జీన్స్

5
5

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఇది. రచన వారణాసి రామకృష్ణ. [/box]

[dropcap]అ[/dropcap]రుణ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసరు, భర్త సైంటిస్టు! ఈ మధ్య అతను తరచు రాత్రిళ్ళు ఇంటికి రావటం లేదు. కొత్తగా ఏవో పరిశోధనలు ప్రారంభించటంతో పని వొత్తిడి ఎక్కువై నిద్రాహారాలు మాని ఆఫీసుకే అంకితం అయిపోయాడు.

అరుణ భర్త రాక కోసం వరండాలో నిలబడి చూస్తుండగా, “మమ్మీ! మమ్మీ!” పదిహేనేళ్ల స్మిత ఏడుపు గొంతుతో తల్లిని పిలిచింది. అరుణ తల తిప్పి చూస్తే, స్మిత సైకిల్ టైర్ వంక చూపించి “మమ్మీ! మళ్ళీ గాలి పోయింది!” బేలగా అన్నది..

“అదేంటి? నిన్నేగా నువ్వు తమ్ముడు షాపుకెళ్ళి పంచర్ వేయించుకొచ్చారు?”

ఆదివారం సైకిల్ తొక్కుకోవచ్చన్న ఆనందం కాస్తా నీరుకారేసరికి స్మిత కళ్ళల్లో నీళ్ళు ఉబికేయి. ఇంతలో లోపల్నించి కొడుకు సిద్ధూ దూసుకొచ్చి “గాలి మళ్ళీ పోయింది కదూ?” అంటూ తల్లి వైపుకి తిరిగి “ఆ సైకిల్ షాపంకుల్ చిన్న సూదితో టైరుని గుచ్చాడు మమ్మీ” చెప్పాడు. అరుణ నిర్ఘాంత పోయింది.

“ఏమిటీ – షాపతను సూదితో గుచ్చాడా?”

“అవును మమ్మీ! పంచర్ వేస్తూ రహస్యంగా చేశాడు కానీ నేనప్పుడే చూశాను! నిన్నట్నించి అక్కకి చెప్తున్నా అతనేం అలా చేయ్యడని నాతో వాదించింది!”.

వాడు చెప్పింది చెప్పినట్టు జరిగేసరికి వాడి కళ్ళు పెద్దవయ్యాయి. మెరుస్తూ పెద్దవయిన వాడి కళ్ళు లోకం మీద పెరుగుతున్న అపనమ్మకాన్ని సూచిస్తున్నాయి.

అరుణ సైకిల్ బైటికి తీస్తుంటే సిద్ధూ ఆదుర్దాగా “మమ్మీ! ఇవాళ ఆదివారం! షాపు ఉండదు!” అన్నాడు. వెంటనే స్మిత “మెయిన్ రోడ్డు మీది షాపు ఉంటుంది మమ్మీ! అక్కడికెళ్దాం మమ్మీ!” బ్రతిమాలింది.

“వొరే సిద్ధూ! డాడీ వస్తారు, నువ్వు ఇంట్లో ఉండు! నేను అక్కా వెళ్ళివస్తాం!” అంటూ అరుణ వెళ్ళబోయి మరో సంగతీ గుర్తొచ్చి ఇంట్లోకి నడిచింది.

అంతకు రెండు రోజుల ముందు సూపర్ మార్కెట్‌ నుంచి  రవ్వ తెచ్చి ఉప్మా చేస్తే – దాన్నిండా ఇసుక! మిగిలిన రవ్వ ప్యాకెట్ సైకిల్‌కి తగిలించి ఇద్దరూ మెయిన్ రోడ్డు మీదకి బైలుదేరారు.

సైకిల్‌షాపు వాడు టైరు విప్పి ట్యూబుకి గాలి కొట్టి – “పంచర్ హై మేడమ్!” అంటూ చకచకా పంచర్ వెయ్యసాగాడు.

అరుణ ఆ ఏరియాని పరిశీలనగా చూడసాగింది. పేరుకది మెయిన్ రోడ్డయినా అన్నీ గుంతలు.. గులకరాళ్ళు! ప్రక్కనే ఉన్న పెట్రోలు బంకులో జనం పెట్రోలు పోయించుకుంటున్నారు. అక్కడ రోడ్డు మీద అటు ఇటుగా బోలెడన్ని తుప్పుపట్టిన మేకులు! ఆ మేకుల మీదుగానే జనం వాహనాలు నడుపుకుంటూ వెళ్తున్నారు. ప్రక్కనే ఉన్న హార్డువేరు షాపు, ఫర్నిచర్ షాపు వాళ్ళు పనికి రాని మేకుల్ని ఇనుప సామాన్లని రోడ్డు మీదకి విసిరేస్తున్నారు.

