[dropcap]నొ[/dropcap]ప్పింపక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు అన్నాడు సుభాషితకారుడు, నీతికోవిదుడు. సుభాషితకారుని నిర్దేశానుసారం చూస్తే ‘స్వామి’ ధన్యుడు కాడు. ఎందుకంటే యితరుల్ని నొప్పింపడు గానీ, తను నొస్తాడు. అందుకని అతడు ధన్యుడు కానేరడు. తన్ను కూడా నొప్పించు కోనప్పడే గదా ధన్యుడయ్యేది. స్వామి కానైతే అధముడు కానేకాదు. మధ్యముడు కూడా కాడు. ఉత్తముడో కాక ఉత్తమోత్తముడో అన్న విభాగానికి చెందినవాడు. ఉత్తముడు, ఉత్తమోత్తముడు అనబడేవాడు నీతికోవిదులు చెప్పగా, తనూ చదువగా, చదివింది చదివినట్లుగా ఆచరించాలిగదా. పాపం స్వామికి ఈ విషయంలో మట్టుకు అచరణ సాధ్యం కాలేకపోయింది. తాను నొస్తాడు గానీ తప్పించుక తిరుగడు.
నొప్పించురు తానొవ్వరు అన్న కోవలోకి వచ్చేవారు కుప్పలు తెప్పలు ఎక్కడు చూసినా వాళ్ళే. వాళ్ళూ నేరస్థులే, పాపం స్వామి లాంటి వాళ్ళు గూడా నేరస్థులే సుభాషితకారుని నిర్దేశానుసారం.
స్వామి యితరుల దృష్టి ప్రకారం – అంటే సమస్య గ్రంథ, పురాణ, వేదేతిహాసాల ప్రకారం, మహాత్ముల మునిపుంగవుల దృక్కోణంలో అతడు ‘సజ్జనుడు’, ‘ఉత్తముడు’ కానీ, సుభాషితకారుని ప్రమాణ నిర్ణయానికి సరితూగ లేకపోతున్నాడు.
స్వామి చిన్నతనంలోనే అతడి తండ్రి చనిపోయాడు. తల్లి పెద్దజేసింది. భర్త లేని తీరని లోటు తప్పిస్తే ఆమె కొడుకుని పెంచడంలో, తాను బ్రతకడంలో యితరత్రా బాధలు, కాయకష్టాలేం పడలేదు. ఆమె ప్రభుత్వోద్యోగి. దాంతో పిల్ల వాడి చదువు సంధ్యలకు గూడా లోటేం లేకుండింది. గానీ, లోపమల్లా స్వామి జీవిత విధానంలోనే. అతడు చదువులో ఆఖరు బెంచీ వాడే. అతని చదువేం లేదు. పరధ్యానం, పరమాత్మని చింతన తప్పితే పూజలు, ప్రార్థనలు, భక్తి గీతాలాపనలు, బొట్లు, బోనాలు… ‘విధ్యాధరుని అండ నుండ వేరె విద్యలేల’ అన్నది స్వామి అంతరంగం. స్వామి తన యిహలోక చింతనలకు ఎంతో దూరం. పరలోక చితనకు అతి దగ్గర అన్నట్టుగా చదువు స్కూల్ ఫైనల్ పరీక్షలో ఫెయిలయ్యాడు.
భగంవతుడు తన భక్తుని గాలికి వదిలేస్తాడా! లేదు. భగవంతుడు స్వామికి ఒక పెద్ద కంపనీలో చిన్నపాటి రోజువారీ కూలీ దయచేయించాడు. ఆ వచ్చిన కూలీ డబ్బుల్తో దేహాన్ని నిల్పుకుంటూంటే చాలు గదా! స్వామి కోరిక కూడా అంతే. దేవుడు ఎంత దయచేస్తే అంతే!
“స్వామీ! అధమాధములకు, అదములకు, మధ్యములకు లాగా నీకు మంచి ఉద్యోగాలేననోయ్, నీకు కాయాన్ని నిల్పి వుంచుకోవడామే నీ వుద్యోగం కదా!” అన్నాడు దేవుడు.
“మహా ప్రసాదం” అన్నాడు స్వామి.
