ఆడపడుచు

0
3

[dropcap]భ[/dropcap]ర్తను ఆఫీసుకు పంపి, తలుపులేసి ఇల్లు సర్దుతోంది మాధవి. ఇంతలో డోరు బెల్ మ్రోగితే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఉన్న మోహన్‌ను చూసి ఒక్క క్షణం తరువాత గుర్తుపట్టింది. ఆశ్చర్యపడుతూ చిన్న నవ్వుతో “రండి లోపలికి” అంటూ ఆహ్వానించింది. మోహన్ మాధవి భర్త శ్రీకర్‌కి స్నేహితుడు. పాతికేళ్ళ క్రితం నుంచి, తమ పెళ్ళికన్నా ముందే శ్రీకర్ మోహన్ స్నేహితులు.

సోఫాలో కూర్చున్న మోహన్‌ను చూస్తే ఏదో జరగకూడనిది జరిగిందేమో అని అనుమానం వచ్చింది మాధవికి. ఎందుకంటే పెరిగిన గడ్డంతో, కళ్ళలో జీవకళ కోల్పోయి నిస్తేజంగా బేలగా ఉన్నాడు మోహన్. మాధవికి కళ్ళ ముందు గతం కదలాడింది.

శ్రీకర్ మోహన్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో వుండేవారు. శ్రీకర్ మితభాషి. మనిషి మంచివాడే కాని అంటీ ముట్టనట్టు ఉండేవాడు. మోహన్ చాలా కలుపుగోలు మనిషి. ఎక్కువ చొరవ తీసుకుంటాడు. తన చుట్టూ వున్న అందరికీ సాయం చేస్తూ తలలో నాలుకలా వుంటాడు. అసలు మోహన్ చొరవ వల్లే శ్రీకర్‌లో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఒకే బ్లాక్‌లో వేర్వేరు ఎపార్టుమెంట్స్‌లో వుండేవాళ్ళు. మోహన్ వేరే ఐదుగురు స్నేహితులతో కలిసి ఉండేవాడు. శ్రీకర్ ఒక్కడే వుండేవాడు.

మాధవితో శ్రీకర్ పెళ్ళి అయ్యి ఆమెను ఢిల్లీకి కాపురానికి తెచ్చిన సంగతి మోహన్‌కి చెప్పలేదు. కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త జీవితం దీనితో మాధవికి బెరుకుగా ఉండేది. పైగా శ్రీకర్ ముభావంగా వుండేవాడు. ఎన్నో ఆశతో, కోరికలతో కాపురం పెట్టిన మాధవికి ఏం చేయాలో తోచేది కాదు.

శ్రీకర్ అసలు పెళ్ళి చేసుకోకూడదని అనుకున్నాడు. తను దైవంగా కొలిచే ఒక బాబా పీఠంలో ఉండిపోవాలని అనుకున్నాడు. కానీ అతని తల్లి తండ్రీ ఎంతో బతిమాలి ఒప్పించి మాధవితో పెళ్ళి జరిపించారు. ఈ విషయం తెలియని మాధవి భర్త నిరాదరణకు ఎంతో బాధపడేది. ఆఫీసు నుంచి వచ్చాక ఒక పలకరింపు లేదు. ఆదివారం ఎక్కడికైనా సరదాగా వెళ్ళే ఆటవిడుపూ లేదు. మాధవి వచ్చి నెల రోజులైనా చుట్టుపక్కల ఎవ్వరికీ పరిచయం చేయలేదు. స్వతహాగా మాధవి చాలా చురుకైన పిల్ల. మంచి తెలివితేటలు, చలాకీతనం ఇంటి పనుల్లో నేర్పు అన్నీ వున్నాయి. వీటితో పాటు ఓర్పు, సహనం కూడా ఎక్కువే. పూర్తి విరుధ్ధ స్వభావంతో వున్న భర్త అంటే ఎందుకో చాలా భయపడేది. శ్రీకర్ మాధవిని ఏనాడూ కనీసం నీకు ఏది ఇష్టం అని కూడా అడిగేవాడు కాదు. ఇలా మరో నెల గడిచింది.

