[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 13వ భాగం. [/box]
[dropcap]సి[/dropcap]విల్ సర్వీస్‌లో సెలక్ట్ కాకపోతే తనేం బాధపడిపోడు… కాని నాన్నగారు తనలా తేలికగా తీసుకోరు… బాధపడతారు…. నాన్నగారు అలా బాధపడడం చూసి అమ్మ ఇంకా బాధపడుతుంది. ఇంత సంతోషంగా ఉన్న వాళ్లని తను సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వ్రాస్తానని ఆశపెట్టడం, మంచి ర్యాంక్ రాకపోతే వాళ్లు నిరాశపడడం ఇదంతా అనవసరం ఏమో అనిపిస్తుంది. అసలు ఈ విషయం గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నాడు. ఇంత సంతోష విషయం అని అనుకున్న వెంటనే వసుంధర గుర్తు వచ్చింది. గభాలున సెల్ తీసి ఫోను చేసాడు.
సంతోషంగా అంది వసుంధర- “చెప్పు దేవ్…”
“మా అక్క పెళ్లి ఫిక్స్ అయింది.”
ఆశ్చర్యంగా అంది – “అక్క యుఎస్‌ఎ నుండి వచ్చేసిందా. మంత్ ఎండింగ్‌కి వస్తుందని చెప్పావుగా…”
“అక్కా ఇంకా రాలేదు” అని జరిగినదంతా చెప్పి “అమ్మ, నాన్నా చాలా హాపీగా ఉన్నారు….”
“ఏం నువ్వు హాపీగా లేవా…”
నవ్వుతూ అన్నాడు… – “చాలా హాపీగా ఉన్నాను…. అందుకే ఈ సంతోషం ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపించి నీకు ఫోను చేసాను.”
“ఒక్క ఫోనేనా? ట్రీట్ ఇవ్వవా?”
“ఎందుకు ఇవ్వనూ… ఇస్తాలే…”
“దేవ్… మన వాళ్లందరికి చెప్పావా..”.
“లేదు…. మొదట నీకే ఫోను చేసాను….”
“థాంక్స్… దేవ్.”
ఆశ్చర్యంగా అన్నాడు – “దేనికి…”
“దేనికి అంటావేమిటి… నీకు సంతోషం కలిగించిన విషయం ఫస్ట్ నాతోనే షేర్ చేసుకోవాలనిపించడం…. నిజంగా నాకు సంతోషంగా ఉంది దేవ్….”
ఆశ్చర్యంగా అన్నాడు… “ఇందులో నీకు ఎందుకు సంతోషంగా ఉందో నాకైతే అర్థం కావడం లేదు…”
“ఎందుకంటావు ఏమిటి దేవ్… నీ మనసులో నేనుండబట్టే ముందు నాకే ఫోను చేసావు….”
“వసూ…. నీ లాజిక్ నాకర్థం కావడం లేదు…”
“నీకు అర్థం అయ్యేలా నేను చెబుతాను… దీన్నే ప్రేమ అంటారు…నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే ముందు నాకు ఫోను చేసావు…”
“వసూ నీకు పిచ్చి బాగా ముదురుతుంది… కాదు ముదిరిపోయింది… ఫోను పెట్టేస్తాను…”
“వద్దు… వద్దు… దేవ్…. కాసేపు మాట్లాడు…”
“ఏం మాట్లాడను…”
“ఏదో ఒకటి…”
“అయితే ఎదురింటి రాజేశ్వరరావు అంకుల్ గురించి చెబుతాను…”
“అంకులు… పెంకులు గురించి నిన్ను నేను చెప్పమనడం లేదు… మన గురించి చెప్పమంటున్నాను….”
“మన గురించి ఏం చెప్పమంటావు… మనమేమైనా బిల్ క్లింటన్‌లమా, డోనాల్డ్ ట్రంపా లేక చంద్రబాబు నాయుడు, కేసిఆర్‌లమా ఏముంది చెప్పడానికి…”
“చాల్లే వెధవ జోకులు నువ్వు…. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ…. గురించి ఎంతైనా చెప్పొచ్చు…”
“నేను చాలా పెద్ద పొరపాటు చేసానని అర్థమయింది…”
“పొరపాటా, ఏం చేసావు?” కంగారుగా అంది.
