[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]
యుగధర్మాలు
13.0 యుగధర్మాల్లో మార్పులు :
[dropcap]యు[/dropcap]గధర్మాల గురించి తెలుసుకునేముందు, కిందటి అధ్యాయంలోని ముఖ్యమైన విషయాలు ఒకసారి చూద్దాం. కిందటి అధ్యాయంలో మనం, దేవతలకు దానవులతో గల వైరంవల్ల వారివురికీ ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవని తెలుసుకున్నాం. అదీగాక దేవతలు శివుడి పట్ల గూడా అపచారాలు కొన్నిసార్లు చేసారు. ఈ విషయం మనకు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అవి:
- దక్షుడు నిరీశ్వరయాగం చేస్తుంటే దేవతలు, ఋషులు పాలుపంచుకోడం.
- శివపార్వతుల కళ్యాణం కోసం దేవతలు తొందరపడడం.
- ఆ కళ్యాణమయ్యాక శివపుత్రుని కోసం తొందరపడడం.
ఇలాటి వాటివల్ల లోకాలకు ఉపద్రవాలే ఎక్కువ వాటిల్లాయి. దీనివల్ల తెలుస్తున్నది ఏమంటే దేవతల్లోగూడా మానవుల్లో ఉన్నట్టే 25 తత్వాలున్నాయని, వారు గూడా త్రిగుణాలకి, అరిషడ్వర్గాలకి అతీతులుకారని. ఈ అధ్యాయంలో మనం యుగధర్మాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా యుగధర్మాల్లో మార్పులు ఎలా వస్తాయన్నది తెలుసుకుందాం. కాలం మారింది అని అంటూంటాం మనం. కాలంలో మార్పులు సహజంగా ఋతువులని బట్టి వస్తాయి. కానీ మనుషుల ప్రవర్తనలో మార్పులెలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. కానీ వాటిని గురించి గూడా మన శాస్త్రాల్లో చెప్పారు. అవే యుగధర్మాల్లో మార్పులు. ఈక్రమంలో మనవారు కాలాన్ని 4 యుగాలుగా విభజించి చూపారు. ఆయా యుగాల్లో ప్రజల ప్రవర్తనల్లో వచ్చే మార్పులనే కాలానికి ఆపాదించి చూపి, కాలం మారిందని అంటున్నారు. అంటే ఈ 4 యుగాల్లో కూడా ప్రజల ప్రవర్తన ఒకే లాగుండదు, మార్పులకు గురౌతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.
13.1 యుగధర్మాలు – పురుషార్థాలు :
ధర్మం అనే పదం ‘ధృ’ అనే ధాతువునుండి పుట్టింది. ‘ధృ’ అంటే ధరించడమని అర్థం. ‘ధర్’ అంటే అంటిపెట్టుకుని ఉండటం. ఏది నిత్యం మనతోనే ఉండి, మనం ఆచరించేట్టు చేసి, మన ఉన్నతికి తోడ్పడుతుందో అదే ధర్మం. అదే ధర్మాచరణం. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. ధర్మానికి ఎవరు హాని తలపెడతారో వారిని ధర్మం రక్షించదు. మన ధర్మశాస్త్రాలు చెప్పేదిదే. ధర్మానికి 4 పాదాలు : సత్యం, దయ, తపస్సు, దానం. కాలం 4 యుగాలుగా విభజించబడింది : కృత, త్రేతా, ద్వాపర, కలి. మనకు 4 పురుషార్థాలు గూడా ఉన్నాయి : ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ప్రతివాడి లక్ష్యం ఈ పురుషార్థాలు నాలుగింటినీ సంపాదించుకోవడమే. ఈ 4 యుగాల్లోని ధర్మాలూ ఒక్కలా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఐతే ఈ పురుషార్థాలు నాలుగింటినీ యుగధర్మాల ప్రకారం ఎలా సంపాదించుకుంటున్నారో తెలుసుకుందాం. కృతయుగంలోఅందరూ ధర్మకాంక్ష కలవారు. ధర్మం 4 పాదాలమీద నడిచేది. త్రేతాయుగంలో ఎక్కువమంది ధర్మార్థ తత్పరులు. ధర్మం 3 పాదాలమీద నడిచేది. ద్వాపరంలో ఎక్కువమంది ధర్మార్థకామానురక్తులు. ధర్మం 2 పాదాలమీద నడిచేది. కలిలో ఎక్కువమంది అర్థకామ రసికులే. ధర్మం 1 పాదం మీదే నడుస్తుంది. వీటి గురించి విపులంగా తెలుసుకుందాం.
13.2 కృతయుగలక్షణాలు :
భూమ్మీద మానవ సృష్టి జరిగాక యుగధర్మాలెలా ఉండేవో తెలుసుకుందాం. మొట్టమొదటి యుగమైన కృతయుగంలో ఏ మనిషికీ, ఏ ప్రాణికీ దేని అవసరం ఉండేది కాదు. ఆ యుగంలో అంతా సిద్దంగా చేయబడి ఉండటాన ఎవరూ ఏమీ చేసేవారు కాదు. తలచినంతనే సర్వం సిద్ధమయ్యేది. చేయదగిందేమీ లేదు కాబట్టి అది కృతయుగంగా పేరు గాంచింది. ప్రాణులకు కోరికలు లేవు, దుఃఖం లేదు, అంతా ఆనందమే.
సమస్త ప్రాణికోటి సృష్టించబడ్డాక, ప్రజలంతా, దేవతలతో సహా, ఈ భూమంతా వ్యాపించిపోయున్నారు. ఆ మొదటి కృతయుగంలో మానవులకు శోకం, వ్యాధి, ముసలితనమన్నవి లేవు. అంతా దేవతల్లా ఉండేవారు. సదా యవ్వనంలో ఉండి దేవతలతోసహా క్రీడించేవారు. ఆకాశగమనం చేసేవారు. స్వర్గాధిలోకాలకు వెళ్ళగలిగేవారు. వృక్షాలన్నీ కూడా కల్పవృక్షాల్లాంటివే. అవన్నీ విమానాకృతుల్లాగ ఉండి నివాసయోగ్యంగా ఉండేవి. స్త్రీలతో సహా ఆ వృక్షాల్లో వాసాలేర్పరుచుకొని విహరించేవారు. ఆకలి దప్పికలు, దారిద్ర్యం లేక ప్రతివారు 10 వేల సంవత్సరాలు జీవించేవారు. సూర్యుడు అధిక వేడి కలిగించేవాడు కాదు. వాయువు అధికంగా వీచడం లేదు. మంచు లేదు. రాత్రులు పూర్ణచంద్రుని వెన్నెలలా ఉండేది. ఒకటే వర్ణం, ఒకటే వేదం. వేదవిభాగాలు లేవు. ఒకటే రుతువు – వసంతం. అందరూ రూప, యవన, విద్య, సుఖం, ఐశ్వర్యం కలిగి ఉండేవారు. అందరూ హెచ్చుతగ్గులు లేక సమంగా ఉండేవారు. నగరం, గ్రామం, పట్నం, పల్లెలన్న భేదాలు లేవు. దోమలు, చీమలు లేనేలేవు. క్రూరమృగాల భయం లేదు. గ్రహదోషాలు లేవు. కల్పవృక్షాల వల్ల కావలసిన భోగాలు లభించేవి. అంతా శుభమే, ఆనందమే. కారణం అధర్మం లేకపోవడమే! – అందరూ ధర్మపరులే. ఇంద్రునితో సమానమైన ఓజస్సు కలిగినవారే. అంతా బలస్తులే. ప్రత్యక్షంగా దేవతలను, దేవర్షులను, ధర్మాన్ని చూసేవారు. ప్రత్యక్ష యజ్ఞఫలం కలవారు. శరీర సౌందర్యం కలిగి ఉదార బుద్ధి, దాన గుణం, ఇంద్రియ నిగ్రహం కలిగినవారు. ఉపవాసం, బ్రహ్మచర్యం మొదలైన వ్రత నియమాలు కలవారు. భయ, రాగ, ద్వేష, మోహ, లోభ, క్రోధ, శోక, మాన, నిద్రా, తంద్రా, శ్రమ, ఆలస్యాది దుర్గుణాలు లేకుండా ఉండేవారు. ఎల్లప్పుడు సత్వగుణ ప్రధానంగా కర్మలు ఆచరించడం వల్ల మంచి సస్యాలు ఉద్భవించేవి. మానవులు సకల సద్గుణాలు కలిగి ఉండటం వల్ల పంచభూతాలు కూడా సత్ఫలితాలు ఇచ్చేవి. అన్ని జీవుల ఎడల సుహృద్భావం కలిగి ఉండేవారు. అన్ని జీవుల మేలుకోరినవారై ప్రాణులను హింసించకుండా ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్నట్లుండేవారు.
