[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]అ[/dropcap]ప్పట్లో డాలర్ కూడా 35 రూపాయలున్నట్టు జ్ఞాపకం. 15000/- నేను డాలర్లలోకి మార్చుకుని వెళ్ళాను. అవన్నీ కాకుండా వంద డాలర్ల తర్వాత మరొక వంద మాత్రం డాలర్లలోకి మార్చుకుని షాపింగ్ చేశాను. మధ్య మధ్యలో పెద్ద పెద్ద వరండాలలా, పైన రూఫ్‌తో వున్న మార్కెట్‌లు వచ్చేవి. అక్కడ చేతితో చేసిన చిన్న చిన్న బొమ్మలూ, చాటలో నిజం మిరపకాయలూ, మిరియాలూ లాంటివి అతికించిన చిన్న చిన్న చేటలూ, ఫ్రిజ్ మీద అతికించుకునేవి, స్వెట్టర్లూ, ఆడపిల్లలు వేసుకునే గాజులూ, పూసల దండలూ, టోపీలూ, గొడుగులూ, ‘మలక్క’ అని రాసి వున్న టి-షర్ట్‌లూ… ఇలాంటిని నేను చాలా కొన్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీలు కూడా చూసాం.
రోజూ లొకేషన్‌కి దూరాలు వెళ్ళేటప్పుడు నేను బస్‌లో ఆకలేసిన కెమేరామెన్ల బృందానికీ, మా కోడైరక్టర్ గోగూ, డైరక్టర్ చంద్రసిద్ధార్థలకీ బ్రెడ్ మీద నేను తెచ్చిన ఆవకాయ రాసి శాండ్‌విచ్‌లు చేసి పెట్టేదాన్ని. ఆకలి మీద వుండి అవి అడిగి అడిగి తినేవాళ్ళు. వెజిటేరియన్ తమిళ హోటల్ కనబడితే నాయుడు గారు, “రమణికి ఏం కావాలో ప్యాక్ చేయించండి” అని మేనేజర్ రాజాతో చెప్పేవారు.
నేనూ, అక్కడ షూటింగ్స్‌కి కోఆర్డినేటర్ రావుగారూ, వాళ్ళ అబ్బాయి శ్రీధర్ సామాన్యంగా షూటింగ్ స్టార్ట్ అయిపోయాకా నెమ్మదిగా రావుగారి కార్లోనే ప్రయాణిస్తూండే వాళ్ళం. అప్పుడు నేను మీసాలూ గెడ్డాలూ వున్న కోతుల్ని చూసి, “సార్… కోతుల్ని చూడండి… మీసాలూ, గెడ్డాలూ వున్నాయి. మునుల్లా ఉన్నాయి” అని నిద్రపోతున్న నాయుడుగారిని నిద్ర లేపేసాను. ఆయన కళ్ళు నులుముకుంటూ లేచి, “ఏవీ? కర్రలు తీసుకోండి… ఏమైందీ?” అంటూ కంగారుపడ్డారు.
నేను భయంగా, “కోతులు తమాషాగా వుంటేనూ….” అన్నాను.
