[dropcap]”ఆ [/dropcap]అమ్మాయి ముక్కు ఎంత అందంగా ఉందంటే – మొగలి పువ్వు, తుమ్మెదపై కోపంతో తపస్సు చేసి ఆవిడ ముక్కు ఉన్న చోట వచ్చి తిష్ఠ వేసిందట. అంతేకాక, తనకు రెండు వైపులా తుమ్మెదలను కాపలాగా పెట్టుకుందట. ఎంత సౌభాగ్యం చూడవే. ముఖాన మొగలిపువ్వు పరిమళానికి ప్రియుడు ఆగగలడా!” .
“ఎంత మురిపెం! ఆ పద్యం నాకూ తెలుసు లెండి.
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్.
ముక్కుతిమ్మన సత్యభామ మీద వ్రాసింది కాదూ ఇది?” –
“కాదోయ్. పప్పులో కాలేశావ్. భట్టుమూర్తి – వసుచరిత్రలో గిరిక అన్న అమ్మాయిది ఆ ముక్కు. సత్యభామ కు ముక్కుపై కోపం కదా; ఆ దెబ్బకు కమిలి ఎర్రగా, ఏ మందారం లానో అయిపోయుంటుంది. మొగలిపువ్వు లా పచ్చగా ఉండే అవకాశం లేదు.”
“ఇదివరకు సత్యభామ. ఇప్పుడు గిరిక అన్నమాట! అవునండీ మరి నందితిమ్మనకు ఈ పద్యం వల్లనే “ముక్కు” తిమ్మన అన్న పేరొచ్చిందని అంటారు?”
“అవునోయి. మంగలి కొండోజీ అనే క్షురకునికి తిమ్మన ఆ పద్యం వ్రాసిస్తే, దాన్ని భట్టుమూర్తి నూరు వరహాలకు కొన్నాడని కథ.”
“మీరు ఇంటికి లేటుగా వచ్చినప్పుడు చెప్పే కథ లాంటిది అన్నమాట!”
“కాదు. లేటుగా వచ్చిన తరవాత ఎప్పుడో, శుభరాత్రికి మునుపు, నీ అలక తీర్చడానికి చెప్పే కథ లాగా. ఆ కథలో నిజం ఉందో లేదో కానీ, కథ వెనుక – ఆకాలంలో అంతటి రసజ్ఞులు ఉండేవారన్నది నిజం.”
“ఔనా! రసజ్ఞత కూ అబద్ధానికి ఏదో లంకె ఉందన్నమాట! ఎంతైనా తెలుగు తెలుగే! ఎంత అందమైన పద్యమో కదా” – తెనుగు ఉపాధ్యాయిని పరిమళ చెప్పింది.
“ఆ పద్యానికి మూలం సంస్కృతశ్లోకమోయి.
భృంగానవాప్తి ప్రతిపన్నఖేదా కృత్వాననే గంధఫలీ తపోऽలమ్ |
తన్నాసికాऽభూదనుభూతగంధా స్వపార్శ్వ నేత్రీకృత భృంగసేవ్యా ||
అర్థం ఇదివరకటిదే అనుకో” – నవ్వుతూ చెప్పాడు సంస్కృత భాషాభిమాని అయిన ప్రబంధ్.
“తెనుగు పద్యం పీచుమిఠాయిలా ఉంటే, సంస్కృతం ఆ పీచుమిఠాయిని చేత్తో వత్తేసి, ఓ చిన్న ముద్దను చేసినట్టుంది.”
ప్రబంధ్ కూడా ఓ మిఠాయి ’రుచి’ నే చూస్తున్నాడు.
…..
…..
…..
నవదంపతుల మధ్య స్వీట్ నథింగ్స్! కాకపోతే ఆంగ్లంలో కాక, సంస్కృతాంధ్రాల్లో జరుగుతున్నాయి. ఆ స్వీట్ నథింగ్స్ పరిణామక్రమంలో “సమ్ థింగ్ సమ్ థింగ్” గా జరగడమూ అయింది. అది ఉత్తరరామచరితమ్ లో భవభూతి చెప్పిన విధాన.