13.3 ధర్మగుణం లోపించడం వల్ల కలిగిన అనర్థాలు :
కృతయుగాంతాన కొంతమందిలో లోభం చోటు చేసుకుంది. దానివల్ల కొంతమందిలో ధనం, వస్తువులు మొదలైనవి అధికంగా గ్రహించడం, దాచుకోవడం జరిగింది. అందువల్ల కొందరి వద్ద సంపద ఎక్కువగా ఉండటం, కొందరి వద్ద సంపద తక్కువగా ఉండటంగాని, లేకపోవడం గాని మొదలైనవి ఉండేవి. వీటివల్ల సంపన్నులలో శ్రమ, బద్దకం, లోభం మొదలగు గుణాలు సంక్రమించాయి. బ్రహ్మచర్యం, ఆయుష్యం మొదలైన వాటికి అనర్థాలు సంభవించాయి.
13.4 త్రేతాయుగ లక్షణాలు :
ప్రతీ యుగంలోనూ ధర్మపాదం నశిస్తే గుణపాదం కూడా నశిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే త్రేతాయుగంలో ధర్మంలో ఒకపాదం కుంటిదైంది. దానివల్ల త్రేతాయుగం నుండి రోగాలు ఉద్భవించాయి. రోగాల వల్ల తపస్సు, ఉపవాసం, వ్రతాలు, అధ్యయనం లోపించాయి. త్రేతాయుగంలో లోభగుణం బాగా పుంజుకుంది. దానివల్ల ద్రోహం, అసత్యం, కామ, క్రోధ, భయ, తాప మొదలగు మానసికోద్వేగాలు ప్రారంభమయ్యాయి. ధర్మం మూడువంతులే ఉండి, నాలుగో వంతు మాయం కావడం వల్ల, పంచభూతాల్లో కూడా ఒక వంతు స్వచ్ఛత లోపించింది. దాంతో సస్యాల్లో నిర్మలత్వం, రసం, వీర్యం మొదలగువాటి ప్రభావం ఒక వంతు ధ్వంసమైంది. ఆహారం దోషభూయిష్టమవడంవల్ల ప్రజల్లో సుగుణాలు నశించాయి. వాత, పిత్తాదుల్లో సమతుల్యం తగ్గి దోషాలు కలగడం మొదలై, రోగాలు చోటు చేసుకున్నాయి. దానివల్ల మనుషుల్లో ఆయుషు తగ్గిపోసాగింది. ఐతే యజ్ఞయాగాదు లెక్కువగా ఆచరిస్తూ ఉండేవారు. రామాయణంలో మనకు త్రేతాయుగ లక్షణాలు బాగా కనబడతాయి.
13.5 ద్వాపరయుగ లక్షణాలు :
ద్వాపరంలో ధర్మం రెండుపాదాల మీదే నడుస్తుందని తెలుసుకున్నాం. అందువల్లనే ద్వాపరయుగ లక్షణాలన్నీ మనకు మహాభారతంలో కనిపిస్తాయి. అందులో చాలామంది రాజుల చరిత్రలను చూస్తాం. వారంతా రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసినవారే. అంటే ఈ యుగంలో ప్రజలు, ప్రభువులు యుద్ద కాంక్షకలవారై ఉండేవారు. వారేమీ సంపాదించిన రాజ్యాలను మూటకట్టుకు పోలేదు స్వర్గనరకాలకు. వారు పోయాక మనకు తెలుస్తుంది పుణ్యపాపాలు తప్ప మనవెంట ఇంకేమీ రావని. కౌరవులవల్ల పాండవులు ఎన్ని బాధలనుభవించారో మనకు తెలుసు. చివరికి అంతా కర్మగతి అని అనుకోకా తప్పదు. చేసుకున్నంతవాడికి చేసుకున్నంత అన్న వేదాంతధోరిణి చివరికి కనిపిస్తుంది.
13.6 కలియుగ లక్షణాలు :
కలియుగంలో ధర్మం ఒంటి పాదంమీద నడుస్తోందన్నమనందరకు అనుభవమే. ఎందుకంటే మనమిప్పుడు కలియుగం యొక్క మొదటిపాదంలో ఉన్నాం. ఈ కలియుగం గురించి చాలా చెప్పుకోవాలి. కలియగంలో ప్రజలు హీనబుద్ది కలిగి నిరంతరం పాపచింతనలతో గూడి పరదార, ధనాదులను అపహరించాలని కోరుకుంటారు. యమలోక భయం, పాపభీతి, దైవభీతి ఉండవు. ఎందుకిలా జరుగుతోందంటే కలి పుట్టుపూర్వోత్తరాల గురించి కొంచెం తెలుసుకోవాలి మరి. బ్రహ్మకు సృష్టి విషయంలో యుగపురుషులు గూడా సహాయపడుతుంటారు ఆయా యుగాలకు తగినట్లు ధర్మాలని ప్రవర్తిల్ల చేయడానికి. ఈక్రమంలో కలికి గూడా కొన్ని బాధ్యతలున్నాయి. అసలు కలియుగమంటేనే అంతా భయపడుతుంటారు. ఎందుకు? అది తెలుసుకోవాలి. ఈ కలిని గూర్చి చెప్పుకోవాలంటే అది ఓ కలిగీత అవుతుందేమో! ఐనా ‘అమ్మో కలా’ అని అనుకోకుండా అసలు సంగతేంటోనన్నది తెలుసుకుందాం.