కానీ, దేవుడు దయ చేయించిన వుద్యోగం కాయకష్టంతో కూడింది. స్వామి శరీరమేమో ఆతి దుర్భలమైందాయె. తల్లి ఉద్యోగం మూలంగా స్వామికి ఏలాంటి తిండి కొరతా లేకున్నా గూడా, స్వామి తిని చస్తే గదా కాయం బలంగా వుండడానికి! భగవదర్పితమైన ఈ కాయానికి యింక బలుపేల అన్నట్టు స్వామి కాయాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు.
రోజులు యిలాగే సాగితే తినని స్వామి కాయకష్టాల పాలైతే అతిసమీప కాలంలోనే హరీ అంటాడు. అది భగవంతునికి యిష్టమే కావ్చచు స్వామి తనలో లీనమై, ఐక్యమైపోవడం. కానీ అతడ్ని కన్న మాతృదేవికి, అతని బంధుమిత్రులకు, హితులకు అలాంటి కోరిక వుంటదా? అంచేత వాళ్ళు అతనితో ఈ కాయకష్టపు రోజు వారీ కూలీ ఉద్యోగం చేయించే స్థానంలో కాయకష్టం తప్పే ఉద్యోగానికి ప్రయత్నాలు చేయించారు, సఫలులయ్యారు. స్కూల్ ఫైనల్ ఫెయిలైవున్న ‘స్వామి’కి ప్రభుత్వ బస్సు కండక్టరు వుద్యోగం దొరికింది.
స్వామి అందిరిలా అధముడో, మధ్యముడో కాడాయే. అంచేత ప్రయాణీకులందరి చేతా నిర్బంధంగా టికెట్టు కొనిపించందే వదలడు. టికెట్ యివ్వకపోవడం – డబ్బులు వసూలు జేసి జేబులేసుకోవడం అన్నది అసలే వుండదు గదా! అంచేత తన బస్సు డ్రైవరుకు రోజూ పూట పూటకు టిఫిన్లు, టీలు, పాన్లు, భోజనాలు చేయించడం, డ్యూటిలో దిగిపోయిం తర్వాత త్రాగిపించడం లాంటివి లేవుగదా!
స్వామి సరియైన దూరానికి సరియైన టికెట్టు తెంపి సరియైన డబ్బులు తీసుకుంటాడు. పైగా బీద, బిక్కి ప్రయాణీకులు తటస్థపడితే స్వయంగా తన జేబుల్నించి వాళ్ళ టికెట్టు పైసలు భరిస్తాడు!
స్వామికి పై రాబడి వుండదు గనుక అతడి బస్సు డ్రైవరుకు కూడా ‘పైవన్నీ’ వుండవు! యిప్పుడు అతడి బస్సు డ్రైవరుకు లేని తిప్పలు వచ్చిపడింది! స్వామికి స్వతహాగా చాయ్‌లు, సిగరెట్లు, పాను అలవాట్లు లేవు కాబట్టి దాంతో డ్రైవరును వెంట దీసుకుపోయే ప్రసక్తిలేదు. దాంతో బాటుగా స్వామికి అదనపు ఆదాయం లేదు కాబట్టి డ్రైవరుకు ఉపవాసాలు…. డ్రైవరుకు స్వామి అంటే మూర్ఖుడు దాపురించాడు. డ్రైవరు స్వామిని ఉరిమురిమి చూడసాగాడు. డ్రైవరు స్వామికి హెచ్చరికలు గూడా చేశాడు. “నీలాంటి సత్యసంధులు, మూర్ఖులు ఎంతో మంది మారిపోయారు గానీ నీవు మాత్రం మారడం లేదు. నీవు కమిషన్లు కొట్టు, కొట్టక; న్యాయంగా నాకు రావాల్సిన వాటాను నువ్వునీ జేబుల్నించి చెల్లించాల్సిందే” అన్నట్టుగా డిమాండ్ చేశాడు డ్రైవరు. అలాంటి పనులు తానేమీ చేయడు కాబట్టి అలాంటి కమీషన్ల వాటలాంటివేం డ్రైవరుకు చెల్లించేది లేదన్నాడు స్వామి. పైగా స్వామి డ్రైవరుకు హితోపదేశం చేయసాగాడు-
