నీలమత పురాణం – 30

0
4

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యామ్యం మార్గం సుఖేనైవ తేన యాన్తి విపశ్చితాః।
యావన్తి రామకూపాణి తస్య దానస్య కాశ్యప॥

[dropcap]పౌ[/dropcap]ర్ణమి నాడు పూజలు చేసి ప్రసాదాలు పంచి, దానాలు చేసిన తర్వాత దీపం వెలిగించాలి. ఈ దీపం ఒక బుట్టలో పెట్టి నెల పాటు ఇంటి ముందు వ్రేలాడదీయాలి. దీపం క్రిందిభాగంలో గంధం పూయాలి. ఈ దీపం ఉన్న బుట్టలో కొన్ని కూరగాయలు ఉంచి నది నీళ్లలో వదిలివేయాలి.

ఇసుకతో చేప ఆకారాన్ని తయారు చేయాలి. దానిలో పాలు పోయాలి. వజ్రాలు కళ్లుగా ఉంచాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. తెల్లటి ఎద్దును సర్వాంగ సుందరంగా అలంకరించి, సుగంధ ద్రవ్యాలు పూసి, శక్తిని అనుసరించి ద్విజులకు దానం చేయాలి. అందువల్ల ఫలితంగా మార్గంలో ఎద్దు వారిని సుఖంగా మృత్యు దైవం వద్దకు తీసుకు వెళుతుంది. ఎద్దు ఒంటిమీద ఎన్ని రోమాలు ఉన్నాయో అంతకాలం దాన్ని దానం చేసినవారు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు. విష్ణువును అర్చించిన తరువాత, పాలు తాగి నిద్రకు ఉపక్రమించాలి.

‘నీలమత పురాణం’లో పండుగలు, పూజలు, పూజలలో చేయాల్సిన కార్యకలాపాలు తెలుసుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది. ఆనాటి సామాజిక జీవనం కొద్దికొద్దిగా అర్థమవుతూ ఉంటుంది.

ముందుగా గమనించాల్సిందేమిటంటే, ప్రజల నడుమ హెచ్చుతగ్గులు లేకపోవటం. సన్నిహితులు, స్నేహితులు, సేవకులు, బ్రాహ్మణులు అందరూ కలిసి ఒకే పంక్తిన భోజనం చేయటం, సంబరాలు జరుపుకోవటం అడుగడుగునా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఏదో ఒక పండగనే. ప్రతీ పండగలో పాటలు, వాయిద్యాల మ్రోతలు, పురాణ పఠనాలు, ఉపోషాలు, నృత్యాలు, నాటకాలు… ఇలా భక్తి, రక్తి, ఆనందోత్సాహాలు అన్నీ మిళితమై కనిపిస్తాయి. జీవితం అనేది ఒక సంబరాల పరంపర అన్నట్టు తోస్తుంది. అంతేకాదు, సంబరాలలో అలంకరణలు ఆనాటి వారి కళాభినివేశాన్ని ప్రదర్శిస్తాయి. ముగ్గులు వేయటం, రంగురంగుల పూలతో అలంకరించటం, విగ్రహాల తయారీ, ముఖ్యంగా దీపాల అలంకరణలు వంటివి ఆనాటి వారు ఏం చేసినా సౌందర్య దృష్టితో చేసేవారన్న భావనను కలిగిస్తుంది. ‘నీలమత పురాణం’లో ఇంకా ముందుకు వెళ్తే ఏయే తీర్థాలలో ఎలా పూజలు చేయాలి, ఎలా స్నానాలు చేయాలి వంటి అనేక అంశాలు తెలుస్తాయి. ఒక కోణంలోంచి చూస్తే ఆ కాలం వారి దృష్టి ధార్మికం. జీవితం అన్నది ధర్మాచరణ కోసం. ధర్మాచరణలో దైవభక్తి భాగం తప్ప, దైవం కోసం ధర్మాచరణ కాదు. ‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం’ అన్న భావన అడుగడుగునా కనిపిస్తుంది.

విష్ణువును అర్చించిన తరువాత అయిదు రోజుల తరువాత దైవాన్ని జాగృతం చేయాలి. ఆ అయిదు రోజులు నేలపై పరుండాలి. నదిలోని చల్లని శుభ్రమైన నీటిలో స్నానం చేయాలి. ఆ తరువాత హరిని, బ్రాహ్మణులను, అగ్నిని అర్చించాలి. ఎంత కష్టమైనా సరే ఈ ఐదు రోజులు మాంసాహారాన్ని పరిత్యజించాలి. దానవులు, దైత్యులు, పిశాచాలు, రాక్షసులు సైతం ఈ అయిదు రోజులు మాంసాహారాన్ని పరిత్యజిస్తారు. కాబట్టి మానవులు కూడా తప్పనిసరిగా ఈ అయిదు రోజులు మాంసాహారాన్ని వదిలివేయాలి.

