అనుబంధ బంధాలు-1

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దుపొడుపు వేళ…

నీరెండ మొదలయింది.

పక్షుల కిలకిలారావాలు…

జనసందోహాపు అలికిడి…

గూడు విడిచిన కోడిపుంజు కొక్కోరోక్కో అని కూసింది.

కాల మహిమ అనుకున్నాడు – కసువు చిమ్ముతున్న పరమయ్య.

‘తొలికోడి ఏమిటో ఇప్పటి తరానికి బొత్తిగా తెలీనీకుండా చేస్తున్నాయి ఈ కోళ్ళు’ అనుకుని లేగ నొదిలాడు. తల్లి పొదుగుదాపుకు రెండు గెంతులలో చేరింది.

ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. దశరథంగారి ఇల్లాలు ‘సీతమ్మ’ బయటకొచ్చింది.

పరమయ్య కనిపించాడు. “నువ్వు వచ్చావేంటి? ‘నాగులు’కు ఏమయింది?” అడిగింది

“రాడట.”

“ఈ పొద్దేనా?”

“ఆఁ… వాళ్ళ అక్క ఇంటికొచ్చింది.”

“అయితే గేదెను ‘జంగిరి’ మందను కాసే గోపాలానికి అప్పగించు. పొద్దస్తమానం దానితో పడలేవు” అంది.

“అట్లాగే” అంటూ పెరటి గుమ్మం దగ్గర కొచ్చి వెనక్కి నడిచాడు.

“సీతా” అంటూ దశరథం వచ్చి చేరాడు.

“ఇక్కడే ఉన్నాను” అంటూ కళ్ళాపి చల్లే ప్రయత్నంలో పడ్డది.

దశరథం స్కూలు మాస్టారు. సీతమ్మ కూడ పిల్లలకు రాత్రి బడి చెపుతుంది. వీరికి ఒక కూతురుంది. ఆ పిల్ల పేరు విజయ. పట్నంలో BSC final చదువుతుంది. అంటే ఈ సంవత్సరంతో చదువు పూర్తవుతుంది. B.Ed చదివించాలా, పెళ్ళి చేయాలా అన్నది మాష్టారు దంపతులకు తెమల్లేదు. నడుస్తున్న కాలం కనుల ముందుంది గనుక భయం.

విజయ చదువుతానంటే అలాగే అనే స్థితి.

“నేను పోతన్నా” అన్నాడు పరమయ్య – కందిపుల్లల పొరకను కొష్టం గాట్లో వేసేస్తూ.

“పెందలాడే వచ్చేయ్ – గేదెను మందలో తోలి వెళ్దువు” అంది సీతమ్మ.

“అట్టనే” అని దోవన పడ్డాడు పరమయ్య.

***

“ఇదిగో అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది” అన్నాడు దశరథం.

“వచ్చిందా పరీక్షలు ఎప్పుడు అయిపోతాయట?” అంటూ ధశరథం ఎదురుగా వచ్చింది. ‘బిడ్డ’ భావన ఆవిడలో ఆనందాన్ని నింపింది.

“చెప్పటం ఎందుకు డిక్టేషనులా? చదువుతా విను.”

“అక్కరలేదు లెద్దురూ మీరు చదివారుగదా చెప్పండి చాలు.”

“పరీక్షలు ఇవ్వాల్టితో పూర్తయినయి. రేపు దాని స్నేహితురాండ్రుతో గడిపి ఎల్లుండి ఉదయం బయలుదేరి వస్తుందిట. పరీక్షలు సంతృప్తిగా వ్రాసిందట. దీని రూంమేటు లేదూ ‘అహల్య’, ఆ పిల్ల వాళ్ళ ఊరు రమ్మనమని తెగ వత్తిడి చేస్తుందట. ఈ సారికి వాయిదా వేసిందట. ఇంటికే వస్తున్నట్లు వ్రాసింది.”

“ఎంత స్నేహితురాలు అయితే మాత్రం మనకంటే ఎక్కువా?” అని, “ఆ మరచిపోయాను అమ్మడి ఉత్తరం అనేసరికి” అని నవ్వి, “మన కరణంగారు మిమ్మల్ని ఒక్కసారి కలిసి పొమ్మమన్నారు వాళ్ళ పాలేరు వచ్చి చెప్పాడు” అంటూనే వంటింటి వైపుగా నడిచింది సీతమ్మ.