“సిగరెట్లు కాల్చడం దురలవాటు – ఆరోగ్యానికి హానికరం. అలాంటి దురలవాట్లకు దూరంగా వుండాలి. యిప్పటికే అలవాటులో పడిపోయి వున్నావు కాబట్టి ఆ అపాయం నుండి తప్పించుకోవాలి. సిగరెట్టు తాగడం మానుకో” అన్నాడు. “టీ, పాన్ కూడా మంచి అలవాట్లు కాదు కాబట్టి మానుకోవాలి” అన్నాడు. “యిక మందు అంటావా అది మరింత చేటు. త్రాగే నీ ఒక్కడి ఆరోగ్యానికి, అర్థికానికి హాని కాదు గదా మొత్తం కుటుంబానికి, భార్యాపిల్లలకు హాని చేస్తుంది. అంచేత వెంటనే దూరంగా తొలగాలి” అన్నాడు. “లొట్టి తాగినవాడు లోకులను చెరచురా అన్నట్టు నీవు లోకులనేం కాదు గానీ, నిన్ను నీవు, నీ కుటుంబాన్ని చెరుస్తావు” అన్నాడు. లొట్టి తాగిన వాడు లోకులను చెరచు అన్నాడు యోగీశ్వరుడు. అది చాలా పాతాకాలపు సంగతి. యిప్పుడు లొట్టి ఎవ్వడు తాగుత లేడు. లోట్టి తాగేతంతటి అమాయకులేం మిగలిలేరు. నీళ్ళ కల్లుకు తాలు వడ్లు అనే కాలం పోయింది. అంతా మందు కలిపిన కల్లు అసలు నోట్లకు నకిలీ కల్లు… గా కల్లు నీళ్ళ జమానా గూడ పడిపోయింది. యిప్పుడంతా సీసాలు, లేకుంటే పాకెట్ల జమానా. ఈతాకు వేసి తాటాకు లాగే జమానా. చీప్ లిక్కరు మీద తయారు మీద పదిరూపాలు ఖర్చు చేసి నూరు రూపాయలు లాగడం… చీప్ లిక్కరు త్రాగితే ప్రాణానికి హాని, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరు తాగితే రాబడి చాలదు, యిల్లు గుల్ల… అందుకని స్వామి డ్రైవరుకు హితోపదేశం చేశాడు దాన్ని మానుకోమ్మని!
అప్పటికి చాయ్, పాన్ ఖర్చులనిమిత్తం డ్రైవరుకు స్వామి తన జేబుల నుండి భరిచసాగాడు! డ్రైవరుకు కండక్టరు మీద మంట వుండనే వున్నది. స్వామి పీడ వదిలించుకోందే తన బ్రతుకు గడవదు అన్న నిర్ణయానికి వచ్చాడు. బోడి వెదవ! వాడికి జీతమెందుకు, డబ్బులెందుకు? ఏం ఖర్చులు? తిండి ఖర్చా, తాగుడు ఖర్చా. తల్ల సంపాదన తోటే కడుపులోని చల్ల కదలకుండగా బ్రతుకుతాడు. అలాంటివాడు తనకు ఉపదేశాలు నూరిపోస్తాడా!
స్వామి పీడ విరగడ జేసుకునే దిశలోనే డ్రైవరు అలోచిస్తున్నాడు.
బస్సు ఓ పల్లెటూర్లో ఆగింది. జనాలు బస్సు ఎక్కడానికి దూసుకవస్తున్నారు. స్వామి పుట్ బోర్డు మీద నిల్చుని టికెట్లు తీసికున్న తర్వాతనే బస్సులోకి అడుగుపెట్టాలంటున్నాడు. టికెట్టు తీసుకన్న తర్వాతనే బస్సు నెక్కాలన్నది అక్కడ పద్ధతి.