జనం ఎవ్వరూ కూడా ఈ ఏరియాలో ఎందుకిన్ని మేకులు ఉన్నాయని కానీ బళ్ళు పాడవుతాయని కానీ ఆలోచించడం లేదు. పంచర్లు అయిన బళ్ళని ఎంతో దూరం నుంచి ఆయాసంగా తీసుకుంటూ వచ్చి పంచర్ వేయించుకుని వెళ్ళి పోతున్నారు.

ఈ లొసుగుల్ని సరిచేసేది ప్రజలా… ప్రభుత్వమా? ఎవరు దీన్ని పట్టించుకోవాలి??

అరుణ ఓపికగా మేకులు ఏరటం ప్రారంభించింది, షాపువాళ్ళు, పెట్రోలు పోయించుకుంటున్న వాళ్ళు విచిత్రంగా ఆమెనే చూడసాగారు. పంచర్ షాపు వాడు “క్యాకర్రా మేడమ్? అంటూ అదోలా చూశాడు. అరుణ జవాబివ్వకుండా సాధ్యమైనన్ని మేకులు ఏరి బ్యాగులో వేస్కుని పంచర్‌కి డబ్బులిచ్చి సూపర్ మార్కెట్లోకెళ్ళింది.

అరుణ వాపసు చేస్తున్న రవ్వ ప్యాకెట్‌ని సేల్స్ కుర్రాడు విసుగ్గా చూశాడు. అరుణ కాస్త కోపంగా చూసి “రవ్వనిండా ఇసుకే! ధర ఎక్కువైనా ఎందుకయ్యా మీ దగ్గర కొచ్చి కొనేది?” అంటూ ప్యాకెట్ చేతిలో పెట్టింది. కుర్రాడు వినయం వొలకబోస్తూ – “లేదు మేడమ్! ఎక్కడో మిస్టేక్ జరిగుంటుంది! డోంట్ వర్రీ!” అంటూ మరో ప్యాకెట్ ఇచ్చి బిల్లు చేతిలో పెట్టాడు.

అరుణ ఇంటికొచ్చేసరికి భర్త సురేష్ సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. అరుణ ఆందోళనగా చూసి “ఏమిటీ – రాత్రంతా పరిశోధనల్లోనే మునిగిపోయారా? అస్సలు నిద్రపోలేదా?” అడిగింది. సురేష్ భుజాలు ఎగరేసి నవ్వాడు. “మా పరిశోధనే నిద్ర గురించి! మేమే నిద్రపోతే మా పరిశోధనా నిద్రపోతుంది!”

“మీ పరిశోధన నిద్ర గురించా?”

అరుణ కూతూహలంగా అడిగింది. అవునన్నట్టు సురేష్ తలవూపి కాఫీకప్పుని టీపాయ్ మీద పెట్టాడు. సిద్ధార్ధ తండ్రి ప్రక్కన చేరి “అసలు మీరు చేసే పరిశోధన ఏమిటి డాడీ?” అసక్తిగా అడిగాడు.

“జంతువులు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట దుర్భరమైన చలికాలాన్ని తట్టుకునే వీలుగా దీర్ఘనిద్రలోకి జారుకునేవి! ఆ టైమ్‌లో జీవ ప్రక్రియ దాదాపు ఆగిపోతుంది! ఇట్లా దీర్ఘనిద్రకి కారణమయ్యే రెండు రకాల జన్యువులు అంటే జీన్స్‌ని మా టీమ్ కునుక్కుంది!”

సిద్ధూ మరింత ఆసక్తిగా “అట్లా నిద్రపోతే వాటికి ఆకలెయ్యదా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఈ జీన్స్ అవి అలా దీర్ఘనిద్రలోకి వెళ్ళేముందు శరీరంలో మిగిలిపోయిన గ్లూకోజ్‌ని మెదడు, నాడీమండలం పని చెయ్యటానికి ఉపయోపడేలా జీవప్రక్రియని నియంత్రిస్తాయి! ఆ టైమ్‌లో వాటి బాడీ టెంపరేచర్, గుండె వేగం తగ్గిపోతుంది! అయితే జంతువుల్లోనే కాక మనుషుల్లో సైతం ఇదే మాదిరిగా ఈ జీన్స్ పనిచేస్తాయని నేను కనుగొన్నాను!”