ఒక రోజు మాధవికి బయటి పనులు అలవాటు చేయడానికి శ్రీకర్ కూరగాయల మార్కెట్ తీసుకువెళ్ళాడు. ఇంటికి తిరిగి వస్తుంటే మోహన్ ఎదురయ్యాడు. శ్రీకర్ పక్కన మాధవిని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఒక వారం పాటు అమెరికాలో ఎసైన్‌మెంట్ వుండటం వల్ల వీళ్ళ పెళ్ళికి వెళ్ళలేకపోయాడు. మాధవి వచ్చిన సంగతి చెప్పనందుకు నొచ్చుకున్నాడు మోహన్. “అదేంటి శ్రీకర్ మాధవి ఇక్కడికి వచ్చినట్లు మా ఎవరికీ చెప్పలేదు. రేపు ఆదివారం మా ఇంటికి తీసుకురా” అని మరీ మరీ చెప్పాడు. ఇక తప్పక వెళ్ళారు శ్రీకర్ మాధవి. తమ బ్లాక్‌లోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో వీళ్ళ అపార్ట్‌మెంట్ అని తెలిసి మాధవి ఆశ్చర్యపోయింది. నిజానికి మోహన్‌తో పాటు వుండే కొంతమంది స్నేహితులు అప్పుడప్పుడు మాధవికి తారసపడేవారు. కానీ ఫలానా అని తెలియకపోవడం వలన ఎప్పుడూ పలకరించుకోలేదు. ఇప్పుడు మోహన్ అందరినీ పరిచయం చేశాడు. సాయంత్రం వరకూ అక్కడే వుండి డిన్నర్ చేశారు శ్రీకర్ వాళ్ళు.

మోహన్‌కీ అతని స్నేహితులకీ మాధవి అంటే ఎంతో సదభిప్రాయం కలిగింది. ఆమె మాట, నిదానం, మంచితనం, అణకువ అన్నీ తన అందానకి తగ్గట్టు వున్నాయి. శ్రీకర్ చాలా అదృష్టవంతుడు అనుకున్నారు. వాళ్ళు తమకు కూడా ఇంత మంచి అమ్మయిగా భార్యగా రావాలని ఆశపడ్డారు.

ఆ తరువాత అప్పుడప్పుడు మోహన్ శ్రీకర్ ఇంటికి వెళ్ళేవాడు. మాధవితో కూడా ఆత్మీయంగా మాట్లాడేవాడు. మాధవికి మోహన్‌లో తన అన్న హరి కనిపేంచేవాడు. హరితో చాలా సన్నిహితంగా వుండేది మాధవి. ఒకరికొకరు అన్ని విషయాలు చెప్పుకునేవారు. మాధవికి పెళ్ళైన వారానికే హరి ఆస్ట్రేలియాలో ఆన్‌షోర్ పని మీద వెళ్ళాడు. అక్కడ ఎక్కువ పని వుండటంతో చెల్లెలితో ఎక్కువ మాట్లాడలేకపోయేవాడు. మాధవి కూడా అంత దూరంలో వున్నవాడికి తన ఇబ్బందులు చెప్పి బాధపెట్టడం ఎందుకని ఏమీ చెప్పేది కాదు. తన అన్న హరి స్థానాన్ని మోహన్ భర్తీ చేసేవాడు. శ్రీకర్ స్వభావం తెలుసుకనుక మాధవితో ఆప్యాయంగా మాట్లాడుతూ, సరదా కబుర్లతో నవ్వించేవాడు. మోహన్ వచ్చినప్పుడు మాధవి సంతోషంగా వుండటం శ్రీకర్‌కి నచ్చేలేదు. ఇదే విషయంగా మాధవిని నిలదీశాడు.

భర్త నిరాదరణ, ఉదాసీనత భరించింది కానీ, అనుమానాన్ని సహించలేక పోయింది. ధైర్యం కూడగట్టుకుని నిబ్బరంగా, స్థిరంగా సమాధానం చెప్పింది.

“ఇంట్లో వస్తువులు అమర్చుకున్నట్లు నన్ను పెళ్ళి చేసుకుని ఇక్కడకు తెచ్చి పడేశారు. ఎప్పుడైనా నేను ఎలా వున్ననో, తిన్నానో లేదో పట్టించుకున్నారా. నా అవసరాలు, ఇష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా. మోహన్ ఆప్యాయతలో నా అన్న హరి ప్రేమను చూసుకున్నాను. మోహన్ నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఈ విషయంలో మీకు ఇంకేమన్నా అనుమానాలు వుంటే అది మీ ఖర్మ” అని చెప్పింది.

ఇవన్నీ విన్న శ్రీకర్ నిలువునా కదిలిపోయాడు. తమ పెళ్ళి అయిన ఈ ఆరు నెలల్లో మాధవిని ఎంత బాధపెట్టాడో గ్రహించాడు. ఆమెను దగ్గిరకు తీసుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు.

మాధవి కూడా నిండు మనసుతో శ్రీకర్‌ని క్షమించింది. ఆ తరువాత ఎప్పుడూ శ్రీకర్ మాధవిని కష్టపెట్టలేదు. తన మంచితనంతో ఆదరణతో శ్రీకర్ మనసు పూర్తిగా గెలుచుకుంది. మాధవి ద్వారా ఈ విషయాలు మోహన్‌కు తెలిసేవి. వాళ్ళు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసి ఎంతో సంతోషించాడు మోహన్.

