[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
తిరునక్షత్రోత్సవాలు
[dropcap]తి[/dropcap]రు అంటే శ్రీ అని తమిళంలో అర్థం. తిరుపతి, తిరుమల, తిరుచానూరు పేర్లు ఇలా ఏర్పడ్డాయి. తిరుమల శ్రీనివాసునికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సర ఉత్సవాలు జరుగుతాయి. ఆయన నిత్యకల్యాణ చక్రవర్తి. నిత్యం గోవింద నామస్మరణాలు, హుండీ గలగలలు వినిపిస్తుండగా ఆనందనిలయంలో స్వామి భక్తులను పులకితులను చేస్తుంటాడు.
కొన్ని ప్రత్యేక నక్షత్రాలలో తిరుమలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
రోహిణీ నక్షత్రం – శ్రీకృష్ణని జన్మనక్షత్రం
ఆరుద్ర నక్షత్రం – భగవద్రామానుజుల జననం
పునర్వసు నక్షత్రం – శ్రీరామచంద్ర జననం
శ్రవణా నక్షత్రం – తిరుమలలో స్వయంవ్యక్తం.
ఈ నాలుగు నక్షత్రాల సందర్భంగా విశేషోత్సవాలు జరపడం ఆనవాయతీ. ఇవి నెలకొకసారి జరుగుతాయి గాబట్టి మాసోత్సవాలు. ఆనందనిలయంలో వున్న ఉత్సవ మూర్తులకు మాత్రమే ఇవి నిర్వహిస్తారు.
1. శ్రవణానక్షత్రం:
తిరుమలలో శ్రీనివాసుడు కన్యామాసంలో శ్రవణా నక్షత్రంలో సోమవారం నాడు స్వయంభువుగా ఆర్చామూర్తిగా అవతరించాడు. బ్రహ్మదేవుడు మొట్టమొదటగా కన్యామాసంలో పది రోజులపాటు శ్రవణానక్షత్రానికి పూర్తి అయ్యేటట్లు ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించాడు. వాటినే బ్రహ్మోత్సవాలు అంటాం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇవి జరుపుతారు. లక్షలాది మంది భక్తులు వాహన సేవలను దర్శిస్తారు. అధికమాసం వచ్చినప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు రెండు మార్లు చేస్తారు. ఇవి తులామాసంలో వచ్చే దసరా ఉత్సవాలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి.
మరో విశేషం – కార్తీక మాసంలో అంటే తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల మాసంలో శ్రవణా నక్షత్రం రోజున తిరుమలలో స్వామివారికి పుష్యయాగం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుతారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు, ఊరేగింపులు జరుపుతారు.
శ్రవణ నక్షత్రం రోజు శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారికి కూడా అభిషేకం జరపడం ప్రత్యేకత. ఆపైన మలయప్పస్వామి ఉభయ దేవేరులతోగూడి బంగారు తిరుచి నధిరోహిస్తారు. మంగళ వాద్యఘోషల మధ్య కల్యాణ మండపానికి వేంచేస్తారు. కల్యాణోత్సవం జరుపుతారు. మలయప్పస్వామి డోలోత్సవం భక్తులు దర్శిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలు వైభవంగా ఆర్జిత సేవలుగా నిర్వహిస్తారు. సాయంకాలం ఊంజల మండపంలో సహస్ర దీపాలంకార సేవ కనుల పండుగలా జరుగుతుంది.
ముందుగా వేద పఠనం, ఆపైన అన్నమాచార్య కీర్తనల ఆలాపన, పురందరదాస కీర్తన అనంతరం నైవేద్యము, హారతి సమర్పిస్తారు. ఉత్సవమూర్తులు నాలుగు మాడవీధులలో సంచరించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ విధంగా రోజూ జరుగుతుంది. శ్రావణ నక్షత్రం రోజు ప్రత్యకం.
2. పునర్వసు నక్షత్రం:
త్రేతాయిగంలో వెలసిన శ్రీరామాచంద్రమూర్తియే కలియుగంలో తిరుమలగిరులపై శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని ఆనందనిలయంలో సుప్రభాత వేళ…
కౌసల్యా సుప్రజా రామా
పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్… అని మేల్కోలుపుతారు.
వాస్తవానికి ఈ శ్లోకం వాల్మీకి రామాయణం బాలకాండలోనిది. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట అయోధ్య నుండి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో తొలి రాత్రి రామలక్ష్మణులు శయనించారు. సూర్యోదయ పూర్వం విశ్వామిత్రుడు కౌసల్యా నందనుని నిద్రలేపుతూ పలికిన పలుకులవి. మణవాల మహాముని ఆశువుగా ఆనందనిలయుని ముందు నిలబడి సుప్రభాతం పలుకుతూ విశ్వమిత్ర మహర్షి నోట వెలువడిన ఆ శ్లోకాన్ని ముందుగా పలికాడు. ఆ తర్వాత ‘ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడద్వజ!’ అన్నాడు. తిరుమల ఆనందనిలయంలో శ్రీసీతారామలక్ష్మణ హనుమంతుల ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి ఎవరు, ఎలా ఎప్పుడు చేర్చి పూజాదికాలు ఆరంభించారో చెప్పే చారిత్రాకాధారాలు లేవు. అయితే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు తిరుమలలో కొలువు అనబడే ఆస్థానం జరుపుతారు. మర్నాడు దశమి నాడు రామపట్టాభిషేకం వుంటుంది. అలానే శ్రీరాముని జన్మదినమైన పునర్వసు నక్షత్రం రోజు తిరుమల మాడవీధులలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమద్ సమేతుడై సంచరిస్తారు.
