మనసులోని మనసా-44

1
4

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]నా[/dropcap]లుగున్నర నెలలు శలభాల్లా మాడిపోయాక – వడదెబ్బ తగిలి సోలిపోయి – ఎందరో ప్రాణాలు వదిలేశాక – ఎట్టకేలకు నిన్న మొదటిసారిగా చల్లగాలులతో మురిపిస్తూ యముడి గాలంలో ఇరుక్కుపోతున్న ప్రాణాల్ని వెనక్కి రప్పిస్తూ చల్ల చల్లగా కురిసింది తొలకరి జల్లు!

ఆహా, ‘ఏమి హాయిలే హలా!’ అంటూ సర్వ ప్రాణికోటి సేద తీరింది.

అసలు ప్రకృతి నుండి లభించే చల్లగాలి ముందు ఏ ఏ.సీ.లు ఆగుతాయి? బయటకి రాకుండా… రాలేక తలుపులు మూసుకుని ఏ.సీ. గాలులతో చీదరెక్కిపోయి పిచ్చి చూపులు చూస్తూ… అప్పుడప్పుడు ముఖ పుస్తకంలోకి పేలవంగా చూస్తూ ఒక్కో క్షణాన్ని వెనక్కి తోయడం ఎంత గగనమైపోయిందో!

ఏమైతేనేం… చినుకులు పడ్డాయి.

పెనం మీద అట్టులా వుడికిన భూమి చల్లబడింది.

మురికితో మూసుకుపోయిన యావత్ప్రకృతి కడగబడి అద్దంలా మెరుస్తోంది!

నిజంగానే హాయి, హాయి, హాయీ!

నేను చిన్నతనం నుండి ప్రకృతి ఆరాధకురాలిని!

సహజసిద్ధమైన అడవులంటే నాకు ప్రాణం!

అసలు ప్రకృతే దేవుడని (దేవత) భావిస్తాను.

అడవుల్లో కురిసే వాన అందాలని వర్ణించడానికి పదాలు చాలవు!

అది కళ్ళతో గ్రోలి మనసుని నింపుకోవాల్సిందే!

నాకు వర్షమన్నా, నీళ్ళన్నా కూడా చాలా ప్రీతి!

చిన్నతనంలో ఎక్కడ నదులు చూసినా బావులు చూసిన దిగిపోతుండేదాన్ని. దాని వలన వచ్చే ముప్పు ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు.

మా నాన్నగారు పనిచేసే చోట మాచర్ల, నాగలేరుల్లో ఈతకి వెళ్లిపోతుండేదాన్ని.

ఈ విషయంలో మా అమ్మగారిని చాలా బాధపెట్టేదాన్ని పాపం! తన్నులు తినేదాన్ని.

ఒకసారి ఒంగోలులో మా అమ్మగారు నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంటి వెనక వైపు సంతచెరువు వుండేది. ఇప్పుడు నాకు అయిదేళ్ళ వయసు వుంటుంది. అమ్మ వాళ్లు కబుర్లలో వుండగా నన్ను పక్కింటావిడ రమ్మని పిలిచింది. నేను వాళ్ళింట్లోకి వెళ్ళిపోయాను. ఆమె పెరటి గుమ్మం తలుపు తీసింది. అక్కడ డైరెక్టుగా చెరువులోకి మెట్లు వున్నాయి. ఇంకేముంది – చెరువు చూడగానే మైమరపు!

వెంటనే కూర్చొని నోట్లో వేలేసుకుని తదేకంగా చెరువుని చూస్తూ కూర్చున్నాను.

నా చెవులకి లోలాకులు, మెడలో గొలుసు, చేతులకి వెడల్పు పూలూ, ఆకులూ నగిషీలు చెక్కిన గాజులు వున్నాయి. ఇవి ఎప్పుడూ మా అందరికీ వుండేవి. అప్పట్లో దొంగల భయం అంత వుండేది కాదేమో మరి!

చీకటి పడిపోతున్నది. చెరువులోకి నీడలు ప్రాకుతున్నాయి.

