తోక తెగిన కోతి

0
3

[dropcap]కో[/dropcap]తులంటేనే అల్లరికి పెట్టింది పేరు. అందులోనూ బాగా అల్లరి చేస్తే కోతి ఒకటుంది. అది కోతులకు నాయకుడుగా వుండటం వలన దాని దూకుడు మరి ఎక్కువగా వుండేది. కోతినాయకుని పేరు రాజన్న. రాజన్నకు పెద్ద కోతుల గుంపే వున్నది. ఆ గుంపునేసుకుని చాలా దూరదూరాలు తిరిగొస్తుంది.

కోతులు మనుషుల్ని కూడా భయపెడుతూ వుంటాయి. అది దగ్గరకు వస్తే పిల్లలు దడుచుకుని ఏడుపు మొదలు పెడతారు. ఒక్కోసారి ఏడ్చే పిల్లల్ని “అదుగో కోతి వస్తుంది పద పద లోపలకు” అంటూ ఏడ్పు మాన్పిస్తూ వుంటారు.

రాజన్న ఒక చోట ఎప్పుడూ నిలకడగా వుండటం కాని, శాంతంగా వుండటం కాని దాని స్వభావంలోనే లేదు. రాజన్న పేరు ఆ చుట్టు పక్కల ఊళ్ళలో చాలా మందికి తెలుసు. పెద్దవాళ్ళూ రాజన్న పేరునూ దాని అల్లరిని బాగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటి వాళ్లకు రాజన్న కోతి స్వభావం దాని అల్లరీ బాగా తెలుస్తున్నది. ఏళ్లు గడిచినా రాజన్నలో ఓపిక తగ్గటం లేదు. దాని చేష్టలూ తగ్గటం లేదు.

రాజన్న ఊళ్లో కెళితే ఆ వూళ్లోని తోటమాలులు ఎంతో జాగ్రత్త పడతారు. ఎందుకంటే రాజన్న తన గుంపునేసుకుని వెళ్లిన చోటల్లా చెట్ల మీద పూలూ, పళ్లతోపాటు ఆకులూ, కొమ్మలూ, రెమ్మలూ కూడా తెంపి పోసేది. తోటమాలికి ఏడుపే మిగిలేది.

ఒక రోజు రాజన్న గుంపు రాయలవారి గూడేం అనే ఊరు వెళ్లింది. ఆ గూడెంలో చాలా పండ్ల తోటలు వున్నాయి. కోతుల గుంపు వస్తున్నదని తోట కాపలాదారులు గ్రహించి రాళ్లు, కర్రలతో సిద్ధంగా వున్నారు. రాజన్న అది గ్రహించి తన గుంపును వెనకాల వుండమని తాను ఒంటరిగా తోటల దగ్గరకొచ్చింది. తాను వచ్చిన తోటకు నాల్గు వైపులా ఎత్తుగా గోడలు కట్టారు. తోటకు ఒక వైపున ఖాళీ ప్రదేశం వున్నది. అటు వైపు నుంచి వెళ్తే తోటలోకి తేలిగ్గా వెళ్లవచ్చు. కాని రాజన్న ఆ దారి నెంచుకోలేదు. ఒక గోడెక్కి చూస్తే ఆ గోడ నానుకుని ఒక రోడ్డు వున్నది. ఆ రోడ్డు మీద ప్రజలు అటూ ఇటూ తిరుగుతూ వున్నారు. కాబట్టి రాజన్న మీదకు తోటకాపలాదారులు రాళ్లు కాని, కర్రలు కాని విసరలేరు. అది గమనించుకుని రాజన్న ఆ గోడేఎక్కి కూర్చుని కాపలాదారుని కిచకిచమంటూ బెదిరించసాగింది. చేసేదేం లేక కాపలాదారుడు దూరంగా వెళ్లిపోయాడు. రాజన్న గోడ మీద కూర్చుని తోటలో ఎలా దూరాలా అని ఆలోచిస్తూ వుంటే కాపలాదారుడు కూడా తోటలోకి రాజన్న వస్తే కోట్టాలని సిద్ధంగా వున్నాడు. ఆ రోజు రాజన్న పప్పులు వుడికేటట్లు కనపట్టంలేదు.