“అసలు నువ్వు గుర్తు రావడం ఏమిటి. నేను నీకు ఫోను చేయడం…ఇదంతా పొరపాటే కదా….” అని ఫోను పెట్టేసాడు.
“దొంగ సచ్చినోడా…. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా…అందుకే నీకు సంతోషం కలగగానే నేను గుర్తు వచ్చాను…. దీన్నే ప్రేమంటారు… ఎప్పటికి ఒప్పుకుంటావో…” అని మనసులో అనుకుంది వసుంధర.
***
బెల్ కంటిన్యూగా కొడుతుండడంతో “ఎవరది” అని కంగారుగా వెళ్లి తలుపు తీసిన సుమిత్ర ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాకైయ్యింది.
కంగారుగా చుట్టూ చూసింది… మరో సారి గేటు వైపు చూసింది.
ఎదురింటిలో నుండి కంగారుగా నీలవేణి గబగబా నడుచుకుంటూ జానకి దగ్గరకు వచ్చి “అమ్మా… తాతయ్య గదిలో నిద్రపోతున్నారు… నేను నా గదిలో చదువుకుంటున్నాను… నీ గదిలో నువ్వు లేకపోయేటప్పటికి ఎంత కంగారుపడ్డానో తెలుసా…. అసలు…. ఎప్పుడు లేనిది ఎలా ఇంటిలో నుండి బైటకు వచ్చావు?… ప్లీజ్ అమ్మా! ఇంకెప్పుడు ఇలా చేయకు” అంది.
ఏం మాట్లాడాలో తెలియని దానిలా… ఒక్క నిమిషం తలదించి…. ఎదురుగా ఉన్న సుమిత్ర చెయ్యి గభాలున పట్టుకుంది…
అభిమానంగా వెంటనే జానకి చెయ్యి పట్టుకొని… “నీలూ… కంగారు పడకమ్మా…. అమ్మ… త్వరలో మాములు మనిషవుతుందనుకోవడానికి అమ్మ ఇలా రావడం ఒక మంచి సూచిక…” అంది సుమిత్ర.
“అవును ఆంటీ… మనుషులను చూస్తే బయటపడే అమ్మ… నిజం చెప్పాలంటే… మొదటసారిగా…. మిమ్ములను, వాసుదేవ్‌ని చూసాక ఆవిడలో భయం పోయింది…. నెమ్మది నెమ్మదిగా మీతో కలవడానికి ఇష్టపడుతుంది… అసలు మీతో పరిచయం కాకపోతే… అమ్మ ఎప్పటికి ఒంటరిగా తన మనసులో తను ఉండేది…. కాని అమ్మలో మార్పు వచ్చింది… తాతయ్య సంతోషం చూస్తూంటే…. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆంటీ… ఇటువంటి సమయంలో అమ్మకు ఏదైనా జరిగిందనుకోండి…” అని నీలవేణి అంటుండగానే లోపలికి రమ్మనట్లు సుమిత్ర చెయ్యి గుంజి సోఫాలో కూర్చోంది జానకి…. నవ్వుతూ వెళ్లి జానకి ప్రక్కనే కూర్చుంటూ… “నేనే మీ ఇంటికి వద్దాం అనకుంటున్నాను నీలూ… కాస్తే ఏ ఏ కాయగూరలు ఉన్నాయే చూసి కోసి… అవి తీసుకొని మీ ఇంటికి వద్దాం అనుకున్నాను” అంది సుమిత్ర…
“అలాగే ఆంటీ… సాయంత్రం అమ్మని తీసుకొని నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను… అమ్మ… మీ కోసం… చూస్తూంటుంది ఆంటీ…” అని గభాలున వెళ్లి సుమిత్ర చేతులు పట్టుకొని… “అమ్మని నలుగురి మధ్యకు వచ్చేలా వాసుదేవ్, మీరు… చాలా ప్రయత్నాలు చేసారు” అంది… అనుకోకుండా నీలవేణి కళ్లల్లో నీళ్లు నిండాయి…