మరో ఏడాది తరువాత మోహన్‌కు లతతో పెళ్ళి జరిగింది. మోహన్ వ్యక్తిత్వానికి లత వ్యక్తిత్వానికి చాలా వ్యత్యాసం వుంది. భర్త, భర్త సంపాదన తప్ప అత్తింటివారు అక్కరలేదు లతకి. మోహన్ చిన్నతనంలో పేదరికంలో కష్టపడి చదువుకున్నాడు. తల్లిదండ్రులంటే అతనికి ఎంతో ప్రేమ, గౌరవం. వాళ్ళది కాకినాడ దగ్గిర చిన్న పల్లెటూరు. తన భర్తకి ఢిల్లీలో ఉద్యోగం కాబట్టి తను అత్తగారింట్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఏంటి అనేది లత ఉద్దేశం. పెళ్ళైన కొద్దిరోజులకే భార్య ఉద్దేశం అర్థమయింది మోహన్‌కి. అత్తమామలతో కలుపుగోలుగా వుండమని చెప్పిచూసాడు. లాభం లేకపోయింది. వారానికి ఒక్కసారైనా ఫోనులో మాట్లాడమంటే, ‘బాగున్నారా’ అని తప్ప ఇంకో ముక్క మాట్లాడేది కాదు.

లత తల్లిదండ్రులైనా బుద్ధి చెప్తారేమోనంటే, అసలు లత ఇలా తయారవ్వడానికి కారణం ఆమె తల్లి ప్రమీల. మొగుడిని మొగుడి సంపాదనని గుప్పిట వుంచుకొమ్మని, అత్తమామల కోసం డబ్బు ఖర్చుపెట్టనివ్వవద్దని, అత్తవారిని ఇంటికి రానిస్తే, ఆస్తి కరిగిపోతుందని లతకు నూరిపోసింది ప్రమీలే.

మోహన్ తల్లిదండ్రులు సాంప్రదాయం కలిగినవారు. పాతకాలం పద్ధతులు మర్యాదలు, మాటపట్టింపులు వున్నవారు. తన భార్య ప్రవర్తన వాళ్ళను నొప్పించకుండా ఎలాగైనా లతను మార్చాలని మోహన్ ఆశ. ఇలాంటి పరిస్థితిలో అతనికి కనిపించిన ఆశాకిరణం మాధవి. ఇద్దరూ ఇంచుమించు ఒకే ఈడువాళ్ళు. కాబట్టి లత తేలికగా అర్థం చేసుకుంచుదని మాధవిని బ్రతిమాలాడు. లతకి కుటుంబ విలువలు, అత్తమామలను ఆదరించటం, నలుగురితో కలుపుగోలుగా ఉండటం వంటిది నెమ్మదిగా నేర్పమన్నాడు. మాధవి అందుకు ఇష్టపడలేదు. లత స్వభావం తను పసిగట్టింది. మాధవిని మోహన్ మెచ్చుకుంటాడని లతకు అసూయ. పెదవులతో నవ్వినా, లత కళ్ళలో అసూయను మాధవి పసిగట్టేది.

భార్యాభర్తల మధ్య తను రాకూడదనుకుంది. మోహన్ వినలేదు. “మాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు నువ్వు కల్పించుకుంటే తప్పులేదు” అన్నాడు. ‘నా కాపురం అల్లరి కాకుండా చూడు. లత వల్ల నా తల్లిదండ్రులు బాధపడితే నేను తట్టుకోలేన’ని ఎంతో ప్రాధేయపడ్డాడు. మాధవి కూడా నిజానికి మోహన్‌కి సాయం చేయాలని వుంది. ఎందుకంటే తన పెళ్ళైన కొత్తలో తను భర్త నిరాదరణకు గురైనప్పుడు మోహన్ చూపించిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేదు తను. మోహన్ తన అన్న. లత తన వదిన. వాళ్ళు సుఖంగా వుండాలన్నదే తన కోరిక. ఇప్పుడు మోహన్ ఇంతగా బతిమాలే సరికి తనూ ఒప్పుకుని లతకు మంచి మాటలు చెప్పటం మొదలు పెట్టింది.

మాధవి చెప్పే సలహాలు, సూచనలు లతకు ఏమాత్రం నచ్చేవి కావు. కానీ తన మనసులోని మాట బయటపడనిచ్చేది కాదు. చీటీకీ మాటికీ మోహన్‌తో “మీ మాధవి ఇలా అన్నది, అలా అన్నది” అని చెప్పేది. మాధవి లతలో ఏం మాట్లాడినా ఆ విషయాలు మాధవి మోహన్‌కి కూడా చెప్పేది. కాబట్టి తను లత చాడీలు పట్టించుకునేవాడు కాదు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఈలోగా మాధవికి కవల పిల్లలు పుట్టూరు. లత ప్రవర్తనలో ఏ మార్పూ లేదు. ఏదన్నా పండక్కి మోహన్ తల్లిదండ్రుల దగ్గిరికి వెళ్దామంటే లత ఒప్పుకునేది కాదు. పైగా మాధవిని అత్తగారింటికి వెళ్ళకుండా తప్పించుకునే ఉపాయం చెప్పమని అడిగేది. మొగుడిని మాయ చేసి పుట్టింటికి తీసుకెళ్ళటానికి మార్గాలు వెతికేది.