ఇంతలో రోడ్డు మీద ఒక చిన్న పిల్లవాడు జామపండు తింటూ వెళ్తున్నాడు. అది చూసి రాజన్న ఒక్క గెంతు గెంతి జామపండు లాక్కున్నది. పిల్లవాడు ఏడ్వటం మొదలు పెట్టాడు. అక్కడున్న వాళ్ళు రాజన్న వెనకాల పడ్డారు. పారిపోయి వచ్చి ఒక పాడు బడిన ఇంటి గోడపై కూర్చున్నది. నిదానంగా పండు తినసాగింది. ఆ యింటి గోడ చిన్నదే దాని కింద ఒక నాగ జెముడు పొద వున్నది. తోక వేలాడ వేసుకుని కూర్చున్నందు వలన రాజన్న తోక నాగజెముడు పొద మీద పడ్డది. నెమ్మదిగా తోకను పైకి తీసుకున్నది కాని ఒక ముల్లు తోకలో గుచ్చుకొన్నది.  ఈలోగా రాజన్నను జనం కని పెట్టి కొట్టటానికొచ్చారు. అక్కణ్ణుంచి రాజన్న మాయమయింది.

అక్కడ్నుంచి ఎక్కువ దూరం పోలేకపోయింది. ఊళ్లోకి వచ్చింది. ఆ ఊళ్లోనే రాజన్న గుంపంతా వున్నది. ముల్లు తోకలో గుచ్చుకుని వుంటం వలన బాగా నొప్పిగా వున్నది. నొప్పి కారణంగా ఎక్కువ దూరం పోలేకపోతున్నది. దారిలో ఒక మంగలి పట్టణం వైపుకు పోవటం రాజన్న కంట బడింది. ఈ మంగలికి ఊళ్లోలో జరిగే విషయాలన్నీ బాగా తెలుసు కాని రాజన్న విషయం ఎందుకనో అతని దాకా రాలేదు. బహుశా ఈ ప్రాంతానికి అతను కొత్తగా వచ్చి వుండవచ్చు.

రాజన్న ఆ మంగలి ఎదురుగా వెళ్లి నిలబడి ఎంతో బాధగా ముఖం పెట్టి బతిమాల సాగింది. “సోదరా! నాకొక చిన్న ఉపకారం చేసి పెట్టు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. నా లాంటి మూగ జీవులకు సాయం చేస్తే నీకెంతో పుణ్యం వస్తుంది. మా కులదైవం ఆంజనేయిస్వామి నిన్నెప్పుడూ కాచుకుని  వుంటాడు” అని చెప్పసాగింది.

“విషయమేమిటో చెప్పు” అని అతనడిగాడు.

“చిన్న పనే. నా తోకలో ఒక నాగ జెముడు ముల్లు గుచ్చుకున్నది. ఎంతో నొప్పి  పుడుతున్నది. దాన్ని బయటికి తీసి నాకు మేలు చేసి పెట్టు” అనడిగింది.

“అయ్యో! ఈ మాత్రానికేనా ఇంత బతిమాలుతున్నావు. ముల్లు తీయటమేమంత పెద్ద పని? చిటికెలో తీసేస్తాను” అని తన కత్తిని నూరసాగాడు.

