చిత్తూరు జిల్లా సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు

0
4

[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లాలో లభించిన శిలాయుగ పనిముట్ల వల్ల ప్రాచీన శిలాయుగం నుండి మానవుడు ఇక్కడ నివసించినట్టు బలమైన చారిత్రక ఆధారాలున్నాయి. రాజకీయ చరిత్ర కూడా క్రీ.శ. 2, 3 శతాబ్దాలలో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. క్రీ.పూ. 2వ శతాబ్దం మౌర్యుల కాలానికి సంబంధించిన విద్ధాంక నాణెం గుడిమల్లంలో బయటపడింది. అలాగే గుడిమల్లంలోని ఆలయంలోని విగ్రహం సైతం మౌర్యుల కాలం నాటిదని రుజువయింది. భారతదేశంలోనే అతి ప్రాచీన ఆలయంగా దీనికి పేరుంది. క్రీ.శ.260-890 మధ్య కాలంలో ఈ ప్రాంతం పల్లవుల అధీనంలో వుంది. తర్వాత క్రీ.శ 13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యంలో భాగంగా వుంది. క్రీ.శ. 14 నుండి పాండ్యుల అధికారంలో ఈ ప్రాంతం వుంది. పాండ్యుల తర్వాత క్రీ.శ. 1810 నుండి క్రీ.శ.1336 వరకు మాలిక్ కపూర్ (ముస్లింల) పరిపాలనలో వుంది. తర్వాత క్రీ.శ. 18 నుండి క్రీ.శ.17 వరకు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజుల పరిపాలనలో వుండింది. ఈ కాలంలోనే చిత్తూరు భౌగోళిక ప్రాంతానికి గుర్తింపు వచ్చింది. క్రీ.శ. 1646లోనే గోల్కోండ నవాబులు చిత్తూరు జిల్లాను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అటు తర్వాత ఆర్కాట్ నవాబ్ (1758), హైదర్ ఆలీ పరిపాలించారు. 1792లో శ్రీరంగ పట్టణంలో జరిగిన సంధి మేరకు మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి తాలుకాలను నిజాం నవాబుకు ఇచ్చారు. మిగతావాటిని ఆర్కాట్ నవాబుకు పంచడం జరిగింది. 1801లో ఈ ప్రాంతం బ్రిటీష్ వారి అధీనంలోకి వెళ్లింది. అప్పటినుండి రాయలసీమ జిల్లాలకు దత్తమండలాలనే పేరు వచ్చింది. 1928లో వీటికి రాయలసీమ అని పేరు పెట్టారు.

బ్రిటీష్ వారిని ఎదిరించడానికి జిల్లాలోని 30 పాలెములకు సంబంధించిన పాలెగాళ్లు చాలా కష్టపడ్డారు. అప్పటివరకు వారు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తూ, జిల్లాలోని ప్రాంతాలను తమ అధీనంలో వుంచుకున్నారు. వీళ్లల్లో చాలామంది తర్వాతి క్రమంలో భూస్వాములుగా మారారు. బ్రిటీష్ వారి అధీనంలో కన్నా ముందరే చిత్తూరు ప్రాంతం మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాలతో వుండేది. స్వాతంత్ర్యోదయ కాలంలోను చిత్తూరు ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఎట్టకేలకు ఏప్రిల్ 1, 1911న చిత్తూరు కేంద్రంగా జిల్లా అవతరించింది.

శిలాయుగ మానవుల నివాసం

ఉత్తర ప్రాచీన శిలాయుగ స్థావరాలు (క్రీ.పూ.28,460 – క్రీ.పూ. 8090 మధ్యకాలం) చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వున్నాయి. ఏర్పేడు, గొల్లపల్లి, జింకలమిట్ట, కొర్లగుంట, మిట్ట కండ్రిగ, తొట్టంబేడు, వెదుళ్లచెరువు అనే గ్రామ ప్రాంతాలలో ఈ స్థావరాలు ఎక్కువుగా వున్నాయి. ఈ ప్రాంతాలలో బయల్పడ్డ బ్యూరిన్లు, చిరుకత్తులు, బాణపు మొనలు, త్రిభుజాలు, చతుర్భుజాలు తదితర వాటిని క్వార్టరైజ్ అనే రాయితో తయారుచేశారు. కర్బనం 14 పద్ధతి ద్వారా ఈ పరికరాలు ప్రాచీన శిలాయుగ స్థావరాలకు సంబంధించినవని తేల్చారు. ఈ మానవులు నదీ తీరాల వెంబడి వుండే గుహల్లో నివసించేవారు. పెద్ద పెద్ద చెట్టు తొర్రల్లోను వీరు నివసించేవారు. జంతువులను వేటాడటం, అడవుల్లో లభించే కందమూలాలు తినడం వీరు చేసేవారు. పచ్చిమాంసాన్నే తినేవారు. చెట్ల ఆకులను, జంతు చర్మాలను దుస్తులుగా వాడేవారు.

మధ్య శిలాయుగం లేదా తొలి హెూలోసీన్ కాలానికి(క్రీ.పూ. 8500- క్రీ.పూ.2000 మధ్యకాలం) చెందిన మానవుడు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, గురవరాజుపల్లి, ఇసుకతాగేలి, శానంబట్ల ప్రాంతాలలో నివసించినట్లు చారిత్రక ఆధారాలు వున్నాయి. వారు వాడిన అనియతాకృతులలో గీకుడు రాళ్లు, మొనలు, అర్ధచంద్రాలు స్వర్ణముఖీనదీ తీరప్రాంతాలలో లభించాయి. ఈ యుగం చివరి దశలో కుండలు, గవ్వలు, పూసలు మానవులు వాడినట్టు కార్‌లైలీ, రాబర్ట్ బ్రూస్‍పూట్ అనే చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. వీరు చనిపోతే, చనిపోయినవారు వాడిన వస్తువులతో సహా వారిని పూడ్చేపెట్టే ఆచారం వుండేది. ఈ సూక్ష్మయుగ పనిముట్లకు బగోర్ (రాజస్థాన్), భీమ్‌బేట్కా (మధ్యప్రదేశ్), సరాయ్ నహర్ రాయ్ (ఉత్తరప్రదేశ్) ప్రాంత పనిముట్లకు సంబంధం వుంది. ఈ మానవులు జంతువులను, చేపలను వేటాడేవారు. ముంగిస, ఎలుకలను సైతం వీరు తినేవారు.