మాధవి ఎంతో ఓపికగా అలాంటి ఆలోచనలు మంచివి కావని ఒకసారి అత్తగారింటికి వెళితే మరో పండక్కి పుట్టింటికి వెళ్ళచ్చనో, పైగా తల్లిదండ్రులని దూరం పెట్టడానికి మోహన్ ఏ మాత్రం ఒప్పుకోడని గంటలు కొద్దీ చెప్పేది.

తన పేరు మీద మోహన్ ఇల్లు కొనాలని లత కోరిక. అప్పుడు తన స్నేహితురాళ్ళ దగ్గిర తన భర్త తన గుప్పిట ఉన్నాడు అని నిరూపించుకోవాలని తాపత్రయం. మోహన్ తమ ఇద్దరి పేరు మీదా కొంటానన్నాడని ఎన్ని రోజులు గోల చేసిందో. ఈ విషయంలో మాధవి తన వైపు నిలబడలేదని లతకి చాలా కోపం వచ్చింది.

ప్రమీల, కూతురి పేరు మీద మాత్రమే ఇల్లు వుండాలని లతని రెచ్చగొట్టేది. ఈ విషయంలో గొడవ ముదిరి, మోహన్‌కు కోపం వచ్చి రోజంతా భోజనం చేయలేదు. సాయంత్రం లత, మాధవికి విషయం చెప్పి, ఇంటికి రమ్మన్నది. గొడవ ముదురుతోందనే బాధతో మాధవి వెళ్ళింది. కేవలం కోడలి పేరు మీద మాత్రమే ఇల్లు కొంటే తన తండ్రికి నచ్చదని, అయినా ఇద్దరి పేరునా కొంటే ఇబ్బంది ఏంటి అనేది మోహన్ వాదన. భార్య అంటే నిజమైన ప్రేమ, నమ్మకం ఉంటే ఏ ఆస్తి అయినా కేవలం భార్య పేర మీద మాత్రమే కొనాలి అనేది లత వాదన.

లత వాదనతో మాధవి ఏకీభవించలేకపోయింది. ప్రేమకి ఆస్తికి సంబంధం ఏమిటన్నది. లత “మా వేపు ఇలానే చేస్తారు. మా పుట్టింట్లో, మా స్నేహితురాళ్ళ ఇళ్లలో ఇలానే జరుగుతుంది” అన్నది. ఈ మాటలతో మాధవికి ఒళ్ళు మండింది. “అసలు నీకు ఇలాంటి దిక్కుమాలిన సలహాలు చెప్పేది ఎవరు. భర్త ఆస్తి భార్య ఆధీనంలో వుంటే తప్ప ప్రేమ వున్నట్లు కాదా. ఇలాంటి చవకబారు మాటలు నీకు ఎవరు చెబుతున్నారు” అని ఆవేశపడింది.

అంతే లతకు మాధవి మీద అంతులేని ద్వేషం కలిగింది. లతకు ఈ సలహాలు ఇచ్చేది తన తల్లి ప్రమీల కనుక, మాధవి కావాలనే తన తల్లిని అన్ని మాటలు అన్నదనే నిర్ణయానికి వచ్చేసింది. మరునాడు తల్లికి ఫోన్‌లో జరిగినదంతా చెప్పింది. విన్న ప్రమీల, లత పాచికలకు మాధవి అడ్డువస్తోందని ఉక్రోషంతో ఊగిపోయింది. “ఆ మాధవి మీ విషయాలలో జోక్యం చేసుకునంత కాలం నీ మొగుడు నీ గుప్పిట్లోకి రాడు. ముందు దాన్ని మీ ఇంటికి నుంచి దూరం చేసి, నీ మొగుడి మనసు విరిచేయ్” అని నూరిపోసింది. ఈ విషయాన్ని తలకెక్కించుకున్న లత, ఆ రోజు నుండి మాధవితో మాట్లాడటం మానేసింది. మోహన్‌తో పూర్తిగా మాట్లాడటం మానేసింది. మాధవితో మోహన్ కూడా మాట్లాడటానికి వీల్లేదంది. తమ కుటుంబ విషయాలు మాధవికి చెప్పటానికి వీల్లేదని పంతం పట్టింది.

ఇందుకు మోహన్ ఒప్పుకోలేదు. “నువ్వు అడిగితేనే కల్పించుకుంది. మంచి మాటలు చెప్పింది. మాధవి ఈ ఇంటికి ఆడపడుచు. నేను ఒదులుకోలేను” అన్నాడు.

