ఆధ్యాత్మికం, మతం ఒకటి కాదా?

3
4

[dropcap]గ[/dropcap]త నెలలో నేను వెళ్ళిన ఒక కుటుంబ కార్యక్రమానికి రేణుక వచ్చింది. తను నన్ను కలిసి చాలా రోజులైంది. ఆ మాట ఈ మాట చెబుతూ చాల సేపు గడిపాము.

మాటల సందర్భంలో అన్నది, “చాలా భక్తురాలివయ్యావు.. చూస్తున్నాను నీ కార్యక్రమాలన్నీ.”

అలా అంటున్నప్పుడు తన కళ్ళలో కనిపించిన చిన్న నవ్వు నా దృష్టి దాటి పోలేదు.

నేను నవ్వి ఊరుకున్నా. తను రెట్టించింది.

నేను నవ్వే సమాధానంగా ఉంటే వదిలేలా లేదు.

అందుకే ఇంక తప్పక చెప్పాను, “నాకు భక్తి ఎక్కువవడం కాదు, నేను కొంత స్పిరిట్యుయల్‌గా మారుతున్నాలే” అని.

తన మొఖంలో స్పష్టంగా కన్ఫ్యూషన్. తనకు స్పిరిట్యుయల్‌గా ఉండటానికి, రెలీజియస్‌గా ఉండటానికి తేడా తెలియదు. తనకే కాదు, చాలా మందికి ఆ తేడా తెలియదు.

తేడాను గమనించకుండా, పూజలు చేసే వారిని భక్తులని, చెయ్యనివారిని భక్తి లేని వారని అనేసుకొని ఆ తరహాలో చూడటం సహజంగా మన సమాజంలో జరుగుతూ ఉంటుంది.

అసలు ఇలాంటి బేసిక్ విషయాలమీద అవగాహన ఉంటే చాల గొడవలు తగ్గిపోతాయి. స్పిరిట్యుయల్ అంటే ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి ఉండాలి. మతం అన్నది వ్యక్తిగత నమ్మకం.

అసలు మతం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఈ భక్తి అంటే ఏమిటి?

వీటిని మనం వేరు వేరుగా చూడగలిగితే మనకు తేడా తొలిగిపోతుంది. అంతే కాదు మనం జడ్జిమెంటల్ గా ఉండము కూడా.

భక్తి అన్నది పరమపద సోపాన పటంలో మొదటి గడి వంటిది. ఆధ్యాత్మిక జీవనానికి తొలి అడుగు.

మనం క్రమశిక్షణ కలిగిన జీవ విధానానికి సహాయకారి. అదే మన గమ్యం కాదు. గమ్యానికి చేరటానికి వేసే తొలి మెట్లు. భక్తితో సాధన చేస్తే మనం ఆధ్యాత్మికతను సాధించవచ్చు.

కానీ ఇంతకీ ఆధ్యాత్మికం అంటే ఏమిటి? మతానికీ, ఆధ్యాత్మికానికి తేడా ఏమిటి? అన్నది మన ప్రశ్న.

– కొన్ని మౌలికమైన తేడాలతో మనం మతానికి, ఆధ్యాత్మికంకి తేడాను తెలుసుకోవచ్చును.

ముందు మనం మతం అంటే ఏమిటి అన్నది తెలుసుకుంటే ఆధ్యాత్మికం ఏమిటి అన్నది తెలుసుకోవటం సులభం.

– మతం అన్నది కొన్ని సిద్ధాంతాలను, కొన్ని రూల్స్‌కి అనుగుణంగా ప్రజలకు భగవంతుని పరిచయం చేసే ప్రక్రియ. ఆ మతం నిర్దేశించిన కొన్ని నిబంధనలను పాటించాలి. వారి ఆ నమ్మకానికి, పాటిస్తున్న పద్దతుల బట్టి, విశ్వాసాల బట్టి ఆ మతానికి సంబంధించిన వారని మనం చెప్పవచ్చు.

ఉదాహరణకి:

సిక్కు మతంలో: జుట్టు కత్తిరించకూడదు. కత్తి, చేతికి కడియం ధరించాలి. గురుగ్రంథ్ సాహెబ్ మీద నమ్మకం కలిగి ఉండాలి. గురుద్వారాను సందర్శించాలి.

ముస్లిం అంటే: 5 సార్లు నమాజ్ చెయ్యాలి. రంజాన్ పాటించాలి. జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలి.

ఇత్యాదివి ప్రతి మతంలో ఉంటాయి. మతంలో పద్ధతులు పాటించకపోతే పనిష్‌మెంట్స్ ఉంటాయి. పాపం పుణ్యం ఉంటాయి. వీటిని వివరించేది మతం.

-కానీ ఆధ్యాత్మికం ఇలాంటివి చెప్పదు.