రాజన్న ఒక ఎత్తైన రాతి బండ మీద తన తోకను వేలాడ వేసి కూర్చున్నది. ముందుగా మంగలి తోక వెంట్రుకల్ని కత్తిరంచసాగాడు. మన కోతికి ఎప్పుడూ వెంట్రుకలు కత్తిరించుకున్న అలవాటు లేదు. అటు ఇటూ కదలసాగింది. తోకను కూడా కదుపుతున్నది. మంగలి తరువాత కత్తిని తోక మీద పెట్టాడు. ఇంతలో చీమలు కోతిని కుట్టేసరికి వాటిని దులిపేయ్యాలని తోకను విసురుగా పైకి లేపింది. ఆ విసురులో మంగలి కత్తి తోకకు బలంగా తగిలి అది కాస్తా తెగి కింద పడింది.

“నీ చేతులు విరిగిపోనూ, ఎంత కసాయివాడివి నువ్వు. నా తోకను కత్తిరించటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి. నువ్వు నాశనమైపోనూ” అంటూ కోతి మంగలిని తిట్టసాగింది.

“ఇందులో నా తప్పు ఏముంది! నువ్వే అటూ ఇటూ కదిలావు. అలా కదలటంతో తోక తెగి పడిందని” మంగలన్నాడు.

“కాదు. కాదు తప్పుంతా నీదే. నా తోక నాకివ్వు లేకపోతే నీ మంగలి కత్తి లాగేసుకుంటాను” అని కోతి బెదిరించింది.

“అయ్యో! నువ్వు బతిమాలితేనే కదా నీ తోకలోని ముల్లు తీద్దామనుకున్నాను. ఇప్పుడు తోక తెగిందని నా కత్తి లాక్కుంటే ఎట్లా? ఆ కత్తి లేకుంటే నేను నా పని ఎట్లా చేస్తాను? పని చేయ్యికపోతే నాకు తిండెక్కడి నంచి వస్తుంది? ఆకలితో చచ్చిపోతాను. కత్తి మాత్రం లాక్కోవద్దు” అంటూ మంగలి బతిమాలుకున్నాడు.

“ఆకలితో చస్తే నా కేంటి? పొట్ట పగిలేటట్లు తింటే నాకేంటి?” అంటూ మంగలి కత్తి లాగేసుకున్నది. అక్కడి నుండి వెళ్లిపోయింది.

చేసేదేం లేక మంగలి వెళ్లిపోయాడు. కోతి మరలా వచ్చి తన తెగి పడిన తోకను వెతికింది. కాని అది దొరకలేదు. బాధ పడి ఒక చెట్టు చిటారు కొమ్మ ఎక్కి కూర్చున్నది. పొరపాటున మరలా మంగలి వచ్చి కత్తి నడుగుతాడేమోనని కనపడకుండా నక్కింది.

ఇంతలో ఆ దారిన పండ్ల అమ్మే ఆడమనిషి ఒకామె వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నది. తన తల మీద వున్న మామిడి పండ్ల బుట్టను దింపి కింద పెట్టుకుని ఆ బుట్టలో నుంచి ఒక మామిడి పండును తీసుకుని నోటితో కొరికి తినసాగింది. అది చూసిన రాజన్నకు కూడా ఆకలి గుర్తొచ్చింది. తోక తెగిన బాధ అట్లాగే వున్నది. ఎగురుకుంటూ వెళ్లి ఎక్కడా పండ్లు తెచ్చుకోలేదు. చెట్టు కింద వున్న మామిడి పండ్లు చూసేటపుటికి నోట్లో తెగ నీళ్లూరసాగినవి. కిందకుదిగి వచ్చి ఆ పండ్లమ్మాయితో మాటలు మొదలు పెట్దింది. “మరీ ముర్కురాలివిలాగా అలా పండ్లని పీక్కుతింటావేంటి? చాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని తినలేవా” అన్నది.

“నువ్వా రాజన్నా, నేను బీదదానిని! నా దగ్గర చాకులూ అవీ ఎందుకు వుంటాయి?” అన్నది.

“నా దగ్గర ఒక కత్తి వున్నది. దాంతో కోసుకుని శుభ్రంగా తిను. కాయలు కోస్తే నా కత్తి ఏం పాడవదు. నా వస్తువు తీసికుని చక్కగా వాడుకో. నా కత్తి  నీది మాత్రం కాదా ఏంటి?” అంటూ తీయగా మాట్లాడింది కోతి.

