కొత్త “అహల్య”

1
3

[box type=’note’ fontsize=’16’] “సినెమా అందం చూసి మనం కూడా తృప్తిగా ఫీలవుతాము. తప్పక చూడాల్సిన చిత్రం, చూస్తే గుర్తుందిపోయేలా వుంటుంది ఇది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఅహల్య‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

పోయిన వారం రెవ్యూ వ్రాద్దామని “ఫలక్‌నుమా దాస్” చూశాను. కాని వ్రాయాలనిపించక, మరో చిత్రం “మయూరాక్షి” చూసి వ్రాశాను. నచ్చని సినెమాలు చూడటం నా వొక్కడికే శిక్ష అయితే పర్వాలేదు గాని, దాని గురించి వ్రాసి మీ అందరికీ అదే శిక్షకు గురి చేయడం నా మనసుకు ఒప్పలేదు.

సరే, ఈ వారం కూడా అలాగే జరిగింది. లాభం లేదు కనీసం నా స్వస్థత కోసమైన వో మంచి సినెమా చిన్నదైనా సరే చూడాలని అనుకున్నాను. సౌమిత్ర చటర్జీ నాకు చాలా ఇష్టం. అకిర కురసావాకి తొషిహిరో మిఫునే యెలానో సత్యజిత్ రాయ్ కి సౌమిత్ర అలాగ. ఈ వారం ఆయన కోసం “అహల్య” చూశాను. దర్శకుడూ నాకు ఇష్టమైన వాడే, సుజోయ్ ఘోష్. మీకు “కహాని” గుర్తుండే వుంటుంది.

సరే కథలోకి వెళ్ళే ముందు పాత రామాయణ గాథ వొకటి మళ్ళీ గుర్తు చేసుకుందాం. అహల్య గౌతమ ముని భార్య. ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపం ధరించి అహల్య దరి చేరతాడు. నదీ స్నానం అయిన తర్వాత తిరిగి వచ్చిన గౌతం మహర్షి సంగతి తెలుసుకుని అహల్యను రాయిగా మారమని శపిస్తాడు. తను నిర్దోషినని వేడుకుంటే కోపం తగ్గి రాముని పాద స్పర్శ వల్ల తనకు పూర్వ రూపం వస్తుందని శాప విమోచనం కూడా చెబుతాడు.

ఇక ఈ లఘు చిత్రంలోకి వస్తే ఇన్‌స్పెక్టర్ ఇంద్ర సేన్ (తోతా రాయ్ చౌధరి) వొక ఇంటి తలుపు తడతాడు. అహల్య (రాధికా ఆప్టే) తలుపు తీస్తుంది. సాధు (సౌమిత్ర చట్టర్జి) గారున్నారా అని అడుగుతాడు. వున్నారు, లోపలికి రండి అంటుంది. గౌను వేసుకున్న అహల్య వెనుకే ఆమె పిరుదులనే చూస్తూ లోపలికి వెళ్తాడు ఇంద్ర సేన్. ఆమె వెను తిరిగినప్పుడు చూపులు మార్చేస్తాడు. (ఇది లస్ట్ ను establish చేయడానికి.) హాల్లోకి ప్రవేశించగానే బల్ల మీద వున్న బొమ్మల్లో వొకటి కింద పడుతుంది. “ఈ ఇంట్లో వొక విచిత్రం జరుగుతుంది. యెవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఈ బొమ్మల్లో వొకటి కింద పడుతుంది”, అంటుంది అహల్య. ఫేను గాలి కేమో అంటాడతను. గౌతం సాధు ను పిలుచుకురావడానికి పైకి వెళ్తుంది అహల్య. ఆ బొమ్మలను చూస్తూ వాటిలో వొక బొమ్మ తను గల్లంతైన “అర్జున్” అనే మోడెల్ ని పోలి వుండడం గమనిస్తాడు. అలాగే బల్ల మీద వొక రాయి అమర్చి వుండడం గమనిస్తాడు. వయసు మళ్ళిన సాధు కిందకొచ్చి అదే విచిత్రం గురించి చెప్పబోతే, మీ అమ్మాయి చెప్పింది లెండి అంటాడు. గౌతం నవ్వి, ఆమె నా కూతురు కాదు భార్య; నాలో యేం చూసిందో తెలీదు నన్ను భాగస్వామిగా యెంచుకుంది అంటాడు.