“ఎహే తీసుకుంటం లేవయ్యా టికెట్లు. టిక్కెట్లు తీసుకోవడానికే మొచ్చింది. ముందు సీటు దొరకాలి” అంటూ విధివిధానాల్ని అతిక్రమిస్తూ ప్రయాణీకులు బస్సు నెక్కసాగారు, కండక్టరును లెక్క జెయ్యకుండా. కండక్టరు మరోడైతే వాళ్ళను బస్సునెక్కనిచ్చేవాడే గాదు. ఒకవేళ ఎక్కినా, దించేసేవాడు. ప్రయాణీకులు మరీ మితిమీరితే బస్సును పోలీస్ స్టేషను ముందుకు తీసికెళ్ళి ఆపేవాడు. స్వామి అలాంటి వాడు కాదాయె. నొప్పింపక తానొచ్చును అన్న విభాగానకి చెందిన వాడాయె. ప్రయాణీకులు బస్సు నెక్కింతర్వాత స్వామి టికెట్లు చింపసాగాడు. ముందుకు సాగుతూ… వెనక్కి వస్తూ… “టికెట్… టికెట్… అందరూ తీసుకున్నారా టికెట్?… యింకెవరన్నా టికెట్ తీసుకునేదుందా?” అని అడుగుతూ. అందరూ టికెట్లు తీసుకన్న సూచనలందాయి. యింకెవ్వరూ టికెట్ తీసుకనేది లేనట్టు నిర్ణయం జరిగాక బెల్ కొట్టాడు. బస్సు కదిలిపోతోంది. ముందు స్టేజీ రావడానికి ముందే బస్సు ఆగింది మధ్యలో… టికెట్ యిన్‌స్పెక్టర్లు బస్సునాపారు. కండక్టరు నుండి టికెట్ ప్యాడ్‌ను తీసికున్నారు. చెకింగ్ మొదలుపెట్టారు. ముందు సీట్లలో టికెట్ లేకుండా దొరికారు ముగ్గురు!
“టికెట్లు ఎందుకు తీసికోలేదు?” అడిగారు యిన్‌స్పెక్టర్లు ఆ దొంగ ప్రయాణీకుల్ని.
“టికెట్లు యివ్వమని కండక్టరుకు పైసలిచ్చాం బస్సులోనికి ఎక్కడానికి ముందే. కండక్టరు డబ్బులు వసూలు జేసుకున్నాడు గానీ టికెట్లు యివ్వలేదు! టిక్కెట్లు యివ్వమని అడిగితే మీకేం పర్వాలేదు కూర్చోండి అని గదమాయించాడు మీది కెళ్ళి మమ్మల్నే. మేము మళ్ల మళ్ల అడిగే ధైర్యం చాలక బిక్కచచ్చి కూర్చుండి పోయాం సార్ అన్నడు.”
“కండక్టర్!” అన్నారు యిన్‌స్పెక్టర్లు.
“ఇదంతా తప్పు సార్! వీళ్ళసలు నాకు డబ్బులివ్వలేదు. టికెట్లు తీసుకన్నామనే అన్నారు. ద్వారం దగ్గర నన్ను నెట్టతూ లోనికి ఎక్కారు” అన్నాడు స్వామి.
“లేదు సార్! దేవుని సాక్షి! టికెట్టుకయేంత డబ్బులిచ్చాం. డబ్బులు తీసుకని టికెట్టు యివ్వలేదు” అన్నారు ప్రయాణికులు.
“అబద్ధం సార్” స్వామి.
“ఊరుకోవయ్య! మీ సంగతులేమైనా కొత్తనా! అబద్దాలాడిది మీరా, ప్రయాణీకులా!… డ్రైవర్! బస్సు పోనీ” అన్నారు యిన్‌స్పెక్టర్లు.
తర్వాత వచ్చిన బస్సు స్టేషన్లో యిన్‌స్పెక్టర్లు దిగుతూ స్వామిని వెంటదీసికెళ్ళారు… వాళ్ళు స్వామి వుద్యోగం పోకుండా కాపాడడానికి ఎంత మొత్తం ఖర్చువుతదో చెప్పారు.
“నేను నేరం చేయనే లేదు. చేయని నేరాన్ని మీరు నన్ను ఒప్పుకోమంటున్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడం కూడా నేరమే. అది నేను చేయలేను. యిలాంటి తప్పులు నేరాలు చేయడం కన్నా నేను నా ఉద్యోగం పోగొట్టుకోవడానికి సిద్ధమే, ఏ శిక్షకైనా సిద్ధమే” అన్నాడు స్వామి.
స్వామి ఉద్యోగం పోయింది.
తన ఉద్యోగానికి ఎసరు తెచ్చినవాడు డ్రైవరే అన్న విషయం స్వామికి తర్వాత తెల్సింది.