“ఇదిగో గుక్కెడు కాఫీ ఇస్తే గొంతులో పోసుకొని వెళ్తాను” అని కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్ళు గాబు దగ్గరకు నడిచాడు.

కాఫీ తాగి బయటకి నడుస్తూ, “కాఫీ బాగుందోయ్, బిడ్డ ఇంటికి వస్తుందన్న ఆనందంలో కలిపి ఉంటావు” అన్నాడు.

“అంటే రోజు బావుంటం లేదా?” అంది తొంగి చూసి.

“ఓర్ని ఇవ్వాళ్ళ బావుంది అన్నాను. దానికి రాజుగారి పెద్ద భర్య పతివ్రత అంటే చిన్న భార్య కాదనే కదా అన్నట్లు అర్థం చేసుకుంటే ఎలా? రోజుటి కంటే ఇవాళ్ళ బావుంది అనుకోవచ్చుగాదా. మీ ఆడవాళ్ళు ఎందుకోగాని అలా బొత్తిగా అనుకోలేరోయ్. అనుమానం మొదట, ఆ తరువాత మీరును భూమ్మీద కొచ్చారని మన పెద్దలు ఊర్కే అనలేదు. అనేక అనుభవాలతో వేగి చెప్పిన మాట ఇది” అని, “నేను కరణం గారింటికి వెళ్ళి వస్తాను. ఈ లోపు తీరికగా ఇంకా ఎమైనా అభియోగాలుంటే కుప్ప వేసుకొని కూర్చో, ఎట్టాగూ ఇంటికైతే వస్తాను గదా కట్టుకున్న మొగుణ్ణి తప్పుదు. వచ్చాక Home affairsకు అధిపతివని తెల్సుగనుక చచ్చినట్లు వినాలి. అయినా నేనెంత సాత్వికుడినో ఊరందరికి తెలుసు. నువ్వు ఒంటికాలి పైన లేచి ఏదైనా అఘాయిత్యం చేసినా ఎవ్వరూ నమ్మరు. శ్రీకృష్ణపరమాత్మ అంతటి వాణ్ణే – పడకటింట్లో తంతే (సత్యభామ) చేసేదేముంది, గుట్టుగా నోరు మూసుకొని ఉండటం తప్ప” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

“అసలు నేనేమన్నా? ఈయన పిల్లలకు పాఠం చెప్పినట్లుగా చెప్పి వెళ్ళాడు” అని ఆలోచనలో పడింది సీతమ్మ.

వంటా వార్పు పూర్తి చేసి, పాలలో తోడు పెట్టి ఆరుబయట కొచ్చి ‘ఈయన ఇంకా రాలేదేం’ అనుకుంది.

మనసాగక గేటు దాక వెళ్ళి తోవ వైపు చూసింది.

చంద్రమ్మ వస్తూంది.

సీతమ్మను చూసి దగ్గరకొచ్చి “బోజనాలయినాయా? అయ్యగారున్నారా?” అని అడిగింది.

“కరణం గారింటికని వెళ్ళారు, వస్తుంటారు” అని, “నువ్వెటు?” అంది.

“ఇక్కటికే.”

“ఏంటి?”

“ఓ ముచ్చట అడిగి పోదామని వచ్చిన.”

“చెప్పు.”

“చెప్త” అని వెంటనడుస్తూ “మా ‘మున్ని’ ఆరెళ్ళాయే గద కాపరానికి పోయి, ఇప్పటిదాకా దాని కడుపున ఏ కాయా కాయలేదు. దాని కిప్పుడు పిల్లల పైన మనస్సు కలిగింది.”

“ఇంకేం? కనమను” అంది నవ్వుతూ.

“అది రడీయే, కానీ దాని మొగుడు పెళ్ళికాకముందు డబ్బుల కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకున్నాడంట.”

“అదెలా” అని ఆశ్చర్యపోయింది సీతమ్మ.

“ఏదో పరిస్థితిలో అట్టా అయిందట.”

“వెళ్ళి డాక్టరును కలవమను. విషయం చెపితే వాళ్ళు మార్గం చూస్తారు.”

“ఆడు ఎల్లడట. ససేమిరా అంటున్నాడు.”

“అతనెళ్ళక పోతే ఎలా చంద్రమ్మా? ఇది భారతం నాటి కాలం కాదు. ఎవరో ఒకరు సరే అంటే ఏ వ్యాసుల వారో వచ్చి సంతునిచ్చి వెళ్ళడానికి” అని నవ్వి, “ఆ టెస్టుట్యూబు బేబీలని ఈ మధ్య చదివాను. ఆ ప్రక్రియలో సంతానాన్ని కనవచ్చునంటున్నారు. న్యాయానికి కౌరవలంతా వారే. అలా పుట్టిన వారే.”