ఆమె కత్తి తీసుకుని పండ్లు కోసుకుని ఆకలి తీరే దాకా తిన్నది. కాని రాజన్నకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు. రాజన్నకు కోపం వస్తున్నది. తన పని అయిన తర్వాత రాజన్నకు కత్తి తిరిగి ఇవ్వబోయింది. కాని రాజన్న తీసుకోకుండా కోపంగా చూస్తూ “నా కత్తిని నీవు పాడు చేశావు. నేను నీ కిచ్చినప్పుడు అది తళ తళా మెరుస్తున్నది. ఇప్పుడలా లేకుండా మొద్దు బారిపోయింది. దీన్ని నీవే వుంచుకో. ఇస్తే నేనిచ్చిన కత్త లాంటి దానినే ఇవ్వు. లేకపోతే ఈ పండ్ల బుట్టను వదిలేసిపో” అని బెదిరించింది.

ఆమె భయపడింది. ఆమెకు రాజన్న చేష్టలు తెలుసు. తెలిసి తెలిసి ఇరుక్కుపోయానే అనుకున్నది.  “రాజన్నా ఈ కత్తిని నేనేం చేసుకుంటాను. పీక కోసుకుంటానా ఏమిటి. ఈ పండ్లుమ్ముకునే కదా నేను బతికేది. పండ్ల గంపను నువ్వు తీసుకుంటే నేనేం అమ్ముకుంటాను. ఆకలితో మాడిపోతాను, నన్నిబ్బంది పెట్టకు” అని బతిమాలుకున్నది.

“నువ్వు చస్తే నాకేంటి ? బతికితే నాకేంటి? నా మెరిసే కత్తే నాక్కావాలి. లేదంటే పండ్ల గంప వదిలేసిపో. లేకపోతే నా సంగతి తెల్సుగా” అంటూ భయపెట్టింది https://sanchika.com/.

‘లేనిపోని ఆపద వచ్చి పడిందే’ అనుకుని ఆమె ఆలోచించేలోగానే కోతి పండ్లగంపను తీసుకుని వెళ్లింది. ఆమె అరిచి గోల పెట్టసాగింది.

పండ్ల గంపను తీసుకుని  రాజన్న ఒక పశువుల కాపరి దగ్గర కెళ్లింది. అక్కడ ఒక అమ్మాయి ఎద్దుల్ని మేపుతూ వున్నది. ఆమ్మాయి ఆకలితో నకనకలాడుతూ కన్పించింది.

“అమ్మాయీ! చాలా ఆకలిగా వున్నట్లున్నావు. దిగులుగా కనపడుతున్నావు” అంటూ మన కోతి ఆ అమ్మాయిని పలుకరించింది.

“అవును. రాజన్నా ఇవాళ ప్రొద్దున్నే చద్ది అన్నం కూడా తినలేదు. కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. నువ్వేంటి ఇలా వచ్చావు?” అన్నది ఆ అమ్మాయి.

“అయ్యో! అలాగా. నా దగ్గర పండ్ల గంప వున్నది. నీ క్కావలసినన్ని పండ్లు తిను” అన్నది.

