“మల్లేశం” పోగుబంధం కట్టిపడేస్తుంది

1
5

[box type=’note’ fontsize=’16’] “నిజంగా తెలుగు సినెమాకు మంచి రోజులు వచ్చాయి అని నమ్మకం కలిగిస్తుంది ఇది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని నేను రెకమెండ్ చేస్తాను” అంటున్నారు పరేష్ ఎన్. దోషిమల్లేశం‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సినెమాలు మంచివి రావట్లేదు అని వాపోతున్న రోజులలో ఈ చిత్రం రాక వో చల్లని వార్త. నిజంగా తెలుగు సినెమాకు మంచి రోజులు వచ్చాయి అని నమ్మకం కలిగిస్తుంది ఇది. ఈ బయోపిక్కుల కాలంలో మరో బయోపిక్కు. అయితే ఇందులో నాయకుడు జీవితం కంటే పెద్ద పరిమాణంలో వుండడు, హీరోగిరి వుండదు, వ్యాపార సినెమాలకుండే మసాలాలూ వుండవు. నిజంగా ఆ పల్లెలో ఆ జీవితాలను వీక్షిస్తున్నట్టు వుంటుంది.

నల్లగొండ జిల్లాలోని వో వూరు. ఆరో తరగతి చదువుతున్న మల్లేశం. వాళ్ళది నేతపని. తండ్రి మగ్గం దగ్గర కూర్చుంటే, తల్లి దారాన్ని ఆసు పోసి దారాలు రకరకాల డిజైన్లు చేసి చీరకు సిధ్ధం చేస్తుంది. అయితే తల్లి చేసే పని చాలా కష్టమైనది, భుజాలు నెప్పి పెడతాయి, క్రమంగా అక్కడి యెముకలు కూడా అరిగిపోతాయి. ఇంత కష్టం చేసినా వచ్చే డబ్బు అంతంత మాత్రం. దళారీల దయా దాక్షిణ్యాల మీద ఆధారం వాళ్ళ బతుకు. చేసిన అప్పులు తీర్చలేక, ఇల్లు గడవడం కష్టం అయ్యి మల్లేశాన్ని ఆరుతోనే చదువు మానిపించేస్తారు. ఇంట్లోనే తల్లిదండ్రులకు సాయపడుతుంటాడు. తల్లి కష్టం చూడలేడు. ఆమె పనిని తేలిక చేయడానికి వొక యంత్రం తయారు చేయగలిగితే కష్టాలు తీరుతాయి కదా అని వొక ఆలోచన. అది పురుగులా మెదడును తొలుస్తూనే వుంటుంది. అప్పులు చేసి రకరకాలుగా ప్రయత్నం అయితే చేస్తాడు కాని ఫలితం వుండదు. ఇతని ఈ పిచ్చి మాన్పించడానికి పెళ్ళి చేస్తే సరి అంటారు వూళ్ళో వాళ్ళు. అదీ అవుతుంది. కాని వచ్చిన భార్య అతన్ని అర్థం చేసుకుని అతనికి దన్నుగా నిలబడుతుంది. వూళ్ళో యెవరూ అర్థం చేసుకోకపోగా ఆటలు పట్టిస్తూ వుంటారు. అప్పు పుట్టదు. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇక లాభం లేదని హైదరాబాదుకు మారతారు మల్లేశం (ప్రియదర్శి) అతని భార్య పద్మ (అనన్య). అక్కడ చెక్క నమూనా సరీయినది కాదని తెలుసుకుని స్టీలుతో మొదలు పెడతాడు. భార్య కడుపుతో వుంటే ఆ ఆరునెల్లు ఆమెనే చూసుకోవాల్సి వచ్చి యంత్రం మీద పని కొనసాగించలేడు. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెడతాడు కాని అడుగడుగునా ఆటంకాలే. ఓటమి వొప్పుకోని వ్యక్తిత్వం వున్న మల్లేశం యేడు సంవత్సరాలపాటు ఏకదీక్షతో ఆ యంత్రం మీదేఅ పని చేసి చివరికి ఫలితం సాధించి, తన వూరిలో అందరి ముందూ దాన్ని ప్రదర్శించి అందరి మెప్పూ పొందుతాడు.

