తిరుమలేశుని సన్నిధిలో – 20

0
4

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

మలయప్పస్వామి ఎవరు?

ధ్రుతి బేరం:

తిరుమల ఆనంద నిలయంలో నిత్యం సేవలందుకొనే శ్రీ వేంకటేశ్వరుని విగ్రహాన్ని ధ్రువబేరం అంటారు. ఈ మూర్తిని రకరకాల పేర్లతో పిలుస్తారు – మూలవిరాట్టు లేదా ధ్రువమూర్తి లేదా స్థానిక మూర్తి. ఇక్కడ స్వామి స్వయంభువుగా శంఖుచక్రాలతో సాలగ్రామ మూర్తిగా వెలసి భక్తుల కొంగు బంగారంగా దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహం 8 అడుగులపైన ఉంటుందని లెక్కగట్టారు. భక్తులు సేవించి తరించేది ఈ స్వామినే. ఈ విగ్రహం వక్షః స్థలంలో శ్రీమహాలక్ష్మి స్థిరనివాసం ఏర్పరుచుకొంది.

ఈ మూల విరాట్టుకు నిత్యం రెండు మార్లు… సేవ, మూడు మార్లు అర్చన, ఆ తర్వాత నైవేద్యం అర్చకస్వాములు భక్తి ప్రపత్తులతో జరుపుతారు. భక్తులు తోమాల సేవ, అర్చనలో ఆర్జిత సేవగా పాల్గొనవచ్చు. వీటి టికెట్లు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

స్వామివారికి అర్చన కాగానే వక్షః స్థల లక్ష్మికి కూడా అర్చన మళ్లీ చేస్తారు. మంగళవారం స్వామివారికి రెండో అర్చనగా 108 బంగారు కమలాలతో అష్టదళపద్మారాధన నిర్వహిస్తారు. గురువారం అదే సమయంలో నేత్రదర్శనం, తిరుప్పావడ (మ. 11 గంటలకు) జరుపుతారు. ఆ సాయంకాలం పూలంగి సేవ. శుక్రవారం ఉదయమే మూలవిరాట్టుకు అభిషేకం జరుగుతుంది. దీనికి టిక్కెట్టు దొరకడం అదృష్టంగా భావిస్తారు. ఆర్జిత సేవలో నేను 2005లో మేలో మూడో శుక్రవారం నాడు (నేను దేవస్థానంలో చేరిన మూడోరోజు) అప్పటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు – ఏ.వి.ధర్మారెడ్డి సౌజన్యంతో దంపతిసమేతంగా పాల్గొన్నాను. అప్పుడు ఆ టిక్కెట్ విలువ 12,500/-

స్వామి వారిని రాత్రి వేళల్లో బ్రహ్మాది దేవతలు వచ్చి అర్చిస్తారనీ, ఆ నిర్మాల్యం కనిపిస్తుదనీ అర్చక స్వాములు చెబుతారు. నిత్యం సుప్రభాతం కాగానే విశ్వరూప దర్శనం వుంటుంది. వజ్రవైఢూర్యాది ఆభరణాలతో అలంకరించిన స్వామి అనేక రకాలైన పూమాలలు సమర్పిస్తారు. దేవస్థాన ఉద్యానవన విభాగం వారు ఏ రోజుకారోజు కావలిసిన మాలలను తయారుచేయించి ఒక అరలో శీతల విభాగంలో ఉగ్రనరసిహమూర్తి ఆలయానికి ఎడమవైపు సిద్ధపరిచి భద్రపరుస్తారు.

కౌతుకబేరం:

ద్రువబేరం కాక కేతుకబేరము అనబడే భోగశ్రీనివాస మూర్తి విగ్రహం 1½ అడుగుల ఎత్తులో ఆనందనిలయంలో వుంటుంది. ఈ విగ్రహానికి ప్రతిరోజూ అర్చక స్వాములు ఆకాశగంగ నుండి తెచ్చిన జలాలతో అభిషేకం చేయిస్తారు. రాత్రి ఏకాంత సేవలో ఈ విగ్రహాన్ని శయనింపచేస్తారు. ఆ సమయంలో అన్నమాచార్య వంశీకులు ఒక కీర్తన ఆలపిస్తారు. ఆ పైన తరిగొండ వెంగమాంబ హారతిని సమర్పిస్తారు.