లత మొండి పట్టు విడవలేదు. మోహన్ ఆమె మార్ఖత్వంతో విసిగిపోయి విడాకుల ఆలోచన చేశాడు. ఆ మాట విని మాధవి గట్టిగా మందలించింది. “పొరపాటున కూడా అటువంటి మాటలు అనవద్దు. ఏదీ ఏమైనా భార్యభర్తలు సర్దుకుపోయి కలిసి ఉండాలి. కొంత కాలం నాతో మాట్లాడకండి. ముందు లత శాంతించి, మీ ఇద్దరి మధ్యా గొడవలు తగ్గాక మళ్ళీ నాతో మాటలు కలపవచ్చు” అని నచ్చచెప్పింది. మాధవి మంచితనానికి, అర్థం చేసుకునే మనసుకి చలించిపోయాడు మోహన్.

లత మోహన్‌తో మాట్లాడటం మానేసి నెల అవుతోంది. వాళ్ల మధ్య గొడవల గురించి మాధవికి తప్ప ఎవరికీ తెలీదు. తన తల్లిదండ్రులకి తెలిస్తే బాధ పడతారని మోహన్ వాళ్ళకి కూడా చెప్పలేదు. మాధవి కూడా కావాలని మోహన్‌ని దూరం పెట్టింది. రెండు ముడు రోజులకొకసారి కూడా ఫోన్ తీసేది కాదు. అప్పుడు కూడా భోజనం చేశాడో లేదో కనుక్కుని తనకు పని వుందని పెట్టేసేది. మానసికంగా ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇక మాధవితో తమ కుటుంబ విషయాలు మాట్లాడనని లతకి చెప్పాడు. విప్పారిన మొహంతో తనకు మూడోనెల అని చెప్పింది లత. తను తొలిసారి తండ్రిని కాబోతున్నానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కరి అయ్యాడు మోహన్. ఇదే అదనుగా మోహన్ మాట మీద నిలబడతానని పుట్టబోయే బిడ్డమీద ఒట్టు వేయమంది లత. అయిష్టంగానే ఒట్టువేశాడు.

మరునాడు ఆఫీసుకి శెలవు పెట్టి, లత చుట్టూ తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పాడు మోహన్. నెల రోజుల పంతం తరువాత భర్తను తన దారిలోకి తెచ్చుకున్నందుకు ఎంతో గర్వంగా వుంది లతకి. ఒంటరి తనంతో విసిగిపోయిన మోహన్‌కి తీయగా మాటలు చెబుతూ హాయి చేకూర్చింది. లతను షాపింగ్‌కి తీసుకెళ్ళి ఆరడజను చీరలు కొన్నాడు మోహన్. ఇదంతా లత తను సాధించిన విజయంగా మురిసిపోయింది. భోజనం చేసి రాత్రి పడుకోబోతున్నంతలో ‘అమ్మా…’ అంటూ పెద్ద కేక పెట్టింది లత. ‘నొప్పి నొప్పి’ అంటూ బాధతో మెలికలు తిరిగిపోయింది. మోహన్ వెంటనే మాధవికి ఫోన్ చేయబోయి ఆగిపోయాడు. ఏంబులెన్స్‌కి ఇతర స్నేహితలకి ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాడు. డాక్టర్లు పరీక్ష చేసి గర్భంలో తేడా వచ్చిందని, వెంటనే గర్భం తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు.

తను తండ్రిని కాబోతున్నానే ఆనందం కొన్ని గంటలన్నా నిలువక ముందే ఈ వార్త విని మోహన్ క్రుంగి పోయాడు. డాక్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇతర స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మాధవి విలవిల్లాడిపోయింది. వాళ్ళతో మాట్లాడి ఓదార్చాలని ఎంత ప్రయత్నించినా మోహన్ లత ఇద్దరూ మాట్లాడలేదు.

హాస్పిటల్ నుంచి లత ఇంటికి వచ్చాక గర్భం పొయిందన్న బాధ మాధవి మీద కోపంగా మారింది. మాధవి మాటలు తనను బాధపెట్టడం వలనే తన ఆరోగ్యం దెబ్బతిని తనకు ఇలా అయింది అని నిర్ణయానికి వచ్చేసింది. ఆ కసితో మోహన్‌కి మాధవి గురించి అబద్దాలు చెప్పటం మొదలు పెట్టింది. మాధవి లతని తిట్టినట్టు, అవమానించినట్టు, చులకనగా, అవహేళనగా మాట్లాడినట్లు చెప్పింది.

“మాధవి మీరు వున్నప్పుడు ఒకలాగ మీరు లేనప్పుడు మరోలాగా నాతో ప్రవర్తించేది. చాలా కుటువుగా మాట్లాడేది. అయినా తను మన ఆడపడుచని నేను నా మనసులోనే బాధపడ్డాను కానీ.. మీతో కూడా చెప్పలేదు. ఆ మానసిక క్షోభ వల్లనే నా ఆరోగ్యం పాడయి చివరకు మనకు పుట్టబోయే బిడ్డను కూడా దూరం చేసుకున్నాను” అంటూ భోరుమన్నది.