ఇది టూకీగా కథ. వొక వ్యక్తి తీవ్రోత్సాహమూ, శ్రధ్ధ, అకుంఠిత దీక్ష మాత్రమే కాదు ఈ చిత్రం చూపేది. మన పల్లెలలో చేనేత నెమ్మదిగా కనుమరుగు అయ్యే పరిస్థితికి కారణాలు, చేనేత కార్మికుల కష్టాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. చిత్రం మొదలు అవడమే అప్పుల్లో కూరుకు పోయిన వో చేనేత కార్మికుని కుటుంబం కుటుంబం కలిసి ఆత్మహత్యలు చేసుకోవడంతో మొదలవుతుంది. అలాంటి నేపథ్యంలో వొక యువకుడు దీక్షగా తమవారి కష్టాలను తగ్గించి, చేనేత పరిశ్రమకు ప్రోత్సాహంగా వుండేలా యంత్రాన్ని కనిపెట్టి దారి దీపం అవడం చాలా పెద్ద విషయం.

ఇక ముందుగా ఈ మంచి చిత్రానికి క్రెడిట్ దర్శకుడు రాచకొండ రాజ్ కు ఇవ్వాలి. అవకాశం వున్నా చిత్రాన్ని కేవలం కథ చుట్టూ అల్లి, అనవసరపు హంగులూ ఆర్భాటాలను దూరం పెట్టాడు. హీరో కూడా వొక సామాన్యుడిలా కనిపిస్తాడు, యెక్కడా హీరోగిరి వుండదు. పాటలు వున్నా అవి నేపథ్యానికి తగ్గట్టుగా చాలా అందంగా వున్నాయి (గోరటి వెంకన్న, అశోక్, దాశరథి). ఇంకొక విషయం యేమిటంటే దర్శకుడు యెలాంటి ప్రత్యేకమైన శైలిని సృష్టించి సినెమా తీసే ప్రయత్నం చేయలేదు. కథ తనే పాఠకుడిని చేరుతుంది అని యెంత నమ్మకముంటే ఇంత సాదా సీదాగా కథను చెప్పగలుగుతాడు. హిందీలో ఈ మధ్య “ప్యాడ్‌మేన్” వచ్చింది. మంచి చిత్రమే. కాని వొక వ్యాపార సినెమా మూసలో వుంది. అందుకే ఆ చిత్రం కంటే కూడా ఆ టెడ్ స్పీచ్ యెక్కువ ఆకట్టుకుంటుంది. తెలంగాణ పల్లెలు ఆ కాలంలో యెలా వుండేవో అలాగే మన ముందు పెట్టగలగడానికి యేలే లక్ష్మణ్ గారి వల్లే సాధ్యమయ్యింది. ఇక తెలంగాణలోని సాంప్రదాయాలు, పధ్ధతులు అన్నీ చాలా చక్కగా వున్నాయి. నాకైతే వొక్క సారి చూడటంతో సరిపోలేదు, మరో సారి చూస్తే గాని పూర్తిగా బోధపడదు. అదే నా వయసు తెలంగాణ వాసులు, అదీ పల్లెలు చూసిన వారికి ఇది చిటిక వేసినంత తేలికగా అర్థమవుతుంది. ఈ మధ్య వస్తున్న తెలంగాణ చిత్రాల కంటే ఇందులో సంభాషణలు చాలా సహజంగా, మెరుగ్గా వున్నాయి. ఆ గొప్పతనం పెద్దింటి అశోక్ కుమార్ గారిది. మార్క్ రాబిన్ సంగీతం, బాలు శాండిల్య చాయాగ్రహణమూ చాలా చక్కగా వున్నాయి. “దాసి” చిత్రం తర్వాత ఇందులో అచ్చమైన తెలంగాణం వింటున్నట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే వో ఆరేడు సంభాషణలు నాకు అందలేదు కూడా. పల్లెల చిత్రీకరణ లో వంకలు లేవు. 1990ల కాలపు హైదరాబాదు చూపడం కష్టం కాబట్టి, కొన్ని సందుల్లో చిత్రీకరించి, కొన్ని క్లోజప్లతో మేనేజ్ చేశారు.