స్నపనబేరం:

ఉగ్రశ్రీనివాసమూర్తిగా ఈయనను పేర్కొంటారు. ఇందులో శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి విగ్రహాలుంటాయి. ఇవి పురాతన కాలం నుండి ఉన్నట్లు భావిస్తారు. అయితే ఒకసారి బ్రహ్మోత్మవాలలో భయంకర సంఘటనలు జరిగాయి. అప్పటి నుండి ఈ విగ్రహాలను మాడ వీధులలోకి తీసుకొని రారు. ప్రత్యక పర్వదినాల్లలో ఈ స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. ఎండ వేడిమి తగిలితే ఈయన ఉగ్రుడవుతాడు. అందుకే సుర్యోదయాత్ పూర్వం ఈ ఉత్సవాలు ఉత్థానైకాదశి, ద్వాదశి, తిరువారాధన రోజులలో పూర్తిచేస్తారు. ఈ విగ్రహం ఎత్తు 18 అంగుళాలు.

బలిబేరం:

ఈయనే కొలువు శ్రీనివాసమూర్తి. ఇది పంచలోహ విగ్రహం. నిత్యం తోమాల సేవ పూర్తి కాగానే ఈ కొలువు శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి ఆస్థానం నిర్వహిస్తారు. రోజూ అర్చకులు పంచంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు తిది వార నక్షత్రాలు, ఉత్సవాల వివరాలు చదువుతారు. కిందటి రోజు స్వామి వారికి వివిధ రకాలుగా వచ్చిన ఆదాయ వివరాలను, హుండీ లెక్కలను అణాపైసలతో విన్నవిస్తారు. నికరాదాయాన్ని స్వామికి రోజూ చెప్పాలని కట్టుదిట్టం చేశారు. అందువల్ల ఈ స్వామిని దేవస్థానం ఆడిటర్‌గా చెప్పవచ్చు.

మలయప్ప స్వామి:

ఈ నాలుగు రకాలైన విగ్రహాల గూర్చి తెలుసుకొన్నాం. ఇక రోజూ ఉత్సవ మూర్తిగా అన్ని సేవలలో పాల్గొనే మలయప్పస్వామిని గూర్చి వివరిస్తాను. క్రీ.శ.1339 నాటి శాసనాల్లో ఈ ఉత్సవ మూర్తుల ప్రస్తావన కన్పిస్తుందని శ్రీనివాస వైభవంలో జూలకంటి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. కల్యాణోత్సవం, ఉంజల సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలలో, బ్రహ్మోత్సవాలలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి విగ్రహాలను వినియోగిస్తారు.

ఈ మలయప్ప విగ్రహాలు దొరకడానికి ఒక ఐతిహ్యం ప్రచారంలో వుంది. ఒకసారి పూర్వకాలంలో ఉగ్రశ్రీనివాసమూర్తి తిరుమల గ్రామంలో ఊరేగుతుండగా ఇళ్లు అన్నీ తగలబడిపోయాయి. అర్చకులు భయభ్రాతులయ్యారు. ఒక అర్చకునిపై స్వామి ఆవహించి ఇక పై ఈ విగ్రహాలు ఉత్సవంగా బయటకు తీసుకురావద్దని ఆదేశించాడు.

“మరి ఉత్సవమూర్తులు ఎలా స్వామీ?” అని ప్రశ్నిస్తే స్వామి ఇలా సెలవిచ్చారు “ఈ కొండ కోనలలో వెదికితే విగ్రహాలు లభిస్తాయి” అన్నారు. అర్చకులు వెదికి మలయప్పకోన అనే ప్రదేశంలో స్వామి వారిని, శ్రీదేవి, భూదేవులను విగ్రహా రూపంలో కనుగొని ఆలయంలోకి తెచ్చి వాటికి పూజాదికాలు నిర్వహించారు. అప్పటి నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలను అన్ని ఉత్సవాలలో పూజిస్తున్నారు. మలయప్ప విగ్రహం 14 అంగుళాలు పద్మపీఠంపై మూడు అడుగుల ఎత్తు వుంటుంది. స్వామి వారికి కుడివైపున 30 అంగుళాల ఎత్తున శ్రీదేవి, అదే ఎత్తులో ఎడమవైపు భూదేవి వుంటారు. ఈ విధంగా శ్రీనివాసుడు ఆనంద నిలయంలో పంచమూర్తులతో కొలువై అర్చనల నందుకొంటున్నాడు. వీటినే పంచబేరాలని పిలుస్తారు.

