[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]
దృశ్యం-9
[dropcap](రూ[/dropcap]ప Flash back పూర్తయి, రంగస్థలం మీద తిరిగి పాత దృశ్యమే కానవస్తుంది. రూప, శారిక నిల్చున్నారు. శారిక ముందుకొచ్చి రూప భుజంపైన చెయ్యి ఉంచితే, రూప దానిని ప్రేమగా నిమురుతుంది.)
రూప : (తనలో తనే మునిగిపోయి) జరుగుతున్న కాలం, తన వెనక జమ్మూ లోనో, దిల్లీలోనో మండుతున్న వాకిట్లో తడిపాదాల గుర్తుల్లాటి క్షణాలను వదిలివెళ్తుంది!
శారిక : అవును కుప్పలకొద్దీ కేసెట్లులో స్మృతుల చిన్న-చిన్న ముక్కలు,… పీలికలు నిక్షిప్తమై ఉంటాయి…
రూప : (చిరునవ్వుతో) పిచ్చిదానా… పీలికలంటావా వాటిని… అవే చెదిరిపోయిన పోగొట్టుకున్న జీవితాల అందమైన పోగులు!
శారిక : అవునవును! ఇటు – అటూ ఊగుతున్న బస్సులో,… ఏదో పుస్తకం చాటునో, విందులో… ఏదో మేడకింద ఎండిపోయి… ఒంటరిగా… మౌనంగా… అంతే. ఇలా అంటుకట్టుకున్న కేసెట్లే మస్తిష్కంలో నిరంతరం నడుస్తూ ఉంటాయి!
రూప : అవును! ఈ అంటుకట్టుకున్న ఆసరాతోనే వాటి నుండి వచ్చే సువాసనల తోడుతోనే మనం జీవన సాగరతీరాన, నిరంతరం… నడుస్తూ ఉంటాం… నడవగలం…
శారిక : కాలమనే తరంగాలను లెక్కిస్తూ….
రూప: (గంభీరంగా) ఒకమాట చెప్పనా శారికా!… ఈరోజు కూడా … ఇన్ని సంవత్సరాల తరవాత కూడా… పరిస్థితులు ఇంత మారిపోయినా, శ్రీనగర్‌కు సంబంధించిన ఏదైనా చెడు సమాచారం విన్నా, చదివినా మెదడులో ఏదో పెద్ద మేకు కొట్టినట్లు అనిపిస్తుంది… తెలుసా?
శారిక : మేకు గుచ్చుకున్నట్లా?
రూప : అవును… ఆ మేకు టక్-టక్ మంటూ గుచ్చుకునే శబ్దంలో పదే పదే సుహైల్ ఎక్కడున్నాడు? ఏ పరిస్థితుల్లో ఉండి ఉంటాడన్న ఒక్క ప్రశ్నే పదేపదే గింగురుమంటూ ఉంటుంది!
(భయవిహ్వలురాలైన శారిక అడుగుముందుకు వేసి రూప చేతిని అదిమిపట్టుకుంటుంది. ఇద్దరూ రంగస్థలంపై నుండి తప్పుకున్నాక టాఠాజీ ప్రవేశం).
టాఠాజీ : (స్వగతం) ఈ దిల్లీలో మరీ అంత చలేం వెయ్యదు… కాని ఎక్కువ అన్నట్లు అనిపిస్తుందంతే… ఇక్కడ చలిగాలి పొడిపొడిగా ఉంటుంది… తడి తక్కువ… (అగి, కాస్సేపు తానేమన్నానో గుర్తుచేసుకుని కాస్తంత నవ్వుకుంటూ) అవును… తడి తక్కువ… ఆ మంచుకురిసే రోజులు.. ఆ తడి… ఇప్పుడవన్నీ ఊహలే.. అక్కడ మంచు కురుస్తూ ఉండే ఉంటుంది. కిటికీ వేసేద్దునా? చలిగాలి కొడుతోంది…
(అంటూ టాఠాజీ లేచి, కిటికీ దగ్గరకొస్తారు. మూసేస్తూ హఠాత్తుగా ఆగి, బైటకు తొంగి చూస్తారు.)
అరే… ఇదేంటి?….
(కిటికీని ముయ్యకుండానే బైటకొచ్చి, చీనార్ చెట్టు మొదలుమీద కూర్చుంటారు. దగ్గరున్న కాంగడీని తీసి, దానిలో నిప్పును అటూ – ఇటూ కదుపుతూ, ఆలోచనల్లో మునిగిపోతారు).
(సశేషం)