(కిమపి కిమపి మందం మందమాసక్తియోగాత్
అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ |
అశిథిలపరిరంభవాపృతేకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రిరేవ(వం) వ్యరంసీత్ || (ఉత్తరరామచరితమ్)
సీతా! మనమిద్దరం చెక్కిలితో చెక్కిలి చేర్చి, మెలమెల్లగా ఏవేవో మాట్లాడుకుంటూ, క్రమంగా పారవశ్యంతో గుసగుసలు వోతూ, కౌగిలిలో మన ఇద్దరి చేతులు ఒకటై జాములు కూడా తెలియకుండా ఆ రాత్రిని కూడా అలానే గడిపాము. గుర్తున్నదా?)
పుచ్చపువ్వులాంటి వెన్నెల రాత్రి – అలా గడిచింది.
కాదు, కాదు, పుచ్చపువ్వులాంటి వెన్నెల! నాటి ‘రాత్రి కూడా’ – అలా గడిచింది. రాత్రి రేవ వ్యరంసీత్!
*****
ముచ్చటైన దాంపత్యం వారిది. ప్రబంధ్ ఓ రైతు. ఆతనికి సంస్కృతంతో చెలిమి. చదువు అయిన తర్వాత, సాఫ్టువేరు, అమెరికాలు, ఆఫ్రికాలు అనకుండా, ఓ గ్రామంలో, వారసత్వంగా వచ్చిన భూమిని పండించుకుంటూ జీవిస్తున్నాడు. డబ్బూ సౌఖ్యాలు లేకపోయినా, అతని సామాన్యమైన జీవితాన్ని మెచ్చిన పరిమళ ఆతనికి అనువైన అర్ధాంగి.
వారి సంభాషణ – క్రికెట్టు, పాలిటిక్సూ, పక్కింటి గోల, వంటివాటి జోలికి వెళ్ళదు. ఇద్దరి అభిరుచులు ఒకటే. అయితే అవి ప్రపంచానికి భిన్నం.
*****
“ఓ చిన్న అనుమానమండీ. కవులందరూ చక్షువుల ద్వారా, స్పర్శ ద్వారా కలిగిన సౌందర్యానుభూతులను వర్ణిస్తారే కానీ, ఘ్రాణం ద్వారా కలిగిన పరిమళం గురించి చెప్పరే! ఎందుకలా? అలాంటి సందర్భాలు లేవా?”
“ఎందుకు లేదోయ్? ఓ అమ్మాయి శిరోజాలకు ఉన్న పరిమళం స్వాభావికమా? లేక షాంపూలు, తైలాలు గట్రా వంటి వాటితో వచ్చిందా? అని తమిళంలో పెద్ద గొడవే జరిగింది.”
“ఏంటా గొడవ? ఏంటా కథ?”
“అనగనగా పాండ్యదేశంలో ఓ రాజు. ఆయన ఓ రోజు తన సఖురాలితో కలిసి విహరిస్తూ ఓ తుమ్మెదను చూచాడు. ఓ భ్రమరీ! అన్ని మధురమైన, సుగంధభరితమైన కుసుమాల వెంట చరిస్తావు. నువ్వు చవి చూసిన పుష్పాల సుగంధాలలో వేటిలోనైనా, నా నెమలినడకల చెలి కేశపాశములకున్న సుగంధం ఉందా? అనుకొన్నాడు. తర్వాత రోజు సభలో రాజు అదే భావాన్ని ఎవరైనా కవులు కవిత్వంగా చెప్పమని అడిగాడు. అప్పుడు రాజు మనసులో భావాన్నే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు కవితగా వ్రాసి, తన భక్తుడి ద్వారా చెప్పించాడు.
కొంగుదేర్ వాళ్కై అంశిరైతుంది
కామం శెప్పాదు కడందుమొళిమో
పైయిలియదు కెళియనడ్పిన్ మైలియల్
సరియైట్రు అరిలై కోందలిన్ నరియవుం
ఉళవో నీయరియుం బూవే !
