రంగుల హేల 16: శుభకార్యాలూ – ఝండూ బామ్‌లూ

1
5

[box type=’note’ fontsize=’16’] “మన పిల్లల పెళ్లి ఫొటోల్లో మనం దారితప్పిన బాటసారుల్లా పిచ్చిచూపులు చూస్తూ ఉన్నట్టు పడతాం. కావాలంటే ఆల్బం తీసి చూసుకోండి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]హిం[/dropcap]దీ సినిమాల్లో కేవలం హిందీ సినిమాల్లోనే పెళ్లంటే సరదాగా, ఆటా – పాటా, నవ్వులూ – తుళ్ళింతలుగా ఉంటుంది. ఇంకా సంగీత్‌లూ, బారాత్‌లూ ఉంటాయి. ఉత్తర భారత రీతిని ప్రతిబింబించే ఆ సినిమాల్లో వియ్యంకుళ్ళూ, వియ్యపురాళ్ళూ చక్కగా ముస్తాబై హార్మోనియం పెట్టెలు, తబలాలూ పూలూ పళ్ళూ ఎదురెదురుగా పెట్టుకుని ముసి ముసి నవ్వులు విరబూసేట్టు పరిహాసాలాడుకుంటూ కూర్చుంటారు. ఆపై గ్రూప్ డాన్సులు చేస్తారు. లయబద్దమైన పాటలు పాడుకుంటూ పెళ్లి తంతుకు తెరతీస్తారు.

మన తెలుగిళ్ళలో పెళ్లి ముహూర్తం పెట్టిన వెంటనే అనుభవజ్ఞులు చేసే పని ఏంటంటే ఓ నాలుగు ఝండూ బామ్‌లూ, మూవ్ ఆయింట్మెంట్‌లూ, ఒళ్ళు నెప్పుల బిళ్ళలూ , తలనొప్పి మాత్రలూ స్టాక్ పెట్టడం. ఇప్పుడింకా డెవలప్ అయ్యి ఓ నలుగురు సెలైన్ బాటిల్స్ ఎక్కించుకోవడం కూడా సాధారణమైపోయింది.

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తల్లితండ్రులకు పెళ్లి కుదిరినప్పటినుంచీ ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అంతా అనుకున్నట్టుగా జరుగుతుందా? అని గాభరాగా ఉంటుంది. డబ్బు సమకూరడం ఒక ఎత్తయితే పని చెయ్యడానికి మనుషులు దొరకడం ఒక ఎత్తు. భోజనాలకి ఆర్డర్‌లు, బట్టలు, బంగారాలు కొనడాలు ఇలా మల్టీ టాస్కింగ్ మొదలవుతుంది. అన్ని పనులూ శుభారంభంగా మొదలుపెట్టాక మాట్లాడుకున్న పనివాళ్ళు ఎగ్గొడతారు. కొత్త వాళ్ళని వలేసి పట్టాక మొదటివాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళను విడదియ్యాలి. ఇంకా విడిదిళ్లు, గ్యాస్ పొయ్యిలు చూసుకోవాలి. సారెలు చేసే స్పెషలిస్టు వంటగత్తెలు కావాలి. వాళ్ళు హీరోయిన్‌ల కన్నా బిజీగా ఉంటారు. ముందు వాళ్ళ కాల్ షీట్లు సంపాదించాలి. పెళ్లంటే ఆ ఇంటి పెద్దవాళ్ళకూ, ఆ తర్వాత అతి దగ్గరి బంధువుల కూ నడ్డివిరక్కొట్టే ఓ పెద్ద ప్రాజెక్ట్.

రాత్రి కాగానే ముఖ్యమైన వాళ్లంతా తలోమాత్రా మింగి పిల్లల చేత బామ్‌లు రాయించుకుని పడకలు వెయ్యాల్సిందే. కొందరికి నడుము మరికొందరికి వీపు నెప్పులు. ఇంకొందరికి అరికాళ్ళ మంటలు. ఇంకో పక్క ఘాటు భోజనాలు చేసినందుకు వచ్చే అసిడిటీకి మజ్జిగ దాహాలు సప్లై చేసే బాచ్ ఒకటి కావాలి.

పెళ్లి దగ్గరపడే కొద్దీ గజి బిజి గందరగోళంగా ఉంటుంది. ప్రతి వాడూ పక్క వాడిమీద వీరంగం వేస్తూ ఉంటాడు. అందరి పనీ ఇంతేనా లేక మనకే ఇన్ని కష్టాలా అని దిగులు మొదలవుతుంది. పెళ్లి ఒక వారం ఉందనగానే రక రకాల ఒత్తిడులతో తల్లిదండ్రులకి నిద్రలుండవు. జరీ కండువా ధరించిన పంతుళ్లు అర్ధరాత్రి ముహుర్తమైతేనే భేషుగ్గా ఉందని లొట్టలేసి మరీ నిర్ణయిస్తారు. పెళ్లి జనాలనందరినీ కలిపి చావగొట్టే ఒకే ఒక దెబ్బ అది. పగలు పెళ్లి పెళ్లే కాదని సన్నాయి నొక్కులు కూడా నొక్కుతారు ఇంకొందరు శాడిస్టు పెద్దలు.