13.7 కర్మగతిననుసరించి జీవులజన్మ – యుగాల్లోమార్పులు :
చాలా వింతగా ఉంటుంది కర్మనుగూర్చి విచారిస్తుంటే. ఏ విషయమైనా ఎందుకలా జరుగుతోందంటే ‘కర్మ’ వద్దకే వెళ్ళి ఆగిపోతున్నాయి మనశాస్త్రాలు. అవి కర్మకే పెద్దపీట వేసాయి. కృత,త్రేతా, ద్వాపర యుగాల్లోని సాధుచింతనులు, సత్పురుషులు స్వర్గాన్నాక్రమిస్తారు. దుర్మార్గులు,దుష్టులు నరకానికేగి,కృత,త్రేతా, ద్వాపర యుగాలు గతించాక, కలియుగంలో నరకంనుండి భూమిపై పుడతారు. కృత,త్రేతా, ద్వాపర యుగాల్లోని దుష్టులు కలిలో జన్మించి ఇంకొంచెం పాపంచేసి నరకానికి పోతారు. కలిలో జన్మించే సాధుజనులు స్వర్గానికి పోయి, కృత,త్రేతా, ద్వాపర యుగాల్లో సజ్జనులుగా పుడతారు. యుగాల్లో మార్పులకనుగుణంగా జీవులకు వారు చేసుకున్న కర్మలను బట్టి జన్మలొస్తాయి. కలిలో ఎక్కువమంది పాపచింతన గలవారిగా ఉంటారు. ఆహారశుద్ది లేకపోవడాన చిత్తశుద్ధి లోపిస్తుంది. దానిమూలాన ధర్మబుద్ధి ఉన్నవారుగూడా పాపకార్యాలు చేస్తారు. ఐతే ఈ కలిమలం పోగొట్టుకోడానికి మార్గం లేదా? ఉంది. దైవారాధన తప్ప ఇంకోటి రక్షించలేదు. గాయత్రి మొదలైన జపాలే పాపఫలాన్ని పోగొడతాయి. ఈ కలియుగంలో చాలామంది పాపిష్టివాళ్ళు పుట్టుకొస్తున్నారు. మూడువంతులు చెడ్డవారున్నా, ఒకవంతు మంచివారుంటారుకాట్టి కొందరు బతికిపోతున్నారు, లేకపోతే భూమే నరకలోకంగా తయారైయండేది. అందుకే కలిపురుషుడు పాపులచేత పాపధర్మాన్ని ప్రవర్తిల్ల చేస్తాడు కలియుగంలో. అది ఆయన ఉద్యోగ ధర్మం. ఇంక కలిపురాణం గురించి కొంతతెలుసుకుందాం.
13.8 పురాణాల్లో కలి ప్రస్తావన :
మనకు కలి ప్రస్తావన క్షీరసాగరమథన సమయంలోనే కనిపిస్తుంది. అమృతకలశాన్ని దేవతలనుండి రాక్షసులు లాక్కున్నప్పుడు విష్ణువు కలిని స్మరిస్తాడు. కలి రాక్షసుల మధ్య కలహం పెడతాడు. వారంతా అమృతకలశం కోసం పోట్లాడుకుంటుంటే, విష్ణువు మోహినిగా వచ్చి ఆ కలశం తీసుకుని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు.
13.9 కలి ప్రాభవం- మ్లేచ్చజాతి ఆవిర్భావం :
కలి యొక్క ప్రాభవానికి కారణం తెలుసుకోవాలి. బ్రహ్మదేవుని సృష్టి విషయంలో యుగ పురుషులు గూడా ఆయనకు సహాయం చేయాలి. కర్మగతిననుసరించి జన్మలు వస్తాయన్నప్పుడు, జీవులందరూ మంచికర్మలు చేసి సజ్జనులుగా పుట్టరు. సత్కర్మలు, దుష్కర్మలూ చేస్తూ జన్మలు తీసుకుంటారు. అందుకు వారు వారి కర్మలకు తగిన ఫలితాలు పొందుతారు. ఈ విషయంలో బ్రహ్మదేవునికి యుగపురుషులు సహాయం చేస్తారు. కృత, త్రేతా, ద్వాపరయుగాల్లో ఎక్కడ చూసినా వేదమంత్రాలు, యజ్ఞయాగాలు, తపస్సులు ప్రవర్తిల్లుతున్న కారణంగా కలికి దుఃఖం కలిగింది. ద్వాపరయుగాంతంలో కలిపురుషుడు పశ్చిమసముద్రంలో ఒక ద్వీపంలో ఘోరతపస్సు చేసాడు. ఆయన భగవంతుడికి విన్నవించుకున్నాడిలా ‘ప్రభూ! ఎక్కడచూసినా ధర్మం అగ్ని హెూత్రంలా ప్రజ్వరిల్లుతోంది. ఇంక నా కలిప్రభావం ఎలా విస్తరింపచేయగలను? మీరిచ్చిన వాగ్దానాన్ననుసరించి నా యుగధర్మాలు వ్యాప్తిచేయాలి. కానీ వేదభూమిలో అది సాధ్యం కావడంలేదు’. అప్పుడు భగవంతుడు కలికి పశ్చిమ సముద్రంలో ఒక ద్వీపం చూపించాడు. అందులోనే మ్లేచ్చజాతికి మూలపురుషుడైన ఆదం అనేవాడిని, హవ్యవతి అనే స్త్రీని చూపించాడు. వారు నీలాచలంవద్ద సృష్టించబడ్డారు. వారి విహారార్థం ఒక ఉద్యానవనం సృష్టించాడు. నిజానికి వారివురూ తోబుట్టువులు. కలి సర్పరూపంలో అక్కడ ప్రవేశించి వారిలో అక్రమ కామాన్ని ప్రేరేపించి అక్రమ, అధర్మ సంతానాన్ని కనమని ప్రేరేపించాడు. వారు పతితులు కాగానే వారియందలి దివ్యశక్తులు పోయాయి. ఆ జంట నుంచే కలిధర్మానికి మూలమైన మేచ్చజాతి ఆవిర్భవించింది. ద్వాపరం ఇంకా 2800 సంవత్సరాలకు అంతమౌతుందనగా, మేచ్ఛదేశాల్లో వారి సంతతి అభివృద్ధి చెందసాగింది. వారు పాపఫలిత ఫలాన్ని అనుభవించి, ఆర్యధర్మం దూషించేవారిగా, నానాభక్షకులుగా, అనాచారవంతులుగా ఉండే సంతానాన్ని వృద్ధిచేసారు.