నవీన శిలాయుగం (క్రీ.పూ. 1400 – క్రీ.పూ.1050 మధ్యకాలం) కాలానికి చెందిన మానవులు చిత్తూరు ప్రాంతంలో చాలాచోట్ల నివసించారు. వీరు రాగి, కంచు విరివిగా వాడారు. కుమ్మరిసారె మీద పాత్రలు తయారుచేయడంలో వీరు నైపుణ్యం సాధించారు. ఈ కాలంలోనే కొండరాళ్ల మీద రౌతుల, గుర్రాల చిత్రలేఖనాలు తిరుమలలోని ఆదిమానవుని బండమీద, మల్లాయిపల్లెలలోను లభిస్తాయి. అలాగే బృహత్ శిలాయుగ సమాధులు ఐరాలబండ, మల్లాయి పల్లె, నాయకనేరి, తవణంపల్లె, మిడిమల్లలో ఎక్కువుగా చూడవచ్చు.

మానవ పరిణామం

ఒక కోటి 80 లక్షల సంవత్సరాలకు పూర్వం చిత్తూరు, కడప, కర్నూలు అనంతపురం ప్రాతం అంతా మహాసముద్రంలో భాగంగా వుండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 1800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం కడప సముద్రంలో వుండేదని పేర్కొన్నారు. ఫ్రీ కేంబ్రియన్ కాలంగా దీన్ని పరిగణిస్తారు. దీనికి ఆధారాలుగా 1. ఎస్‌స్కారప్పమెంట్ ( ఎర్రటి తూర్పు పశ్చిమ దిశగా కనిపిస్తున్న తిరుమల కొండరాతి భాగం) 2. తిరుమల-నగరి నోస్ (తిరుమలలోని గంటా మండపం, నగరిలోని నగరినోస్. ఈ రెండు నావికులకు లైట్‌హౌస్‌గా ఉపయోగపడేవి) 3. పూర్వపు సముద్రపు ఉనికి (తిరుమలకు వెళ్లే కొత్త దారిలో అక్కగార్ల గుడి దగ్గర ఇప్పటికీ వస్తున్న నీరు, ఇసుక). అందుకే ఈ ప్రాంతాల్లో బాక్సైట్, జింక్, బైరటీస్ లోహపు నిక్షేపాలు విరివిగా లభిస్తాయి. ఆదిమ మానవుని ఉనికి తెలియజేసే ఆధారాలు తిరుమల కొండ మీద చాలా వున్నాయి. ప్రపంచంలోనే అతి ప్రాచీన భూభాగంగా తిరుమల ఖ్యాతి గడించింది. 1966లో జిల్లాకు చెందిన మూర్తి అనే చరిత్రకారుడు వెదుళ్ల చెరువు ప్రాంతంలో రాతి బ్లేడ్, ఉలి లాంటి పనిముట్లను కనుగొన్నాడు. 1975-1983 మధ్య జాకబ్ జయరాజ్ అనే చరిత్రకారుడు కళ్యాణిడ్యామ్-మల్లిమడుగుడ్యామ్ మధ్య ఆది మానవ సంస్కృతికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నాడు.

ఆదిమానవులు ఆహారసేకరణలో భాగంగా కొండచరియల్లో లభ్యమయ్యే అటవీ దుంపలను తినేవారు. ఇప్పటికీ జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో నివసించే కొండజాతి వారు ఇప్పటికీ ఈ అటవీదుంపను తమ ఆహారంగా తింటారు. అత్యంత పోషకాలు కల్గిన ఈ దుంపను తిరుపతి మార్కెట్లో అప్పుడప్పుడు కొండజాతివారు అమ్ముతుంటారు. బ్లేడు తర్వాత కత్తిని సైతం వేటకు మానవుడు ఈ ప్రాంతంలో ఉపయోగించినట్లు తేలింది. నిజానికి క్రీ.పూ. 15 వేల సంవత్సరాల నాడు ఉలిని రాతిని మలచడానికి మానవుడు ఉపయోగించినట్టు చరిత్రకారులు చెపుతారు. ఆదిమానవుడు నివసించిన స్థలం, వేటకు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువులను చంపిన స్థలం, నిప్పు ఉపయోగించిన ఆధారాలు రేణిగుంట దగ్గరి జింకలమిట్టలో ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆహారాన్ని నిల్వచేసుకునే విధానం ఆదిమానవుడు కనుగొన్న తర్వాత ప్రకృతిని మచ్చిక చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాడు. తెలుసుకున్న జంతువుల వివరాలను కొండచరియల్లోని రాతిపలకలపై చెక్కడం, చిత్రీకరణ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు. తిరుమలలోని నామాలగవి, ఆదిమానవుని బండలో వీటిని చూడవచ్చు. తర్వాత వచ్చిన భౌగోళిక పరిణామంలో భాగంగా కొండగుట్టలపై మానవులు నివాసాలు ఏర్పర్చుకున్నారు. దీన్ని మైక్రో లిథిక్ సంస్కృతి అంటారు. శెట్టిగుంట, బాలపల్లి, రేణిగుంట, అక్కారంపల్లి ప్రాంతాల్లో వీటి ఆధారాలు వున్నాయి. అలాగే మిసోలిథిక్ సంస్కృతికి చెందిన చిన్న రాతి పనిముట్లకు కొయ్యను చేర్చడం లాంటవి ఇప్పటికీ ఈ ప్రాంతాలలో గమనించవచ్చు. కొడవళ్లు, రంపాలు, కొన్ని వ్యవసాయ పనిముట్ల ఈ కోవకు చెందినవే.

క్రీ.పూ.2000-3000 మధ్యపు లోహపు యుగం కాలంలో ఇనుమును ఈ ప్రాంతంలో తయారుచేసినట్టు అధారాలున్నాయి. రేణిగుంట దగ్గర, అంకమనాయుడి మిట్టలో ఇనుమును తయారుచేసినట్టు ఆధారాలు లభించాయి. దీన్ని నియోలిథిక్ సంస్కృతి అంటారు. పాపానాయుడుపేట ప్రాంతంలోని పూసల బలిజ అనే కులస్థులు క్రీ.పూ. 2000 సంవత్సరాల నాడు ఇనుమును తయారుచేసిన మానవుల సంతతి వారని చరిత్రకారులు వెల్లడిచేసారు. మెగాలిథిక్ సంసృతి (బృహత్ శిలాయుగం) నాగరికతకు చిహ్నంగా భావిస్తారు. చనిపోయినవారి చుట్టు పెద్ద రాతి గుళ్లను ఏర్పాటు చేయడం, రాతిపలకలను నిలబెట్టడం చేసేవారు. వీటిని కోస్తా ప్రాంతంలో రాక్షసిగుళ్లు అని పిలిస్తే, రాయలసీమ ప్రాంతంలో పాండవ గుళ్లు అని పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని మెగాలిథిక్ స్థావరాలను రాబర్ట్ బ్రూస్‌పూట్ ఎక్కువుగా పరిశీలించారు. చిత్తూరు, వెల్లంపల్లి, వాయుల్పాడు, ఐరాల బండ, అమిలేపల్లి, బసినికొండ తదితర ప్రాంతాలలో కనుగొన్నారు. వీటిని క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రాన్‌ఫిల్ సైతం గుర్తించాడు. నాయకనేరి ప్రాంతంలో 60 సమాధులను కనుగొన్నారు. మెగాలిథిక్ దేవతల బొమ్మలు సమాధిపైన రాళ్లపై చెక్కినట్లు చిత్తూరు జిల్లా, నరకల్లు వద్ద వున్న 12 సమాధులపై కనబడ్డాయి. ఈ సమాధుల్లో మానవ అస్థికలను కనుగొన్నారు.