“అమ్మో అమ్మో నీకు నోరు ఎట్టా వచ్చింది తల్లీ. అట్టా కల్గినోడికి ‘వాడు’ అదే మా అల్లుడు తండ్రి ఎట్టా అవుతాడు?” అంది లబలబలాడుతూ ఎగతట్టిన కోపాన్ని ఆపుకొని.

“నీ కూతురు మున్ని అతగాని భార్యేగదా?”

“అవును.”

“మరి నీ కూతురుకు కల్గిన సంతానానికి అల్లుడు తండ్రి కాక ఏమవుతాడు. అనవసరంగా లబలబలాకడు. ఆదివారం నాడురా ఈయన కేమైనా తెలిస్తే చెపుతారు” అంది.

“అట్టనే వస్తాను” అని “ఏమవుతదో ఏందో?” అనుకుంటూ లేచింది.

రాత్రి తొమ్మది గంటలకు గానీ రాలేదు దశరథం. రాగానే ఇంత పెట్టింది తిన్నాక తనూ తిన్నది, వంటిల్లు సర్ది తలుపులు వేసి బయటి కొష్టం దాక నడిచింది పశువులకింత మేత వేసింది. నెమ్మదిగ మంచం దగ్గిరికి వచ్చింది ఏదో చెపుదామని, అప్పటికే మంచి నిద్రలో కెళ్ళిపోయాడు మాష్టారు. ‘బాగానే ఉంది సంబడం’ అనుకొని, పక్కనే ముడుచుకొంది.

***

తెలతెలవారుతుంది- పరమయ్య పనిలోకి రాలేదు. బుడతడే ఇవాళ్ళ కసువు పొరగొడుతూ కనిపించాడు.

కొంచెం బద్దకంగా అనిపించింది సీతమ్మకు. కళ్ళు తెరచి పక్కకు చూసింది. ఈయన లేరు. ఉలిక్కిపడింది అంత బద్దకంలోనూ.

మంచం దిగి గబ గబా నడిచి తలుపు బార్ల తెరచి ఉంది. గడప దాటింది.

“అమ్మగారూ కసువు పూర్తయింది. కళాపి చల్లండి” అన్నాడు బుడత.

“అరేయ్ బుడ్డీ, పంతులు గారేడీ?” అడిగింది.

“ఇంతకు ముందే ఆచార్లయ్యగారు కనపడితే… ఆయనగారితో ఊళ్ళోకి వెళ్ళారేమో.”

“అయితే వస్తుంటాడు. అని కళాపి చల్లి ముగ్గు వేయడం పూర్తిచేసి లేస్తుండగా వస్తూ కనిపిచాడు.

వస్తూనే “మన ఆచార్యయ్య కోడలు పురిటి నొప్పులతో సతమతమవుతుంటే…” అన్నాడు.

“పురిటి నొప్పులకు మంత్రసాని కావాలిగానీ మీరెందుకు?” అంది నవ్వు ముఖాన పులుముకొని.

“మంత్రసానికి అర్థమవకనే నే వెళ్ళింది.”

“ఏమర్థమయిందేమిటి?” అంది నడుస్తూ.

“కనలేక ప్రాణం విడిచింది.”

“శివ శివా ఈ కాలంలో కూడా ఇలా అశ్రద్దగా ఎందుకున్నట్టు? బాలవాడి అనంతమ్మ రాలేదా, అనుభవం ఉన్నావిడ” అంది.

“ఇదే పని పైన గూడెం వెళ్ళిందట ఆవిడ”

“నూకలు చెల్లాయన్నమాట” అంటూ లోనకు నడచింది.

“వాళ్ళ ఘోష చూడలేక పోయాను సీతా. ఏమని ఓదార్చగలం? ఆ లోటు లోటే. భర్తీ అయ్యేది కాదు” అని ఒక క్షణం ఆగి “సీతా బాగా తరచి ఆలోచిస్తే బాధ కల్గదు? పుట్టినాక చావు సహజం. కాకపోతే ఇన్నినాళ్ళ సంబంధం అనుబంధం కన్నీరు తెప్పిస్తుంది. భరించలేమేమోననిపించే క్షణాలు ఎదురు అవుతాయి. ఆ కొద్ది సేపూ దాటితే చాలు… అంత త్వరగా మరపురాక పోయినా నిగ్రహించుకొనగలం” అన్నాడు.