“వ్యాట్! మనుషుల్లో కూడానా!” పిల్లలిద్దరి కళ్ళల్లో వింతవెలుగు ప్రసరించింది. అరుణ మాత్రం అభావంగా చూస్తూ కాస్త విసుగు ధ్వనించే స్వరంతో ఇలా అన్నది: “మీరు కనుగొన్న ఈ జీన్స్ వల్ల మనుషులకేమైనా ఉపయోగం ఉందేమో అది చెప్పండి!”.

“ఎందుకు లేదు? ఉంది! ఈ జీన్స్ సహాయంతో మనుషుల్నీ అలా దీర్ఘనిద్రలోకి తీసుకుపోవచ్చు! ముఖ్యంగా స్పేస్ లోకి వెళ్ళే వ్యోమగాములకు, యుద్ధ సమయాల్లో గాయపడ్డ సైనికులకు ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరం!”

ఉత్సాహంగా సురేష్ చెపుతుంటే అరుణ ఆగమన్నట్టు సౌంజ్ఞ చేసి “ఇది కాక మరో ‘మహత్తర ప్రయోజనం’ ఉందేమో ఆలోచించి చెప్పండి!” అన్నది. ఆమె గొంతులోని వ్యంగ్యం అతనికర్ధమై “ఏమిటీ నీ ఉద్దేశ్యం?” కాస్త సీరియస్‌గా అన్నాడు.

“అవునండి! మనదేశం ఎంతో అభివృద్ధి సాధించిందని సంబరపడుతున్నాం! నాగరీకులమై పోయామని భావిస్తున్నాం! కానీ వాస్తవంగా చూస్తే జరుగుతున్న దోపిడి, అవినీతి, అన్యాయాలు ఎక్కువవుతున్న విషయం తేలిగ్గానే అర్థం అవుతోంది!”

ఆవేశంగా అరుణ చెపుతుంటే అతను అసహనంగా చూసి “దానికి నా జీన్స్ పరిశోధనలకి ఏ సంబంధం….” పూర్తి చేసేలోగానే వేగంగా ఆమె “ఉంది! అక్కడికే వస్తున్నాను! ఈ సమాజాన్ని నానా చండాలం, సర్వభ్రష్టత్వం పట్టిస్తున్నవి కొన్ని దుష్ట శక్తులు! ఇంకొందరు అవినీతిపరులు! వీరివల్ల మనం ఎంత అభివృద్ధిని సాధిస్తున్నా ఇంకా వెనకబడి పోతున్నాం! మీరు ఇప్పుడు ఇలాంటి అరాచక శక్తులు, అవినీతి పరులు బ్రతకలేని పరిస్థితిని సమాజంలో సృష్టించగలగాలి! దాన్ని మీరు జీన్స్ ద్వారా సాధించగలరా?”

సూటిగా ఆమె ప్రశ్నిస్తూంటే అతను నివ్వెరపోయాడు. క్షణంపాటు నిర్ఘాంతపోయాడు. తేరుకుని, “చూడు అరుణా! ఈ పని చేయ్యాల్సింది సైటింస్తులు కాదు! రాజకీయనాయకులు!” గట్టిగా అన్నాడు. అరుణకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ గదిలో నిశ్శబ్దం ఘనీభవించింది. అరుణ అలోచనల్లో కూరుకు పోయింది!

జాతిని పట్టి కుదిపేస్తున్న రాచపుండు – అవినీతి! దీన్ని ఎలా కూకటి వేళ్ళతో పెకిలించి వెయ్యాలి? ఎలా! ఎలా!! సమస్యకి పరిష్కారం లేదా?

***

చాలా రోజుల తర్వాత సురేష్ లాబ్ నుండి ఉత్సాహంగా వచ్చి

“అరుణా! నీ ప్రశ్నలకి జవాబు దొరికింది. నేను కనుగొన్న జీన్‌ని ప్రేరేపించే గుణం ఉన్న ఔషదాన్ని కనుకున్నాం! ప్రభుత్వాన్ని సంప్రదించాం! వారి సహాయంతో ఈ ఔషదాన్ని అరాచక శక్తులకి, అవినీతిపరులకి ఇస్తాం! మందు ప్రభావం చేత కనీసం ఆరునెలలు వీళ్ళంతా దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతారు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు! ఎలా ఉందీ ఐడియా?” సంతోషంగా అడిగాడు. అరుణ మాట్లాడలేదు.