చిత్తూరు జిల్లాలో దొరికిన ప్రాచీన, మధ్య శిలాయుగ పనిముట్లు ఆఫ్రికా, యూరోప్‌లో దొరికిన పనిముట్లతో సంబంధం కల్గివున్నాయి. మెగాలిథిక్ సంస్కృతి నుండే లిఖిత ఆధారాలు సమాజానికి లభిస్తుంది. నవీనశిలాయుగంలో పశుపోషణ, కుండల తయారీ, కంచు, రాగి వాడకం ముఖ్యమైనవి. అలాగే మెగాలిథిక్ సంస్కృతిలో ఇనుము వాడకం ముఖ్యమైనది.

నాగరిక చరిత్ర

చిత్తూరు జిల్లా ద్రావిడ దేశంలో భాగంగా వున్నందువల్ల, మూడు రాష్ట్రాల ప్రాంతాలు ఇందులో కలసివుండటం వల్ల విభిన్న సంస్కృతుల మేళవింపు ఇక్కడ సాధ్యమయింది. అడవుల్లో అనాగరికులుగా జీవనం సాగించిన ఈ ప్రాంత మానవులు సముద్ర తీరంలో, నదీతీరప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. వేటాడం, ఆహారసేకరణ, పశుపోషణ, వ్యవసాయం లాంటి ఉత్పత్తి పద్ధతుల ద్వారా వేల సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. అటవీసంపదను వస్తుమార్పిడి ద్వారా ఇప్పటికి అమ్ముతున్న యానాదులు, ఎరుకలు ప్రాచీన జాతులకు చెందిన వారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ. 10వ శతాబ్దంలో నాగరికత మొదలైనట్టుగా విల్సన్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. తొలి జాతుల గురించి ద్రావిడసంస్కృతిలో ఆధారాలు లేనప్పటికీ, రాజులు, వారి పరిపాలన గురించి అనేక శాసనాలు ఈ ప్రాంతంలో వున్నాయి. ప్రాచీన సాహిత్యంలో తగిన ఆధారాలు లేకపోవడం వల్ల, శాసనాల ద్వారానే చిత్తూరు జిల్లా చరిత్రను గ్రంథస్తం చేశారు. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చిన కురుబలు స్థానికంగా వున్న వేటగాళ్లు (వేడర్లు)పై యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించినట్టు తెలుస్తోంది. తదనంతర కాలంలో కోమండు కురుంబ ప్రభు అనే నాయకున్ని ఎన్నుకుని, వారి అధీనంలో వున్న ప్రాంతాన్ని 24 రాజ్యాలుగా చేసుకున్నట్టు చరిత్రకారులు చెపుతున్నారు. వీరినే పల్లవరాజులుగా పరిగణించారు. కాంచీపురం, పూరలూర్లను కేంద్రాలుగా చేసుకుని రోమ్, చైనా దేశాలకు వీరు వర్తకం సాగించారు. జైనమతాన్ని వీరు ఆదరించారు. క్రీ.శ. 8,9 శతాబ్దాలలో చోళుల చేతుల్లో వీరు ఓడిపోయారు. పల్లవులు, చోళుల మధ్య జరిగిన యుద్ధ ప్రాంతాన్ని తొడైమండలంగా పేరు పెట్టారు. చోళులపై యాదవులు విజయం సాధించారు. దీంతో చిత్తూరు ప్రాంతం యాదవుల ఏలుబడిలోకి వెళ్లింది. నారాయణవనం, తిరుపతి, చంద్రగిరిలను పట్టణాలుగా రూపుదిద్దే ప్రయత్నం వీరి పరిపాలనలోనే జరిగింది.

క్రీ.పూ. 350 నాటికే ఆర్యులు తంజావూరు, మధుర ప్రాంత ప్రజలతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు. జిల్లాలోని గుడిమల్లంలో లభించిన విద్దాంక నాణాలను బట్టి మౌర్యులు ఈ ప్రాంతంలో లావాదేవీలు జరిపినట్టు అర్ధమౌతుంది. మౌర్య రాజుల తదనంతరం శాతవాహనుల అధీనంలోకి ఈ ప్రాంతం వెళ్లింది. క్రీ.శ 8వ శతాబ్దం వరకు తెలుగు వాడుకలో లేదని తెలుస్తోంది. శాతవాహన రాజైన వాసిష్టీ పుత్ర శాతకర్ణి నాణేలను ముద్రించాడు. ఈ నాణెం రెండోవైపు వాడిన భాష తమిళమా, తెలుగా అనే విషయంలో చరిత్రకారుల మధ్య విబేధాలున్నాయి. చిత్తూరు జిల్లా ప్రాంతంలో తమిళులు 80శాతంకి పైగా గతంలో నివసించేవారు. ఇప్పటికీ చిత్తూరు ప్రాంతంలో 12 మండలాల్లో 80 శాతం మంది ప్రజలు తమిళం బాగా మాట్లాడగలరు. శాతవాహనడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్ర చెపుతోంది. గుడిమల్లం ప్రాంతంలో శాతవాహనుల నాటి అవశేషాలు బయటపడటం వల్ల శాతవాహనులు అధీనంలో వున్నట్టు తెలుస్తోంది. ప్రాకృత, సంస్కృత, తమిళ శాసనాలను బట్టి పల్లవులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టు తెలుస్తోంది.