ఆయన చాలా సేపు నవ్వి “చిన్నపిల్లవి రమణీ నువ్వూ… రచయిత్రివి కదా! బాగా పెద్దమనిషి తరహాగా వుంటావనుకున్నా!” అన్నారు. తర్వాత కూడా చాలా విచిత్రమైన జంతువులనీ, పక్షులనీ చాలా వాటిని చూసాం. మలేషియాకి రాజున్నాడనీ, వారసులు లేరనీ, ఏనుగు ఎవరి మెడలో దండేస్తే వాళ్ళే రాజులనీ రకరకాల కథలు రావుగారు చెప్తుంటే వినేదాన్ని. ఈ రావుగారూ వాళ్ళూ, వాళ్ళ తాతల కాలంలోనే వైజాగ్ ప్రాంతాల నుండి ఈ మలేషియాకి వలసెళ్ళి పోయారుట. వాళ్ళ భాష విచిత్రంగా వుంటుంది. తెలుగు మాట్లాడ్తున్నారని, చాలాసేపు మాట్లాడాకా కానీ తెలీదు! చేపలు పట్టేవాళ్ళు వైజాగ్ సముద్రతీరంలో ఎలా మాట్లాడ్తారో అలా వుంటుంది. “వచ్చీసి, సెప్పెల్లిపోనాను…. నాన్నారు ఇంకా వేగిర ఎల్లి పొచ్చీస్తారనుకోలేదు” అన్నట్టుండేది. “ఏంలా? మాటాడవేంలా? ఇటు రాలా!” అని ‘తెలుగబ్బాయి’ అనే సినిమాలో కూడా మా ఓ.ఎస్. అవినాష్ ఆ భాషపెట్టి తనీష్‌తో అక్కడ సెటిల్ అయిపోయిన స్థానికుల మీదొక సినిమా తీసాడు తర్వాత. రమ్యా నంబీశన్ అనే అమ్మాయి నటించి, ఓ పాట కూడా పాడింది అందులో. మొత్తానికి రావుగారి తెలుగు, ఆయన లేనప్పుడు ఇమిటేట్ చేసి అందరికీ నేను వినిపిస్తుండేదాన్ని. దాదాపు మలేషియాలో కొన్ని వేలమంది తెలుగువాళ్ళుంటారు. అరవం అయితే వాళ్ళకి మలయా ఎంతో, అంతే విరివిగా మాట్లాడ్తారు.
ఇండోనేషియా ముస్లింలు నెత్తిమీద ముసుగు కప్పుకుని, మన పైట కొంగుకి పెట్టుకునే బ్రోచ్‌ల లాంటివి, భలే విచిత్రమైన డిజైన్‌లలో రాళ్ళతో చేసిన అందమైన అభరణాల్లా పెట్టుకుంటారు. అవి నేను చాలా కొనుక్కొచ్చాను. నా ఫోటోలు అన్నింట్లో అప్పట్లో బ్రోచ్ పెట్టుకునే వుండేవి.
మొత్తం పదిరోజుల్లో మూడు రోజులు మలేషియాలో షూటింగ్ చేసాకా, లంకావీకి వెళ్ళి అక్కడ నాలుగు రోజులుండి, తిరిగి వచ్చి మళ్ళీ మూడు రోజులుండి ఇండియాకి తిరిగివచ్చాం. మా కాస్ట్యూమర్ జగదీష్ ఎక్కడ ‘టండాస్’ అని రాసున్నా, “అదిగో ఆడ టండాస్… మగ టండాస్… వెళ్ళి రండి” అని అరిచేవాడు! అతనే తర్వాత నిర్మాతగా కూడా మారి ‘సీమశాస్త్రి’ అనే సినిమా అల్లరి నరేష్‌తో తీసాడు. ప్రయాణంలో మాత్రం బస్ కదిలితే డాన్స్‌లూ, పాటలూ, చాలా అల్లరి చేసేవాళ్ళం. అందరూ సమానం అన్నట్లు హీరో, డైరక్టరు కూడా చేతికందినవి పట్టుకుని నడుస్తూండేవారు. మామూలు షూటింగులలో వుండే భేషజాలు అక్కడ వుండేవి కావు!
అప్పట్లో ఇలా సెల్‌ఫోన్స్‌లో కాల్ చేయడానికి వాట్స్‌అప్‌లూ అవీ లేవు. యు.ఎస్.కి మాత్రం మేజిక్ జాక్ అనే పరికరం తెచ్చి మన పీ.సీ.కి కనెక్ట్ చేసి యు.ఎస్.లో వున్న వాళ్ళతో మాట్లాడే వాళ్ళం, డబ్బు ఖర్చు కాకుండా, వై-ఫైలో. అందుకే సింగపూర్ వెళ్ళగానే చాలామంది సెల్‌ఫోన్, ఇంకా అందులోకి కార్డూ కొనుక్కున్నారు. నేను కొనలేదు. ఒకసారి రావుగారి సెల్‌లోంచి, ఇంకోసారి చంద్ర సిద్ధార్థ సెల్‍లోంచీ నేనూ అమ్మతో, పిల్లలతో, మా వారితో మాట్లాడాను. అమ్మతో ఓ రోజు సాయంత్రం అక్కడ మంచి నది దగ్గర నిలబడి మాట్లాడ్తూ “అమ్మా ఇక్కడ ఎంత బావుందో తెలుసా? నిన్నూ తీసుకొస్తే బావుండేది… నిన్ను తప్పకుండా తీసుకొస్తాను” అన్నాను. అమ్మ చాలా ఆనందపడిపోయింది. “నిజంగా?” అని అడిగింది. ఆ విషయం నేను కాలక్రమంలో మర్చిపోయాననుకుంది, కానీ, 2012లో నేను అమ్మ పుట్టినరోజుకి “నీకీ సారి బహుమతేంటో తెలుసా? మనం మలేషియా వెళ్తున్నాం…” అని తీసుకెళ్ళాను. చిన్నపిల్లలా ఎంజాయ్ చేసింది.