సుమిత్ర కంగారుగా అంది… “మనం మనుషులం… అప్యాయతలు, అనురాగాలు… అభిమానాలు మన మధ్య ఉండాలి… కొద్ది రోజుల్లో పవిత్ర వస్తుంది… అది వస్తే… మీ అమ్మగారిని… త్వరగానే మాములు మనిషి చేయడానకి ప్రయత్నాలు మొదలు పెడుతుంది… నా కుతురు అని చెప్పుకోవడం కాదు… బంగారం నా కూతురు…
సోషల్ సర్వీస్ అని ఎక్కడికో వెళ్లి ఏదో చేసామని పేపర్లలో… టి.వి.లో ఫోటోలు వేయించుకోనక్కర లేదు… మన కళ్లెదుట… ఆపదలో ఉన్నవారికో, సహాయం కోసం ఎదురు చూసే ఒక్క మనిషికి చేయి అందించి సహాయం చేసినా మనకి తృప్తి కలుగుతుంది… నీ వలన ఎవరికైనా సహాయం కావాలంటే చెయ్యి అమ్మా అంటుంది…”
మోటారు బైక్ పోర్టికోలో ఆపి అప్పుడే లోపలికి వచ్చిన వాసుదేవ్… ఆశ్చర్యంగా అన్నాడు…
“ఆంటీ… మనింటికి వచ్చిందా… వావ్… అయితే నీలూ… నువ్వు మాకు ట్రీట్ ఇవ్వాలి”
“ష్యూర్…” అంది నవ్వుతూ…
వాసుదేవ్‌ని చూసిన జానకి ముఖం సంతోషంతో నిండిపోయింది…
“నాన్నా… అందరికీ కాఫీలు తెస్తాను… ఈలోగా నువ్వు కాస్త కాయగూరలు ఏవి ఉంటే అవి కోసి తీసుకురా… నీలూ తీసుకువెళుతుంది…” అని సంచి తెచ్చి వాసుదేవ్ చేతికిచ్చింది…
సంచి తీసుకొని అడుగులు వేసాడో లేదో వాసుదేవ్… ‘నేను… వస్తాన’ని దగ్గరకు వెళ్లి వాసుదేవ్ చేతిలో సంచి తీసుకుంది జానకి.
జానకి నోటిలో మాటలు విని అందరూ షాకైయ్యారు…
“అమ్మా” అని గభాలున వెళ్లి తల్లిని కౌగలించుకుంది నీలవేణి…
“వాసుదేవ్… పద… కొద్దాం… కాయగూరలు… నీలూ… సుమిత్రగారు…” అని అందరి మొఖల్లోకి చూసింది జానకి.
ఎవరికి వాళ్లే షాకై అచేతనంగా ఉండిపోయారు.
“ఆంటీ… వాసుదేవ్… అమ్మ… అమ్మ మాట్లాడుతుంది… స్పష్టంగా మాట్లాడుతుంది… మిమ్ములను పేరు పెట్టి పిలిచింది…. నన్ను, వాసుదేవ్‌ని పేరు పెట్టి పిలుస్తుంది. కలా నిజమా” అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబయిపోయింది నీలవేణి…
“చూడమ్మా నీలూ… ఇప్పటిదాక నువ్వు పడ్డ కష్టాలు చాలని, నీ మనసుకి ఊరట కలిగించాలని ఆ భగవంతుడు అమ్మను నీ దగ్గరకు చేర్చాడు… కష్టాలు, సుఖాలు ఎప్పుడూ మనిషిని అంటి పెట్టుకొని ఉండవు… చీకటి, వెలుగు… ఒకదాని వెనుక ఒకటి ఉన్నట్లు, కష్టం సుఖం కూడ అంతే… ఇక ముందు రోజులన్నీ… నీకు మంచి రోజులే…” అంది సుమత్ర…
వాళ్ల మాటలేం పట్టించుకోకుండా వెళదాం అన్నట్లు అందరి వైపు చూసింది జానకి.
***
టి.విలో తొమ్మిది గంటల న్యూస్ వస్తుంది. టేబిల్ మీద భోజనం చేయడానికి గిన్నెలు తెచ్చి పెడుతుంది… గదిలో నుండి వచ్చన వాసుదేవ్‌ని చూసి “ఏంటి నాన్నా… భోజనం చేస్తావా?” అంది సుమిత్ర.