ఇక్కడ మనం ఆగి ఈ మాంసాహారాన్ని అయిదు రోజులు వదిలివేయడం గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. భారతీయ ధర్మంలో ‘ఆహారం’ ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే ఆహారాన్ని భగవంతుడి ప్రసాదంగా భావించటం అలవాటు. భగవంతుడు జీవుల ఆహారం కోసం ఓషధులను సృష్టించాడన్నది నమ్మకం.  ఓషధులు అంటే వృక్షాలు. ఇవి సృజించటంలో, భూమిపై మొలవటంలో చంద్ర కిరణాల పాత్ర అధికం అన్న భావనతో చంద్రుడు ‘సుధాకరుడు’ అయ్యాడు. ‘సుధ’ అంటే అమృతం. అమృతం వ్యక్తిని చిరంజీవిని చేస్తుంది. అంటే మరణం లేనివాడిని, దీర్ఘాయుష్షుకుడిని చేస్తుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆహారాన్నిచ్చే వృక్షాలు ఓషధులు అయ్యాయి. ఇప్పుడంటే ‘ఔషధం’ అంటే మందు (మెడిసిన్) అన్న భావన స్థిరపడింది కానీ ‘ఓషధ’ అంటే ‘వృక్షం’. తద్వారా ‘ఆహారం’ అని అర్థం. అంటే ప్రాకృతికంగా లభించే ఆహారాన్ని సక్రమంగా, సమపాళ్ళలో సేవిస్తే ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. శరీరంలో సమతౌల్యం ఉండడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ సమతౌల్యం దెబ్బతినడం అనారోగ్యం అంటుంది ఆయుర్వేదం. మళ్లీ ఆరోగ్యం సిద్ధించాలంటే సమతౌల్యం ఎక్కడ దెబ్బతిన్నదో పరిశీలించి, అన్ని సరైన పాళ్లలో సేవించటం వల్ల ఆరోగ్యం సాధించవచ్చు. ఇది ఆయుర్వేదం. అందుకే ఆహారానికి అంత ప్రాధాన్యం.

ఆహారం ఎప్పుడు సేవించాలి? ఎలా సేవించాలి? ఎంత సేవించాలి? ఉపోషం ఎప్పుడు ఉండాలి? ఎంత కాలం ఉండాలి? ఏమేం తినాలి? ప్రసాదంగా ఏమేమి అర్పించాలి? వీటన్నిటి నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన కనిపిస్తుంది. ఆయా భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణ పరిస్థితులను, మానవ శారీరక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని నియమ నిబంధనలను ఏర్పాటు చేయటం కనిపిస్తుంది.

ఆహారంలో ప్రకృతి నుండి లభించే వృక్షాహారం ప్రాకృతికం. అది ప్రైమరీ ఫుడ్. జంతువుల నుండి లభించేది పరోక్షాహారం. పైగా దానిలో జీవహింస ఉంటుంది. అలాగని మాంసాహారం నిషేధం కాదు. నిర్దిష్టమైన పద్ధతిలో నియమితమైన రీతిలో మాంసాహారం స్వీకరించడం కూడా ఔషధాన్ని స్వీకరించినట్టే. అది కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మధ్యమధ్యలో మాంసాహారాన్ని మానివేయటం, శాకాహారాన్ని స్వీకరించటం, ఉపోషాలు ఉండటం వంటివి సమతుల్యాన్నిస్తాయి. అయితే, రానురాను, పలు కారణాల వల్ల ఈ ఆహారాన్ని స్వీకరించటం అన్నది మన సమాజంలో ఒక obsession గా మారిపోయింది. ఇంతగా కొందరిని రెచ్చగొట్టాలంటే ఒక రకమైన ఆహారాన్ని స్వీకరిస్తే చాలు. ఇంకొందరిని ఏడిపించాలి అంటే ఇంకో రకమైన ఆహారాన్ని నిషేధిస్తే చాలు. మనోభావాలు దెబ్బతింటాయి. ఆవేశకావేశాలు ప్రజ్వరిల్లుతాయి. దీనిలో మేధావులు, తెలివైనవారు, విద్యావంతులు, విజ్ఞానులు అందరూ ఉండటం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది చూస్తే ‘నీలమత పురాణం’ కాలం నుంచి మన సమాజ ప్రయాణం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో, ఏయే మార్గాలలో తిరిగిందో ఆలోచించాల్సి వస్తుంది. భారతీయ సమాజం నిశ్చల సమాజం కాదు. ప్రవహించే, పరుగులు తీసే నదిలాంటి చైతన్యవంతమైన సమాజం. కాబట్టి ఇప్పటి దృష్టితో అప్పటి సమాజాన్ని చూసి తీర్మానాలు చేయకూడదు. తీర్పులు ఇచ్చేయకూడదు. గతాన్ని అవగాహన చేసుకొని, వర్తమానాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్తును నిర్దేశించే దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’లో ఐదు రోజులు మాంసభక్షణ వదిలివేయమనటాన్ని ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విశ్లేషించాలి తప్ప మరో కోణంలో చూడకూడదు.

ఇంకో విషయం గమనించాల్సిందేమిటంటే పూజలు, దానాలు వంటి విషయంలో కూడా ఇలాగే చేయాలన్న నియమ నిబంధనలు లేవు. ఎవరెవరు వారి వారి శక్తికి తగ్గట్టు  చేయాలని ఉంది తప్ప ఇలా చేయకపోతే నరకం వస్తుంది, దేవుడికి కోపం వచ్చి శపిస్తాడు వంటి ఆలోచనలే లేవు.

‘స్వవిత్త శక్తయా కర్తవ్యం అప్రయుక్తం నూనమేవతు।’

‘స్వవిత్త శక్తయా’ ఎవరి వద్ద ఎంత ధనం ఉందో, దానికి తగ్గట్టుగా విగ్రహం తయారీ నుంచి దానం వరకు చేయాలి తప్ప ప్రతి ఒక్కడు వజ్రాలు పొదిగిన విగ్రహాలు దానం చేయాలని లేదు. తన శక్తి గడ్డిపోచ అయితే గడ్డిపోచను దానం చేయవచ్చు. వజ్రవైడూర్యాలు అయితే అవే దానం చేయవచ్చు. అంటే అత్యంత ‘ప్రజాస్వామిక పూజా పద్ధతి’ అన్నమాట. భారతీయ సమాజాన్ని విశ్లేషించే  సమయంలో ఈ అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here