జూలై 2019 సంపాదకీయం

0
4

[dropcap]పా[/dropcap]ఠకుల నుంచి విశేషంగా లభిస్తున్న ఆదరణ ‘సంచిక’ వెబ్ పత్రిక ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేసే శక్తినిస్తోంది. సాధారణంగా పాఠకులు ఇది మెచ్చుతారు, ఇది మెచ్చరు, ఇవి చదవరు అంటూ తమ వ్యక్తిగత ఇష్టాఇష్టాలను పాఠకులపై రుద్దుతూ పాఠకుల స్థాయిని తమ స్థాయికి దిగజార్చటం తెలుగు పత్రికలలో కనిపిస్తుంది. నిజానికి తెలుగు పాఠకుడు అత్యంత విచక్షణ కలవాడు. ఏది ఉత్తమ రచనన? ఏది పసలేని రచన అన్నది పాఠకుడు అత్యంత సులువుగా గ్రహిస్తాడు. ఉత్తమ సాహిత్యాన్ని ఆదరిస్తాడు. పసలేని సాహిత్యాన్ని ఎవరెంతగా ఆకాశానికెత్తినా దానికి తగ్గ స్థాయిలోనే దాన్ని ఆదరిస్తాడు. కానీ, పద్ధతి ప్రకారం పాఠకులు ఇవే ఆదరిస్తారని పాఠకుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా పాఠకులపై బలవంతాన తమ అభిప్రాయాలను రుద్దుతూండటంతో ప్రస్తుతం తెలుగు పాఠకులు కరవయ్యారు. వారికి సాహిత్య పెద్దల అభిప్రాయాలపై గౌరవం పోయింది. అలాగని ఉత్తమ సాహిత్యాన్ని వెతుక్కుని చదివే ఓపిక, తీరిక వుండదు. దాంతో తెలుగు రచయితలు సృజించిన అత్యద్భుతమయిన సాహిత్యం, విశిష్టంగా సృజించిన విభిన్నమయిన సాహిత్యం విస్మృతిలో పడుతోంది. పదే పదే పెద్దలు పొగిడే గుప్పెడు మంది రచయితలు, గుప్పెడు రచనలే మిగులుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చి మన కథకులు సృజించిన అత్యద్భుతమయిన రచనలను పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో సంచిక సంకలనాల ప్రచురణ చేపట్టింది. ఇప్పటివరకూ దేశభక్తి కథలు, క్రీడాకథ కథల సంకలనాలను ప్రచురించింది. ఈ రెండు సంకలనాలు పాఠకాదరణను పొందటం ఆనందం కలిగిస్తే, ఆ సంకలనాలలోని రచనలు అందరినీ అలరిస్తూ విమర్శకుల ప్రశంసలను పొందటం అమితానందాన్ని కలిగిస్తోంది. మామూలుగా అయితే పాఠకులు చదివే అవకాశం లేని ఈ కథలు సంకలనాల ద్వారా ప్రాచుర్యం పొందటం, వాటి గురించి చర్చలు జరగటం అత్యంత సంతృప్తిని కలిగించే అంశం. అయితే ఇంకా ప్రధాన స్రవంతి పత్రికలు ఈ సంకలనాల కన్నా, తమ తమ ఇష్టుల రచనలపైనే దృష్టిని పెట్టటం జరుగుతోంది. కానీ, త్వరలో వారూ నిజానిజాలు గ్రహించి తమవారినే పొగుడుకునే రోజులు చెల్లిపోయాయని గుర్తిస్తారన్న విశ్వాసం సంచికకు ఉంది. ఆ విచక్షణ ప్రదర్శించకపోతే నష్టం వారికే తప్ప సాహిత్యానికి కాదు. ఎందుకంటే జాగృతులయిన సాహిత్యాభిమానులకు, రచయితలకు జవాబివ్వాల్సిన రోజు అంత దూరంలో లేదు.