ఆ పద్యంలోని వస్తువు – అమ్మాయి కేశపాశాల సుగంధం కాబట్టి, ఆ సుగంధం స్త్రీ శిరోజాలకు సహజస్వభావమని ఉద్యోతించటం – నక్కీరుడనే ఓ కవికి నచ్చలేదు. ఆయన పెద్దగొడవ చేశాడు.”
“అరసికుడు”
“అవునోయ్! అరసికేషు కవిత్వనివేదనం శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ అని కాళిదాసు ఇలాంటి వారి గురించే కాబోలు, మొత్తుకున్నాడు. ఆ నక్కీరుడు ఒక ముసలాయన పాపం. అమ్మాయిల కేశపాశాలకు సుగంధం సహజంగా రాదని ఆయన మంకు పట్టు పట్టి కూర్చున్నాడు. శివుడు ఆతణ్ణి ఆక్షేపించి, ఉమాదేవి కేశపాశాలకు, సరస్వతి కేశపాశాలకు కూడా సుగంధం ఉండదా? అని అదిలించినా, ఆఖరుకు మూడో కన్ను తెరిచి చూపినా లొంగలేదు.
అన్నట్టు ఆ తమిళ కవితను ఓ తెలుగు కవి ఇలా తెనిగించినాడు చూడవోయ్.
ఇలను సువస్తుగంధములనెల్ల గ్రహించితి విప్పుడెంతయున్
మలకఁలు నీలనీలములు మార్దవయుక్తములౌ ఝుషాక్షి కుం
తలములఁ బుట్టినట్టి పెనుతావియుఁ గాంచితి షట్పదంబ! యా
వలపుల నెన్నఁడైన నిటువంటి సుగంధము మూరుకొంటివే.“
పద్యం నెపంతో పరిమళ కుంతల పరిమళాలను మూర్కొన్నాడు ప్రబంధ్.
“మొత్తానికి నక్కీరుడనే ఆయన మహాభక్తుడు అయినా మహా అరసికుడు అన్నమాట! మదగజాలకు, పునుగు పిల్లులకు స్వభావసిద్ధంగా సుగంధం ఉన్నప్పుడు అమ్మాయి కేశపాశాలన్న తర్వాత ఏదో ఒక గంధం ఉండాలి కదండి. ఆముక్తమాల్యద – కురుల సుగంధానికి మెచ్చి కదూ రంగవిభుడు ఆమె కొప్పులో మాలను తన మేన దాల్చినది? అసలు ఉమాదేవికే కాదు, పద్మావతి కురులకూ కస్తూరివాసనలు దట్టించాడు కదా పదకవితా పితామహుడు అన్నమయ్య.
మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా
…..
గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నిను గూడి నే–
నరమరచి సదమదములౌట యెన్నఁడురా“
“అవునోయ్ రసిక ఫెమినిస్టూ! నువ్వు చెప్పింది నిజం. ఆ మాటకొస్తే శ్రీనివాసుడు కూడానూ ’వాసనకస్తురిమేని వన్నెకాఁడు’ కాదేమి?”
“ఈ నక్కీరుని కథను ధూర్జటి కవి కదా తెనిగించినది?”
“ధూర్జటికవి ఈ కథను కొన్ని నోళ్ల ద్వారా విని తనకు తోచిన కథ వ్రాశాడు. ధూర్జటి మహాసరసుడు. పూర్తికథ విని వ్రాసి ఉంటే ఎంత అందంగా ఉండేదో! అసలు నక్కీరుని కథ వేరు, ధూర్జటి చెప్పిన కథ కాస్త వేరు.”
“ఇంతకూ ఏం తేలిందండి? రసికత్వమా? అరసికత్వమా?”
“అది మనకు అప్రస్తుతమోయ్! లోకం లో ఎప్పుడూ సౌందర్యమే చెల్లుబాటు కావాలి. సత్యం శివం సుందరం. అందుకనే శివుడు దిగాడు రంగంలోనికి. అందుకనే కావ్యప్రయోజనంలో ’శివేతర క్షతము’ ప్రధానమైనది.”