“వండ్రఫుల్ ఐడియా డాడీ!” పిల్లలిద్దరూ ఉత్సాహంగా అరిచారు.

“మాట్లాడవేం అరుణా?”

“మీ ఐడియా బానే ఉన్నట్టంది!” అరుణ కంఠంలో అసంతృప్తి ధ్వనించింది! మనుషుల్లో దీర్ఘనిద్రకి కారణమయ్యే జీన్స్‌ని ప్రేరేపించే ఆ ఔషధాన్ని అన్ని నదుల్లోనూ, కాలవల్లోనూ రహస్యంగా కలిపేశారు! ఎవరైతే అవినీతికి పాల్పడతారో – వాళ్లంతా మందు ప్రభావం చేత వెంటనే దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతారు.

పేపర్లలో పతాక శీర్షికలు – ఉన్నట్టుండి మండలాధికారి కోమాలోకెళ్ళాడని! మరో ఊళ్ళో ఎక్సైజ్ సూపర్నెంటు నిద్రలోంచి లేవటం లేదని! మరోచోట ప్రఖ్యాత రాజకీయనేత ఉన్నట్టుండి అసెంబ్లీలోనే నిద్రలోకి జారుకున్నాడని! కారణం మాత్రం తెలీటంలేదు!.

ప్రతి రంగంలోనూ, ప్రతిచోటా అభివృద్ధి నిరోధకులు, అవినీతిపరులు అడ్డు తొలుగుతున్నారు! అయినా.. అవినీతి మాత్రం ఆగలేదు. ఇంకా చిత్రంగా అలాంటి నేరాలు పెరిగాయి! అక్రమాలు పెరిగాయి! కొందరు మరింతగా దిగజారి అవినీతికి పూనుకున్నారు!

“ఏమిటిది? మనం అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి?” – సురేష్‌తో సహా సైంటిస్టులంతా ఆశ్చర్యంతో తలలు పట్టుకున్నారు!

***

అరుణ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకం రెఫర్ చేస్తూంటే, భర్త ఫోన్ చేసి “ఈ రోజు ఐదుగంటలకి మేమంతా అర్జెంట్ మీటింగ్ పెట్టుకున్నాం! నిన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నాం!” చెప్పాడు. అరుణ ఆశ్చర్యపోయింది.

“నన్నా? నేనెందుకండి?”

“చూడు అరుణా! సురేశ్ భార్యని ఇన్వైట్ చెయ్యడం లేదు, యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని ఆహ్వానిస్తున్నాం!” చెప్పేసి ఫోన్ పెట్టేశాడు.

భర్త పనిచేస్తున్న లాబ్‌కి వెళ్దామన్న ఉద్దేశంతో అరుణ యూనివర్సిటీ నుండి త్వరగా ఇంటికొచ్చింది. ప్రతిరోజూ పిల్లలిద్దరూ ఆపాటికే స్కూల్ నుండి వచ్చి అన్నం తిని హెూం వర్కు చేసుకుంటుంటారు. అయితే ఆరోజు పిల్లలింకా స్కూల్ నించి రాలేదు. అరుణ కంగారుగా ప్రక్కింటావిడని అడుగుదామని వెళ్తే – ఆవిడ పాల కుర్రాడ్ని కేకలు వేస్తూ అరుస్తోంది. అరుణని చూసి ఆవిడ – “ఈ పాల కుర్రాడు చేసే వెధవ పనులు చూశారా! ప్రతిరోజూ పొద్దున్నే గేటు చప్పుడు చేసి పాలు అని అరిచి సంచీలో పాల ప్యాకెట్టు వెయ్యాలి! అయితే ఒక్కోరోజు ప్యాకెట్టు వెయ్యకుండానే పాలు అని అరిచి వెళ్ళిపోతున్నాడు!” కోపంగా అనగానే పాల కుర్రాడు వెంటనే “లేదండి! రోజూ నేను వేస్తానండి! కానీ ఎవరో వచ్చి ఎత్తుకు పోయుంటారు!” నిర్లక్షంగా అన్నాడు.