నీటిని చూస్తుంటే ఒకలాంటి భయమూ, ఆకర్షణా!

అమ్మ తిరిగి వెళ్ళిపోదామని నాకోసం చూస్తే నేను కనబడలేదట! చివరికి ఈవిడ మీద అనుమానం వచ్చి అమ్మ వచ్చి అడిగిందట!

ఆమె “ఇక్కడికి రాలేదు” అని చెప్పిందట!

అమ్మ అనుమానంతో మళ్లీ తిరిగొచ్చి ఆమె చేతులు అడ్డం పెట్టినా, బలంగా తోసేసి పెరటి గుమ్మం తలుపు తీసి నన్ను చూసి అక్కడే నన్ను చావగొట్టి – ఆమెను లాగి ఒకటి కొట్టిందట!

అందరూ మూగి ఆమెను కొట్టినంత పని చేసేరుట!

ఆ రోజు అమ్మ ధైర్యంగా తెగించి రాకపోతే నా పని అయిపోయి వుండేది!

అయినా నాకేమీ నీటి పిచ్చి వదలలేదు.

చంద్రవంకలో ఈతలు కొట్టి రంగు రంగు సుద్దలు ఏరుకొచ్చేదాన్ని.

మా చిన్నప్పుడు తరచూ కాకినాడలో తుపానులు వస్తూనే ఉండేవి.

“ఈ మాయదారి తుపాను ఎన్నాళ్లో! వెళ్లి ఎన్ని బుట్టలు కట్టేరో చూసి రండి!” అనేది మా అరుంధతత్త.

మేం పరుగున ఆ వాన నీటిలో అవకాశం దొరికిందని ఆడుకుంటూ, వర్షంలో తడుస్తూ చర్చి స్క్వేర్‌లో నిలబడి దూరంగా కనపడే తుపాను హెచ్చరికని గమనించే వాళ్ళం. అక్కడ మాకు మూడు బుట్టల్లా కనపడితే సీరియస్ తుపాను హెచ్చరికన్నమాట!

మేం సంబరంగా ఎగురుకుంటూ వచ్చి “అత్తా తుఫాన్ ఇంకా ఉందోచ్!” అని ఆనందంగా చెప్పేవాళ్లం!

“మాయదారి వర్షం! వదలడం లేదు” అని అత్త తిట్టుకుంటుంటే మాకు నవ్వొచ్చేది.

ఒకసారి మా పెదనాన్న ఉప్పెన వస్తుందని హెచ్చరికలు చేసి మమ్మల్నందర్నీ ఎత్తరుగుల ఇంట్లో కూర్చోబెట్టి టార్చిలైట్ పట్టుకొని రాత్రంతా కాపలా కాస్తూ కూర్చున్నారు.

మేం మాత్రం అది రావాలని, చూడాలని ఉబలాటంగా కూర్చున్నాం.

అది పైనుండి వస్తుందని పెద్దవాళ్ళు చెప్పడంతో అటకల వైపు చూస్తూ కూర్చున్నాం.

కెరటాలు ఉవ్వెత్తున తాటి ప్రమాణంతో లేస్తాయని తెలియక అటకల మీదనుండి ఇంట్లోకి వస్తాయని అనుకునేవాళ్లం.

చివరికి ఆ ఉప్పెన చూసే భాగ్యం కూడా నాకు పట్టింది.

ఎంతయినా నాది అదృష్ట జాతకం!

1977 మహమ్మారి ఉప్పెన చూసే భాగ్యం కూడా కల్గింది నాకు.

అప్పుడే హైదరాబాద్ వచ్చాను.

ఇక్కడ పరిచయాలు లేవు.

ఏ రెండు రోజులు శెలవొచ్చినా ఊరు వెళ్లిపోవాలనిపించేది.

అలాగే శనివారం దొరికిన బస్సు ఎక్కేసి తెనాలి బయలుదేరేం!

ఒక చిన్న సూట్‌కేసు, మేమిద్దరం!