ఇన్‌స్పెక్టర్ అర్జున్ ఫొటో చూపించి ఇతన్ని చూశారా అని అడుగుతాడు. మోడెల్ కదా, వొకసారి సిట్టింగ్ కి వచ్చాడు, యేం యేమైంది అని అడుగుతాడు గౌతం. అతను కనబడుటలేదు, అతను చివరిసారిగా మీ దగ్గరికి వచ్చినట్లు తెలిసింది. ఆ సందర్భంలో మిమ్మల్ని ఇంటెరాగేట్ చేయాలి, పోలిస్ స్టేషన్ కి పదండి అంటాడు. అప్పుడు నెమ్మదిగా నమ్ముతానంటే చెబుతాను అని ఆ రాయి రహస్యం చెబుతాడు. మాయాశక్తులున్న ఆ రాయిని యెవరన్నా ముట్టుకుంటే కోరిన రూపంలోకి మారిపొతారు ముట్టుకున్నవారు అంటాడు. కాకమ్మ కబుర్లు ఆపమంటాడు ఇన్‌స్పెక్టర్. నమ్మకపోతే చేతిలోకి రాయి తీసుకుని చూడండి, నన్ను తలచుకుంటూ. నా రూపం ధరించి పైనున్న అహల్యకి ఈ మొబైల్ ఇచ్చి రండి అంటాడు. అపనమ్మకంగానే ఆ రాయినీ, ఆ మొబైల్ నీ తీసుకుని పైకి వెళ్తాడు ఇన్‌స్పెక్టర్. భర్తగా భావించి అతన్ని తన కౌగిలిలోకి ఆహ్వానిస్తుంది అహల్య; అద్దంలో అతని ప్రతిబింబం గౌతం సాధు లా కనబడుతుంది అతనికి.

కట్ చేస్తే అతను ఇప్పుడు వొక బొమ్మలో బందీ. కాలింగ్ బెల్ మోగడం, యెవరో లోనికొచ్చి సాధు గురించి వాకబు చేయడం, భార్యా భర్తలు అదే కథ చెబుతుండగా వూపిరి ఆడని ఇన్‌స్పెక్టర్ బొమ్మ కింద పడటం తో సినెమా ముగుస్తుంది.

అసలు కథకు విరుధ్ధంగా వున్న ఈ కథలో అహల్య తనను కాముక దృష్టితో చూసిన వారందరినీ మట్టి/రాతి బొమ్మలుగా మార్చివేయడం చూస్తాము. అసలు కథలో అమాయిక మోసపోయి, భర్త శాపానికి గురై, శాపవిమోచనం దాకా రాతి రూపం లో దుఃఖిస్తూ పడివుంటుంది. ఈ ఆధునిక అహల్య మాత్రం అలా కాకుండా కాముకులను తగిన శిక్ష విధిస్తుంది.

దర్శకుడు సుజోయ్ ఘోష్ అయినప్పుడు చెప్పేదేముంది. చాలా చక్కగా తీశాడు ఈ చిత్రాన్ని. సౌమిత్ర నటన యెప్పటిలా గొప్పగా వుంది. రాధికా ఆప్టే నటన కూడా బాగుంది. షాట్స్ ను కుదించడం కోసం యెలా రూపొందించాడంటే మొదటే కాలింగ్ బెల్ వైపు చేతిని సాచిన ఇన్‌స్పెక్టర్ చాతీ మీద “ఇంద్ర సేన్” అన్న పేరు గల బిళ్ళ కనిపిస్తుంది. అలాగే “గౌతం సాధు” అని వ్రాసివున్న బోర్డు తగిలించి వున్న తలుపు తీస్తూ అహల్య కనిపిస్తుంది. ఇలా సూటిదనమూ, క్లుప్తతా సాధిస్తాడు. ఆమెను చూసి అతను మోహించడం, దాన్ని ఆమె గమనించడం కూడా 2,3 షాట్లలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇలా సినెమా అందం చూసి మనం కూడా తృప్తిగా ఫీలవుతాము. కథలో సత్యజిత్ రాయ్ వ్రాసిన శొంకు కథలలో వొకటైన “ఆశ్చోర్జొ పుతుల్ – ప్రొఫెసర్ శొంకో” చాయలు కనిపిస్తాయి. నబరూన్ బోస్ సంగీతం, సెతు చాయాగ్రహణం చాలా బాగున్నాయి. తప్పక చూడాల్సిన చిత్రం, చూస్తే గుర్తుందిపోయేలా వుంటుంది ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here