సీతమ్మ భర్తను చూసి “నేనూ ఆచార్లయ్యగారింటికి ఒక్కసారి వెళ్ళి వస్తానేం” అంది.

“అమ్మా లేగ నొదలనా?” అడిగాడు బుడతడు.

“ఇప్పుడా?” అంది సీతమ్మ.

“వేళయిందమ్మా.”

“అయిందా?” అంది దాపునున్న పాలతప్పేలను అందుకుంటూ.

***

“ఇవాళ్ళ అమ్మాయి వస్తుందోయ్” అన్నాడు దశరథం.

“అసలు రాత్రి నిద్రపోయారా? బోరిపాల బొప్పెమ్మనే తలచుకుంటూ మాగన్నుగా ఉండిపోయారా? ఇంతోటి బిడ్డ ఇంకెవరికైనా ఉందా” అంది సీతమ్మ భర్తకు కూతురిపై ఉన్న అనురాగానికి మనసులో అనందిస్తూ…

“నన్ను అనాలని అంటావుగానీ” అన్నాడు కండ్లలోకి చూస్తూ.

“సర్లే, బాగానే ఉంది కానీ ఇంకా కూర్చోనే ఉన్నారేంటి, బస్సు స్టాండు దాకా వెళ్ళక” అంది.

“ఎనిమిదింటికే అది వచ్చేది. మన పద్ధతి ప్రకారం పావుగంటన్నా ఆలస్యం అవుతుంది గదా! ఇంకా టైముంది. వెళ్తానులే” అన్నాడు.

“మీకు తోవలో ఒక్క మనిషి ఎదురు పడితే చాలు, అది బస్సు దిగి ఎదురొస్తుంది” అని నవ్వింది.

లేచి నడవబోయి ఆగి “ఇదిగో ఎనిమిదింటి బస్సు వస్తుందా?” అన్నాడు.

“వస్తుంది, ఎందుకురాదూ?”

“అంటే అది వట్టి పేగులతో వస్తున్నట్లు. అంతేనా నువ్వు కనిపించగానే ‘అమ్మా బొబ్బట్లు’ అంటే తెల్లమొఖం వేస్తావా లేక మీ నాన్నగారు నువ్వు వస్తున్నవని పగలే కలల్లోకి వెళ్తుంటే అవేమిటో చూద్దామని నేనూ వెళ్తాను. అంచేత బొబ్బట్లు కార్యక్రమం అటకెక్కింది. ప్రస్తుతానికి మంచి కాఫీ ఇస్తాను. నువ్వు సేద తీరేలోపు. ఉప్మా చేసి పెడతాను అంటావా?” అని, “నా పిచ్చిగాని అది రాగానే ఇద్దరూ జట్టుగా అయిపోతారు” అన్నాడు.

బుడతడు పని ముగించుకొని చేతులు కడుక్కుంటూ కనిపించాడు.

కూనిరాగం వినిపించిది, లీలగా ఆగి ఆలకించాడు దశరథం. బుడతడు అర్థమయాడు. అసలే పని చేయని వానిలా ఉన్నాడు. ఈ కూనిరాగమే వాడి పని అలసటను తెలీకుండా చేసిందా అనిపించింది. “పని అయిందట్రా” అడిగాడు దశరథం గేటు దాటుతూ.

“వస్తున్నా” అన్నాడు.

“ఎక్కడికి?”

“అమ్మాయిగారు వస్తుందట గదా, బస్టాండుకు నేనూ వస్తా.”

“నిన్ను గానీ రమ్మన్నదా” అన్నాడు విస్తుపోతూ.

“రమ్మనడమేంటి నాకు కొత్త బట్టలు కూడా తెస్తుంటే. నేను ఆ బట్టలు వేసుకొని శ్రీరామనవమికి అమ్మగారెంట బద్రాచలం వెళ్తానుగదా” అంటూ పరుగో పరుగు.

“అరేయ్ నిన్నే నిన్నేరా” అని దశరథం ఎంత గొంతెత్తి అరచినా ఆగలేదు. పైగా ఆ పరుగులో, త్వరగ రండి” అన్నాడు.

“అవును వెళ్ళాలి” అనుకుంటూ నడిచాడు.