అసలే లత గర్భస్రావంతో ఆమె పట్ల విపరీతమైన జాలితో వున్న మోహన్ ప్రతి రోజూ లత అదే పనిగా చెప్పే అబద్దాలు కల్లిబొల్లి కబుర్లు, దొంగ ఏడుపులకి లొంగిపోయి, నెమ్మదిగా లత చెప్పేది తలకెక్కించుకున్నాడు. క్రమేపి మాధవిని అసహ్యించుకోవటం మొదలు పెట్టాడు.

ఒక రోజు లత చెప్పే చాడీలు వినీ వినీ కోపంతో మాధవికి ఫోన్ చోశాడు. లతని ఇంత కాలం మాటలతో ఎందుకు హింసించావని నిలదీశాడు. చాలా కాలం తరువాత మోహన్ నుంచి ఫోన్ వచ్చిందన్న ఆనందంలో వున్న మాధవి ఆ మాటలకు నివ్వెరపోయింది. “మెహన్, నేనెలాంటి దాన్నో మీకు తెలీదా. మీరేనా ఇలా మాట్లాడుతోంది” అని బాధపడింది. కానీ లత మాటలతో విషపూరితమైన మోహన్ మనసుకి మాధవి బాధ తెలియలేదు.

“నా భార్య అమాయకురాలు. తనకు అబద్దాలు చెప్పటం తెలియదు” అన్నాడు.

మోహన్ నిష్కారణంగా తనపై నిందలు వేయడంతో మాధవి మనసు తీవ్రంగా గాయపడింది. నమ్మకం లేని చోట ఏది చెప్పినా నిష్ప్రయోజనం. లత తనను ఎన్ని మాటలు అన్నా, మోహన్‌ కోసం సహించింది తను. కానీ, ఇప్పుడు మోహన్ అన్నీ తెలిసి కూడా ఇలా మారిపోయి చేయని తప్పుకి తనని బాధ్యురాలిని చేయటం సహించలేకపోయింది. మోహన్‌కి ఫోన్‌లోనే చెప్పేసింది, “మీకు నా మాట మీద నమ్మకం లేనప్పుడు, నేను తప్పు చేశానన్న భావన మీలో బలంగా వున్నప్పుడు, ఇక నేను ఏది చెప్పనా మీకు అర్థం కాదు. ఇక మనం మాట్లాడుకోవటం అనవసరం అంతే” ఫోన్ పెట్టేసింది. ఇది ఊహించని మోహన్ విసురుగా ఫోన్ పక్కన పడేశాడు. వారంలోగా మోహన్ వేరే ఇంటికి మారిపోయాడు లతతో. తరువాత శ్రీకర్ కుటుంబం మరో నాలుగేళ్ళు ఢిల్లీలోనే వున్నా, ఎప్పుడూ మోహన్‌ను కలుసుకోలేదు. బాధపడుతున్న మాధవిని శ్రీకర్ ఎంతో ఓదార్చాడు. ఆ తరువాత శ్రీకర్ వాళ్లు హైదరాబాద్ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.

ఇది జరిగిన ఇరవై సంవత్సరాల తరువాత ఈ రోజు మళ్ళీ మోహన్ శ్రీకర్ ఇంటికి వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. కళ్ళలో నిర్వేదం, పశ్చాత్తం అతన్ని చూస్తుంటే జాలి కలిగింది మాధవికి. అతని అవస్థకి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. “లత ఎలా వుంది?” అని అడిగింది మాట కలుపుతూ. మాధవి ఇచ్చిన మంచి నీళ్ళు త్రాగుతూ తన గోడు చెప్పుకున్నాడు మోహన్.

మాధవిని దూరం చేశాక తన ప్రతాపం చూపించింది లత. ఇంత కాలం అణిచి పెట్టుకున్న కోరికలు పురివిప్పాయి. జడ వేసుకోవటం మోటుతనమంటూ జుట్టు మొత్తం మెడ వరకు కత్తిరించింది. ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకొని కిట్టీ పార్టీలు, లేడీస్ క్లబ్‌లు అంటూ అర్ధరాత్రి తెల్లవారుఝాము వరకు బయట తిరిగేది. అత్తమామలు ఇంటికి వస్తే కావాలని లోనెక్, బిగుతుగా వున్న డ్రస్సులు, మోకాళ్ళ పైవరకు ఉండే స్కర్ట్స్ వేసేది. అది చూడలేని మోహన్ తల్లిదండ్రులు రెండు రోజులలోనే వాళ్ళ ఊరు వెళ్ళిపోయరు. ఇలా తన ఇష్టానుసారం ప్రవర్తించేది.

ఇది గమనించిన మోహన్ మరో స్నేహితుడు మంచి చెప్పబోతే లత అతని మీద నిందలేసి వాళ్ళ స్నేహం కట్ చేసింది. మోహన్ పూర్తిగా లత మాయలో పడిపోయి లతని గుడ్డిగా నమ్మేవాడు. అతనికి లతే కళ్ళు, చెవులు, నోరు. మాధవి దగ్గిర తన పాచిక పారేసరికి లత తనకు నచ్చిని వారందరి మీద అదే అబద్ధాలు అపనిందలు అస్త్రం ప్రయోగించింది. వరుసలో మోహన్ తల్లిదండ్రులు, బంధువులు, మోహన్ అన్న కుటుంబం స్నేహితులు ఇలా అందిరినీ దూరం చేసింది. ఇప్పుడు మెహన్‌కు లత తల్లిదండ్రులే సర్వస్వం.