ఆ అమ్మాయి బాగా ఆకలి మీదుంది గబగబా పండ్లను తినసాగింది. ఒకటి రెండు పండ్లను మాత్రమే మిగిల్చింది. బుట్ట వంక చూస్తూ రాజన్న బాగా కోపంగా “ఏయ్ అమ్మాయ్ నీదింత పెద్ద పొట్ట అని తెలీదు. గజమెత్తు పిల్లవు, రెండు గజాల దాకా కడుపేసుకుని పండ్లన్నీ మింగేశావు. నాకోసం కొంచెమైనా మిగల్చలేదు. నా మామిడి పండ్లు నాకు తిరిగి ఇచ్చెయ్యి. లేదా నీ ఎద్దును నాకప్పగించు” అంటూ షరుతు పెట్టింది. “అయ్యో! రాజన్నా నువ్వు తినమంటేనేగదా తిన్నాను. ఇప్పుడిలా మాట్లాడతావేంటి? సాయింకాలానికి ఇంటికి ఎద్దును తోలుకెళ్లకపోతే అమ్మ అయ్య నా తుక్కురేగ్గొడతారు. రాజన్నా, నీకు పుణ్యం వుంటుంది నన్నొదిలిపెట్టు” అంటూ జాలిగా అడగసాగంది ఆ అమ్మాయి.

కాని రాజన్న ఆ అమ్మాయి మాటలు పట్టించుకోలేదు. బలవంతంగా ఎద్దును తోలుకుపోతుంటే ఆమ్మయి గొల్లుగొల్లున ఏడవసాగింది.

కోతి ఎద్దును తోలుకుపోతుంటే ఒక గానుగ కనుపించింది. గానుగకు ఒకటే ఎద్దు వున్నది. రెండవ ఎద్దుకు బదులుగా తెలకలవాడే స్వయంగా గానుగను తిప్పుతున్నాడు.

అతణ్ణి ఆ స్థితిలో చూసి కోతికి చిలిపితనం పుట్టింది. “ఏం సోదరా ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు” అంటూ ఎగతాళిగా మాట్లాడింది.

“ఏం చెయ్యిను రాజన్నా రెండో ఎద్దు నిన్ననే చనిపోయింది. మరొక దాన్ని వెంటనే కొనలేకపోయ్యాను. గానుగ తిరిగితే కాని ఇంట్లో పొయ్యి వెలగదు. మరో దారి లేదు. ఏం చెయ్యను, నా ఖర్మ అనుకుంటూ గానుగ తిప్పుతున్నాను”. అని చెప్పాడు తెలకలవాడు.

“అయ్యో! అలాగా నా దగ్గరున్న ఈ ఎద్దును తీసుకుని గానుగకు కట్టేయ్. సాయం కాలం దాకా నూనే ఆడించుకో” అంటూ ఎంతో దయగా మాట్లాడింది కోతి.

అతను చాలా సంతోషించి ఎద్దును తోలుకెళ్లి గానుగకు కట్టేశాడు.

రాజన్న పగలంతా తిరిగి తిరిగి సాయింకాలానికి గానుగ దగ్గరకొచ్చాడు. గానుగ తిప్పే ఎద్దును చూస్తూ “అయ్యో! ఎద్దును చూడు. ఎలా అయిపోయిందో. ఆకలికి చచ్చిపోయేటట్లుగా వున్నది. ఎముకలు పొడుచుకొచ్చాయి. తిండి పెట్టకుండా మాడ్చి దాన్ని ఎండగట్టావు. ఇప్పుడిలాంటి ఎద్దు నాకొద్దు. ఈ ఎద్దును నీ దగ్గరే వుంచుకో. నాకక్కర్లేదు. ఈ ఎద్దుకు బదులు గానుగ ఆడిన నూనెంతా నాకిచ్చేయ్. లేకపోతే బాగుండదు” అంటూ తగాదాకు దిగింది.

“అదేంటి రాజన్నా! అలాగంటావు. నూనెంతా నీకిస్తే నా యిల్లెలా గడుస్తుంది ? నూనె ఇస్తానని ముందుగానే కొందరి దగ్గర డబ్బులు తీసుకుని వున్నాను. వాళ్లకిపుడు నేనేం జవాబు చెప్తాను! నేను నునె ఇవ్వలేను. నన్నుక్షమించు” అన్నాడు తెలకలవాడు.

