[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ప్రణిపత్య హృశీకేశం పరాశరగురుం హరిమ్।
కశ్మీరాయాం వసత్యర్థం వదయామ్యాచరణం తవ॥
హృశీకేశుడికి ప్రణామాలు ఆచరించి, కశ్మీరంలో సుఖంగా నివసించేందుకు పాటించవలసిన నియమాలు, చేయవలసిన పూజలను నీలుడు చెప్పడం ఆరంభించాడు.
ఆశ్వయుజ మాసం పౌర్ణమినాదు పిశాచాలను చంపి నికుంభుడు కశ్మీరం వస్తాడు. ఆ రోజు నికుంభుడిని పూజించాలి. ఇళ్ళకు తెల్ల సున్నం వేయాలి. పిల్లలు, పెద్దలు శుభ్రంగా స్నానం చేయాలి. ఆ రోజంతా పురుషులు ఉపవాసం చేయాలి. పిల్లలకు, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఆహారం ఇవ్వాలి. ఇళ్ళకు మంగళతోరణాలు కట్టి పూజించాలి. పళ్ళతో అర్చించాలి. చంద్రోదయంతోటే అగ్ని రగిలించి రుద్రుడు, చంద్రుడు, ఉమ, స్కంద, నాసత్య, నందిలను పూజించాలి. ప్రతి ఒక్కరికి అర్ఘ్యం ఇవ్వాలి. పూలమాలలు సమర్పించాలి. నికుంభుడిని పూజించాలి. నైవేద్యం పెట్టాలి. అశ్వాలు ఉన్నవారు ఆదిత్యపుత్రుడు రేవంతుడిని పూజించాలి. ఆవులున్నవారు ‘సురభి’ని పూజించాలి. గొర్రెలున్నవారు అగ్నిని పూజించాలి. పశువుల కాపర్లు వరుణుడిని పూజించాలి. ఏనుగులు ఉన్నవాళ్ళు గణేశుడిని పూజించాలి.
అగ్నిహోత్రాన్ని అర్చించిన తరువాత ఉత్తమ బ్రాహ్మణులను గౌరవించాలి. ఆ తరువాత తనని తాను పూజించుకోవాలి. తనలోని పరమాత్మను దర్శించాలి. ఆ తరువాత శాఖాహారాన్ని వండుకుని స్నేహితులు, ఆప్తులు, ఆత్మీయులు, సేవకులు, భార్యా పిల్లలతో కలిసి భుజించాలి.
ఆ రాత్రంతా పురుషులు అగ్నిహోత్రం సరసనే గడపాలి. భజనలు, గీతాలు పాడుతూ, సంగీత వాయిద్యాలపై మధురమైన సంగీతాన్ని సృజిస్తూ, శంఖనాదాల నడుమ గడపాలి. అ రోజు రాత్రి మంచి నాటకాలు ఆడాలి. ఉదయం శుభ్రమై, చక్కగా అలంకరించుకుని అగ్నిని ఆరాధించాలి. పవిత్ర వస్తువులను స్పృశించాలి. తన ఆప్తులు, స్నేహితుల సాంగత్యంలో రోజు గడపాలి. నచ్చినంత సేపు ఆడుకోవాలి. ఆరోజు రాత్రి, తరువాత రాత్రి కంటినిండా నిద్రపోవాలి.
మరుసటి రోజు ప్రజలు ఒంటినిండా మట్టి/బురద పూసుకోవాలి. స్నేహితుల ఒంటిపై కూడా బురద పూయాలి.
ఆపై కామోద్దీపన కలిగించే పదాలతో, చర్యలతో, అశ్లీల సంభాషణలతో, ఇష్టమైన యువతులతో ఆడుకోవాలి, లైంగిక చర్యలలో పాల్గొనాలి. ఆరోజు ఉదయం భయంకరమైన పిశాచాలు, నికుంభుడి అనుచరులు మనుషులలో ప్రవేశిస్తారు. సాయంకాలం వారు మనుషుల శరీరాలను వదిలి వెళ్ళిపోతారు. అలా పిశాచాలు వెళ్ళగానే స్నానం చేసి పరిశుద్ధులవ్వాలి మనుషులు. పరిశుద్ధులై కేశవుడిని పూజించాలి, ప్రార్థించాలి. ఎవరయితే ఆనందించరో, అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారో పిశాచాలు వారి శరీరాల్లో ప్రవేశిస్తాయి. శరీరాలకు లేపనం పూసుకుని, అలంకరించుకుని మనుషులు బ్రాహ్మణులను పూజించాలి. స్నేహితులు, సన్నిహితులు, సేవకులు, భార్యా పిల్లలతో కలిసి సంతృప్తిగా భోజనం చేయాలి.