పునర్వసు ఉదయం పూట మూలమూర్తితో బాటు సీతారామలక్ష్మణ హనుమంతులకు కూడా అభిషేకం జరుపుతారు. సాయంకాలం సహస్రదీపాలంకరణ సేవలో ఈ ఉత్సవమూర్తులు పాల్గొంటారు. ఆ రోజు శ్రీనివాసుడు (మలయప్ప స్వామి) బయటకు రాకపోవడం విశేషం. సీతారామలక్ష్మణుల కెదురుగా హనుమంతులవారు ఊరేగుతారు. వీరికి హారతి యిచ్చిన తర్వాత ఆలయ ముఖద్వారానికి ఎదురుగా వున్న బేడి అంజనేయస్వామికి శేషహారతి సమర్పిస్తారు.
3.రోహిణీ నక్షత్రం:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడే కలియుగ శ్రీనివాసుడు. ఇందుగా ఉదాహరణగా పద్మావతీ దేవితో శ్రీనివాసుడు తన పేరు శ్రీకృష్ణుడనీ, తన అన్న బలరాముడనీ తాను వైకుంఠం నుండి వచ్చానని చెప్పుకోవడం తెలుసు. పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవంతో శ్రీనివాసుని పేర సంకల్పం చెబుతూ వసుదేవసుతునిగా చెప్పడం ఆనవాయితీ.
ద్వాపరయుగంలో యశోద ఈ జన్మలో వకుళమాత. అందుకు ఆమె శ్రీనివాసుడు నిత్యం ఆరగించే వంటకాలను పర్యవేక్షిస్తూ వుంటుంది. వకుళమాత పంపిన ‘మాతృ దధ్యోదనం’ వేకువజామునే స్వామికి నైవేద్య సమర్పణ చేస్తారు. ఎప్పటి నుండో ఆనంద నిలయంలో రుక్మిణీ శ్రీకృష్ణుల ఉత్సవమూర్తులు పూజ లందుకుంటున్నాయి.
కృష్ణాష్టమినాడు తిరుమలలో పురవీధులలో ఊరేగి తర్వాత ఉట్ల ఉత్సవాలలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవ అలంకారాలతో కూడా మలయప్పస్వామికి కాళింగవర్ధనం, గోవర్ధనోద్ధరణలు చేస్తారు. ఫాల్గణ మాసంలో శ్రీనివాసుని తెప్పోత్సవాలలో ఒకరోజు రుక్మిణికృష్ణుల ఉత్సవమూర్తులు తేలియాడుతారు.
దసరాలలో పారువేట ఉత్సవం వైభవంగా జరుగుతుంది. అందులో మలయప్పస్వామితో పాటు శ్రీకృష్ణమూర్తి పాల్గొంటారు. సంక్రాంతి, దసరా పండుగుల వేళ ఈ సంబరం వుంటుంది.
ఇన్ని కారణాల వల్ల శ్రీకృష్ణని జన్మనక్షత్రమైన రోహిణి నాడు తిరుమలలో శ్రీనివాసుని అభిషేకం తర్వాత రుక్మీణీ కృష్ణులకు అభిషేకం చేస్తారు. సహస్రదీపాలంకార సేవలో అనాడు వీరికే సేవ జరుపుతారు.
4.ఆరుద్ర నక్షత్రం:
కృతయగంలో అనంతుడు, త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపరంలో బలరాముడిగా పుట్టిన ఆదిశేషుడే ఈ యుగంలో రామనుజులుగా జన్మించారు. కీ.శ్ర.1017 అనగా వెయ్యి సంవత్సరాలకు పూర్వం వైశాఖమాసంలో ఆరుద్ర నక్షత్రంలో రామానుజులు జన్మించారు. ఆయన వెంకటాచలాన్ని సందర్శించాడు.
వైఖానస ఆగమ శాస్త్ర విధానంలో జరుగుతున్న పూజా నివేదనలను నియమబద్ధం చేసి, క్రమపరచి పర్యవేక్షించారు రామానుజులు. ఈ వ్యవస్థకు అధిపతులుగా జీయరులనే వైష్ణవ స్వాములను ఏర్పరిచారు. వీరు ఇప్పటికీ ఆలయ అర్చనాదికాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు. వీరి చేతి మీదుగా కార్యక్రమాలు జరుపుతారు. అనంతాళ్వారు అనే భక్తుడు తిరుమల ఆలయం లోపలే రామానుజుల శిలామూర్తిని ఉత్సవమూర్తిని నెలకొల్పాడు.
రామానుజుల జయంతి అయిన ఆరుద్ర నక్షత్రం ప్రతి సంవత్రరం వైశాఖ శుద్ధ పంచమికి పది రోజుల ముందు నుండి భాష్యకార ఉత్సవాల పేర వైభవంగా జరుపబడుతుంది. ఈ రోజు మలయప్పస్వామితో బాటు తిరుమల మాడవీధులలో రామానుజులు సంచరిస్తారు.
ఉదయం పూజాదికాలు పూర్తికాగానే స్వామివారి మూలవిరాట్టు మీది పుష్పమాలతో రామానుజుల ఉత్సవమూర్తిని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవలో మలయప్ప స్వామి కెదురుగా నిలుపుతారు. హారతులందుకొని మాడవీధుల్లో సంచరిస్తారు. ఈ విదంగా ఈ నాలుగు నక్షత్రాలు విశేషంగా ఉత్సవరూపంలో భక్తుల కానందం కలిగిస్తున్నాయి.