“తొమ్మిదయింది… భోజనం పెట్టేయ్ సుమిత్రా… కాసేపు చదువుకోని పడుకుంటాడు… అన్నట్లు ఇంట్లో పండ్లు ఉన్నాయా? దేవ్‌కి జ్యూస్ ఇస్తున్నావా…” అన్నాడు నిరంజనరావు.
“అమ్మ ఏదైనా మరిచిపోతుంది కాని… నాకిచ్చేవి ఏవీ మరిచిపోదు నాన్నగారు…” అన్నాడు వాసుదేవ్…
టి.విలో న్యూస్ విని ఆశ్చర్యంగా అందరూ టి.వి వైపు చూసారు.
“కాలేజికి వెళ్లి తిరిగి ఇంటికి రాని నలుగురు అమ్మాయిలు… ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు…. తమ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేసారని పోలీసుస్టేషనులో పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు.”
“ఏంటండి ఈ ఘోరం… పిల్లలు చదువుకోవడానికి బైటకు వెళ్లకపోతే ఎలాగు?”
“పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా, ఎన్ని షీ-టీమ్‌లున్నా…. ఆడపిల్లలు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు… నిన్నటికి నిన్న విజయవాడలో ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి వెళుతున్న అమ్మాయిలను కిడ్నాపరులు కిడ్నాప్ చేయబోతే ఇద్దరమ్మాయిలు తప్పించుకొని ఇంటికి వెళ్లారట.. ఆ ఇద్దరమ్మాయిలు కిడ్నాపర్ల కారు నెంబరు నోటు చేసి పోలీసులకు ఇచ్చారట… ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే…. అసలు కిడ్నాపరులు ఎక్కడి వాళ్లు, వాళ్ల స్థావరం ఎక్కడుందని పోలీసులు గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉంది… వాళ్లు తలచుకుంటే తలలో జేజమ్మయనా కిందకు దిగిరావలసిందే… సుమిత్రా…” అన్నాడు నిరంజనరావు.
“అంటే మీరనేది ఏమిటి నాన్నగారూ” అన్నాడు వాసుదేవ్…
“ఏముంది దేవ్… షరా మామూలే… నిజాయితీపరులైన పోలీసులు, అవినీతిపరులైన పోలీసులు ఉన్నారు… ఆడపిల్లల కిడ్నాప్ అవుతున్నారంటే… కిడ్నాపరులు మామూలు వాళ్లు కాదు. వాళ్ల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. ఎంత నిజాయితీపరులైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ… ఒకరో ఇద్దరో అవినీతిపరులైన పోలీసులు ఉండడం వలన… బాగా డబ్బు సంపాదించుకొని… కిడ్నాపరులు దొరకనట్లు బిల్డప్ ఇస్తారు… అందుకే మన దేశంలో ఏ మూల చూసినా… చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడవాళ్లు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు… ఆడపిల్లలు కిడ్నాప్ అయినప్పుడు నాలుగు రోజులు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, తరువాత ఆ న్యూస్ మరుగున పడుతుది” అని అన్నాడు నిరంజనరావు.
సెల్ రింగ్ కావడంతో అన్నం తింటున్న వాసుదేవ్ గభాలున ఎడం చేతితో ఎత్తి “హలో” అన్నాడు.
వసుందర గబగబా చెబుతున్నది విని షాకై గభాలున కుర్చోలో నుండి లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చెయ్యి కడుకుకోవడం చూసి కంగారుగా అంది సుమిత్ర…
“ఎక్కడి నుండి రా ఫోను… అంత కంగారుగా ఉన్నావేంటి… ఏం జరిగింది నాన్నా…”
“దేవ్ ఏం జరిగిందిరా?” అన్నాడు నిరంజనరావు.
“నాన్నాగారు… అమ్మ…. నే చేప్పే విషయం విని కంగారు పడకండి…. కార్తీక్ అక్క… జ్యోతి… జ్యోతి… ఆఫీసులో టెర్రస్ ఎక్కి సూసైడ్ చేసుకుందిట… వసూ అక్కడే ఉంది. నేను వెళుతున్నాను…” అని గబగబా గదిలోకి వెళ్లి షర్టు వేసుకొని హాలులోకి వచ్చాడు.
