[dropcap]ప్[/dropcap]రముఖ సాహితీ విమర్శకుడు డా॥ ఎస్. రఘు రచించిన 16 వ్యాసాల సంపుటి ఇది. ఈ పుస్తకాన్ని మనస్వి ప్రచురణలు వారు ప్రచురించారు.
***
ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి “నేటి తరం విమర్శకుడు రఘు” అనే ముందుమాటలో ఈ విధంగా వ్యాఖ్యానించారు:
” ‘సమన్వయ’ 16 విమర్శవ్యాసాల సంపుటి. ఇందులో ఎనిమిది వ్యాసాలు కవిత్వం మీద, నాలుగు వ్యాసాలు కథానిక మీద, నాటకం, విమర్శ, యాత్రాచరిత్ర, చిత్రకళ మీద ఒక్కో వ్యాసం ఉన్నాయి.
ఒక విమర్శకుడు అనేక ప్రక్రియల మీద విమర్శ రాసినా, అనేక సాహిత్యాంశాల మీద రాసినా వారిదైన విమర్శా ప్రణాళిక ఉంటుంది. వాళ్ళదైన విమర్శా మెథడాలజీ ఉంటుంది. ఈ ప్రణాళిక, ఈ మెథడాలజీ ఎంత స్పష్టంగా ఉంటే ఆ విమర్శ అంట స్పష్టంగా ఉంటుంది. రఘుకు విమర్శాప్రణాళిక, మెథడాలజీ కుదురుకుంటున్నాయి.
సాహిత్య విమర్శకులకు సామాజిక, సాహిత్య పరిమాణాలు, రచయితల నేపథ్యాలు, సాహిత్య ప్రక్రియల క్రమవికాసాలు తెలిసుంటే వాళ్ళ విమర్శ సాధికారికంగా ఉంటుంది. రఘుకు ఈ పరిణామ వికాసాల పరిజ్ఞానంలో పట్టువడుతున్నది అనడానికి ఈ పుస్తకంలో అనేక ఉదహారణలున్నాయి.
సాహిత్యాన్ని గురించి రచయితలకు ఎంత బలమైన అభిప్రాయాలు ఉంటాయో, సాహిత్య విమర్శకులకు కూడా అంతే బలమైన అభిప్రాయాలు ఉండాలి. సాహిత్యం గురించి పూర్వ అవగాహన ఏదీ లేకుండా విమర్శ రాయడం సాధ్యం కాదు. రఘుకు సాహిత్యతత్వం గురించి చాలా ఆరోగ్యకరమైన అవగాహన ఉంది.
రఘు కవి, విమర్శకుడు. అందువల్ల ఈయన విమర్శలో కవితాత్మకత పల్చగానైనా కనిపిస్తుంది. రఘు విమర్శక వచనం సరళంగా, సుందరంగా ఉంటుంది. రఘు విమర్శక వచనం పాఠకుడిని ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది.
తెలుగు సాహిత్యవిమర్శ ఎదుగుదలకు రఘు విమర్శ ఆశాకిరణంగా కనిపిస్తుంది.”
***
సమన్వయ (సాహిత్య వ్యాసాలు),
రచన: డా॥ ఎస్. రఘు,
ప్రచురణ: మనస్వి ప్రచురణలు, హైదరాబాద్,
పేజీలు: 168, వెల: ₹ 150/-,
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.