నటన విషయానికి వస్తే ప్రియదర్శి చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల అతని passion, perseverance ఇంకా బలంగా చూపగలిగివుంటే బాగుండేది అనిపించింది. వొక నాయకుడిగా కాక ఆ పాత్రలో ఇమిడిపోయి చేసినందుకు అభినందించాల్సిందే. ఝాన్సి గారు యెప్పటిలా చాలా బాగా చేశారు. అలాగే అనన్య. ఈమెనుంచి మరిన్ని గొప్ప చిత్రాల ఆశలు పెట్టుకోవచ్చు. ఆనంద్ చక్రపాణిగారు కూడా సహజంగా నటించారు. ఇక నటనలో రెండు ప్రత్యేక వ్యాఖ్యానాలు అవసరం. వొకటి స్నేహితులుగా జగదీశ్, అన్వేశ్ లు అసలు నటులుగా కాకుండా ఆయా పాత్రలుగానే సహజంగా కనబడ్డారు. తర్వాత చెప్పుకోవాల్సింది మరో ఇద్దరి గురించి. వొకరు తిరువీర్. చాలా చిన్న పాత్ర అయినా మరచిపోలేని విధంగా చేశాడు. థియేటర్ అతనికి బాగా ఉపయోగపడినట్టుంది. మరో పాత్ర వొక ముసలమ్మ పాత్ర. పేరు తెలీదు. “నే చెప్పలా మిషినీ పని చేసుద్దని” అనే ఆవిడ. ఆమెను యేదన్నా నాటక రంగం నుంచి తెచ్చారో, మరొకటో తెలీదు గాని ఆమె కూడా మరపు రాదు. ఆమెను చూస్తే నాకు ఇద్దరు గుర్తుకొచ్చారు. పథేర్ పాంచాలిలో చున్ని బాలా దేవి. ఆమె నాటక రంగంలో పేరున్న మనిషి. రెండో ముసలామె “ఖోస్లా కా ఘోస్లా” లో వొక ముసలామె. యెక్కడా మోసం లేదు కదా అని నిర్ధారించుకోవడానికి సైట్ కు వెళ్తాడు బమన్ ఇరాని, అక్కడ వాచ్మన్ గది బయట వో ముసలామె వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తుంది. వొక్క మాటా మాట్లాడదు. వాస్తవానికి ఆమె నాటకాల్లో చేసే మనిషి. ఇలా చిన్న చిన్న సంగతులు ఈ చిత్రంలో చాలా వున్నాయి. ఇక నా అభిప్రాయంలో పుస్తకాలకు glossary, footnotes వున్నట్టు ఈ చిత్రంలో వున్న తెలంగాణ ప్రత్యేకతలు యెవరన్నా వివరిస్తే ఇతరులకు ఇంకా బాగా అర్థం అవుతుంది. రెకార్డ్ చేసినట్టు కూడా వుంటుంది.

ఈ చిత్రంలో మల్లేశం సాధించింది కొంతవరకే చూపారు. అతను యేడో తరగతి ప్రైవేటుగా కట్టి పాసయ్యి, తర్వాత పదో తరగతి మూడు ప్రయత్నాలలో పాసయ్యి మొదటగా తయారు చేసిన నమూన ఈ చిత్రం లో వుంది. దీన్నే మరో రెండుసార్లు మెరుగు పరిచాడు. దానికోసం ఇంజనీరింగ్, కంప్యూటర్ పుస్తకాలు కొనుక్కుని కష్టపడి చదివి, అర్థం చేసుకుని మెరుగైన అధునాతన యంత్రాలు చేశాడు. ఇప్పుడతను అసెంబ్లీ లేంగ్వేజ్ లో కోడ్ వ్రాయగలుగుతున్నాడంటే వూహించుకోండి. ఈ చిత్రం చూశాక అతని టెడ్ స్పీచ్ తప్పకుండా చూడండి.

ఇక ఈ చిత్రంలో లోపాలు లేవా అంటే వున్నాయి. కాని పట్టించుకో తగ్గవి కావు. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని నేను రెకమెండ్ చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here