నాగార్జునసాగర్ మీదుగా ప్రయాణం!

చందమామ మసకగా కనిపిస్తున్నాడు.

చల్లగా వుంది వాతావరణం!

వర్షం లేదు.

సాగర్ దాటాక డ్రైవరుకి, కండక్టరుకి ఒక సందేహం వచ్చింది. ఎదురు ఒక్క వెహికల్ కూడా రావడం లేదు.

మాచర్లలో అడిగారు.

“ఏమో అన్నా! అటు నుండి బళ్ళు రావడం లేదు” అన్నారు వాళ్ళు.

సత్తెనపల్లి దాకా వచ్చాం. ఇక అసలు కథ మొదలైంది.

ఏనాడో వేసిన మహా వృక్షాలు కూకటివ్రేళ్లతో పెకిలింపబడి రోడ్డుకడ్డంగా పడి వున్నాయి.

నిర్ఘాంతపోయేం!

ఒక్కోచోట బస్సులు ఆ ట్రంక్ క్రింద నుండి వెళ్లాయి.

“రాత్రి ఉప్పెన వచ్చింది. తెల్లారి ఆగిపోయింది” అని చెబుతున్నారు జనం.

ఒక్కో చోట వారి మానవత్వానికి కళ్ళు చెమర్చాయి.

గొడ్డళ్ళు తెచ్చి కొమ్మలు నరికి – బస్సులకు దారి ఏర్పాటు చేశారు. అలా ఇరవై బస్సులు ఒకదాని వెనుక ఒకటిగా మెల్లిగా నడిచాయి.

పిడుగురాళ్ల దగ్గర ఏరు పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నది.

అన్ని బస్సులు ఆగిపోయాయి. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. పాలూ, నీళ్ళూ ఏమీ దొరకడం లేదు.

బస్సులో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు.

చివరికి, ధైర్యం చేసి ఒక లారీ ఏట్లోకి నడిచింది.

దాని వెనుక బస్సులు!

అలా గండం గడిచి ప్రొద్దుట చేరాల్సిన గుంటూరు సాయంత్రానికి చేరాం.

గుంటూరు వస్తుండగా జరిగిన దారుణం స్పష్టంగా కనిపిస్తున్నది. చెట్లన్నీ కూలిపోయాయి. ఎలక్ట్రిక్ పోల్స్ మనం పెట్టుకునే చెంపపిన్నుల కన్నా అద్వానంగా వంకర్లు తిరిగి పోయాయి.

ఎటు చూసినా మనుషుల శవాలు – పశువుల మృత కళేబరాలు! గుంటూరులో కరెంటు లేదు, నీళ్ళు లేవు!

ప్రతి పెంకుటింటి కప్పు కూలిపోయి వుంది!

తెనాలి వెళ్ళడానికి బస్సులు లేవు, రైళ్ళు లేవు!

ఏం చేయాలో తోచక నిర్ఘాంతపడి నిలబడి పోయాం.

సరిగ్గా అప్పుడే ఒక నడివయసు దంపతులు ఒక ఆటో మాట్లాడుకుని నందివెలుగు వెళ్తూ మమ్మల్ని ‘వస్తారా’ అని అడిగారు. ఎగిరి గంతేసి ఎక్కి కూర్చున్నాం.

వాళ్ల అబ్బాయి సైకిల్ మీద వస్తున్నాడు.

వాళ్ల అమ్మగారు నందివెలుగులో ఇల్లు కూలిపోయి చనిపోయారట. వాళ్లు ఎంతో ఔదార్యంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు.

ఉప్పలపాడు వచ్చింది.

సంజె వెలుగు!

అక్కడ దాదాపు ఊరు ఊరంతా ఉప్పెన ధాటికి చనిపోయారు!

రోడ్డుకి అటూ ఇటూ రెండు కిలోమీటర్ల పొడవునా పసిపిల్లల నుండి వృద్ధుల దాకా శవాలు బారులుగా పడుకోబెట్టారు.