13.10 కలి యొక్క ఉద్ధృతిని అణచివేసిన పరీక్షితుడు :
తమోగుణ స్వభావం గల కలికి వేదఘోషలన్నా యజ్ఞయాగాలన్నా ధర్మకార్యాలన్నా, గోసేవలన్నా అందరూ సంతోషంగా ఉండటమన్నా ద్వేషం. కలహాలు పెట్టడం, క్రూరకార్యాలు ఇష్టం. కలియుగం మొదట్లో, కలికి ఒకరోజు ఒక ఎద్దు, ఒక ఆవు కనిపించాయి. వాటిని కలి కొట్టి, తన్ని, బాగా హింసించి ఆనందిస్తున్నాడు. అంతలో మహారాజైన పరీక్షిత్తు అక్కడకు వచ్చి,ఆ సాధు జంతువులను బాధలకుగురి చేస్తున్నందుకు కలిని చంపబోయాడు. దాంతో కలి ఆయన్ను శరణువేడాడు. శరణు వేడితే అప్పటి రాజులు జాలిపడేవారు. అలాగే పరీక్షిత్తు కలిని చంపకుండా వదిలి పెట్టి, బుద్ధిగానడచుకోమని మందలించాడు. కలి ఆయన్ను వేడుకున్నాడు తాను ఉండడానికి తావు చూపించమని. అప్పుడు పరీక్షిత్తు కలికి కొన్నితావులు చూపాడు : బంగారం, జూదం, మద్యపానం, వ్యభిచారం, ప్రాణిహింస, అసత్యం, మదం, కామం, విరోధం- ఇవన్నీ ఉన్న చోట్లలో కలి ఉంటాడు. కలహకారకుడు కలి.
13.11 కలికి సహాయకులు రాహుకేతువులు :
కలికి సహాయకులుగా రాహుకేతువులు ఎలా నియోగించబడ్డారో తెలుసుకోవాలి. రాహువు తలిదండ్రులు సింహిక, విప్రచిత్తి. సింహిక, కశ్యప ప్రజాపతికి దితి వల్ల పుట్టింది. దనువు/తనువుకు పుట్టినవాడు విప్రచిత్తి. దానవుడైనప్పటికి రాహువుకు గ్రహాధిపత్యం ఇయ్యాల్సి వచ్చింది బ్రహ్మదేవునికి. అదెలాగో తెలుసుకుందాం. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన అమృతాన్ని దక్కించుకోడానికి దేవదానవులిద్దరూ పోటీపడతారు. విష్ణువు మోహినీ అవతారమెత్తి అమృతాన్ని దేవతలకేపంచుతాడు. దానవుల్లోని రాహువు అది గమనించి తన మాయతో కామరూపంధరించి, దేవతా గణాల్లో చేరిపోతాడు. ఆవిషయం సూర్యచంద్రులు గ్రహించి విష్ణువుకు తెలియజేస్తారు. అప్పుడే అమృతం సేవిస్తున్న రాహువును అంతమొందించడానికి విష్ణువు తన సుదర్శనచక్రాన్ని పంపుతాడు. దాని జ్వాలలకు భయపడి రాహువు మహాసర్పంగామారి విషాగ్నిజ్వాలల్ని కురిపిస్తాడు. ఐనా ఆ చక్రం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. తనకు ముప్పు తప్పదన్న సంగతి గ్రహించి తలకిందులుగా దూసుకు పోసాగాడు రాహువు. గ్రహకక్ష్యలు దాటిపోతున్న వాడ్ని ఆ సుదర్శన చక్రం రెండుముక్కలుగా ఖండించింది. అమృతపానంవల్ల ఆ రెండు ముక్కలు జీవించే ఉన్నాయి. తన దుస్థితికి కారకులైన రవిచంద్రులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు రాహువు. రాహువు శిరోభాగం అంతరిక్షంలో సంచరిస్తూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడ్ని ప్రార్థిస్తుంది: తను ఇప్పుడు అమృతపానం చేయడం వల్ల దేవతలతో సమానమని, తనకు న్యాయంచేసి వారితో సమానమైన స్థితిని కల్పించాలని. కామరూపం ధరించిన రాహువుకు యధారూపం ప్రసాదించడానికి బ్రహ్మదేవుడు తిరస్కరిస్తాడు. కానీ కొన్నివరాలిస్తాడు బ్రహ్మ :1. ఏ రూపంలో ఉన్నా అమృతపానం చేయడం వల్ల గ్రహాధిపత్యం కలుగుతుంది. 2. ఆ శరీరంలోని రెండుభాగాలూ ఛాయాగ్రహాలుగా రాహుకేతువులనే పేర్లతో పిలవబడతాయి. 3. వారి సంచారం వక్రగతిలో ఉంటుంది. 4. కలియుగంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిఉంటారు. 5. రాహువు అనన్యసామాన్యమైన మాయాపాటవాన్ని ప్రదర్శించి అందరినీ మాయలో పడేసే ప్రత్యేక ప్రాధాన్యతను కలిగిఉంటాడు.
13.12 కలియుగంలో రాహు కేతువుల ప్రభావం :
కలియుగంలో రాహు కేతువుల ప్రభావం ఎలాగుంటుందో తెలుసుకోవాలంటే, మనం జోతిషశాస్త్రంలోకి వెళ్ళాల్సిందే. మనమీద నవగ్రహాల ప్రభావముంటుందని జోతిషశాస్త్రం చెపుతుంది. ఒకానొకప్పుడు రాజ్యాలు, రాజులు, రాజరికాలు ఉండేవి. వాటికి కారకుడైనవాడు గ్రహరాజైన సూర్యుడు (రవి). ఈ కలియుగంలో రాజ్యాలు, రాజులు, రాజరికాలు అంతరించిపోయి, ప్రజాపాలన వచ్చింది. దీనికి కారకుడు సూర్యపుత్రుడైన శని. వారివురికీ గ్రహపరంగా శత్రుత్వముంది. ఈ కలియుగంలో రాహుకేతువులకు తోడుగా శని గూడా తన ప్రభావం చూపుతున్నాడు. ఎందుకంటే ఆ ముగ్గురికీ మిత్రత్వముంది. మనకు ముహూర్తశాస్త్రముంది. అందులో నిష్ణాతులైన సిద్ధాంతులను, మనం వివాహాది కార్యాలకు ముహూర్తాల కోసం ఆశ్రయిస్తాం. కొందరు సిద్ధాంతులు వివాహాలకి ముహూర్తాలు పెడితే, రాహుకేతువులను ఛాయాగ్రహాలని, వాటిని పరిగణనలోకి తీసుకోరు. అందుకే చాలా వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయని ఇటీవల పరిశోధనలు చేసిన కొందరు సిద్ధాంతులు అంటున్నారు. అందరి జతకాలు ఒకేలాగుండవు. అలాంటప్పుడు ఒకేముహూర్తం అందరికీ ఎలా ప్రయోజనకారిగా ఉంటుందని వారంటున్నారు. వారి పరిశోధనల వల్ల తెలుస్తున్న విషయాలు: ఈ కలియుగంలో రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, రాహుకేతువులు గూడా శుభయోగాలని అశుభయోగాలని – అమృత యోగాన్ని, విషయోగాన్ని గూడా ఇవ్వగలరు. అందుకే రాహుకేతువులను పరిగణనలోకి తీసుకుని ముహూర్తాలు పెడితే ఫలితాలు బాగుంటాయి. ఈ విషయం నిజమైందన్నది ఈ మద్యనే నిరూపించబడింది. మొన్నీమధ్య జరిగిన ఎన్నికల విషయంలో బుల్లితెర మాధ్యమాల ద్వారా జ్యోతిషపరంగా కొన్ని చర్చలను నిర్వహించారు. జ్యోతిషశాస్త్రంలో ఉద్ధండపండితులొకవైపు, ఆధునిక పండితులు ఇంకోవైపు కూర్చుని వాదోపవాదాలు చేసారు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఎవరొస్తారు, మొన్న ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లోనని. పేరుగాంచిన శాస్త్రీయ పండితుడు రాహుకేతువులని పరిగణనలోకి తీసుకోకుండా చెప్పిన జోస్యం తప్పింది. రాహుకేతువులని పరిగణనలోకి తీసుకుని చెప్పిన ఫలితాలు నిజమయ్యాయి. దీని వల్ల తెలుస్తున్నదేమంటే రాహుకేతువుల ప్రాముఖ్యతను గూడా మనం గుర్తించాలని. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. రాహువు శని లాగ, కేతువు కుజుని లాగ ఫలితాల్ని ఇస్తారు. రాహుకేతువులు అమృతయోగాన్ని, విషయోగాన్ని గూడా ఇస్తారు. తమోగుణ రాహువు స్వతంత్రించి రాజయోగాన్ని ఇవ్వగలడు, కాని దానికి శాశ్వతత్వం ఉండదు. సత్వగుణ కేతువు స్వతంత్రించి మోక్షాన్నివ్వగలడు. రాహువు యోగకారకుడైతే పర్వతశిఖరాగ్రానికి తీసుకుపోతాడు. అదే రాహువు దుర్యోగంలో ఉంటే ఆ శిఖరాగ్రం నుండి ఒక్క తోపుతోసి థామ్మని కిందపడేస్తాడు. మనం ఈ మధ్య చాలా చిత్రవిచిత్ర సంఘటనలను చూస్తున్నాం. మహామహా స్వామీజీలు, ఎంతమందితోనో పూజలందుకున్నవారు గూడా, అప్రతిష్ఠ పాలవుతున్నారు రాహుకేతువుల దుర్యోగంవల్లనే. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి.