రాజుల పరిపాలన

ఇక్కడి రాజుల పరిపాలనకు మిగిలిన ప్రాంతాల్లోని రాజుల పరిపాలనకు చాలా సారూప్యత వుంది. రాజు పట్టాభిషేకానికి ఘనమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు శాసనాలు చెపుతున్నాయి. పార్టీలు ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ప్రకటించే ఉచిత తాయిలాలు గతంలో రాజలు సైతం ప్రకటించేవారు. క్రీ.శ.971-1000 మధ్యకాలం పరిపాలించిన భువన త్రినేత్ర ఇరుగేయ మహారాజు (వైదుంబులు), తాను కిరీటం ధరించే రోజు రైతులకు పూర్తి పన్నుల మినహాయింపు నిచ్చాడు. కలకడ శాసనంలో ఈ విషయం ప్రస్తావించబడింది. చంద్రబాబు రుణమాఫీ పథకం మల్లే పన్ను మినహాయింపును రాజులు ప్రవేశపెట్టేవారు. చాలా సందర్భాల్లో సామంత రాజుల మధ్య యుద్దాలు పశువుల కోసమే జరిగేవి. చక్రవర్తి క్రింద మూడు అంచెల పాలనావిధానం వుండేది. వైదుంబ పాలనా వ్యవస్థలో సైన్యానికి అధినేతగా సేనాధిపతి వుండేవాడని మదనపల్లె, పుల్లగంటివారి పల్లి శాసనంలో వుంది. ఇంటిపన్ను, వస్తువులపై పన్ను ఆ కాలంలో వుండేది. ఆస్థిపన్ను, జిఎస్టిపన్నుగా ఇప్పటి పాలకులు ప్రజలనుండి వసూలు చేస్తున్నారు. యువరాజులకు సేవచేసే వారి జీతాల కోసం దొగరాచ పన్నును విధించేవారు. సైన్యానికి ఇచ్చే జీతాల కోసం విధించే పన్ను పడేవాళ పన్ను, ఇది స్వయానా సైన్యాధిపతి నాయకత్వంలో వసూలు చేయబడుతుంది. అలాగే అధికారులకు అంగరక్షకులుగా వున్న వారి పోషణ కోసం పడిమేరి పన్నును విధించేవారు. యుద్ధాల కోసం, రాజ్యంలో శాంతిభద్రతలను కాపాడటానికి సంధివిగ్రహి పన్నును విధించేవారు. రైతు-యజమాని మధ్య పంటల పంపకాలు జరిగినట్టు వాయల్పాడు తాలూగా కలకడ గ్రామంలోని కులోత్తుంగుని తమిళ శాసనంలో పేర్కొనబడింది. పంటలో 7వ వంతును రాజు పన్నుగా వసూలు చేసినట్టు శాసనంలో వుంది.

క్రీ.శ.9,10 శతాబ్దపు పెద్దవెలగటూరు శాసనంలో బాళసోమ భట్టారకుడు గ్రామాన్ని పరిపాలించినట్టు పేర్కొనబడింది. మహాబలి బాణరస (రెండో విక్రమాదిత్యుడు) ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలమిది. గ్రామాలకు అధిపతిని బాణుల వంశస్టులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. క్రీ.శ. 844-845 నాటి గుడిమల్లం శాసనంలో బాణ విజయాదిత్యుని కాలంలో చెరువుకు పూడిక తీయడానికి భూమి దానం చేసినట్టుగా వ్రాయబడివుంది. క్రీ.శ. 868-860 రెండో నందివర్మ కాలానికి చెందిన శాసనంలో ఆళున్‌గణ్ సభ్యుడిగా వున్న ముళ్లిరికిళార్ తిరువిప్పిరంబేడులోని పరుశురామేశ్వరాలయంలో నిత్యదీపారాధనకు భూమిని దానంగా ఇచ్చినట్లు వుంది. ఆళున్‌గణం అనేది గ్రామంలోని ముఖ్యమైన సంస్థగా తెలిస్తోంది. క్రీ.శ. 898-905 విజయాదిత్య మావలి వాణరాయర్ కాలం నాటి రెండో శాసనంలో నైవేద్యానికి, దీపారాధనకు పరుశురామేశ్వరుని గుడికి బంగారం దానం చేసినట్లు చెప్పబడింది. దీనికి గ్రామ అత్యున్నత సంస్థ ఆళున్‌గణం రక్షణగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అలాగే గ్రామాలలో జరిగే ప్రతి వివాహానికి కల్లాణక్కాణం అనే పన్నును విధించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం వివాహం చేసుకునే వారు ఒక బంగారునాణాన్ని గ్రామాధికారులకు ఇవ్వాల్సివుంటుంది. బాణవంశస్థుల మరో శాసనంలో చెరువులను త్రవ్వడానికి, పూడికలను తీయడానికి విదనాళి అనే పన్నును వసూలు చేసినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు చెరువులమీదే ఎక్కువుగా ఆధారపడినట్టు తెలుస్తోంది. వాటికోసం ప్రత్యేక పన్నుల సైతం వసూలు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 10వ శతాబ్దంలో పశ్చిమ గాంగ వంశస్థులు వీరుల మరణానికి గుర్తుగా భూదానాలు చేసినట్టు తెలుస్తోంది. బోడినాయని పల్లిలోని దిన్నె శాసనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. శెంబియన్ మహాబలి బాణరస (రెండో పృధ్వీపతి) పల్లవధవళ ప్రతినిధిగా వున్న కాలంనాటి శాసనం ఇది. రాజ్యానికి సేవచేసిన వారికి భూదానాలు ఇచ్చే ఆచారం వుండేది. క్రీ.శ10వ శతాబ్దానికి చెందిన నొలంబ వంశస్థులు బెళగటూరు గ్రామాన్ని దానం చేసినట్టు పుంగనూరు తాలూకా కర్షణపల్లి గ్రామ శాసనం తెలియజేస్తోంది. ఆ గ్రామంలో వచ్చే పన్నులను, దానం తీసుకున్న వ్యక్తి అనుభవించవచ్చు. పుంగనూర్ తాలుకా నేలపల్లిలోని క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన శాసనంలోను కరవయ్య అనే వీరుడికి అశ్వాన్ని, ఛత్రాన్ని, ఆయుధ భటులను, కుంచము, ఖడ్గాన్ని ఇవ్వడమే గాక కొలటూర అనే గ్రామాన్ని నగరంగా తీర్చిదిద్దాలని దానం చేసినట్టు తెలుస్తోంది. గ్రామాల నుండి పన్నులను వసూలు చేయడానికి రాజు కొంతమంది సైనికాధికారులను నియమించుకునే వాడని ఈ శాసనం తెలుపుతోంది. అలాగే గ్రామాధికారులు, రాజు కలసి అనేక దానాలను ఇచ్చినట్టు తెలుస్తోంది.