ఆ చల్లని వేళ రావుగారి ఫోన్ లోంచి నేను మా అమ్మతో మాట్లాడిన వేళే, నేనన్న మాటకి ఆకాశంలో ‘తథాస్తు’ దేవతలు తథాస్తు అనే వుంటారు. అమ్మలూ నాన్నలూ మనకెన్నో చేస్తారు. మనం ఏం చేసామో ఆలోచించుకోవాలి. ఎందుకంటే, మనం చాలా కొంచెం చేసినా వాళ్ళు బోలెడు మందితో చెప్పుకుని బోలెడు ఆనందపడ్తారు.
నా మొదటి విదేశీ ప్రయాణమనేమో… మలేషియా నాకెంతో ఇష్టమైన ప్రదేశంగా వుండిపోయింది.ఇప్పటికి నాలుగుసార్లు వెళ్ళొచ్చే అవకాశం వచ్చింది. ప్యూచర్‌లో కూడా ఇంకా చాలాసార్లు వెళ్తానేమో!
పాటల షూటింగ్ పూర్తి చేసుకుని మేం హైదరాబాద్ వచ్చేసాం. నేను ఇంటికి రాగానే సూట్‌కేస్ తెరిచి, అప్పటికే ఆర్కిటెక్చర్ మొదటి ఏడులో కొచ్చిన మా పెద్దబాబుతో సహా ఇద్దరు పిల్లలూ, నెను తెచ్చిన వస్తువులనీ, చాక్లెట్లనీ చూసి చాలా ఆనందపడ్డారు. మా నాన్నకీ, అమ్మకీ, అన్నయ్యకీ, వదినకీ అని నేను పేరు పేరునా వస్తువులు తెచ్చాను. అక్కడి విశేషాలన్నీ చెప్పాను. ఇక్కడ రెస్ట్‌రూమ్స్ మీద టండాస్ అని వుంది. కానీ ఇండోనేషియాలో అయితే ‘వనితా’, ‘ప్రియా’ అని వుంటుందట! Taxi కి taksi అనీ, Lobby కి laby అనీ, Police కి Pulis అనీ ఇలా చాలా తేలిగ్గా ఇంగ్లీష్ రాసి వుంటుంది. అన్ని చోట్లా మనం ఎలా పలుకుతామో అలాగే రాస్తారు. మాకు భోజనానికి ఏమీ ఇబ్బంది లేదు. రావుగారు మంచి వంటవాళ్ళతో వండించేవారు. మామూలుగా వెళ్తే కొంచెం కష్టమే. కానీ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ప్రొద్దుటే చాలా బావుంటుంది. మొత్తం మూడు హోటల్స్ మారాం అక్కడ, లంకావీ తో కలిపి.
నేనూ ప్రేమా పేవ్‌మెంట్ మీద ఓపెన్ ఎయిర్‌లో పెట్టే రెస్టారెంట్స్‌కి నడుచుకుంటూ వెళ్ళి తను నాన్‌వెజ్ ఫుడ్, నేను ఫ్రూట్స్ తినేవాళ్ళం. అక్కడ దొరికేటన్ని రకాల పండ్లు మనకి దొరకవు. అన్నీ అతి తీపిగా వుంటాయి. పులుపూ, వగరూ అనే మాటే లేదు. అందులో ‘రంబూటాన్’ ప్రసిద్ధి.
మళ్ళీ మా షూటింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడొచ్చింది చిక్కు.
(సశేషం)