13.13 సాధు,సిద్ధపురుషుల స్థితికి ప్రధాన కారకులు రాహుకేతువులు :
రాహువు మంత్రకారకుడైతే, కేతువు మంత్రసిద్ధి కారకుడు. సన్యాసయోగాలు రాహు కేతువుల నియంత్రణలో ఉంటాయి. వారే సాధు, సిద్ధపురుషుల స్థితికి ప్రధాన కారకులు. రాహుకేతువులు నిజమైన సన్యాసయోగాలని, కపటసన్యాసయోగాలని గూడా ఇవ్వగలరు. నిజమైన సన్యాసయోగానికి ఉదాహరణగా కంచిమహాస్వామి జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరసరస్వతివారిని చెప్పుకోవచ్చు. ఆయన జాతకంలో రాహుకేతువుల అమృతపరివ్రాజ రాజయోగముంది. ఆయన్ని నడిచే దేవుడంటారు. స్త్రీ దేవతా ఉపాసనకి కారకుడు రాహువు. అందుకే రాహుశాంతికి దుర్గాదేవిని పూజించాలంటారు. తంత్రప్రక్రియకు కేతువు అధిపతి. ఏపూజ చేయాలన్నా కేతుగ్రహయోగమవసరం. ఎందుకంటే కేతుగ్రహానికి అధిపతి గణపతి. కేతువు మోక్షయోగకారకుడు. రాహుగ్రహ సంబంధితసాధుసిద్ధపురుషులు, కేతుగ్రహ సంబంధితసాధుసిద్ధపురుషులు వేరువేరుగా ఉంటారు.
13.14 రాహుమాయ :
నిజానికి రాహుమాయంటే మనకేం తెలియదు. కానీ జ్యోతిషం చెప్పేవారు రాహువు యొక్క మాయాప్రభావం గురించి చెప్తారు-అదే రాహుమాయ. రాహువు కపట సన్యాసయోగానికి కారకుడు. అదెలాగోచూద్దాం. దొంగ సన్యాసులకు కారకుడు రాహువే. రాహువు యొక్క యోగంవల్లనే వారంతా అలా తయారౌతున్నారు, డబ్బు పోగేసుకుంటున్నారు, యోగభంగమైతే పట్టుబడిపోతున్నారు. అందుకే కాషాయం కట్టిన ప్రతివాడూ స్వామీజీ కాడు. దాని గురించి అందరూ తెలుసుకోవాలి. కొందరి జాతకాల్లోమంత్రకారకుడైన రాహునియత్రణ బాగా ఉంటుంది. వారు కృషితో మంత్ర, తంత్ర, యంత్రాలపై గట్టి పట్టు సాధిస్తారు. వారు ఉగ్రదేవతా ఉపాసకులు. అంతా గోప్యమే వారికి. చాలా ఏళ్ళు కష్టపడి ఉపాసన చేసి మంత్ర బలం పొందుతారు. భూతవైద్యం, విషయోగనివారణ, అష్టదిగ్బంధన యంత్రాలు, మంత్ర ప్రయోగాలు,వాటి ఉపసంహరణల్లో గట్టిపట్టు సాధిస్తారు. వారు గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తమకు తాము దైవాంశసంభూతులుగా చెప్పుకుంటారు. ఇతర సాధువులకన్నా తామే గొప్పంటారు. దేవుడు తమకు కనిపిస్తాడని, తాము దేవతలతో మాట్లాడగలమని అంటారు. వారికి తిరుగులేదన్నట్టు వ్యవహరిస్తారు. జనవశీకరణశక్తి ఉంటుంది వారివద్ద. రాహువు ఇలా ఇస్తాడు కపట సన్యాస యోగాన్ని. కానీ వారికి స్త్రీ వ్యసనం కలిగిందా, అంతా గోవిందే! ఎవరే మనుకున్నా పట్టించుకోరు. సిగ్గూ లజ్జ ఉండదు వారికి. వారిలో కొందరు జంతు బలులిచ్చే వామాచార పరాయణులు గూడా ఉంటారు. కొందరు పిల్లల్ని పుట్టిస్తామని ప్రకటిస్తుంటారు. కొందరు రోగాలు తగ్గిస్తామని భక్తులను కొట్టడం, కొరకడం, గీకడం, తన్నడం వంటి వికృతచేష్టలు చేస్తుంటారు. వాళ్ళకి ప్రదర్శన, ప్రచారమంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళని దేవుళ్ళనుకుంటాం మనం! ఇదంతా రాహుమాయే! కానీ కొందరు నిజమైన సాధువులుగా, మంత్రోపాసకులుగా గూడా రాణించగలరు. అది జాతకంలో రాహుస్థితిని బట్టి ఉంటుంది. రాహువిచ్చే దుర్యోగాలు గూడా చూద్దాం. ప్రజాసేవపేరుతో ప్రజాధనం కాజేస్తున్న రాజకీయనాయకులకి, ప్రేమవివాహాలకి, అవి విఫలమవడానికి, అమ్మాయిల వెంట పడుతూ వేధిస్తున్న అబ్బాయిలకి, స్త్రీల మీద అత్యాచారాలు పెరిగిపోడానికి, దొంగ తనాలకు, దోపిడీలకు, దీర్ఘకాలిక రోగాలకు, కిడ్నీ వ్యాధులకు, మెదడు వ్యాధులకు, మతసంబంధ ఘర్షణలకు… ఒకటేమిటి అన్ని దుర్యోగాలకు కారకుడు రాహువే.