మానవమాత్రులే గాదు ముక్కోటి దేవతలు సైతం శ్రీనివాసుని కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు. అందుకే ఆయన కలియుగ వైకుంఠనాధుడు. ఆయన నిత్యకల్యాణ చక్రవర్తి. నిత్య వైభవ విలసితుడు.

జియ్యంగార్ల వ్యవస్థ కూడా రామానుజాచార్యులు ఇక్కడ స్థిరపరచారు. రోజూ సుబ్రభాత వేళ అర్చకులను ఇంటి నుండి పిలుచుకొని వచ్చిన గొల్ల – సన్నిధి వీధిలో బేడి అంజనేయస్వామి ఆలయం కుడివైపువ వున్న పెద్ద జియ్యంగారి మఠానికి వెళ్తాడు. అక్కడ పెద్ద జియ్యంగారు లేదా ఆయన పరిచారకుడు – ఏకాంగి వెంటరాగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. దేవస్థానం పక్షాన పేష్కారు అక్కడికి ముందే చేరి వుంటాడు. అర్చక స్వామి తన చేతిలో కుంచెవోలతో సహా తాళపు గుత్తులు తెచ్చి బంగారు వాకిలి ముందు నిలబడతాడు. సుప్రభాత పఠనం ప్రారంభమవుతుంది.

మలయప్పస్వామికి జ్యేష్ఠాభిషేకం:

సంవత్సరం పోడుగువా 365 రోజుల్లో ఈ స్వామికి 470కి పైగా ఉత్సవాలు తిరుమలలో జరుగుతాయి. ఆయన మూలవిరాట్‌కి ప్రతినిధి. ఇన్ని రకాల అభిషేకాలు, తిరుమంజనాలు ఆయనే అందుకోంటాడు. అలా రోజూ జరగడం వల్ల ఆ విగ్రహానికున్న కళ్లు, ముక్కు, చెవులు, శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు, మిగతా శరీరభాగాలు తరుగులు పడతాయి. అలా జరగకుండా విగ్రహాలన్ని రక్షించే ప్రయత్నానే ఈ జ్యేష్ఠమాసంలో జరిగే అభిషేకం.

భృగుమహర్షి ఈ అంశాన్ని క్రియాధికారంలో వివరంగా చెప్పారు. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముడు రోజుల ముందుగా ఈ అభిషేక కార్యక్రమం వైఖానసాగమ శాస్త్రోక్తంగా జరుగుతుంది. 2019 సంవత్సరం జూన్ నెల 14, 15,16 తేదీలలో ఇది నిర్వహించారు. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసివున్న మాసంలో సుగంధ తైల సమర్పణ విగ్రహాలకు చేయాలని భృగు సంహిత చెబుతోంది. మూల విరాట్‌కు రోజూ నివేదన జరిగిన తర్వాత మలయప్ప స్వామివారికి కల్యాణ మండపానికి శ్రీదేవి భూదేవులతో సహా చేరుస్తారు. యాగశాలలో శాంతి హోమం చేస్తారు.

నిత్యం భక్తులు దర్శించే విగ్రహానికి కవచం ధరిస్తారు. జ్యేష్ఠాభిషేకం సమయంలో స్వర్ణకవచాన్ని తొలగించి అభిషేకిస్తారు. ఈ ఒక్క సంధర్భంలోనే మలయప్ప నిజరూప దర్శనం కలుగుతుంది. ఏడాది పొడువునా కేవలం శుద్ధ జలాలతో మలయప్పకు అభిషేకం జరుపుతారు. జ్యేష్ఠాభిషేకం ముడు రోజులూ సుగంధద్రవ్యాలతో చేస్తారు.

ముందుగా శుద్ధజాలలు తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్ళతో నూరు కలశాలలోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం చేయిస్తారు. చివరగా స్వామివారికి, అమ్మవార్లకు చందనం పూత పూస్తారు. కలశాలలోని జలాలతో అభిషేకించి, ఆ జలాలను భక్తులపై చిలకరిస్తూ ‘పురోభవ’ అంటారు. స్వామికి వస్త్రాలంకాంరం తర్వాత నైవేద్యం పెడతారు. ఇలా మూడు రోజులలో చివరి రోజు స్వామి వారికి స్వర్ణ కవచం ధరింపజేస్తారు. ఈ విధంగా మలయప్పస్వామి భక్తులను ఆశీర్వదిస్తూ వుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here