“కదా! పరిమళం సహజమైన వస్తువే.”
“కదూ! అందుకనే మహాభారతంలో ఓ అమ్మాయి మత్స్యగంధి గా ఉంటే, వ్యాసుడు ఆమెను యోజన గంధిగా మార్చాడు. ఒక యోజనం దూరం ఆమె పరిమళం గుప్పుమనేలా ఆ మహర్షి ఆమెకు వరమిచ్చాడు. ఆ యోజనగంధి తన డిస్టన్సు తగ్గించుకుని కలియుగంలో మళ్ళీ జన్మించి నాతో మాట్లాడుతోందిప్పుడు.”
ఆమె ఒద్దికగా సిగ్గుపడింది. “ఐసు బానే వేస్తున్నారు. తెనుగు ప్రబంధాలలో పరిమళం సంగతి చెప్పండి?”
“ఆహా! నీకు తెలీకనే అడుగుతున్నావూ?
మృగమదసౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమౌ
మగువ పొలపు దెలుపు నొక్క మారుతమొలసెన్. (మనుచరిత్ర)
ఓ పాలు మృగమదము, దానికి రెండుపాళ్ళు కర్పూరము దట్టించిన తాంబూలపు సువాసన ఎలా ఉంటుందో, దాన్ని కప్పేసేంత ఘాటైన పరిమళం ఆ అమ్మాయి అడ్రసు తెలిపే విధంగా తగిలింది.”
“ఎంత తన్మయత్వమండీ! అంత ఘాటు ఉన్నా, ఆ ప్రవరాఖ్యుడికి పట్టలేదు, మీరా తాదాత్మ్యం నుంచి బయటకు రావచ్చు”
“నాకు వాళ్ళెందుకోయ్. నా వరూధినివి నువ్వే. వరూధిని అంటే సైన్యం అనేగా! “
పరిమళ కళ్ళలో సిగ్గుతో కూడిన మెరుపును ప్రబంధ్ దాటిపోనివ్వలేదు. రెండుచేతులను ఒకదానిపై మరొకటి చేర్చి, ఆ చేతులను ప్రబంధ్ ఒడిపై పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉంది ఆమె. పక్కన రేడియోలో అందమైన వీణాగానం ముగిసింది.
“సువాసితం హర్మ్యతలం మనోహరం ప్రియాముఖోచ్ఛ్వాస వికమ్పితం మధు|
సుతంత్రిగీతం మదనస్య దీపనం శుచౌ నిశీథేऽనుభవన్తి కామినః || (ఋతుసంహారం -3)
(ప్రియుడు వేసవి కాలపు రాత్రి మేడపైభాగంలో ప్రియురాలి మోవిపై నుండి వచ్చే తేనెల పరిమళాన్ని, కోరికలు రేకెత్తించే చక్కని వీణాగానాన్ని అనుభవిస్తున్నారు.)
సందర్భానికి పూర్తిగా కాకున్నా, దాదాపుగా తగినట్టే ఉంది సుమా!” తనలో అనుకుంటున్నట్టుగా అన్నాడు అతను. కళ్ళలో చిన్ని మెరుపు! ఆమె జడలో మల్లె జారింది.
వర్షోదక ముద్గిరతా శ్రవణాంతవిలంబినా కదంబేన |
ఏకస్తనోऽభిషిక్తో నృపసుత ఇవ యౌవరాజస్థః ||
అనుకున్నాడు ప్రబంధ్.
*****
దంపతులను చూసి చంద్రుడు నవ్వాడు.
మల్లెలు నవ్వాయి.
మాగాణి నవ్వింది.
మంచె కూడా నవ్వింది.
ఎక్కడో స్వర్గాన ఉన్న కవులు కూడా నవ్వుకుని ఉంటారు.
రాత్రి రేవం వ్యరంసీత్!