“అదేం కుదరదు. ఇవ్వాల్సిందే” అంటూ నూనె పాత్ర బలవంతంగా లాక్కొని ఆ పాత్రను తల మీద పెట్టుకుని కోతి అక్కడ్నుంచి పరుగెత్తి వెళ్లింది.

తెలకలవాడు లబోదిబో మన్నాడు.

కోతి నూనె పాత్రను మోసుకుని వెళ్తూ వుండగా దారిలో ఒక ముసలవ్వ అట్లు పోసి అమ్మకుంటూ కనపడింది. రాజన్న సరాసరి ఆమె దగ్గరకెళ్లి కూర్చుని మాటలు మొదలుపెట్టింది. “అవ్వా! దొంతర్లు దొంతర్లుగా అట్లు పోసి పేర్చుతున్నావు కాని అవి మంచి నూనె వాసనే రావటం లేదు. ముక్కిపోయిన నూనె కంపు కొడుతున్నాయి. ఇలాంటి వాటిని ఎవరు కొనుక్కుంటారు చెప్పు. నువ్వు గనక మంచి తాజా నూనెతో  అట్లు పోస్తే కొనే వాళ్లు బారులు తీరుతారు” అంటూ ఊరించటం మొదలు పెట్టింది.

 “నువ్వా రాజన్నా! నూనె సంగతి నువ్వు సరిగానే చెప్పావు. నేను బీదదాన్ని గదా? మంచి తాజా నూనె ఎక్కడి నుండి ఖరీదు పెట్టి కొని తీసుకురాగలను?” అన్నది ఆమె.

“నా దగ్గరున్న నూనె తీసుకుని మంచిగా అట్లుపోయి. ఇదుగో నూనె గిన్నె” అంటూ ఆ గిన్నెను ఆమె కప్పగించింది.

ఆమె ఆ నూనె తోనే అట్లుపోయిటం ప్రారంభించింది. నిజంగానే అట్లున్నీ అమ్ముడయిపోయాయి. పిండి అంతా అయిపోయింది. నూనె పాత్ర కూడా ఖాళీ అయింది.

ఖాళీ నూనె పాత్ర చూసి రాజన్న మాటలు మొదలు పెట్టింది. “అవ్వా ఏదో కొంచెం నూనె వాడుకోమన్నాను. నువ్వు అదే పనిగా నూనెంతా వాడుకున్నావు. పాత్ర ఖాళీ చేశావు. ఇప్పుడీ అట్లన్నీ నాకివ్వు. ఎందుకంటే ఈ అట్లన్నీ నా నూనెతోనే పోశావు కనుక వాటిపై నాకే హక్కు వుంటుంది” అని అనసాగింది.

దీనికి దెబ్బలు తగిలిస్తే కాని మాటవినేటట్లు లేదనుకుని అవ్వ రాజన్నను కొట్టటానికి పొగగొట్టాన్ని కిందకు వంగి తియ్యబోయంది. ఇంతలోకే అట్ల దొంతర తీసుకుని రాజన్న గాలిలో ఎగిరిపోసాగింది. అవ్వ చూస్తూ వుండిపోయింది.

వెళ్తున్న రాజన్నకు ఒక డోలు వాయించేవాడు కనిపించాడు. అతడు తన డోలును వీపు మీద మోసుకువెడుతూ ఎక్కడికో వెడుతున్నాడు. అతణ్ణి ఆపి “సోదరా ఎక్కడికి వెడుతున్నావు” అని రాజన్న అడిగింది.

“ఎక్కడికో లేదు రాజన్నా. ఇక్కడికి దగ్గర్లోనే వున్న ఊర్లో పెండ్లి జరగబోతుంది. వారు డోలు వాయించాలని కబురు చేస్తే వెళ్తున్నాను” అని  సమాధానం చెప్పాడు. అట్ల దొంతరతో రాజన్న, డోలుతో అతనూ ఇద్దరూ కలసినడుస్తున్నారు. వారు వెళుతూ, వెళుతూ ఒక పంపు దగ్గర ఆగారు. “నడిచి నడిచి అలిసిపోయాం. కొంత విశ్రాంతి కావాలి. ఇద్దరం అట్లు తిందాం. పంపులోని నీరు త్రాగి కాస్త సేదదీరుదాం” అని రాజన్న కోతి డోలు వాయించేవానితో చెప్పింది.