చోళుల పరిపాలనలో దండనాయకుడు, సేనాపతి, అధికారి, రెవెన్యూ అధికారులు పరిపాలన చేసినట్టు శాసనాలు చెప్తున్నాయి. క్రీ.శ. 940-941 తొండమనాడు శాసనంలో బ్రాహ్మణులతో కూడిన సభకు, వర్తకులతో కూడిన నగరట్టార్ అనే సభకు బంగారం ఇచ్చినట్టు తెలుస్తోంది. బ్రాహ్మణుల, వైశ్యుల సంఘాల సంక్షేమ కోసం మొదటి పరాంతకుని కాలంలో బంగారం ఇచ్చాడు. ప్రస్తుతం కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్‌ను కేటాయించినట్టు గతంలో బ్రాహ్మణుల, వైశ్యుల సంఘాలకు బంగారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. క్రీ.శ1011-12 శాసనంలో చోళుల మొదటి రాజరాజు బంగారు పళ్ళెమును దానం చేశాడు. ఈ దానంలో పాలుపంచుకున్నవాళ్లలో ఆలయ శివ అర్చకుడు, రాజు సేవకుడు, సభ ప్రతినిధి, ఆలయ అధికారి, ముమ్మడి చోళపురంలోని కొంతమంది వర్తకులు పాల్గొన్నారు. ఆలయాలకు సంబంధించిన శాసనాల్లో ఆలయాల నిర్వహణ కోసం కొన్ని గ్రామాలను, భూదానాలను, కొంత బంగారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. దేవదానం అని పేర్కొన్నవాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేనట్టు శాసనాల్లో తెలుస్తోంది. క్రీ.శ 1085-1086 మొదటి కులోత్తుంగుని కాలపు లడ్డిగం శాసనంలో ఓలై, ఓలైనాయక్, విడైయిల్ అధికారి, నడువిరుక్కం అనే పైనుండి క్రింది వరకు రెవెన్యూ అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. .

రాజులు రాజ్య అవసరాల నెపంతో, దేవాలయాల నుండి బంగారాన్ని తీసుకుని, దానికి బదులుగా కొంత భూమిని ఇచ్చేవారని తెలుస్తోంది. క్రీ.శ.1098-1099 మొదటి కులోత్తుంగుని కాలంలో అగస్త్యకొండ శాసనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. పరిపాలనలోని పై అధికారులందరిని నాటార్ అనే సంస్థ నడిపేదని తెలుస్తోంది. ఈ విభాగాల్లో సభ, ఊర్, నగరం అనే విభాగాలు వుంటాయి. ఈ విభాగాల్లో కులాలకు విపరీతమైన ప్రాధాన్యత వుండేది. బ్రాహ్మణ, వెళ్లాల, వర్తక అనే మూడు కులాల వారు నాట్టార్ అనే పై పరిపాలనవ్యవస్థలో ఎక్కువుగా వుండేవారు. రాజ్యపాలనలో బ్రాహ్మణ, వైశ్యులు ప్రధాన పాత్ర వహించగా, రాజు కులానికి చెందిన వారు ప్రముఖ పాత్ర వహించేవారని తెలుస్తోంది. తిరుమల ఆలయాన్ని పర్యవేక్షించడానికి తిరువేంగడ దేవర్ అనే దేవాదాయ అధికారిని నియమించినట్టు తెలుస్తోంది. రాజ్యపు పరిపాలనాధికారాలను చూసేందుకు అత్యున్నత అధికారి వుండేవాడని తెలుస్తోంది. క్రీ.శ.1023-1024 మొదటి రాజేంద్రుడు ఆర్రూర్ శాసనంలో కణకాణి నాయకన్ అనే అధికారిని పరిపాలనా కోసం నియమించినట్టు తెలుస్తోంది. ఈ అధికారి ఆర్రూర్ నాడుకు చెందిన ఆలయానికి 150 గోవులను ఇచ్చినట్టు శాసనంలో వుంది. దేవాలయాల పర్యవేక్షణకు ఎండోమెంట్ అధికారులు అప్పట్లోనే వున్నట్టు తెలుస్తోంది. దేవాలయాలకు దానం చేసిన గ్రామాలు ఒక్క దేవాలయపోషణ చూసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా కొత్త పన్నులను వారు రాజుకు కట్టనవసరం లేదు.

పెద్ద ఎత్తున తమ అధీనంలో భూములను కల్గివున్న భూస్వాముల తరహా వ్యక్తులు చోళుల కాలం నుండి వున్నట్టు తెలుస్తోంది. పన్నుల వర్గీకరణలో భాగంగా పొన్ పన్ను (ధనరూపంలో వసూలు చేసే పన్ను), ధాన్యపన్ను (ధాన్యం ద్వారా పన్నులను స్వీకరించడం) వున్నాయి. అలాగే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేకమైన పన్నును వసూలు చేసేవారు. అప్పుడప్పుడు వసూలు చేసే పన్నులను అమన్‌జి పన్ను అని వసూలు చేసేవారు. అలాగే పాండ్యుల, హోయసాలుల పన్నులను వసూలు చేసేవారు. క్రీ.శ.9,12 వశతాబ్దాలకు చెందిన శాసనాలలో వీటి ప్రస్తావన వుంది. క్రీ.శ1861 పలమనేరు తాలూకా కూర్మాయిలోని శాసనం ద్వారా రెవెన్యూ అధికారుల్లో మహాప్రధాని, భాండారి, అరమణై కణక్కు లాంటి వారు వున్నట్టు తెలుస్తోంది. ఇదే శాసనంలో కురుమాయి గ్రామం గుండా వ్యాపార వస్తువులు రవాణా చేసినందుకు ఆ వస్తువులపై వివిధ పన్నులు (మేర్‌పొన్ సుంగం, కట్టిన కడలి, ఉరిరుక్కై ఆడుతిరై, మక్కల్తిరై, పశానతిరై)ను వసూలు చేసినట్టు తెలుస్తోంది. పరిపాలనా విధానంలో పన్నులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. రాజ్యాల మధ్య యుద్ధాలు లేనప్పుడు, సైన్యం ప్రజల దగ్గర పన్నుల వసూలు కోసం వినియోగించబడినట్టు తెలుస్తోంది.