“ఏంటండి ఈ ఘోరం… జ్యోతికి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది… ఏడాది నుండి జాబ్ చేస్తుంది. బంగారు బొమ్మలా ఉంటుంది… తనతోనే చదివిన సంజయ్ ఏరికోరి తననే పెళ్లి చేసుకోవడానికి నానా పాట్లు పడి ఒప్పించాడట… జ్యోతి అమ్మ లక్ష్మిగారు ఎంతో సంతోషంగా ఈ విషయాలన్ని నాతో చెప్పారు… భగవంతుడు జ్యోతికి అన్నీ ఇచ్చాడనుకుటే ఇంత అన్నాయం చేసాడేమిటండీ.”
“అమ్మా… ప్రతీది… దేవుడితో ముడిపెట్టకు. సమాజంలో ఒక మనిషికి అన్యాయం జరుగుతుందంటే దేవుడు దిగి వచ్చి ఆ మనిషికి అన్యాయం చేయడం లేదు… అన్యాయం జరిగిన మనిషికి తోటి మనిషే అన్యాయం చేస్తున్నాడు… దోచుకుంటున్నాడు. బాధ పెడుతున్నాడు” అని గబగబా మోటరు బైక్ తాళాలు తీసుకొని బయటకు నడిచాడు దేవ్.
“చిన్నోడైనా కరక్ట్‌గా చెప్పాడండి… ఆ తల్లిదండ్రులు ఇంత బాధను ఎలా తట్టుకుంటారు…” బాధగా అంది సుమిత్ర.
***
కార్తీక్ వాళ్ల ఇంటినిండా మనుషులున్నారు. హాలులో జ్యోతి శవం పడుకోబెట్టి ఉంది… తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కార్తీక్ కళ్లు చింత నిప్పులా ఉన్నాయి. తలంతా చెల్లాచెదురుగా ఉంది… సంజయ్ షాక్‌లో నిశ్చేష్టుడై నిలబడి ఉన్నాడు. వాసుదేవ్‌ని చూసిన వెంటనే గభాలున దగ్గరకు వచ్చి బలంగా వాటేసుకొని కన్నీళ్లు కార్చసాగాడు కార్తీక్.
“ఏం జరిగిందిరా… అక్క ఇలా ఎందుకు చేసింది. ఆఫీసులో ఏమైనా ప్రోబ్లమ్స్ ఉన్నాయా. ఒక వేళ ఉంటే జాబ్‌కి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకోవలసింది… She is genius” బాధగా అన్నాడు వాసుదేవ్.
“లేదు లేదు… కాని వారం రోజుల నుండి బయట ఒకసారి కలుద్దాం అన్నా ఫోనులో మాట్లాడినా ఇష్టపడడం లేదు” అన్నాడు బాధగా సంజయ్.
“అవునురా… ఇంటిలో కూడ మా అందరితో సరిగా మాట్లడడం లేదు… ఏం జరిగిందంటే… ఏమి జరగలేదు… కొద్ది రోజులు నన్ను వదిలేయండి… సమస్య వస్తే పరిష్కరించుకునే శక్తి నాకుంది…. ప్లీజ్ అందిరా… వాళ్లకి ప్రాజెక్టులుంటాయి… డెడ్ లైన్ ఉంటుంది… అలాంటిదేదో అయి ఉంటుందని మేము అనుకున్నాం” అని వెక్కిల్లు పడసాగాడు.