13.15 కేతుమాయ :
ఇంక కేతుమాయని గూడాచూద్దాం. మంత్రసిద్ధి కారకుడైన కేతువు గూడా మాయాజాలాన్ని ప్రదర్శించి భ్రాంతిలో పడేస్తాడు. జాతకంలో కేతుగ్రహస్థితిని బట్టి మామూలుగా ఉంటున్న వాళ్ళు ఒక్కసారిగా దేవుళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. కొందరికి పూనకాలొస్తుంటాయి. వాళ్ళవద్దకివెళితే రోగాలు తగ్గుతాయి, లంకెబిందెలు బయటపడతాయని చాలామంది పొలోమనిపోయి, టెంకాయలు కొట్టి హారతులు ఇస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత గానీ తెలియదు, వాళ్ళు చెప్పినట్టు జరగటంలేదు, అంతా మాయేనని. కేతులక్షణ జాతకులు దేవుళ్ళావహించారన్న భ్రాంతితో అలా ప్రవర్తిస్తారు. కేతుగ్రహ స్థితి బాగాలేకపోతే చిత్తచాంచల్యంతో కూడిన పూజలు, నిలకడలేని భక్తి కలుగుతాయి. కేతుస్థితిని బట్టి కొందరు నిజమైన సిద్దపురుషులుగా తయారౌతారు. కొందరు సాధకులు ఎంత సాధన చేసినా సిద్ధి కలగక పిచ్చివాళ్ళుగా తయారౌతారు. కొందరికి రోగాలు లేకపోయినా రోగాలున్నాయనుకొని భ్రాంతికి గురౌతుంటారు. ఎవరో ఏదో చేసారని తాము బాధపడుతూ, ఇతరులనుగూడా బాధపెడుతుంటారు. దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని గూడా భ్రమపడుతుంటారు. కేతులక్షణ జాతకులు ఎప్పుడూ అపశకునపు మాటలు పలుకుతుంటారు. కలలో దేవుళ్ళు కనిపిస్తున్నారంటారు కొందరు. కొందరు పూజలూ, పునస్కారాలుచేస్తారు. పిల్లికి గూడా బిచ్చం పెట్టరు. తీర్థయాత్రలకెళతారు దానధర్మాలు చేయరు. వీటి మూలాన దక్కవలసిన ప్రతిఫలం దక్కటంలేదు. కలిసి రావడం లేదని రోజుకో దేముడ్ని మారుస్తారు. ఇవన్నీ కేతుగ్రహ దుర్యోగం వల్లనే. ఒక్క రాక్షసుడే అమృతపానంవల్ల, బ్రహ్మవరంవల్ల దేవత్వం సంపాదించి, దేవతలను సైతం వణికిస్తూ, వేదభూమిగానున్న భారతదేశాన్ని అవైదిక దిశగా లాక్కెళుతుంటే, క్షీరసాగరమథనప్పుడు లభించిన అమృతాన్ని రాక్షసులందరూ తాగుంటే ఇంకెలా ఉండేదో? ఊహకందనిదిగా ఉండేది! ధర్మపక్షపాతి ఆ విష్ణువే లేకపోతే ముల్లోకాలూ నరకకూపాలుగా ఉండేవేమో? సామూహిక హత్యలు, సామూహిక మరణాలు బస్, రైలు, విమాన ప్రమాదాలకి, ఆఖరికి కొన్ని సముద్రాల్లో జరుగుతున్న విమాన, నౌకల ప్రమాదాలకి గూడా కారణం ఈ ఛాయాగ్రహమైన రాహువేనట. ఛాయాగ్రహం కాబట్టి నీడలను బట్టి లాగి ప్రమాదాలకి గురిచేస్తాడు.
13.16 భారతదేశ దుస్థితికి కారకులెవరు?
భారతదేశ లగ్నం వృషభలగ్నం. లగ్నంలో రాహువు. మనదేశాన్ని పరదేశీయులు ఆక్రమించి పాలించారు. ఇది రాహుగ్రహం వల్ల కలిగిన దుర్యోగం. ఈ కలి యుగంలో, దాదాపు 2000 సంవత్సరాలు నుండి భారతదేశంమీద అనేక విదేశీ దండయాత్రలు జరగడం మూలాన, మన స్వదేశీ సంస్కృతి మరుగున పడిపోయింది. విదేశీ సంస్కృతుల వల్ల మన సంస్కృతీ, సంప్రదాయాలు సంకరమైపోయాయి. మన విద్య గూడా విదేశీవిద్యే. దానిమూలాన విదేశీశాస్త్ర, సాంకేతిక విద్యలను, భాషలను మనం నేర్చుకుంటున్నాం. అవన్నీ ఇప్పుడు పెరిగిపోడానికి కారకుడు రాహువు. ఇంకా ఎలాంటి వాటికి రాహువు కారకుడో చూద్దాం : ఇనఫర్మేషన్ టెక్నాలజికి, ఐటి దురుపయోగానికి, సైబర్ నేరాలకు, రకరకాల వైరస్లకు, బేంకులలో డబ్బు క్షణాల్లో మాయమవడానికి, భూ, జల, వాయు సంబంధమైనవాటికి, రక్షణశాఖ వాహనాలకు సంబధించినవారికి, కొత్త కొత్త శారీరకరోగాలకు, అకాలమృత్యువుకు, జ్ఞానం తగ్గడానికి, అజ్జానం పెరగడానికి, అగ్ని ప్రమాదాలకి, అర్హుల అణచివేతకి, అనర్హులను అందలమెక్కించడానికి, విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకి, విదేశీ ప్రయాణాలకి, బందిఖానాల్లో నేరస్థులు పెరిగిపోడానికి, ఒకటేమిటి ఎన్నోవింతలు జరుగుతూ ఉన్నాయి రోజూ. వాటన్నిటికీ కారకుడు కేవలం తోకలేని ఈ రాహువే. ఈయనకు తోడుగా తలలేని కేతువు ఎప్పుడూ ఉంటాడు. వీటిని ఎవరూ అరికట్టలేరా? ఇంతవరకూ అది జరగలేదు, అంతా కర్మ అనుకుని బాధలు పడడం తప్పించి. ఒకటి గుర్తుంచుకోవాలి. మన శాస్త్రాలు ఏదీ అసాధ్యమని చెప్పవు. అన్నిటికీ సమాధానాలున్నాయి పరిహారరూపాల్లో. అయితే ఆధునికమైన చిక్కులు పరిష్కరించుకోవాలంటే ప్రాచీనశాస్త్రాల్లోని గ్రహశాంతి చిట్కాలు పనిచేస్తాయా అని అనుకోవచ్చు! ఏమో? చేసి చూస్తే తెలుస్తుంది! ఈ మధ్య ఒక సిద్దాంతిగారు చెప్పారు: ధనవంతులు డబ్బు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకో గలరు. కాని పేదవారికి ఎలా? వారికి గూడా సరిపడే చిట్కాలున్నాయిట. మనకి వారంలో 7 రోజులకీ సరిపడా గ్రహాలుఉన్నాయి. ఛాయాగ్రహాలైన రాహు, కేతువులకి శని, మంగళవారాలను కేటాయించారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఆరోజు యొక్క గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని ఒక చెంచాడు నీటితో వదలాలి, 11 సార్లు ఆ గ్రహాన్ని తలచుకుంటూ. నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయచ్చు. లేకపోతే మంత్రజపం చేయచ్చు ఓ 108 సార్లు. ఇవి తేలికేగా! లేకపోతే రాహు కాలంలో మౌనం పాటించాలి. ఇది పైసా గూడా ఖర్చుపెట్టకర్లేని చిట్కా. ఈ యుగంలో కలి, శని, రాహువు, కేతువులకి ప్రాముఖ్యత యుగధర్మాల ననుసరించి వచ్చింది. అదీగాక పాపాలు ఎక్కువ చేసుకున్నవాళ్ళు ఈ యుగంలో జన్మించి కర్మని అనుభవించాలి. అదే విధిరాత. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. దైవం తప్ప ఎవరూ రక్షించలేరు. ఆ దైవానుగ్రహం అంత తేలిగ్గా రాదు. ఈ విషయమే పురాణాలు చెప్తున్నాయి. కలి యొక్క ప్రభావం రానురాను ఎలా ఉంటుందో చూద్దాం.