ఇలా మోహన్‌ని ఒంటరిని చేసింది. లతకు పిల్లలు కలగలేదు. కొన్నేళ్ళకి ఇక లత మోహన్‌ని చులకనగా చూడటం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రుల ముందే ఎగతాళి చేసేది. వాళ్ళు కూడా అల్లుడని కూడా చూడకుండా మోహన్ మాటకు ఏ మాత్రం విలువనిచ్చేవాళ్ళు కాదు. మాధవిని దూరం చేసుకున్న ఏడేనిమిదేళ్ళకే మోహన్‌కి ఇంతర స్నేహితులు, బంధువులు అందరూ దూరమయ్యారు. సంపాదించినదంతా లత పేరు మీద పెట్టాడు. లత తనకు విలువనివ్వటం లేదన్న విషయం చాలా రోజులకిగాని అర్థం కాలేదు. ఇంటా బయటా తనకంటూ ఎవరూ లేకపోవటంతో మోహన్‌ను ఒంటరితనం వేధించసాగింది.

ఒకప్పుడు ఎంతో సంతోషంగా నలుగురికి సాయం చేస్తూ, చుట్టూ పది మందితో ఆనందంగా వుండే తను ఇలా ఏకాకిలా ఎందుకు మిగిలిపోయానా అన్న ప్రశ్న వేధించసాగింది. క్రమేపి కొద్ది కొద్దిగా ఆలోచన రాసాగింది. కళ్ళ ముందు పొరలు ఒక్కక్కటి విచ్చుకోసాగాయి. తన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళో తెలిసి కూడా వాళ్ళను తను ఎలా అపార్థం చేసుకున్నాడు. లత వాళ్ళ గురించి చెడుగా చెప్పినప్పుడు ఎలా నమ్మాడు. తన వివేచన ఏమైంది. తన అమ్మ, నాన్న అన్నల మీద ప్రేమ ఏమైపోయింది. లత మాటలు విని వాళ్ళను అనుమానించాడు, అవమానించాడు. చిన్ననాటి ఆప్తమిత్రులను కూడా అపార్థం చేసుకున్నాడు. తన చదువు, సంస్కారం విచక్షణ అలోచనా శక్తి ఏమైపోయాయి. ఇలా చేసిన తప్పులు మనసుకి తెలుస్తున్నాయి. కాని లత దాష్టికం ముందు తన బేలతనం నిలబడలేదు.

ఈ ఆలోచనతోనే పన్నెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. మనసుకి నైరాశ్యం కలిగింది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మనశ్శాంతి కోల్పోయి జీవచ్ఛవంలా మారటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

పి.యఫ్. మొత్తం ఒకేసారి తీసుకోగానే లత తన పేరు మీద బ్యాంక్‌లో వేయించుకుంది. ఇక నెలనెలా వచ్చే ఆదాయమంటూ ఏమీ లేకుండా పోయింది. వట్టిపోయిన గొడ్డు లాంటి మోహన్‌ను లత పూర్తిగా పట్టించుకోవటం మానేసింది. ఆమెకెంత సేపూ పార్టీలు, తల్లిదండ్రులు అంతే. కనీసం మోహన్ తిన్నాడో లేదో కూడా చూసేది కాదు. క్రమేపి మోహన్‌కి జీవించాలన్న కోరిక నశించి, తన పనులు తాను యాంత్రికంగా చేసుకుంటున్నాడు.

ఒక రోజు ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నవాడు తనకు తెలియకుండానే అక్కడ ఒక రామాలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ ప్రవచనం జరుగుతుంటే వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. పురాణగతంగా ప్రవచనకర్త ‘కర్మ సిద్ధాంతం’ వివరిస్తున్నాడు.

“మనం చేసిన మంచి చెడు కర్మల ఫలం మనమే అనుభవించాలి. మనకు కలిగే సుఖాలు, కష్టాలు అన్నీ మనం చేసిన కర్మల ఫలితాలే. అవి ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా అనుభవించక తప్పదు” అని ఆయన వివరిస్తున్నారు.

ఇది వింటున్న మోహన్‌కి ఒక్కసారిగా ఎవరో తన మస్తిష్కాన్ని కుదిపినట్లు అనిపించింది. తను అనుభవిస్తున్న ఒంటరితనం, కారణం తన వాళ్ళందరినీ దూరం చేసుకోవటం. ఎలా దూరం చేసుకున్నాను. నేను చేసిన పాపమేమిటి.