సామాజిక వ్యవస్థ

చిత్తూరు జిల్లాలోని వ్యవస్థ పూర్తిగా పశుపోషణ, వ్యవసాయంపైనే 90 శాతం ఆధారపడివుంది. మిగిలిన వారు అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా వస్తుమార్పిడి చేసుకునేవారు. యుద్ధాలు పశువుల కోసమే ఎక్కువుగా జరిగాయని తెలుస్తోంది. రాజ్యాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు సైనికులతో పాటు యువకులందరూ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చేది. ఆస్తిని కాపాడుకోవడానికి ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఎక్కువుగా వుండేవి. ముఖ్యంగా పరువు హత్యలు ఎక్కువుగా జరిగేవి. పరువు, ప్రతిష్ఠలు కోసం ప్రాణాలర్పించడం పవిత్రమైన కర్తవ్యంగా భావించే సంప్రదాయం వుండేది. వీరగల్లుల ప్రతిష్ఠకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పశువులను అపహరించిన వీరులను కీర్తించే సంప్రదాయం ఎక్కువుగా వుండేది. అలాగే పశువులు శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడి, ప్రాణాలర్పించిన వీరులను కీర్తించేవారు. పుంగనూరు తాలూకాలోని వనమలదిన్నె గ్రామంలో క్రీ.శ.9వ శతాబ్దానికి చెందిన, మహావరి భాణరస (మొదటి విక్రమాదిత్యుడు) శాసనంలో పశువులను కాపాడే క్రమంలో యద్దంలో మరణించిన వీరునికి ధాన్యం పండే భూమిని దానం చేసినట్టు తెలుస్తోంది. బోడినాయినిపల్లిలోని క్రీ.శ 10వశతాబ్దానికి రెండో పధ్వీపతి పశువుల దాడిలో చనిపోయిన వీరునికి ఏడు కొళగల వరిచేను దానం చేసినట్టు వుంది.

యుద్ధంలో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన వీరులకు దానాలిచ్చే సంప్రదాయం క్రీ.శ.9వ శాతాబ్దపు ముందు నుండే వుంది. మదనపల్లి తాలూకా వెలగల్లు గ్రామంలో క్రీ.శ. 9వ శతాబ్దానికి చెందిన శాసనంలో చంతమానదడి అనే వీరుని కీర్తిస్తూ శాసనం వ్రాయబడింది. వైదంబ-నొలంబుల సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో ఇతను చనిపోయాడు.

మతపరమైన మొక్కులను తీర్చుకోవడానికి ప్రాణాలను అర్పించినవారికి సైతం వీరగల్లులు ప్రతిష్ఠించారు. ముఖ్యంగా అగ్నిలో ప్రవేశించి తమ మూడభక్తిని ప్రదర్శించుకోవడం ఎక్కువుగా జరిగేది. దోపిడీలు ఎక్కువుగా వుండేవి. ఈ దోపిడీలను దొంగలు చేసేవారు. ఈ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో వారిని చంపినా అతి పెద్ద నేరంగా పరిగణించబడేది కాదు. అక్రమసంబంధం నెరిపే స్త్రీ, పురుషులు ఇరువురిని చంపినా, చంపినవారికి శిక్ష వుండేది కాదు. క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన వైదుంబరాజు భువన త్రినేత్రుని పాలనలో వాయల్పాడు తాలూకా, కలకడ గ్రామంలోని శాసనం ఈ విషయాన్నే చెపుతుంది. అక్రమసంబంధం నెరిపే స్త్రీని మాత్రమే చంపితే, చంపినవారు 64 గద్యాలు చెల్లిస్తే సరిపోతుంది. చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేసే ఆచారం వుండేదని తెలుస్తోంది. గ్రామంలోని రైతులు అక్రమసంబంధాలకు సంబంధించి, నేరగాళ్లకు సంబంధించి నిర్ణయాలుతీసుకునే అధికారం గ్రామపెద్దలకు వుండేది. గ్రామస్థులు ఏ తప్పుచేసినా వారిని చంపమని సిఫార్సు చేసే అధికారం గ్రామపెద్దలకు వుండేది. గ్రామరైతులు నిజంగా తప్పు చేసిన వారి దగ్గర నుండి కొంత పైకము తీసుకుని వారిని వదిలివేసే అధికారాన్ని కల్గివుండేవారు. రైతులు అంటే ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కల్గివున్నవారని అర్థం. అంటే డబ్బున్నవారు హంతుకులైనా, గ్రామం కోసం కొంత బంగారాన్ని లేదా భూమిని ఇస్తే అతను నిర్దోషిగా మారిపోతాడు.

పుణ్యం కోసం దానధర్మాలను చేసే ఆచారం వుండేది. ముఖ్యంగా చనిపోయినవారి ఆత్మ శాంతి కోసం ఈ దానాలు ఎక్కువ జరిగేవి. క్రీ.శ.1016 నాటి మొదటి రాజేంద్రుని కాలంనాటి శ్రీకాళహస్తిలోని శాసనంలో ఇళయైరాజ వైళైక్కారన్ పుణ్యం కొరకు మహాదేవ ఆలయానికి 96 గొర్రెలు దానంగా ఇచ్చినట్టు వుంది. చక్రవర్తికి, అతని సంపద రక్షణకోసం వైళైక్కారులనే రక్షకబడులను నియమించుకునేవారు. రాజకు చెందిన సైన్యం ఎన్ని హత్యలు చేసినా తప్పించుకునే విధంగా చట్టాలు తయారుచేశారు. రాజుకు దగ్గరగా వుండే వ్యక్తులు ఎవరినైనా చంపితే వారి ఆత్మకోసం ఏదైనా దేవాలయానికి దూపదీప నైవేద్యం కొరకు దానం చేస్తే, అతనికి శిక్ష నుండి మినహాయింపు ఇచ్చేవారు. క్రీ.శ. 1112-18 మొదటి కులోత్తుంగుని పాలనాకాలంలో శ్రీకాళహస్తిలోని శాసనంలో సేనాని పట్టి అంగాడి అయ్యారన్ దేవాలయానికి దీపదానం చేసినట్టు పేర్కొనబడింది. ఇతను వేరేవారిని హత్యచేసి వారి ఆత్మకు శాంతికోసం ఈ దానాన్ని చేసి, శిక్షనుండి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

