప్రవేశించాడు.
ప్రజలు కశ్మీరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో నీలుడి నుండి ప్రజలు కశ్మీరంలో సుఖంగా నివసించేందుకు పాటించవలసిన ధర్మాలను తెలుసుకున్న చంద్రదేవుడు రాజును కలిశాడు. నీలుడు తనకు అందించిన ధనాన్ని రాజుకు అందజేశాడు. జరిగినదంతా చెప్పాదు.
చంద్రదేవుడు చెప్పిన విషయం రాజుకు మహదానందం కలిగించింది. వెంటనే ఈ వార్త ప్రజలలో చాటింపు వేయించాడు.
“చంద్రదేవుడు నీలనాగు మహారాజు చెప్పిన విషయాలను తుచ తప్పకుండా పాటిస్తే ఆరు నెలలకోసారి కశ్మీరును వదిలి వెళ్ళాల్సిన అవసరం రాదు. కశ్మీరులోనే ఎల్లప్పటికీ ఉండవచ్చు. కాబట్టి అందరూ నీలుడు చెప్పిన దాన్ని పాటించాలి.”
అప్పటి నుంచీ కశ్మీరులో ప్రజలు నీలుడు చెప్పినదాన్ని పాటించడం ఆరంభించారు. కశ్మీరులో స్థిరపడ్డారు.
రకరకాల ఇళ్ళు కట్టుకున్నారు. మందిరాలు నిర్మించుకున్నారు. పవిత్ర స్థలాలను గుర్తించారు. నగరాలు, పల్లెలు ఏర్పాటయ్యాయి. తాము సంతోషంగా, ప్రేమగా నిర్మించుకున్న నిర్మాణాలలో ప్రజలు సుఖంగా ఉండసాగారు.
‘నీలమత పురాణం’లోని ఈ శ్లోకాలు చదువుతూంటే ఒక భావన మనసులో మెదలుతుంది.
బహుశా నీలమత పురాణ రచయిత భౌగోళికంగా, వాతావరణపరంగా కశ్మీరులో సంభవిస్తున్న మార్పులను పురాణంలో ప్రతిబింబిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన పురాణాలు ప్రతీకాత్మకంగా తమ చుట్టూ సంభవిస్తున్న పరిణామాలను, అవి మానసికమైనా, భౌతికమైనా, భౌగోళికమైనా, అంతరిక్షంలోనైనా వాటిని పురాణ గాథలలో అత్యంత సృజనాత్మకమైన రీతిలో పొందుపరిచాయి.
మహాభారతంలో బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. తీర్థయాత్రను ఆయన ప్రభాసతీర్థం వద్ద ఆరంభిస్తాడు. ఈ తీర్థం ఇప్పుడు సౌరాష్ట్రలో సోమనాథ్ వద్ద ఉంది. అటునుంచి ఆయన ఎగువవైపుకి ప్రయాణిస్తాదు. సరస్వతి నది ఒడ్డున ఉన్న వేలకొద్దీ పుణ్యతీర్థాలను దర్శిస్తాడు. అన్ని తీర్థాలలోనూ స్నానం చేస్తాడు. అలా సరస్వతీ నదీతీరం వెంట ప్రయాణిస్తూ బలరాముడు ఓ స్థలం చేరుకుంటాడు. అక్కడ సరస్వతీ నది పైకి కనబడదు. కానీ భూమిలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందంటాడు బలరాముడు. పుణ్యాత్ములు మాత్రమే ఈ నిజాన్ని గ్రహించగలరంటాడు.
గమనిస్తే సరస్వతి నది నెమ్మదిగా అదృశ్యమవటాన్ని ఈ గాథ ప్రదర్శిస్తున్న భావన కలుగుతుంది. విష్ణుపురాణం, భాగవత పురాణంలోని బలరాముడి తీర్థయాత్రలకు సంబంధించిన గాథలు చదివితే ఈ భావన బలపడుతుంది.
బలరాముడు సరస్వతీ నదీతీరం వెంబడి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒకరోజు బృందావనం చేరాడు. అతడికి యమునా నదిలో స్నానం చేయాలనిపించింది. యమునను తన దగ్గరకు రమ్మన్నాడు. యమున రాలేదు. దాంతో కోపం వచ్చి నాగలితో యమునను తన దగ్గరకు లాగాడు. అందువల్ల యమునా నది ప్రవాహ మార్గం మారింది. గతి మారింది. అప్పటి నుంచీ యమునా నది బలరాముడి హలం నడిపిన మార్గంలోనే నడుస్తోంది.
శాస్త్రవేత్తలు సరస్వతి నది అంతర్ధానం కావటానికి సూచించే ప్రధాన కారణాలలో ఒకతి సరస్వతి నదికి నీటిని అందించే ఉపనదులు తమ ప్రవాహగతిని మార్చుకోవడం.
భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం క్రీ. పూ. 3000 సంవత్సరాల ప్రారంభంలో సరస్వతి, యమున వంటి నదులు కలిసే ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప ఫలితంగా యమునా నది దిశ మారింది. దాని ఫలితంగా సరస్వతి నదికి ఉపనదుల వల్ల అందే నీరు తగ్గి నెమ్మదిగా సరస్వతి నది ఇంకిపోవటం ఆరంభమయింది. బహుశా తను రమ్మంటే రాలేదని ఆగ్రహించిన బలరాముడు యమున ప్రవాహానికి తన హలంతో మార్గం ఏర్పరచిన కాలం ఇదేనేమో! అప్పుడు భూకంపం వచ్చిందేమో! మహాభారత యుద్ధం జరిగిన కాలం లెక్కలకు (భారతీయ శాస్త్రవేత్తల లెక్కలు) భూకంపం సంభవించిందని, యమున ప్రవాహ దిశ మారిందని శాస్త్రవేత్తలు భావిస్తున్న కాలానికీ పెద్ద తేడా లేదు. అంటే పురాణాలలో నమ్మలేని కథలుగా కనిపిస్తున్న గాథల వెనుక తరచి చూస్తే నమ్మే నిజాల నీడలు ఒదిగి ఉన్నాయన్న మాట! పురాణ గాథలన్నీ ఒక రకంగా చూస్తే వైజ్ఞానిక సూత్రాల లాంటివన్నమాట. E=mc2 ఒక సూత్రం. దాంట్లో E, m, c లు దేన్ని సూచిస్తున్నాయో తెలిసిన వారికి ఇదొక అర్థవంతమైన సూత్రం. అది తెలియని వారికి ఇది అర్థవిహీనమైనది. పురాణగాథలు ఇలాంటివే. కథలలో దాగి ఉన్న మార్మికతను, ప్రతీకలను అర్థం చేసుకోగలిగితే అవి సామాన్య మానవులకు భూ, భౌగోళిక, ఖగోళ విజ్ఞానాన్ని, చరిత్రను సులభంగా అందజేస్తున్నాయి. లేకపోతే, ఏవో పుక్కిటి కథలు చెప్తున్నాయి.
అందుకే చంద్రదేవుడు నీలుడు చెప్పిన నియమాలను కశ్మీరు ప్రజలు పాటించడం వల్ల అక్కడ ప్రజలు సుఖంగా ఉండగలిగేరు అని చెప్పిన గాథను అంత తేలికగా కొట్టివేయాలనిపించదు. బహుశా, ఆ సమయానికి కశ్మీరు వాతావరణంలో సున్నితమైన మార్పులు సంభవించి ఉంటాయి. కొన్ని చర్యలు చేపట్టడం వల్ల కశ్మీరును నివాసయోగ్యంగా మలచుకోవచ్చని గ్రహించి ఉంటారు. “చెట్లు నాటండి. పర్యావరణాన్ని కాపాడండి” అని చెప్తే ఎవరూ పట్టించుకోరు. అందరూ వింటారు, వదిలేస్తారు. అదే “చెట్లు నాటండి. దాని వల్ల పుణ్యం వస్తుంది” అంటూ చెట్లు నాటటం వల్ల స్వర్గానికి వెళ్ళిన వాళ్ళ కథలు, చెట్లు నాటి లక్షలు లాభాలు పొందినవాళ్ళ కథలు, చెట్లు నాటి ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్న వాళ్ళ కథలు, చెట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందినవారి కథలూ చెప్పి, దానికి దైవాన్ని జోడిస్తే వద్దన్నా చెట్లు నాటుతారు.
అప్పటికీ ప్రజలు ఇప్పటంతగా మంచి చెప్పినా కాదని వ్యతిరేకించేంత తెలివిమంతులు కారు కాబట్టి, ప్రజలు నీలుడు చెప్పిన వాటిని అనుసరించారు. సుఖంగా ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఉంది.
ఎవరికయినా అనుభవించిన వారికి నొప్పి తెలుస్తుంది. కశ్మీరు ప్రజలు ఆరు నెలలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఆ బాధ వాళ్ళకు తెలుసు. అందుకని ఆ బాధ వదిలించుకునేందుకు చెప్పింది చేశారు. అది సంప్రదాయం అయింది. కొన్ని తరాల తరువాత ఆరు నెలలు వదిలి వెళ్ళే బాధ జ్ఞాపకాలు ఆవిరైపోయాయి. ఇళ్ళల్లో స్థిరంగా ఉండడం తప్ప వదిలి వెళ్ళటం అన్నది ఊహకి కూడా అందని తరాలు వస్తాయి. అప్పుడు ఒకప్పటి పద్ధతులు, నమ్మకాలు అనాగరికంగా, అర్థవిహీనంగా అనిపిస్తాయి. ‘పాత రోత’ అవుతుంది. వాటిని కాదని అంటారు, వదిలేస్తారు. అనుభవిస్తారు. కానీ అప్పటికి ఇంకొన్ని తరాలు వస్తాయి. కాబట్టి తమకన్నా ముందువారి దుశ్చర్యలు వీరికి తెలియవు. అయితే ఎవరికి తెలిసినా తెలియకున్నా జరిగేది జరిగిపోతూంటుంది.
ఇదంతా ముందు జరిగేది. అయితే ప్రజలు కశ్మీరులో నీలుడు చెప్పింది పాటిస్తున్నప్పటి నుంచి మంచు కొద్దిగానే పడుతోందని, ప్రజలు సుఖంగా ఉన్నారని వైశంపాయనుడి ద్వారా విన్న గోవిందుడికి ఒక సందేహం వస్తుంది.
“ఇంతకీ ఎలాంటి కార్యాలు చేయమని నీలుడు చంద్రదేవుడిని ఆదేశించాడు? ఏమిటా పూజలు? ఏమిటా ఆచారాలు?”
ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చేవారం.
(ఇంకా ఉంది)