బుడతడి ముఖంలో కనిపించిన ఆనందం చూసాక ‘పసివాళ్ళను దేవుళ్ళనేది అందుకే, విజయంటే వీడికింత ప్రేమ ఎందుకు’ అనుకున్నాడు.

అసలు ప్రేమంటే ఏమిటట? దీని పుటుక ఎక్కడ? ప్రేమ భావన కలిగే వరకూ ఇది ఎక్కడ దాక్కుని ఉంటుంది? ఎందుకు ఎలా ఏ ఆకర్షణను చూసి మొదలవుతుంది? ప్రేమిచేందుకుగానీ ప్రేమ కలిగేందుకుగానీ కావల్సిన మసాలా ఏమిటి? ఈ మధ్యన పుట్టే ఆకర్షణ ఏమిటి? ఎందుకు కల్గుతుంది?

ప్రేయసీ ప్రియు నడుమ. తల్లీ బిడ్డల నడుమ. ఆత్మీయుల నడుమ. స్నేహం నడుమ. సన్నిహితుల నడుమ. భగవంతుని నడుమ. అనురాగపు అంతరాల నడుమ. ఎందుకిది పుట్టి పెరుగుతుంది? అసలు దీని స్వరూపమేమిటి?

భగవత్ స్వరూపమే ప్రేమా? అట్టా అయితే అసలు భగవంతుడెవరు ఉన్నాడా? ఉంటే ఎవరు చూసాడు? చూసి ఏం చెప్పాడు? అసలు నేను చూసాను అన్నవాడెవడు?

ఇలా ఆలోచన ప్రయాణం చేస్తుండగా ‘అమ్మాయి’ అన్న మాట వినిపించి ఆగాడు.

తను వెళుతున్నదేటో చూసుకున్నాడు. సిగ్గనిపించింది. వెనక్కి మళ్ళాడు టైం చూసుకొని. అప్పుడనిపించిది ‘నన్నెవరో పిరిచారు’ అని.

ఆగి చూసాడు.

దీక్షితులు.

“నువ్వే నువ్వే అనుకున్నాను” అన్నాడు నవ్వుతూ ఆగి.

“నువ్వు ఇంత గొప్ప వాడవని తెలిసే మీ ఇంటికే బయలుదేరాను. ఇక్కడకు చేరేసరికి నువ్వు వస్తూ కనిపించావు. నా కోసమే నేమో అనుకున్నాను. కాని నన్ను దాటి వెళ్ళావు, అప్పుడు అర్థమైయింది, పిలిచాను” అన్నాడు.

“బస్సుస్టాండుకే గదా” అన్నాడు తలదించుకొని దశరధం.

“అమ్మాయి వస్తుంది గదా, నువ్వు బయలుదేరింది అందుకే మరి. నన్ను బస్సుస్టాండుకేనా అని అడుగుతావేంటి?” అన్నాడు చికాకుగా.

“ఆహ! అది కాదు నువ్వు ఏదైనా పని ఉండి వెళ్తున్నావేమోననీ…” అంటూ, “అయినా విజయ వచ్చాక ఇంటికిరాక ఎక్కడికిక పోతుంది. అంత ముంచుకపోయే పనులు మనకేముంటాయి. పిల్లది వస్తుంది గదా చూసి పలకరించి పోదం. అరెయ్ మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగిపోతే విజయ నా ఇంట్లో కొచ్చాక నువ్వు పలకరించేందుకు చుట్టపు చూపుగా రావాల్సిన వాడివి నాకా అదృష్టం లేదు” అని కళ్ళు కండువాతో తుడుచుకుంటూ నడిచాడు దీక్షితులు.

“ఇదిగో దీక్షితులు” అంటూ దగ్గరికెళ్ళి భూజాన చెయ్యి వేసి “ఏంటి? ఏంటిరా తోవలో? ఏంటి? అరెయ్ తిరిగి రాని గతాన్ని నెమరేసుకు బాధపడేంత జవసత్వాలున్న వాళ్ళంగాదు మనం. నువ్వు మరచిపోలేక పోతున్నావుగానీ మరిచిపోక ఏం చెయగలం చెప్పరా?” అని ఆగి చెయి పట్టుకొని “రా ఇద్దరం వెళ్ళేదీ దాని కోసమే, పరీక్షలు వ్రాసి ఇంటికి వస్తుంది. ఇప్పుడు కంట తడి ఎందుకు పద” అన్నాడు. ఇద్దరు నడిచారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here