తీవ్రమైన కుల పట్టింపులతో సమాజం వుండేదనేదానికి శాసనాలు వున్నాయి. క్రీ.శ. 1204-1205 మూడో కులోత్తుంగని పాలనా కాలంలో శ్రీ కాళహస్తి శాసనంలో తమ కులం ప్రజల ప్రయోజనాలు పొందాలని కొంత కాలం వరకు స్వామి నైవేద్యానికి పురప్రముఖులు అంగీకారం తెలిపినట్టు శాసనంలో వుంది. అలాగే కొన్ని కులాలకు మాత్రమే మరిమితమై సైన్యం వుండేది. ఇడంగై కులానికి, ఆ కులానికే చెందిన సైనిక విభాగంపై అధికారం వుండేదని, వీరి పోషణ కోసం కొన్ని గ్రామాలను రాజు ఇచ్చినట్టుగా శాసనం వుంది. విజయనగర రాజుల కాలంలో చంద్రగిరి కేంద్రంగా సైనిక విన్యాసాలు జరిగేవి. ఇడంగైకులానికి చెందిన సైన్యం చంద్రగిరి దుర్గానికి కొంత కాలం రక్షణగా వుంది. రెండో హరిహరరాయల కాలానికి చెందిన శాసనం తిరుత్తణి తాలూకా వళకణామ్ వూండిలో వుంది. నాయనార్ స్వామి నైవేద్యానికి 40 పణాలు దానం నాయనాచారీ (కమ్మాళ్) తమ వృత్తిదారులు అభివృద్ధి చెందాలని దానం ఇచ్చినట్టు పుత్తూరు తాలూకా, నారాయణవనం శాసనంలో వ్రాయబడింది. క్రీ.శ.1510 రామేశ్వరం (ప్రస్తుతం కడప జిల్లాలో వుంది) శాసనం ప్రకారం, శ్రీకృష్ణదేవరాయల ఉత్తర్వుల మేరకు చంద్రగిరి, గండికోటస్థలం, సిద్దవటం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో పెండ్లిసుంకం రద్దు చేసినట్టు తెలుపబడింది. అంటే పెండ్లి చేసుకునేవారు గ్రామాధికారులకు ఇచ్చే పన్నును రద్దు చేశారు. ఇదే సంవత్సరంలో మదనపల్లి తాలూకా రంగసముద్రంలో సాళువ తిమ్మరుసయ్య ఉత్తర్వులు ప్రకారం కొన్ని కులాలకు మాత్రమే పెండ్లిసుంకాన్ని రద్దు చేశారు.

రాజుకు చెందిన వస్తువులపై కొన్ని ముద్రలను గుర్తుగా వేసేవారు. ఆ వస్తువులు ఆ రాజవంశానికే చెందుతాయి. అలాగే స్త్రీల శరీరాలపై కూడా రాజులు ముద్రలు వేసేవారు. ఆ స్త్రీలపై ఆ రాజవంశీయులకే అన్ని హక్కులుండేవి. అంటే స్త్రీలను బానిసలుగా, లైంగిక వస్తువులుగా చూసే ప్రక్రియ క్రీ.శ 10వ శతాబ్దం వరకు వుండేదని తెలుస్తోంది. అలాగే సమాజంలోని కొంతమంది స్త్రీలను బలవంతంగా రాజు అంతపురంలో సేవకు వినియోగించినట్టు, వారి శరీరాలపై రాజముద్రలను వేసినట్టు చిత్తూరు జిల్లాలో కొన్ని శాసనాలున్నాయి. క్రీ.శ.1087-1088 మొదటి కులోత్తుంగుని శ్రీ కాళహస్తి శాసనంలో చక్రవర్తి రాజసౌధము నుండి కొంతమంది స్త్రీలను శ్రీకాళహస్తీశ్వరాలయానికి బదిలీ చేసినట్టు పేర్కొనబడింది. ఈ స్త్రీలను కాళహస్తీదేవాలయ అధికారులు తమ యిష్టానుసారం వినియోగించుకొనుటకు అధికారం ఇవ్వబడింది. ఈ స్త్రీలను దేవరడియార్ అని పిలిచేవారని తెలుస్తోంది. దేవాలయానికి వచ్చిన తర్వాత స్త్రీల శరీరాలపై శూలము గుర్తు వేసినట్టు శాసనంలో వుంది. అలాగే రాజులకు అనేకమంది రాణులున్నట్టు తెలుస్తోంది. రాణుల మధ్య ఆధిపత్య పోరు చాలా తీవ్రస్థాయిలో వుండేదని శాసనాల్లో వుంది. క్రీ.శ. 1088వ సంవత్సరం నాటి శ్రీకాళహస్తి శాసనంలో ఘట్టియదేవుడు (యాదవరాయ దేవుడు) తన కంటే ముందు మరణిస్తే, అతని మిగిలిన రాణులకు తాను సేవకురాలు అవుతానని, అలాగే రాణుల జీవించి వుంటే వారు తన సేవకులకు సేవ చేయాలని ప్రతిజ్ఞ చేసినట్టు శాసనంలో వుంది.

ఆర్థిక పరిస్థితులు

గ్రామం యూనిట్‍గా అభివృద్ధి జరిగేది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా వుండి, పశుపోషణను కూడా రైతులు నిర్వహించేవారు. వ్యవసాయానికి అనుబంధంగా వుండే కులవృత్తులన్నీ గ్రామాల్లోనే వుండేవి. పశువులు ప్రైవేట్ ఆస్తులుగా చెలామణి అయ్యేవి. వీటిని పూజించడం కూడా జరిగేది. ప్రత్యేకంగా పశువుల కోసమే ఆవులు, గేదెల కోసం సంక్రాంతి సమయంలో పశువుల పండగను నిర్వహించేవారు. పశువుల కోసమే గ్రామాల్లో ఎక్కువ ఘర్షణలు చోటుచేసుకునేవి. వ్యక్తి ఆస్తిని అతనికున్న పశువుల ఆధారంగానే లెక్కకట్టేవారు. గ్రామాల్లోని పశువులను కాపాడేందుకు గ్రామాధికారులు కొంత సైన్యాన్ని నడిపేవారు. పశువులపై ఆధిపత్యం కోసం జరిగిన దాడిలో చనిపోయిన వారిని వీరులుగా కీర్తించేవారు. క్రీ.శ. 9వ శతాబ్దానికి చెందిన, వైదుంబరాజు గండత్రినేత్రుని పరిపాలన కాలపు శాసనం వాయల్పాడు తాలూకా, కలకడ శాసనం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. క్రీ.శ.964-965, వజ్జర దేవుని కాలంలో 300 ఎద్దులను వెమ్మరసన్ అనే వ్యక్తి అపహరించినట్టు శాసనం వుంది. శత్రువుల బలాన్ని అతనికున్న పశువుల సంఖ్యా ప్రాతిపదికనే నిర్ణయించేవారు. వ్యక్తి పశువులను అపహరిస్తే, ఆ వ్యక్తి హక్కులను సైతం హరించివేయబడినగా భావించేవారు.