“సరిగా చెప్పావు. కాని ఈ అడవిలో ఆకాశాన్నుండి అట్లు రాలిపడ్డాయా ఏంటి?” డోలు వాయించే అతను అడిగాడు.

“ఆకాశం నుంచి ఊడి పడ్డాయో లేదోలే. కాళ్లూ, చేతులూ కడుక్కో తిందాం.” అన్నది  “అలాగే” నంటూ అతను వచ్చి కూర్చుని తినటం ప్రారంభించాడు. అతనకి అట్లు చాలా రుచిగా వున్నాయనిపించింది. వంచిన తల ఎత్తకుండా తినేశాడు. ఇంచుమించు అన్నీ అయిపోయాయి.

అప్పటి వరకూ చూస్తూ కూర్చొన్న రాజన్న కోతి “అరే సోదరా! నువ్వే అన్నీ తినేశావు. ఇదెక్కడి సంగతి? నేను తినటానికి ఏవీ? నా అట్లు నాకు తిరిగివ్వు. ఇవ్వకపోతే నీ డోలు నాకివ్వు” అంటూ వత్తిడి చేసింది.

డోలు వాయించే వాడు ఏం మాట్లాడలేకపోయ్యాడు. అసలేం మాట్లాడాలో అతనికి తోచలేదు. కడుపు నిండా తిన్నాడు. భుక్తాయాసంతో మాట కూడా త్వరగా రావటం లేదు. అతను ఆలోచనలో వుండగానే రాజన్నకోతి డోలు తీసుకొని వెళ్తూ కనుపించింది. తన డోలు కోసం పంచె ఎగట్టి మరీ పరుగెత్తాడు. రాళ్లు విసిరాడు. ఆ రాళ్లు రాజన్నకే మాత్రం తగల్లేదు.

రాజన్న డోలు తీసుకుని తన గుంపు దగ్గరకెళ్లింది. ఆ గుంపంతా సంతోషపడింది. గుంపుకంతా రాజన్నే రాజూ, నాయకుడు కదా. వాళ్లందరూ రాజన్న నడిగారు. “మీరు ఏమేం గొప్పపనులు చేసి వచ్చారు” అని.

“అందరూ కూర్చోండి. నేను చేసి వచ్చిన పనులు చెప్తాను” అంటూ డోలు వాయిస్తూ రాజన్న కోతి పాట ప్రారంభించింది.

“తోక పోయె, కత్తి వచ్చె ఢం ఢం,ఢం
కత్తి పోయె, పండ్లు వచ్చె ఢం,ఢం,ఢం
పండ్లు పోయె, ఎద్దు వచ్చె ఢం,ఢం,ఢం
ఎద్దు పోయె, నూనె వచ్చె ఢం,ఢం,ఢం
నూనె పోయె అట్లు వచ్చె ఢం,ఢంఢం
అట్లు పోయె, డోలు వచ్చె ఢం,ఢం,డం
ఢం,ఢం, ఢం,ఢం, ఢం, ఢం, ఢం, ఢం.”

రాజన్న డోలు వాయిస్తూ ఇలా పాడుతూ వుంటే మిగతా కోతుల గుంపంతా ఈ పాటనే పాడసాగింది. అడవంతా  ఈ పాట ప్రతిధ్వనించింది. గ్రామాంలో వున్న తోటమాలి ఈ గోలంతా విని రాజన్న మళ్లీ తన గుంపుతో తోటల మీద పడబోతున్నదా అన్న ఆలోచనలో పడ్డాడు.

హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి, తెలుగు సేత – దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here