‘మధిర’లో… ‘మధురిమ’కు…

0
3

[dropcap]ఆ [/dropcap]రోజు శనివారం అవ్వటం వలన జనాలు బాగా వున్నారు. సాయంత్రం మేము స్టేషన్ జేరేసరికి టైం నాలుగైంది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిన విషయమే కదా! నేను, మధురిమ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. టికెట్లు ముందే రిజర్వ్ చేయించుకోవటం వలన ఇబ్బంది లేకుండా సీటులో కూర్చొని అలసట తీర్చుకునే లోపలే రైలు బయలుదేరింది. మా కంపార్ట్‌మెంట్ నిండా విపరీతంగా స్టూడెంట్స్, ఉద్యోగస్థులు ఎక్కారు. అసలు విషయం చెప్పడం మరిచాను సుమండీ…

నా పేరు గీత. నా స్నేహితురాలి పేరు మధురిమ. మేము బి.కామ్. ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులవి. హైదరాబాద్‌లో మా స్నేహితురాలి పెళ్ళి. యింట్లో ప్రాధయపడి అడిగితే పెళ్ళికి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. పెళ్ళిలో బాగా హడావిడి చేసి తిరుగు విజయవాడకి బయలుదేరాము. మా ప్రక్కన బామ్మగారు కూర్చున్నారు. పెద్ద వయస్సు. ఒక్కరే ప్రయాణం చేయటం వలన కాస్త ఇబ్బంది పడుతున్నారు. మధురిమ పొద్దు నుంచి ఏమి తినలేదు. అసలే తెల్లగా నాజూకుగా వుంటుదేమో… నీరసం వస్తే ఎలాగా? కాస్త ఏదైనా తిను అని బ్రతిమాలాను.

చదువు అయిపోతే యింట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చిన కుర్రాడిని చూసి వివాహం జరిపిస్తారు. మధుకి ప్రేమ వివాహంపై మక్కువ. మనం అనుకుంటాము కానీ, పెళ్ళి అనేది దైవనిర్ణయం. ఎవరికి ఎవరు వ్రాసి పెట్టారో…. మన చేతుల్లో లేదని ఊరికే అంటారా… మన పెద్దవాళ్ళు.

ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. మధురిమ చాలా అందంగా వుంటుంది. మంచి హైట్, పెద్ద కళ్ళు, రింగుల జుట్టు, విశాలమైన నుదురు. ఆ నుదిటి మీద అందంగా డిజైనర్ బొట్టు పెట్టుకుంటుంది. మధురిమ బాబా గారి భక్తురాలవటం వలన నుదుట విభూది ధరిస్తుంది. మాట, మనస్సు తనలాగే చాలా మృదువు.

వేడిగా సమోసాలు, కట్లెట్టు అమ్మకానికి వచ్చాయి. మధురిమ తింటాననటంతో రెండు ప్లేట్లు సమోసాలు తీసుకున్నాను. బాగా ఆకలి వేయటం వలన నేను తినటం మొదలు పెట్టాను.

ఆకలి రుచి ఎరగదని వూరికే అంటారా… మధురిమ ప్లేటులో కదలటం లేదు. ఏమైందా అని చూస్తే ఎదురుకుండా గుంపులో ఒక అబ్బాయి మధురిమను బాగా ఆకర్షింప చేస్తున్నాడు. మధురిమ పాత చింతకాయ పచ్చడి. సాధారణంగా పట్టించుకునే రకం కాదు. ఇష్టపడి చూస్తోందంటే, ఏదో విషయం వుందనమాటే.

ఆ అబ్బాయి ఆరు అడుగులుంటాడు. ఆకర్షణీయమైన ముఖం. చూడటానికి ధనవంతుల కుటుంబానికి చెందిన వాడిలా వున్నాడు. ఏమి అర్జెన్సీయో యేమో యిందులో సీటు దొరకక నిలబడివున్నాడు. లేదంటే ఎ.సి. కంపార్టమెంటులోనే ప్రయాణం చేసేవాడు. మధురిమ ఎంత గమనించినా ఆ అబ్బాయి మాత్రం మధురిమకేసి చూడటం లేదు. మధురిమ మాత్రం మధ్య మధ్యలో  చూస్తూనే వుంది. చూడగానే ప్రేమంటే యిదేనేమో మరి. మన డిక్షనరీలో యింత వరకు తగలలేదు. ‘లవ్ యట్ ఫస్ట్ సైట్’ అన్న మాట అని మనస్సులో అనుకున్నాను. పైకి చెప్పానంటే చంపేస్తుంది. నాకు కూడా ప్రయాణం బోర్ అనిపించలేదు. యింతలో వరంగల్ వచ్చింది. మధురిమ కొంచం ఫ్రెష్ అయివస్తానని వెళ్ళింది. బహుశ ఆ అబ్బాయిని దగ్గరగా చూడచ్చు అనేమో….. నీరసంగా వచ్చి కూర్చొంది. ఏమైనా అడిగామో కోపం  వచ్చేస్తుంది. తను చెప్తేనే విందామని ఆగాను. ఆ అబ్బాయి మాత్రం హెడ్ ఫోన్సు పెట్టుకుని తన మొబైల్ ఫోనులో బిజీగా వున్నాడు.