సంచిక దీపావళికి విడుదలచేసే కథల సంకలనం కులం కథలు. ఈ సంకలనానికి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్‌లు సంపాదకత్వం వహిస్తారు. ఆ సంకలనం తయారీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఎలాగయితే దేశభక్తి కథల సంకలనం దేశభక్తి అంటే ఏమిటన్న ఆలోచనలను రగిలిచిందో, క్రీడాకథ సంకలనం అందరి దృష్టిని క్రీడ ఆధారిత కథలవైపు మళ్ళిస్తోందో అలాగే కులం కథల సంకలనం ప్రస్తుతం సమాజన్ని పట్టి పీడిస్తూ, మనుషుల నడుమ విద్వేషాలు రగిలిస్తూ, అడ్డుగోడలు నిర్మిస్తూ దేశాన్ని నిలువునా చీల్చే స్థాయికి ఎదుగుతున్న సమస్య గురించి అవగాహన, ఆలోచనలు కలిస్తూ ప్రజల నడుమ వైషమ్యాలు తొలగించి, విద్వేషాలు రూపుమాపి సమన్వయం, సామరస్యం సాధించటంలో తనవంతు తోడ్పడుతుందన్న ఆలోచనతో ఈ సంకలనాన్ని ప్రచురిస్తున్నది సంచిక. ముఖ్యంగా కులం భావనకు తెలుగు రచయితలు ఎలా స్పందించారు? ఈ సమస్య పరిష్కారానికి వారు చూపిన మార్గాలేమిటన్న విషయం గురించి ఈ సంకలనం వల్ల ఒక అవగాహన కలిగితే చాలు, సంచిక ప్రయత్నం ఫలవంతమయినట్టే. తెలుగు పాఠకుల అపారమయిన విచక్షణపై కల అనంతమయిన విశ్వాసంతో ఈ సంకలనాలను సంచిక వెలువరిస్తోంది. ఈ సంకలనానికి కథలను సూచించి, పంపి రచయితలు, పాఠకులు సహకరిస్తారని ఆశిస్తున్నాము.

పాఠకులను ఆకర్షించి, ప్రతి సంచికతో పాఠకులను పెంచుకుంటూ పోవాలన్న సంకల్పంతో కొత్త కొత్త రచనలు, సరికొత్త శీర్షికలను అందించాలని సంచిక అనుక్షణం తపన పడుతోంది. ఇందులో భాగంగానే త్వరలో సంచిక ఆడియో, వీడియో పత్రికగానూ మీ ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు, తెలుగు రచనలను ఇతర భాషలవారికి సులువుగా అందే వీలును కల్పించేందుకు త్వరలో తెలుగు కథల ఆంగ్ల అనువాదాలతో సంచిక ఆంగ్ల పత్రికను కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

1 జూలై 2019 నాటి సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు ఇవి:

ప్రత్యేక వ్యాసం: చిత్తూరు జిల్లా సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు – ఎం.కె. కుమార్

సీరియల్స్:

అనుబంధ బంధాలు -1: చావా శివకోటి​

నీలమత పురాణం – 29 – కస్తూరి మురళీకృష్ణ

కాలమ్స్:​

రంగులహేల-16- శుభకార్యాలూ – ఝండూ బామ్‌లూ – అల్లూరి గౌరీలక్ష్మి​

నవ్వేజనా సుఖినోభవంతు!-2 – ఆలాగుననా? ఆలాగుననే – భావరాజు పద్మిని

వ్యాసాలు:​

కావ్యమత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది -1: డా. టి.సి.వసంత

కథలు:​

ఒక్క దీపశిఖతో పెక్కు కరదీపాలు – పాండ్రంకి సుబ్రమణి

అపభ్రంశం – పి.ఎల్.ఎన్.మంగారత్నం

శృంగార ప్రబంధ పరిమళం – ఇ.ఎన్.వి. రవి

లేత మనస్సులు – మూరిశెట్టి గోవింద

ముద్ద మందారం – కాశీవిశ్వనాధం పట్రాయుడు

కవితలు:​

మనిషీ, ఓ అయస్కాంతమేగా! – శ్రీధర్ చౌడారపు​

సుమధుర బాల్యస్మృతులు – గొర్రెపాటి శ్రీను

కులం – కొప్పుల ప్రసాద్

సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు-21 – పుప్పాల జగన్మోహన్రావు

ఫో ఫో ఫో  రాచిలుక – శ్రీదేవి శ్రీపాద

భక్తి:​

దివి నుంచి దిగివచ్చిన దేవతలు – 14 – డా. ఎం. ప్రభావతీదేవి

​ఆధ్యాత్మికం, మతం ఒకటి కాదా?? – సంధ్య యల్లాప్రగడ

సంచిక ప్రకటనలు:

సంచిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా వెలువరిస్తున్న మూడవ కధా సంకలనం కోసం కథలకి ఆహ్వానం – సంచిక టీమ్

పుస్తకాలు:

విశిష్ట నవలికలు – విభిన్న కోణాలు – గుడిపాటి

అవీ ఇవీ:

డా.శాంతి నారాయణ రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభకి ఆహ్వానం

మీ సలహాలు, సూచనలు రచనలతో సంచికను పరిపుష్టం చేయండి. తెలుగు సాహిత్యాభివృద్ధిలో భాగం పంచుకోండి.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here