నేనెప్పుడూ శవాన్ని చూస్తే వణికి పోతాను.

నాకా ఫోబియా వుంది.

చిన్నప్పుడు ఇప్పుడైనా ఖర్మ కాలి చూస్తే నెల రోజులు గజ గజే!

వెంటనే మా అమ్మ పక్కలో దూరి పోయేదాన్ని!

“ఏంటి ఇలా వచ్చావ్! ఏం చూసి చచ్చావ్!” అనేది అమ్మ. ఆమెకూ తెలుసు!

ఆమెను గట్టిగా పట్టుకునిదాన్ని.

ఇప్పుడు ఒక్కసారి అన్ని శవాలు చూసినా భయం వెయ్యలేదు.

‘వీళ్ళంతా నా వాళ్లు – ఇంత అన్యాయంగా చనిపోయారు’ అని ఏడుపొచ్చేసింది.

కొంచెం ముందుకి వెళ్ళాక పద్నాలుగు కిలోమీటర్లు ఒక పెద్ద మహా సముద్రంలా నీరు!

“ఆటో ఇంజన్ లోకి నీళ్లు వెళ్తాయి. ఇక ముందుకు వెళ్ళదు” అని చెప్పాడు డ్రైవర్.

ఏం చేయాలో తోచలేదు.

“మేము ఎలాగైనా వెళ్లాలి. మీరు వస్తారా?” అని అడిగారు వాళ్ళు.

ఇక ఏం చేస్తాం! మరో దారి లేదు. గుంటూరులో ఆశ్రయం పొందే పరిస్థితి లేదు. “సరే” అన్నాం!

“దిగుడు బావులుంటాయి. మా వెనకే నడవండి” అంటూ వాళ్లు కర్రపోటు వేస్తూ మమ్మల్ని నడిపించారు.

అదృష్టం కొద్దీ వెన్నెల వచ్చింది.

నిన్న అంత ప్రళయం వచ్చినా ప్రకృతి నంగనాచిలా మామూలుగా వుంది.

వారి వెనకే గుండె దాకా వచ్చిన నీటిలో నడుస్తున్నాం. లోతు పెరిగితే మునుగుతామేమో తెలియదు. వీటిలో అడ్డంగా, మానవ దేహాలు, పశువుల కళేబరాలు, పాములూ కొట్టుకు వస్తున్నాయి. వాటిని తప్పించుకుంటూ నడుస్తున్నాం.

విరిగిపోయిన కల్వర్టులు, చిన్న బ్రిడ్జీలు దాటుతున్నాం – వెన్నెల తోడుగా. వాళ్లు మాకు భయం లేకుండా కబుర్లు చెబుతున్నారు.

చిన్నగా రాత్రి రెండు గంటలకి నందివెలుగు చేరేం. వాళ్ళు అక్కడ మాకు ఒక రిక్షా మాట్లాడి ఎక్కించారు.

దూరంగా కాలేజీలో ఆశ్రయం పొందుతున్న జనాల గోల వినిపిస్తున్నది.

అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంగా ఉన్న తెనాలికి ఆ కటిక చీకటిలో చేరుకొన్నాం.

దారి పొడుగునా ఎన్నో అనుభవాలు! ఎన్ని రోజులో ఏడ్చేదాన్ని!

తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని నిరాశ్రయులైన పిల్లలు!

ఆశ్రయం ఇస్తామని తీసుకొచ్చి పనిపిల్లలుగా మార్చి వాతలు పెట్టిన కసాయిలు!

ఎన్నో! ఎన్నో!

దెబ్బకి నా నీటి సరదా తీరింది!

కొన్నాళ్ళు తలచుకొని ఒళ్లు గగుర్పొడిచినా తర్వాత కాలంలో నాకొక ఎడ్వెంచర్‌లా మిగిలింది.

ఆ అనుభవంతో ‘ఆడపిల్ల’ అనే కథ ఆంధ్రభూమి వార పత్రికలో రాశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here