13.17 కలియుగ ప్రభావం :
కలియగం మొదటిపాదంలో మనమున్నాం. ఇప్పుడే ఎన్నో వింతలూ, విడ్డూరాలు రోజూ చూస్తున్నాం. భారతీయుల్లో ఆధ్యాత్మికత కొంచెం బాగానే ఉండేది లోగడ. ఇప్పుడంతా మరుగున పడిపోతోంది. అందరూ దేవుడ్ని వదిలేస్తున్నారు, డబ్బును ఆరాధిస్తున్నారు. డబ్బు సంపాదనలో జీవితాలు నిస్సారమైపోతున్నాయి. అంతా కాలుష్యమే. అందరికీ రోగాలే. జీవాధారమైన నదులు కాలుష్యానికి గురౌతున్నాయి. మహాపాతకాల్ని పోగొట్టే గంగానది గూడా కలుషితమైంది. అందుకే కలి 5 వేల సంవత్సరాలు దాటాక గంగామాత భూమిని వదిలి వెళ్ళిపోతుందిట. అందరూ అల్పజీవులే, అల్పజ్ఞానులే. నీతి నిజాయితీలు ఉండవు. కుటుంబాల్లో అందరూ కలహించుకుంటూనే ఉంటారు. పెద్దలకు, పండితులకు గౌరవం ఉండదు. ఇలా ఈమొదటి పాదంలోనే జరుగుతుంటే ఇంక తక్కిన పాదాల్లో ఎలా ఉంటుందో ఊహించగలమా? ఇప్పుడు కొద్దిమందైనా మంచివారున్నారు. ఇంక కలి ద్వితీయపాదంలో మంచివారుండరుట. ఇంక తృతీయ, చతుర్థపాదాల్లో మానవులు మృగాల్లాగా వ్యవహరిస్తారుట. మానవ సంబంధాలు మంటగలిసిపోతాయి. మానవుల ఆయుషు 20 సంవత్సరాలకి మించి ఉండదు. మనుషులంతా కురచగా ఉంటారు. అధర్మం, అన్యాయం పెరిగినప్పుడు విష్ణువు కల్కి అవతారమెత్తి మ్లేచ్ఛులనందర్నీ సంహరిస్తాడు. తిరిగి ప్రళయం వస్తుంది. మళ్ళీ భూమి నీటిలోముణిగిపోతుంది. వైవస్వతమనువు మళ్ళీ ఉద్భవిస్తాడు. ఆయన తన తపశ్శక్తితో మళ్ళీ మానవజాతిని అభివృద్ది చేస్తాడు. తిరిగి వేదధర్మం ప్రవర్తిల్లుతుంది. ఇదంతా భవిష్యపురాణంలో ఉంది.
13.18 ఈరోజుల్లో ఎందుకింత మానవ జనాభా పెరుగుతోంది?
కలియుగం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ కాలంలో పెరుగుతున్న జనాభా గురించి గూడా తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయమేమిటంటే రోజు రోజుకీ జనాభా పెరిగిపోతోంది. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశ జనాభా మొత్తం కేవలం 30 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు మటుకూ 130 కోట్లు దాటిపోయింది. దాదాపు 70 ఏళ్ళలోనే ఎంత పెరిగిపోయిందో! ఎందుకిలా జరుగతోందంటే సరైన కారణాలు లేవు. కానీ మన శాస్త్రాలు చెప్పగలవు కారణాలు. ప్రపంచమంతా జీవులతోనిండి ఉంది. జీవచైతన్యమన్నది కదల్లేని రాయిరప్పా, చెట్టూ పుట్టా లోను ఉంది, కదిలే చీమా, దోమా, జంతువులూ, మనుషుల్లోనీ ఉంది. మనం ఆధునికత పేరుతో విదేశీయులను అనుకరిస్తూ జీవహింస చేస్తున్నాం. కొండల్ని పిండిచేస్తున్నాం, చెట్లని నరికేస్తున్నాం, జంతువులని చంపేస్తున్నాం. అసలు జీవులు ఎందుకు పుడుతున్నారోనన్నది ఎవరికీ తెలియడంలేదు. అది తెలుసుకోవాలి.
