[dropcap]మ[/dropcap]నిషీ, ఓ అయస్కాంతమేగా!
ఓ ధృవంలో ఆకర్షణ…. మరో ధృవంలో వికర్షణ
విడివిడిగా ఉన్న వ్యక్తిగతాలు
ఒకరికి ఒకరు అంతగా అంతుపట్టని వ్యక్తిత్వాలు
గతమేదీ లేదనేమో ఏమో?? గట్టిగా దగ్గరవుతుంటాయి
ఉన్నవన్నీ ఉన్నంతలో పంచుకుంటుంటాయి
కొసరి కొసరి తినిపించుకుంటుంటాయి
సమూహంగా మారి సందడి సందడి చేస్తాయి
కలిపేసిన కాలం …
గడుస్తున్నకొద్దీ, ముందుకు నడుస్తున్న కొద్దీ
కొత్తదనపు మోజును కాస్తకాస్త నలిపేస్తుందేమో
దాగి ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా తెలిపేస్తుందేమో
అల్లుకున్న ఆప్యాయతానురాగాలు
ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవాలు
అలా అలా ఆవిరవుతుంటాయి
నిందలూ నిష్టూరాలూ గుండెలో గూడుకట్టుకుని
ప్రయోగానికి నాలుకను వేదిక చేసుకుంటాయి
గోడలకూ చెవులుంటాయనేమో
గుసగుసల ముసుగులేసుకున్న మూడోవ్యక్తి ముచ్చటలు
ఇద్దరిద్దరి మధ్య అసంతృప్తి గమ్యాలు చేరుతుంటాయి
అతను, అలా చెయ్యడం తప్పేకదా
ఆమె, అలా అని నన్ననకూడదు కదా అంటూ
ఈగోల గోలలో ఈదులాడుతుంటాయి
కాలం …
క్షణం నిలవకుండా సాగిపోతూ
నిర్దాక్షిణ్యంగా విడదీసి వేరుచేసేస్తే
చెల్లా చెదురైన సమూహం
వ్యక్తులుగా విడివిడిగా విసిరేయబడితే
ఒంటరి దీవిలో నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుని
జ్ఞాపకాల పుస్తకాన్ని అటకమీంచి దించేసి
పేజీలు ఒక్కొక్కటిగా తిప్పేస్తూ
గతపు స్మృతులను తమకంగా తడుముకుంటూ
అప్పుడు… నేనలా చెయ్యడం తప్పేకదూ
ఆ సమయంలో… అలా అని నేననకూడదు కదూ
ఆ క్షణాన… అలా చేసి ఉండకూడదు కదూ అంటూ
కళ్ళునిండిన నీళ్ళ సాక్ష్యంతో కలవరపడుతుంటాయి
మనిషీ, ఓ అయస్కాంతమేగా!!
విడివిడిగా ఉన్నంతవరకూ
విజాతిధృవం లక్షణంగా, దగ్గరకు లాక్కనే ఆకర్షణ
కలివిడిగా ఉన్నంతసమయం
సజాతిధృవం రూపంలో, దూరంగా విసిరికొట్టే వికర్షణ