ఈ లోగా కాబోయే వియ్యాలవారి నుండి వర్తమానాలు పట్టుకుని వార్తాహరులొస్తారు. ఆడ పెళ్ళివారి నైతే మీరన్నీ ఇంకా బాగా చెయ్యాలని చురకలంటిస్తుంటారు. మగ పెళ్ళివారి నైతే కోడలికి ఇంకా బాగా ఏమేం పెట్టబోతున్నారు? తక్కువ చేస్తే బాగోదు అని బెదిరిస్తుంటారు. మధ్యవర్తులు ఇరుపక్షాల వారినీ మీ అదృష్టం కొద్దీ ఈ సంబంధం వచ్చిందని పోతూ పోతూ గిల్లి పోతారు. ఆ గిల్లుడికి మంట పుట్టి పెళ్లి పెద్దలంతా పనులు చేసుకుంటూ కోపంగా చర్చించుకుంటూ ఉంటారు. లోలోపల సవాళ్లు చేసుకుంటారు. చూద్దాం చూద్దాం అనుకుంటారు, అసెంబ్లీ లో అధికార ప్రతిపక్షం వాళ్ళలా. ఐతే ఇది నిశ్శబ్ద యుద్ధం.

ఒక పక్క ఈ రాజకీయాల వేడి, మరో పక్క పెళ్లి బాగా జరగాలన్న ఆత్రుత అన్నీకలగలిసి ఒక హాట్ సీట్‌లా ఉంటుంది పెళ్ళివారిల్లు. పెళ్లి కెంతమంది వస్తారు? వాళ్ళకిచ్చే రిటర్న్ గిఫ్ట్ లేంటి? చీరేలేంటి? సారేలేంటి? ఈ వరుసన ఎటు చూసినా పనులే కనబడతాయి.

పెళ్లి దగ్గర పడే కొద్దీ వేడి పెరిగిపోతుంటుంది. దగ్గరి బంధువులు ముందు దిగుతారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకీ ఒక్కో పని ఇవ్వాలి. వాళ్ళిచ్చే సలహాలు సూచనలు వినాలి. వాళ్ళలో ఆడవాళ్లు బంగారు నగలు తెచ్చి బీరువాలో పెట్టుకుంటామంటారు. మన బంగారాలూ,కాష్ అక్కడే ఉంటాయి. ఎవరినో ఒకరిని బీరువాకి కాపలా పెట్టినా వాళ్ళు ఏటోకటు తుర్రుమంటూ ఉంటారు. అదొక టెన్షన్. బీరువా తాళాలు చేతులు మారి మారి ఎక్కడో దాక్కుంటాయి. అవి కనబడే సరికి దేవుడు కనబడతాడు.

ఈ హడావిడిలో మనమేం మాట్లాడుతున్నామో మనకే తెలీదు. ఏదో ఒకటి కనిపించలేదని గొడవ. అది దొరుకుతుంది. మరొకటి కనబడదు. పెళ్లికి బయలుదేరుతూ దారిలో ఎదురుచూస్తున్న పురోహితుని కారెక్కించుకోవడం మర్చిపోతాం. ఇంకొందరు తాళిబొట్టు బాక్స్‌ను లాకర్‌లో పెట్టి మర్చిపోతారు. అరుపులు, కేకలు, చెణుకులు, నవ్వులు.

మన ఇంట్లో పెళ్ళికి వచ్చిన ప్రతివారూ మనతో మాట్లాడాలనుకుంటారు. పలకరిస్తూ ఉంటారు. వాళ్లతో మాట్లాడుతూ ఉంటే మన బుర్ర సరిగా పని చెయ్యదు. ఎవరో ఏదో తెచ్చితినమని, తాగమని వేధిస్తూ ఉంటారు. ఏం తిన్నామో ఏం తాగామో తెలీదు. పెదాలు పొడారిపోతూ ఉంటాయి. కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నిద్ర సరిగా లేక శరీరం కొత్త కొత్త కంప్లైంట్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటాడపడుచుకి మర్యాద జరగలేదని ఆవిడ అలుగుతుంది. చిర్రెత్తుకొచ్చినా నోరు విప్పితే బాగోదు. లోపల హైపర్ టెన్షన్ పెరుగుతుంటుంది.

పెళ్లి ముహూర్తం రానే వస్తుంది. తారా స్థాయిలో బ్యాండ్ మోగుతుంది. పెళ్లి తంతు పూర్తవుతుంది. వచ్చిన వాళ్లంతా భోజనాలు చేసి వెళుతున్నామని చెప్పి గిఫ్ట్ లిచ్చి వెళుతుంటారు. కానుకల్ని పేరు రాసి నోట్ చేసుకునే పని అప్ప చెప్పిన పిల్ల ఫ్రెండ్స్‌తో కలిసి ఎటో వెళ్ళిపోతుంది.

అందరికీ వీడ్కోలు చెబుతూ వెర్రి నవ్వులు నవ్వుతూ ఉన్న మనకి ఒక టైం తర్వాత పెళ్ళికి ఎవరెవరు వచ్చారో బుర్ర రిజిస్టర్ చెయ్యడం మానేస్తుంది. అలా రోబోలా తిరిగి తిరిగి ఎక్కడో పడి నిద్ర పోతాం. ఇదండీ మనింట్లో పెళ్లి ముచ్చట.

మరంచేతనే…. పెళ్లనగానే గుండెలు గుభేల్ మంటాయి. పైన చెప్పిన రీల్ గిర్రున తిరుగుతుంది. మన పిల్లల పెళ్లి ఫొటోల్లో మనం దారితప్పిన బాటసారుల్లా పిచ్చిచూపులు చూస్తూ ఉన్నట్టు పడతాం. కావాలంటే ఆల్బం తీసి చూసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here