జీవరాసులన్నీ చేసుకున్న కర్మలనుబట్టి ఒక క్రమపద్ధతిలో పరిణామం చెందుతూ చివరికి పరమాత్మలో లయించిపోతాయి. చైతన్యమన్నది ఏమార్పుకూ లోనుకాదు. కానీ, జీవచైతన్యానికి – అంటే జీవుడికి దేహంతో తాదాత్య సంబంధం ఉంటుంది. జీవాత్మ ఏదేహంలో ఉంటే ఆ జీవి కర్మానుసారంగా ఆ లక్షణాలతో ప్రవర్తిస్తుంది. తమోగుణప్రధానమైన ఖనిజాల్లో గూడా చైతన్యం ప్రాణరూపంలో ఉంటుంది. కానీ అది నిద్రాణస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ప్రాణంలో మనసు అంతర్లీనంగా ఉండి, అణిగిపోయి ఉంటుంది, కాబట్టి అది పనిచేయదు. ఎవరైనా ఓ రాతిని రెండు ముక్కలుచేస్తే, ఒకముక్కలో ఒక జీవాత్మ ఉంటే,ఇంకో ముక్కలో ఇంకో జీవాత్మ చేరి కర్మానుభవం పొందుతుంది. ఇక్కడ జీవాత్మ మహా దుఃఖం అనుభవిస్తుంది. తర్వాత చెట్టుగా, క్రిమికీటకాదులుగా, ఆవుగానో ఎద్దుగానో పుట్టి పుణ్యం సంపాదించుకుంటుంది. ఐనా మానసిక వికాసం కలగదు. తర్వాత మనిషిగా పుడుతుంది. రజోగుణ ప్రధానమైన మనుషుల్లో మటుకూ మానసిక వికాసం కలిగి ఉంటుంది. ఇప్పటికి మనసు సంపూర్ణశక్తితో పనిచేస్తుంది. ఇక్కడనుండి జీవుడు పుణ్యపాపకర్మలు చేసుకుంటూ పోతాడు. వాటినిబట్టి మళ్ళీ జన్మలు- ఇలా ఒక క్రమ పద్దతిలో సాగుతుంది కర్మచక్రం, జీవపరిణామం. కానీ ఈ రోజుల్లో కొండలూ, చెట్టూ జంతువులూ కనుమరుగౌతున్నాయి. వాటికి ఉపాధులు కరవై మళ్ళీ పుట్టడానికి ఆస్కారం కనబడటంలేదు. అందుకే అవన్నీ మనుష్య జన్మలు తీసుకుంటున్నాయి. అందుకే మానవ జనాభా పెరిగిపోతోంది. అటువంటివారిలో చురుకుదనం ఉండదు. తాగుడుకు బానిసలైనట్టు మొద్దుల్లాగ, జడపదార్థాల్లాగ ఉంటారు. కొందరైతే ఎంతో క్రూరంగా వ్యవహరిస్తారు. వారి పూర్వజన్మల సంస్కారాలవల్లనన్నమాట అలా ఉంటారు. మనసులో మనసుకతీతమైన అతిమానసశక్తి ఉంది. అది మానవుల్లో అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని యోగం ద్వారా పొందితే పరిపూర్ణమానవుడౌతాడు. జీవరాసుల్లో 84 లక్షల రకాలు ఉన్నాయంటారు. ప్రతిజీవి కోటానుకోట్ల జన్మలెత్తాల్సిందే ముక్తి పొందేవరకు.
13.19 భారతదేశం నాడు-నేడు :
భారతమాత కృతయగంలో ఉత్కృష్టమైన సంస్కృతీ, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని చూసింది. మరి కలియుగంలో అతి నీచాతినీచమైన వాటిని గూడా చూస్తోంది. అంటే కృతయగం ఎంత మహెూత్కృష్టమైనదో, కలియుగం అంత నీచాతినీచమైంది. ఈనాడు విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించి, మనవారిలో చాలామందిని ఊచకోతలుకోసి సంహరించి, మన సంస్కృతిని, సంప్రదాయాలను నాశనంచేసి, వారి భావజాలాల్ని ప్రచారంచేసి, మనల్ని అణగదొక్కి బానిసలను చేసి, మన దేవతలను సైతం దూషిస్తూ, వారి మతాల గురించి గొప్పలు చెప్పుకుంటూ మన వేదధర్మంలోని వాళ్ళను సామదానభేదదండోపాయాలతో తమ మతంలోకి లాక్కుంటున్నారు. విదేశీమతాలంటే కలిమతాలనే అర్థమవుతుందిప్పుడు, ఇంత తెలుసుకున్నాక. ఆ మతాలవారు ఎక్కువగా డబ్బు ఎరచూపి ఆత్మలను కొనుక్కుని నరకానికి లాక్కుపోతారన్నమాట. మనకి తెలుసు, దేవతావ్యవస్థ లేని విదేశీయులు మనవాళ్ళను మతం పేరుతో ‘మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు’ అంటూ అన్యాయంగా, అధర్మంగా ఊచకోతలు కోసి ఎలా చంపారో. దేవుడ్ని వేరుచేసి చూపడమంటే దేవుడిమీద నమ్మకం లేనట్టేగా! దేవుడంటే ఏమిటో తెలియదనేగా అర్థం! అటువంటి వారికి స్వర్గం ఎలా లభిస్తుంది? నరకమే గతి మరి! యమలోకంలోని యమధర్మరాజుకి మాత్రం నరకలోకం పాపిష్టివాళ్ళతో నిండుగా ఉండాలనుండదా! అందుకే మనకు ఈ కలిలో విద్వేషపూరిత విదేశీమతోన్మాదుల వల్ల దైవభక్తి అంటే ఏమిటో అర్థం కావడంలేదు. విదేశీమతస్తుల మతదాడులను తిప్పికొట్టే స్థితికి మనం చేరుకోవాలి. ఈ కలిలో మూడువంతులు అధర్మపరులుంటే, ఒకవంతు ధర్మపరులుంటారు. ఈ ధర్మపరులు అంతా ఏకమై తమ ధర్మాన్ని తాము రక్షించుకోవాలి. ఈ కలిలో రాహుకేతువుల మాయాజాలం నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రజాఉద్యమాలే గతి. మనకి తెలుసు ప్రజాపాలనకి కారకుడు శని. ప్రజాభిప్రాయానికే ఎక్కువ విలువ. ఈ శనిగ్రహమే రాహుకేతువుల ఉద్ధృతిని అణచగలవాడు, కాబట్టి ఉద్యమాలవల్లనే ఏదైనా సాధ్యం. ప్రజాఉద్యమమే తిరుగులేని అస్త్రం. అందుకని ధర్మానికి హాని జరిగినప్పుడు, ధార్మిక హిందువులంతా ఏకమై ఉద్యమించి తమ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. రాహువు బ్రహ్మదేవునికి మాట ఇస్తాడు తాను వేదపాఠకుల జోలికి పోనని. ఐనా వేదధర్మానికి కోలుకోలేనంత హాని ఎప్పుడో జరిగిపోయింది విదేశీయుల వల్ల. ఈ యుగంలో రక్షించబడాలంటే భక్తి మార్గమే దిక్కు. అందుకే ద్వాపరాంతంలో అద్భుతమైన శ్రీకృష్ణపరమాత్మ అవతరించి, కలియుగంలో మానవులు రక్షించబడటానికి, తరించడానికి తన అవతార ఘట్టాలను స్మరించుకోమని కానుకగా వ్యాసమహర్షి ద్వారా శ్రీమహాభాగవతాన్ని అందించాడు. నిజానికి కలియుగవాసుల్ని ఉద్ధరించడానికే కృష్ణపరమాత్మ అవతరించాడేమోననిపిస్తుంది. అందుకే కృష్ణనామస్మరణ కలిదోషాలు పోగొడుతుందంటారు. కలియుగంలో ఎవడైనా పాపం చేస్తేనే పాపఫలం లభిస్తుంది. ఏదైనా పుణ్యకార్యం చేస్తానని తలచినా చాలు పుణ్యఫలం లభిస్తుందిట. ఇంక పుణ్యానికి తేలికైన మార్గం దొరికినట్టేగా. అందుకే తీర్థాలకి, క్షేత్రాలకి వెళ్ళకపోయినా వెళ్ళినట్లు తలచుకుంటే సరిపోతుంది. ఇంతటితో యుగధర్మాలు, కలిపురాణం సమాప్తం. వచ్చే అధ్యాయంలో కలియుగం లోని కొందరు రాజుల గురించి తెలుసుకుందాం.
(సశేషం)