సుప్రసిద్ధ కవి దాసరాజు రామారావు గారు 2013 -2017 మధ్య వ్రాసిన 54 కవితల సంపుటి ఇది. మంజీరా రచయితల సంఘం వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
***
“ఒక ఊహ/ఒక స్పృహ/ఒక రహస్యానంతర జిలుగు/ఒకానొక మైమరపించే మేల్కొలుపు/కవిత్వం” అనడంలో కవిత్వం తనకెంతో ప్రియమో చెబుతున్నారు కవి.
“అక్షరం.. కాలం.. మనిషి/చెట్టాపట్టాలేసుకొని నడిచే/సహజ జీవన దృశ్యం/నేను గెలుచుకునే కల” అంటూ ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు.
“రాజుగారి వేషం తడిపి/బికారి గాడి దేహం తడిపి/ఒక్క ముద్దగా/ఒక్కతీరైన పులకరింతగా” వానా కురిసిన తీరుని ‘చినుకొకపరి’ కవితలో వివరిస్తారు.
“నువ్వు/నూరంకెలు లెక్కబెడుతున్న బతుకుచుట్టూ/మూగిన ఆశయానివి./నీ అడుగులకు మరింత/నూరేళ్ళ బలాన్నద్దుతున్న/నేను/శిల్పాన్ని” అంటారు ‘మనిద్దరమొక పద్యం’ కవితలో.
‘జాతర’ కవితలో “కండ్లు మలుపనియ్యని/కళలు నేర్వనియ్యని/వీడియోగేముల్ల తల దూర్చిన నా చిన్నారులకు/నా బాల్యపు జాతర చూపించడానికి/పుల్లూరుకు పోవాల్సే ఉంది” అంటూ తన చిన్ననాటి జాతరను వివరిస్తారు.
“మట్టి జిగితో/ఆకాశపు చెమ్మతో/తలంపుల మరువపు అల్లికతో/ప్రేమిద్దాం…/బ్రతుకుని,/అంతకు మించి కవిత్వాన్ని” అంటారు ‘మోహనం’ కవితలో.
జీవితంలో అనేక సందర్భాలలో ఎదురయ్యే ప్రశ్నలను తలచుకుంటూ “ప్రశ్న మధురం గనే/మభ్య పెట్టడానికి చూస్తుంటది ఒక్కోసారి” అంటారు ‘ప్రశ్న… ప్రశ్న గనే’ కవితలో.
పచ్చదనం కోసం పరితపిస్తున్న కవి “గోడలు కట్టి ఇరికిరికైన హృదయంలో/ఒక విత్తు నాటిన -/యిక అప్పట్నుంచీ,/ ఉదయమవ్వటం కోసం ఆకాశం/ఎదురు చూచే స్థితిలో, నేను కూడా” అంటారు ‘ఆకుపచ్చని శ్వాస’ కవితలో.
‘అమ్మ సంతకం’ అనే కవితలో తల్లి ఋణం తీరేది కాదని చెబుతూ “నాన్న పాత్రను, నీ పాత్రను పోషించీ, పోషించీ/అలసిపోయావనుకుంటా/ఏ పూట ఏం మాట్లాడాలో/తెలియని అపసవ్యం గాళ్ళం/శారీరక నొప్పులకే జడిసిపోతం/బతుకునొప్పి గురించి నువ్వెంత చెప్పినా/అర్థం కాలేదప్పుడు” అంటారు.
“దుకాండ్లు తెరుస్తున్నారు/పోటీలు మొదలైనాయి/అమ్మడం కొనడం గొప్పపని కిందే లెక్క” అంటారు ‘దృశ్యభ్రమణం లోంచి’ అనే కవితలో.
“నిజానికి, మృత్యువు/స్నేహశీలి/ప్రేమమయి/దిగమింగలేని దుఃఖంలో మునిగినప్పుడు/జీవితం మొత్తానికే రద్దనుకొన్నప్పుడు/ఒళ్ళో పెట్టుకుని, సేద తీరుస్తది” అంటారు ‘మృత్యు గానం’ అనే కవితలో.
ఇంకా చక్కని కవితలెన్నో ఉన్నాయి ఈ సంపుటిలో.
***
విరమించని వాక్యం (కవిత్వం)
దాసరాజు రామారావు
పేజీలు : 130, ధర : ₹ 60/-
ప్రచురణ: మంజీరా రచయితల సంఘం
ప్రతులకు : పాలపిట్ట బుక్స్, 16-11-20/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ, సలీమ్ నగర్, మలక్‌పేట్,
హైదరాబాద్ – 500036. ఫోన్ : 040-27678430