అంతర్మథనం సాగుతోంది. మనసులో తళుక్కున మెరిసింది మాధవి. అవును మాధవి, తన చెల్లెలు మాధవి. తను చేసిన చిన్న సాయం గుర్తుపెట్టుకుని, లత ఎన్ని మాటలు అన్నా భరించిన మాధవి. అటువంటి మాధవితో అనుబంధం తెంచుకుంటానని ఒట్టువేసిన కొద్ది గంటలలోనే లత కడుపులో బిడ్డ కడుపులో కరిగిపోయింది. అప్పుడైనా తనకు అర్థం కాలేదు.

మాధవి పరిచయమైన తరువాత ప్రతి శ్రావణ పౌర్ణమినాడు తప్పకుండా తనకి రాఖీ కట్టి తను స్వయంగా చేసిన స్వీట్ తినిపించేది. ఆ ఆప్యాయతని తను మర్చిపోయాడు. తన ఇంటి ఆడపడుచు మాధవిని తనే బాధపెట్టాడు. లత బాధపెడితే తట్టుకుంది. కాని తను బాధపెట్టి అనుమానించి, అవమానిస్తే ఆమె మనసు విరిగిపోయింది. ఇంటి ఆడపడుచు కన్నీళ్ళు ఆ ఇంటికి కలిసిరావు. అవును తనకు కష్టాలు మొదలయ్యాయి.

ఇప్పుడు మోహన్ మనసులో ఆలోచనలు ఒక రూపు సంతరించుకుంటున్నాయి. అంతలో మళ్ళీ ప్రవచనం చెవుల పడింది.

“తప్పులు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు. కానీ ఎవరైతే నిష్పక్షపాతంగా ఆత్మవిమర్శ చేసుకుని తప్పులని తెలుసుకుని అవి సరిదిద్దుకుంటారో వారు మహోన్నతంగా ఎదుగుతారు. చేసిన తప్పులు గ్రహించి పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళన చేసుకుని, భగవంతుని ప్రార్థించేవారికి, ఆ తప్పుల నుంచి పాపాల నుంచి బయట పడే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు” అని చెబుతున్నారు ప్రవచనకర్త.

అవును తను తప్పులు చేయడం మాధవితోనే మొదలు. కాబట్టి తను మాధవిని క్షమించమని అడగడంతోనే తన పాపప్రక్షాళన జైత్రయాత్రకి శ్రీకారం చుట్టాలి అనుకుని, మనసారా శ్రీరామచంద్రమూర్తిని తలచుకుని చెంపలు వేసుకున్నాడు. తనకి దారి చూపమని ప్రార్థించాడు. దాంతో మోహన్ మనసు, మొహము తేటపడ్డాయి.

మరునాడు అనుకోకుండా ఒక పాత స్నేహితుడు కనిపించి శ్రీకర్ వాళ్లు హైద్రాబాద్‌లో ఉంటున్నారని ఎడ్రస్ ఇచ్చాడు. ఇది దేవుడి అనుగ్రహంగా భావించిన మోహన్ ఆ రోజు రాత్రి రైలుకే బయలుదేరి హైద్రాబాద్ వెళ్ళి తిన్నగా శ్రీకర్ ఇంటి తలుపుతట్టాడు.

గతాన్ని మొత్తం చెబుతుంటే మోహన్ కళ్ళు తడుస్తూనే వున్నాయి. మాధవికీ కన్నీళ్ళు ఆగలేదు. “అమ్మా మాధవి, నిన్ను బాధపెట్టినందుకు క్షమించుమ్మా” అని బావురుమన్నాడు. మోహన్ బాధ చూసి మాధవి చలించిపోయింది. “మనలో మనకి క్షమాపణలు ఎందుకన్నయ్యా. నీకు నిజం తెలిసింది. అంతే చాలు ఊరుకో” అని ఎంతో సముదాయించింది.

అప్పటికే శ్రీకర్ వచ్చి చాలా సేపయ్యింది. మోహన్ చెబుతున్నది వింటూ వరండాలోనే ఆగిపోయాడు. మాధవితో పాటు శ్రీకర్ కూడా చాలా ధైర్యం చెప్పాడు. వారి మాటలతో మోహన్ కొంత సేద తీరాడు.

చేసిన తప్పులు సరిద్దుకోవటానికి క్షమాపణలు చెప్పి తన వాళ్ళని దగ్గిరకు చేసుకోవటానికి వెళ్తునట్లు చెప్పాడు.

“అన్నయ్యా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నిన్ను దూరం చేసుకోరు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని తెలియగానే సంతోషంతో అందరూ నీకు దగ్గరవుతారు” అన్నది మాధవి నిండు మనసుతో.

మాధవి శ్రీకర్‌ల ఆప్యాయతకి మోహన్ మనసు శాంతించింది. తన జీవితంలో మళ్ళీ సంతోషం వస్తుందనే ఆశ కలిగింది. ఆ ఆనందంతోనే తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పకోవటానికి బయలుదేరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here