బ్రాహ్మణులు ఆరు నెలల వరకు తమ ఇంట్లో అగ్నిహోత్రం నిరంతరం వెలుగుతూ ఉండేట్టు చూడాలి. ఒక నెలపాటు, కృత్తిక మాసం పౌర్ణమి వచ్చే వరకు రాత్రి ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించి పెట్టాలి. ఆ పౌర్ణమి నాడు పండుగ జరుపుకోవాలి. ఆ పదిహేను రోజులు గడిచి పోయిన తరువాత ‘సుఖ సూక్తిక’ అంటే సుఖ నిద్ర పండుగ జరుపుకోవాలి. ఈ పదిహేనవ రోజున పండుగ ఎలా జరుపుకోవాలో నేను చెప్తాను.
“ఆరోజు అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు తప్ప ఇతరులంతా నిరాహారంగా ఉండాలి. సూర్యాస్తమయం తరువాత లక్ష్మీదేవిని ప్రార్థించాలి, పూజించాలి. మందిరాలలో, దారులలో, నాలుగు రోడ్ల కూడళ్ళలో, స్మశానాలలో, నది ఒడ్డున, కొండలపై, ఇళ్లల్లో, చెట్ల వద్ద, వరుసలలో, దుకాణాలలో దీపాలు వెలిగించాలి. దీపతతులను ఉంచాలి. దుకాణాలన్నీ అందంగా అలంకరించాలి. మట్టితో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగించాలి. అందరూ నూతన వస్త్రాలు ధరించాలి. అందంగా అలంకరించుకోవాలి. స్నేహితులు, హితులు, సేవకులు, భార్య పిల్లలతో కలిసి భుజించి బ్రాహ్మణులకూ భోజనం పెట్టాలి.
తరువాతి రోజు పూజలు చేసి శుభ్రంగా తయారయ్యి, జూదం ఆడాలి. ఆరోజు జూదంలో ఎవరు గెలుస్తారో వారికి సంవత్సరమంతా శుభం జరుగుతుంది. ఆ రోజు రాత్రి శయన మందిరాలను అందంగా ఉత్తేజం కలిగించే రీతిలో అలంకరించాలి. పలు రకాలైన సుగంధద్రవ్యాలతో, అగరుబత్తులతో గదిని అలంకరించాలి. నగలు, ఆభరణాలు ధరించాలి. గది గోడల అంచున అందమైన దీపాల తతులను వెలిగించాలి. ఆ రోజు రాత్రి భార్యతో సుఖసౌఖ్యాలు అనుభవించాలి.
తల్లి తరపు బంధువులను, వివాహం ద్వారా బంధువులు అయిన వారిని గౌరవించి వారికి నూతన వస్త్రాలను సమర్పించాలి. సేవకులను, బ్రాహ్మణులను ఉచితరీతిన సత్కరించాలి. పదకొండవ రోజు రాత్రి ఉపవాసం ఉంటున్న భక్తులు హరినామ సంకీర్తనలతో, నృత్యాలతో హరిని నిద్ర లేపాలి.
ఆషాడమాసంలో కేశవుడి విగ్రహాన్ని తయారు చేయాలి. శేషశయనుడయిన భగవానుడి మూర్తిని శిలతో, మట్టితో, బంగారంతో, చెక్కలతో, తామ్రంతో, పిండితో తయారు చేయాలి. అంత శక్తి లేనివారు ప్రభువు చిత్రం గీయవచ్చు. అతని పాదాలు లక్ష్మీదేవి ఒడిలో ఉన్నట్టు చూపాలి. కేశవుడి అనుగ్రహం ఎలా పొందాలో నేను చెప్తాను విను…”
ఇక్కడినుంచి ఇంకా పూజా విధానాలు, సంబరాలు వంటిది ప్రతి చిన్న అంశాన్ని వదలకుండా చెప్పడం ఉంటుంది.
ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి కొన్ని విషయాలను నుంచి విశ్లేషించవలసి ఉంటుంది.