“నేను” అన్నది ఎక్కడ్నుంచి వచ్చింది అన్నది మాట్లాడుతుంది ఆధ్యాత్మికం.

ఇక్కడ పాటించటానికి రూల్స్ అంటూ ఉండవు. ప్రతి వ్యక్తిని వారి నమ్మకాలను గౌరవిస్తుంది.

మనం చేసి పనులకు మనమే కర్త, కర్మ. వాటిని మనమే అనుభవిస్తామన్నది ఆధ్యాత్మికం.

మతం భయపెట్టి మనిషిని క్రమశిక్షణలో ఉంచాలనుకుంటుంది.

భయం అన్నది మనసులలో నాటుతారు. ఒక పద్ధతి పాటించక పోతే శిక్షలు వేయ్యటం వంటిది.

అందుకే వివిధ మతం నిర్దేశించిన పనులు చేస్తారు సామాన్య ప్రజలు.

ఉదాహరణకు తీసుకుంటే పండగలను కుదిరితే, సంపద కలిగివుంటే జరుపుకోవాలి. కాని నిర్దేశించినవి చెయ్యకపోతే పాపం వస్తుందని భయపడి చెయ్యటం సామాన్యంగా మనము చూస్తూ వుంటాము. అవి మూఢ నమ్మకాలు.

-మనకు చేతనైనది చేసి, దాని మూలంగా అప్పుడే సంతోషం పొందటం ఆధ్యాత్మికం.

– మతంలో సామాన్యంగా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. వాటికి ఎదురు చెప్పటం అన్నది ఉండదు. ఎందుకు అలా చెయ్యాలన్న ప్రశ్నను పెద్దలు తలెత్తనియ్యరు.

అంటే ఒక రకంగా మతం మనిషి లోని కుతూహలాన్ని చంపేసి, ఒక మూస పద్దతిలో బ్రతకమని నిర్దేశిస్తుంది.

-కానీ ఆధ్యాత్మికం అలా కాదు. ప్రతిదీ ప్రశ్నించమని చెబుతుంది. ప్రశ్నతో కనిపెట్టమని, సమాధానం కోసం వెతకమని ఉద్బోధిస్తుంది. ఎవరికీ వారు తెలుసుకోవలసిన “పరమ సత్యాన్ని” ఎవ్వరి మీద బలవంతంగా రుద్దదు ఆధ్యాత్మికత.

మతం మనుష్యులకు లేని ఒక గుర్తింపు నిచ్చి, వేరు చేసి చూపే సాధనం. అందుకే మతం మనుష్యులకు అడ్డు గోడలు అని వ్యాఖ్యానించాడు ఒక కవి.

మతం మనుష్యులకు లేని రంగును ఇస్తుంది. సంకుచితం చేస్తుంది మానవ మేధను, హృదయాన్ని. అజ్ఞానాన్ని పెంచుతుంది.

– అదే ఆధ్యాత్మికత అడ్డు గోడలు చెరిపేసి అంతా సమానమన్నది అవగాహనకు వచ్చేలా చేస్తుంది. జ్ఞానము కోసం జిజ్ఞాసుల్లా వెతుకుతారు ఆధ్యాత్మికంలో.

కర్మ సిద్ధాంతం అన్నది ప్రతి వారు నేడు నమ్ముతున్న మాట. కర్మలని పనిష్‌మెంట్స్‌గా చూపిస్తుంది మతం.

-కానీ అది ఎవరు చేసిన పనికి, అది మంచి అయినా, చెడు అయినా ఫలితాలు అనుభవించాలన్న నిజం చెప్పేది మాత్రం ఆధ్యాత్మికతనే!

అఖండమైన, నిరాకార, నిర్గుణ పరంబ్రహ్మను గురించి తెలిపేది ఆధ్యాత్మికత.

ఆ దారి ఎవరికివారు వెతుకుకొని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవటం, “నేను” అన్నది తెలుసుకొని, ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసుకోవటమే ఆధ్యాత్మికత.

ఆధ్యాత్మికత అన్నది ఒక జీవన విధానం. ప్రతి వారిలో ఉన్న పరమాత్మను గ్రహించటం. తమ- పర అన్న వేరు భావన అన్నది వదిలెయ్యటం.

సర్వం, సర్వ ప్రాణులు ఈ అఖండ విశ్వంలో తమ పాత్ర నిర్వహిస్తామని తెలుసుకోవటం.

అందరిని ఆదరించటం. ప్రేమించటం. తమ, పర తేడాలను వదిలివెయ్యటం.

నేటి సమాజంలో కొంత సమయం తీసుకొని, ప్రతి దినం చెయ్యవలసిన సాధనే ఆధ్యాత్మికత. భక్తి అని, మతమని దానిని కుదించటం కుదరని పని.

ఇంత వివరించే సరికే నా నేస్తం కళ్ళు తిప్పి, మౌనాన్ని ఆశ్రయించినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here