“కూల్ రా…” అని భుజం తట్టాడు వాసుదేవ్…
ఉన్నటుండి ఒక్కసారి హడావిడిగా జ్యోతి చుట్టూ మూగి ఉన్న జనం కంగారుగా ప్రక్కకు వచ్చారు… హాలంతా మనుషులతో నిండిపోవడంతో అందరూ గుమ్మం వైపు చూసారు… ఆరడుగులు దాటిన వ్యక్తి… గుబురు గడ్డం మీసాలతో తెలుపు, పసుపు కలిసిన రంగుతో, తీక్షణమైన కళ్లతో… వత్తైన జుత్తుతో అక్కడక్కడ మెరుస్తున్న తెల్లవెంట్రుకలతో, నుదుట పెట్టిన ఎర్రని సింధూరంతో ఎవరో గంభీరంగా ఉన్న వ్యక్తి జ్యోతి దగ్గరకు వచ్చి ఒక్క నిముషం మౌనంగా కళ్లు మూసుకొని… తరువాత కళ్లు తెరిచి “ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవాలి. నూటికో కోటికో తప్ప ప్రతీ మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుంది… అలా అని ప్రాణం తీసుకుంటే ఈ భూమిమీద మనుషులే ఉండరమ్మా… నాకు ఒకటే బాధ… నా ఆఫీసులో నా మనిషికి వచ్చిన సమస్యని తెలుసుకోలేకపోయాను” అంటూ వచ్చీరాని తెలుగులో వత్తి వత్తి మాట్లాడుతున్న రామ్‌లాల్ దగ్గరకు ఆఫీసు హెచ్.ఆర్. మేనేజరు దగ్గరకు వచ్చి…. “బాధపడకుండి సార్… అనవసరంగా బాధపడకండి సార్… మీరు సగం రోజులు యుఎస్‍ఎలో ఉంటారు… ఈ మధ్యనే వచ్చారు. రావడమే జ్యోతిగారి టాలెంట్ గుర్తించి డిపుటేషన్ మీద యుఎస్‌ఎ వెళతావా అని అడిగారు…”
“అవును, ఈ విషయం తెలిసిన దగ్గర నుండి సార్ పచ్చి మంచి నీళ్లు కూడ ముట్టుకోలేదు… ఆవిడకు ఆయుష్షు భగవంతుడు అంతే వ్రాసాడు…” అని మేనేజరు అనగానే…
“వీరభద్రం… నువ్వేం మాట్లాడకు… ఇక మీదట నా ఆఫీసులో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ టెన్షన్ ఫీలవుతున్నా, సమస్య ఉన్నా నాతో షేర్ చేస్కోండి… మనం every month social work ఎక్కడెక్కడికో వెళ్లి ఎలా చేస్తున్నామో… ప్రతీ నెల ఒక గంట మనందరం మనసు విప్పి మాట్లాడుకుందాం…” అని తిరిగి కళ్లు మూసుకొని “జ్యోతి… you soul will be in peace” అని అన్నాడు రామ్‌లాల్.
“అతను… జ్యోతి పని చేస్తున్న R.L. Solutions M.D.గారట… చాలా మంచి మనిషట… సామాజిక సేవ చేస్తాడట. తను చేయడమే కాదు, ఆఫీసులో అందరిని మోటివేట్ చేసి అందరితో ఉమ్మడిగా సోషల్ సర్వీస్ చేయిస్తున్నాడట… దేవుడు లాంటి మనిషి బాస్ అయినప్పుడు తనకి ఏదైనా ప్రోబ్లమ్ ఉంటే చెప్పవలసింది… చదువులో అంత చురుకైన అమ్మాయి… చిన్నతనం నుండి ఇప్పటి దాక ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన జ్యోతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం ఏమిటి?” అని అక్కడున్నవాళ్లు ఒకరితో ఒకరు అనుకోసాగారు..
“అసలు జ్యోతక్క ఇంలాటి పని ఎందుకు చేసింది. ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులో, లవ్ ఫెయిల్ కావడం లాంటివి ఉంటాయి. కాని జ్యోతక్క జీవితం ఇప్పటికి దాక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా సాగుతుంది… త్వరలో పెళ్లి. సంజయ్ మంచి వ్యక్తి… అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది. నమ్మలేకపోతున్నాను రా” అని కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగాడు కార్తీక్.
మంచి నీళ్లు తెచ్చి వాసుదేవ్ చేతికిచ్చి “దేవ్ కాస్త ఈ నీళ్లు కార్తీక్‌తో తాగించు… ఏడ్చి ఏడ్చి నోరు ఎండిపోతున్నా… నీళ్లు కూడ తాగడం లేదు” అంది బాధగా వసుంధర.
బలవంతంగా కార్తీక్‌తో నీళ్లు తాగించాడు వాసుదేవ్.
(ఇంకా ఉంది)