రైలు వరంగల్ నుండి బయలుదేరింది. “గీతూ, నేను బాగుంటానని అంటావు కదా నిజమేనా?” అని సడన్‌గా అడిగింది. “మధూ… నువ్వు ఎవరికైనా నచ్చుతావు” అన్నాను నవ్వుతూ… మధురిమ ముఖంలో నమ్మకం ఏర్పడలేదు.

యింతలో తన ఫోను మోగింది. చూస్తే వాళ్ళ నాన్నగారు. ప్రయాణం ఎలా వుందో, ఆడపిల్లలం ఒంటరిగా వస్తున్నామని ఆయన కంగారు. ఒక ప్రక్క బామ్మగారు నిద్రపోతున్నారు. యింతలో సీటు ఖాళీ అవగానే పాపం ఆ అబ్బాయి కూర్చున్నాడు. మధురిమకు కాస్త ఉపశమనం కలిగింది. నేను కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా చిన్న కునుకు తీశాను. బండి కాస్త ఆలస్యంగా నడుస్తోంది. చెవిలో అదే పనిగా కాఫీ – కాఫీ అని అరవటం వలన మెలుకువ వచ్చింది. యింతలో ఆ అబ్బాయి తన బ్యాక్‌ప్యాక్  తీసుకుని లాప్‌టాప్, మిగిలిన యాక్ససరీస్ బ్యాగులో సర్దుకుంటున్నాడు. చూస్తే దిగటానికి తయారవుతున్నట్లు వుంది. రాబోయే స్టేషన్ ‘మధిర’.

మధురిమకు టెన్షన్ పెరిగింది. వెళ్ళిపోయే ముందు ఒకసారైనా తనని చూడలని ఎంతగానో ఎదురుచూస్తోంది. ‘మధిర’లో రైలు ఒక్క నిమిషమే ఆగుతుంది. ఆ అబ్బాయి మా ప్రక్కనుంచి వెళ్తున్నప్పుడు అతని జోబులో నుంచి వాలెట్, హ్యాండ్‌ కర్చీఫ్ జారిపడిపోయాయి. మధురిమ చుటుక్కున అవి తీసుకొని  “ఎక్స్‌క్యూజ్‌ మీ… హలో… బ్లూ షర్ట్… ఏవండీ… మిమ్మల్నే…” అని గట్గిగా పిలిచింది. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూశాడు. చెవిలో హెడ్‌సెట్ వలన  వినబడలేదనుకుంటా… మధు తన చేతిలో ఉన్న వాలెట్ మీదేనా అని అడిగింది. ఆ అబ్బాయి అది గమనించి వెనక్కి వచ్చి తీసుకొని  “థాంక్స్”  అని చెప్పి నవ్వుతూ… “రియల్లీ యూ లుక్ వెరీ ప్రెటీ” అన్నాడు. అది విన్న మధురిమకు నోటి వెంట మాట రాలేదు. కలా లేక నిజమా… అని అనుకునే లోపు మధిర వచ్చింది. రైలు ఆగింది. మధురిమ బుగ్గలు ఎరుపెక్కాయి. తన వంక ఒక్కసారైనా చూస్తే బాగుండు అని అనుకునే మధురిమకు డైరెక్టుగా ఆ అబ్బాయి నోటి వెంట తనకిచ్చిన కాంప్లిమెంట్‌తో తన ఆనందానికి హద్దులేదు. ఒక ప్రక్క అతనిని మళ్ళీ కలవలేము, చూడలేము అనే బాధ, మరో ప్రక్క ఆ అబ్బాయి మధురిమకు తెలియకుండా గమనించి తనతో మాట్లాడటం వలన కలిగిన సంతోషం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

యింతలో “హలో… మిమ్మల్నే…” అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి చూస్తే మధురిమ ప్రక్కన కిటికి బయట నిలబడివున్నాడు ఆ అబ్బాయి.  “సిస్టర్ మీ చేతిలో ఉన్న కర్చీఫ్ నాదే… కొంచెం యిస్తారా ప్లీజ్…” అని అడిగాడతను. మధురిమకు అతని పిలుపు ‘సిస్టర్’ ఎకో సౌండ్ లాగా వినపడటంతో ప్రేమ కాస్తా 3600 కోపంగా మారిపోయి “యిదేమైనా యాంటిక్ పీసా, మ్యూజియంలో పెట్టుకోవటానికి?” అని అరిచి ఆ అబ్బాయి చేతికి రూమాలందించింది. అతను ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. నేను, బామ్మగారు పొట్ట చేత పట్టుకొని నవ్వసాగాము. యిది చాలాదన్నట్లు… కాంప్లిమెంట్ మధుకి కాదు యిచ్చినది, ఫోనులో మాట్లాడుతూ వేరేవారికి అని తెలియడంతో మరెంత చిందులు తొక్కింది.

రైలు బయలుదేరి 15 నిమిషాలు అయింది. మధురిమ విజయవాడ వచ్చే దాకా కళ్ళు తెరస్తే ఒట్టు. మళ్ళీ జీవితంలో యింక ఏ అబ్బాయికైనా సైట్ కొడితే ఒట్టు. తొలి ప్రేమ కాస్తా తుస్సుమన్నది. ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు నాకు, మధుకి బాగా నవ్వు వస్తుంది. మధు ఉడుక్కోవటం మరింత నవ్వు తెప్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here