నీలమత పురాణంలో కనిపిస్తున్న అనేక అంశాలు మనలని ఆశ్చర్య చకితులను చేస్తాయి. మనకు పరిచయం లేని భారతదేశ జీవన విధానాన్ని మనకు పరిచయం చేస్తాయి. పండగలు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు మనకు కొత్త కాదు. ఇటీవలి కాలంలో ‘శుక్రవారం పులుపు తినవద్దు, ఆదివారం ఉప్పు తినవద్దూ’ లాంటి వ్రతాలూ మనం చూస్తున్నాం. కానీ నీలమత పురాణంలో కనిపించే పూజలు వ్రతాలు మనకు తెలిసిన వాటికి భిన్నం. జీవితాన్ని ఆనందంగా అనుభవించటం, అంతే చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వహించటం, అంతకుమించిన నిజాయితీతో భగవంతుడిని ప్రార్థించడం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి నీలమత పురాణం మన గురించి మనకు ఉన్న అనేక అపోహలను పటాపంచలు చేస్తుంది.
పండగలలో సంబరాలు సాధారణం. ఆ సంబరాలలో అందరినీ భాగస్వాములను చేయడం కనిపిస్తుంది. తాను, తన కుటుంబం, తన బంధువర్గానికి మాత్రమే పరిమితం కాని సమాజం కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో స్పష్టంగా సన్నిహితులు, ఆత్మీయులు, స్నేహితులతో పాటు సేవకులు, బ్రాహ్మణులు అని నొక్కి చెప్పటం కనిపిస్తుంది. అంటే సేవకులు అని తక్కువ చేయటం, వారిని నీచంగా చూడటం, దూరంగా పెట్టటం వంటివి ఆ కాలంలో వారికి ఆలోచనలో లేనేలేవు అన్నమాట.
బ్రాహ్మణులు అంటూ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో, సేవకులు అని బ్రాహ్మణుల కన్నా ముందు వారిని చెప్పటం, అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. అంటే నిజానికి మన సమాజం ఇప్పటి విద్యాధికులు, సామాజిక తత్వవేత్తలు, జనోద్ధారకులు పీడిత, పీడక, తాడిత అంటూ సందర్భం ఉన్నా లేకున్నా సమాజంలో మనుషుల నడుమ గోడలు నిర్మిస్తూ విద్వేషాలు పెంచేందుకు నిత్యం శాయశక్తులా కృషి చేసే అపర మేధావులు చెప్తున్నట్టు లేదేమో అన్న భావన కలుగుతుంది. భారతీయ సమాజం నిత్య పరిణామశీలి అయిన డైనమిక్ సమాజం. అది స్టాటిక్ సమాజం కాదు. కదలని సమాజం అయితే ఎప్పుడో కుళ్ళిపోయి పాడైపోయి శిథిలమై భగ్నం అయిపోయి ఉండేది. కానీ ఇంకా సజీవంగా ఉండటమే కాక తనని తాను సంస్కరించుకుంటూ అత్యంత వేగంగా ముందుకు సాగుతూ ఉండడం భారతీయ సమాజంలోని చైతన్యాన్ని స్పష్టం చేస్తుంది. ఒక్కసారి మన ప్రాచీన భారతీయ సమాజాన్ని పాశ్చాత్యులు తగిలించిన న్యూనతా భావనా రంగటద్దాలలోంచి కాక మనదైన దృష్టితో పరిశీలించి విశ్లేషించాల్సిన ఆవశ్యకత గతంలో కన్నా ఇప్పుడు అధికంగా ఉందనిపిస్తుంది. కుటుంబం కోసం వ్యక్తి, సమాజం కోసం కుటుంబం, రాష్ట్రం కోసం సమాజం, దేశం కోసం రాష్ట్రం… ఇలా వ్యక్తి అస్తిత్వం అన్నది లేకుండా ధార్మిక భావనలో మమేకమై సర్వం త్యాగంచేసే విశాల దృక్పథం కల సమాజం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యక్తి కోసం సర్వం త్యాగం చేయటమే ‘గొప్ప’ అన్న స్థాయిలో ఆలోచించే స్థితికి రావటం వెనక కారణాలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గొంతుండి అరిచిన వాడిది నిజం, గుంపు చేర్చుకొని గోల చేసే వాడిది అసలు సత్యం అనుకునే దిశలో సమాజం ప్రయాణిస్తున్న తరుణంలో ఇదంతా ఆవశ్యకం అనిపిస్తుంది.
భవిష్యత్తులో సందర్భాన్ని బట్టి ఈ విషయాలను చర్చిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దృష్టిని మరో అతి ప్రాధాన్యమైన అంశం వైపు సారిద్దాం. పండగ సంబరాలలో ఒకరోజు అశ్లీలం మాట్లాడుతూ, అశ్లీలంగా దూషిస్తూ, కామోద్దీపనలు కలిగిస్తూ, కామాతురులైన మహిళలతో లైంగిక సుఖం తప్పనిసరిగా అనుభవించాలన్న నియమం గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)