అలాగే నూతన రాజధానులను నిర్మించేటపుడు, అక్కడ నివసించడానకి బలవంతంగా ప్రజలను ఎత్తుకెళ్లేవారు. పల్లవులను ఓడించిన ఆదోండై తొండైమండలం అనే నూతన రాజధానిని నెలకొల్పాడు. ఆ రాజధానికి బలవంతంగా ఏకంగా 3 లక్షలమంది ప్రజలను తరలించినట్టు శాసనం వుంది. ఇందులో 60 వేలమంది వెల్లాల కులానికి చెందినవారున్నారు. వెల్లాల కులానికి చెందిన వారికే వ్యవసాయ యోగ్యమైన భూమిని రాజు కేటాయించి కులపక్షపాతాన్ని చూపించాడు. వీరి పశువులకు కొత్త రాజధానిలో ఎక్కడైనా మేతను తినడానికి, ఎక్కడైనా వంటచెరకును వీరు ఉచితంగా సంపాదించుకోవడానికి (కానీ ఏచ్చి) వీరికి అధికారం ఇవ్వబడింది. కానీ ఏచ్చి స్థానంలో మిరాశీ అనే పదాన్ని మహ్మదీయులు తీసుకువచ్చినట్టు తెలస్తోంది. మిరాసీ అంటే ఎటువంటి పన్నులను స్వీకరించకుండానే భూమిని కేటాయించడమని భావించవచ్చు.

సహకార పద్ధతుల్లో వ్యవసాయం కొంతకాలం జరిగినట్టు తెలుస్తోంది. గ్రామంలో మిరాశీదార్ల ఎంపికను రాజు చేసేవాడు. వీరంతా రాజుపెత్తనాన్ని గ్రామాల్లో నడిపేవారు. భూమిని తాత్కాలిక పద్ధతిన కొంతమందికి ఇచ్చేవారు. వీరందరూ సామూహికంగా వ్యవసాయం చేసి, పంటను పన్నురూపంలో కొంత రాజుకు చెల్లించి, మిగిలినది పంచుకునేవారు. దీన్ని పసనకరీ పద్ధతి అనేవారు. వీరు తదనంతర కాలం శాశ్వత ప్రాతిపదికన భూమిపై హక్కును పొందారు. దీన్ని ఫలభోగం అనే వారు. వీరి భూముల్లో మెజారిటీ గ్రామప్రజానీకం వ్యవసాయ పనులు చేసేవారు. కొంతకాలానికి గ్రామల్లోని ఒకే వ్యక్తి అధీనంలోకి భూమంతా చేరిపోయింది. దీన్ని ఏకభోగం అనేవారు. మిరాసీదార్లతో పాటు తోట మిరాసీదార్లు వుండేవారు. వీరు పంటను కొనేవారు. గ్రామాల్లోని రైతులను పాయికార్లు అనేవారు. పాయికార్లు గ్రామాలకు వలసవచ్చినవారు. వీరు కౌలు రూపంలో కొంతకాలం భూమిని దున్ని, తర్వాత దాన్ని స్వంతం చేసుకునేవారు. అప్పుడు వీరు శాశ్వత కౌలుదార్లు అయ్యేవారు. అయినప్పటికీ వీరు మిరాశీకి, రాజుకు కౌలు చెల్లించాల్సి వచ్చేది. గ్రామాలలో వర్ణరూపం రాజులపరిపాలనలో చాలా బలీయంగా వుండేదని తెలుస్తోంది.

గ్రామాలకి స్వయంపాలనాధికారం కొంతవరకు వుండేది. గ్రామాధికారి (మణీగార్), గ్రామసేవకులు గ్రామాన్ని పరిపాలించేవారు. వీరికి శాశ్వతప్రాతిపదికన భూములు రాజు కేటాయించేవాడు. మిరాశీదార్లు, కౌలుదార్లు దగ్గర పన్నులను గ్రామాధికారి రాజు కోసం వసూలు చేసేవాడు. గ్రామాధికారి, న్యాయాధికారిగా వుండేవాడు. మర్యాదరామన్న తరహాలో గ్రామల్లోని తగాదాలను పరిష్కరించేవాడు. శాసనాలను బట్టి చిత్తూరుజిల్లా రాజుల ఏలుబడిలో వున్నకాలంలో గ్రామంలో కరణం, తలారి (గ్రామరక్షకుడు), తోటి (పొలాలకు నీరందించేవాడు), వడ్రంగి, కమ్మరి, చాకలి మొదలగు కులవృత్తులు వారుండేవారు. గ్రామాలలో వ్యవసాయం చేయకుండా వుండే భూములపై గ్రామస్థులకు హక్కువుండేది. భూములను నంజ, పుంజ, తోటలు అని విభజించి, దాని ప్రకారమే పన్నులు వసూలు చేసేవారు. బాగా పండేభూమి నంజగా వుంటుంది. మెట్టభూములు పుంజగా వుండేవి.

ముస్లింల పరిపాలనలో భూములపై హక్కును తీసివేసి, అన్ని భూములను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో మిరాసీదార్లు భూమిని సాగుచేయాల్సి వచ్చింది. ముస్లింలు గ్రామాల్లోని బ్రాహ్మణ ఆధిపత్యానికి ఇతోధికంగా మద్దతిచారు. ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే భూమిపై హక్కునిచ్చారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి గండికొట్టడానికి వీరు సాహసించలేక పోయారు. మిగిలినవన్నీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చారు. భూమిపై పన్నును వివిధ రాజులు భిన్న రకాలుగా వసూలు చేశారు. సాధారణంగా పంటపై 6వ వంతు పన్నుగా వుండేది. క్రీ.శ13వ శతాబ్దములో పాండ్యరాజులు ఇదే పన్నును వసూలు చేసేవారు. యుద్ధ సమయాలలో 4వ వంతు పన్ను వసూలు చేసినట్టు తెలస్తోంది. విజయనగరరాజులకాలంలో పంటపై 6వ శాతం పన్ను రాజుకు, 13వ వంతు బ్రాహ్మణులకు, 20వ వంతు దేవతలకు, మిగిలినది మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది. పండినపంటపై సగానికి పైగా ప్రభుత్వాలు పన్ను వసూలు చేసిన సంఘటనలు వున్నాయి. విజయనగర రాజుల కాలంలో రాజు కన్నా బ్రాహ్మణవర్గాలు ఆర్ధికపెత్తనాన్ని బలంగా కొనసాగించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here