“ఇంకా వాదించావంటే నా చేతిలో తన్నులు తింటావు! ఈ నెల్లో నాలుగు సార్లు ఇలా చేశావు! నీకు డబ్బులివ్వను – వెళ్ళి మీ వోనర్నీ పిలుచుకుని రా పో!” గట్టిగా అనేసరికి తలదించుకుని వెళ్ళిపోయాడు.

పాల ప్యాకెట్టు వెయ్యకుండానే వేసినట్టు నటన – అలా మిగుల్చుకున్న దొంగపాలని హెూటల్ వాళ్ళకి అమ్ముకుంటాడట! హెటల్ వాళ్ళకీ విషయం తెల్సినా కూడా తక్కువ ధరకి దొంగపాలు కొనడం మానరు.

అరుణ నిశ్శబ్దంగా నిలబడ్డం చూసి పక్కింటావిడ “మీ పిల్లలేమిటి ఇవాళ ఇంతవరకూ రాలేదు!” అన్నది ఆదుర్దాగా.

“ఆటో వచ్చిందా అసలు?”

“వచ్చినట్టు లేదండి! ఈ పాలవాడి గొడవలోపడి గమనించలేదు!”

అరుణ వెంటనే స్కూటీ తీసి స్టార్ట్ చేసింది.

స్కూలు ఆవరణలో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నారు. తల్లిని చూడగానే స్మిత పరుగెత్తుకొచ్చి “మమ్మీ! ఆటో అంకుల్ రాలేదు!” దిగులుగా అన్నది. ఆటో అతనూ ఇంతే! స్కూల్ జరిగే ఇరవై రోజుల్లో ఏదో ఒక సాకుతో నాలుగైదు రోజులు రాడు. జీతం మాత్రం ఠంచనుగా నెల మొదటి రోజునే వచ్చి డిమాండ్ చేస్తాడు

జీతం తీసుకునేందుకు ఉన్న శ్రద్ధ పని పట్ల లేదు! కొంత మందికి వృత్తి పట్ల బాధ్యత, గౌరవం కనిపించదు! ఎందుకని??

అరుణ పిల్లలిద్దర్నీ ఇంటికి తీసుకొచ్చి బ్యాగులోంచి క్యారియర్ తీస్తే బరువుగా అన్పించింది. ఆశ్చర్యపోతూ “స్మితా! స్కూల్లో టిఫిన్ తినలేదూ? అడిగింది. వెంటనే సిద్ధూ తన బ్యాగ్ లోంచి టఫిన్ బాక్స్ తీసి తల్లి చేతిలో పెడుతూ “నో మమ్మీ, ఎలా తినాలి? ఉప్మా నిండా ఇసకే” చెప్పాడు. అరుణకి ప్రాణం ఉస్సురుమనిపించింది. వెంటనే వెళ్ళి సేల్స్ కుర్రాడి నెత్తిన రవ్వ కుమ్మరించాలన్నంత కోపం వచ్చింది.

తమాయించుకుని పిల్లలికి అన్నం పెట్టి హడావిడిగా తనూ తినేసి లాబ్‌కి బైలుదేరింది. దారిలో స్కూల్ ఆటో డ్రైవర్ వేరే వాళ్ళని ఎవ్వరినో ఆటోలో తీసుకెళ్తూ కనిపించి, అరుణ గమనించగానే గతుక్కుమని ఆటోని పక్కదారి పట్టించి స్పీడుగా వెళ్ళిపోయాడు.

మానవాళి ప్రగతి కోసం కొందరు అహర్నిశలు శ్రమిస్తూ కొత్త దారులు సృష్టిస్తూంటే మరికొందరు ఉన్న సవ్యదారుల్ని ధ్వంసం చేస్తూ పక్కదారులు పడుతున్నారు.

అరుణ కొంతదూరం వెళ్ళేసరికి, గుంపులు గుంపులు జనం! ట్రాఫిక్ జామ్ చేస్తూ ఓ రాజకీయ పార్టీ బృందం ఎదురయింది.

మెళ్ళో పెద్ద దండ వేస్కుని రాజకీయ నాయకుడు వంగి వంగి దండాలు పెడుతూ నవ్వుతున్నాడు. గుంపులో జనం ఆమె బండికి అడ్డం పడ్డారు. అరుణ బొక్కబోర్లా పడబోయి కంగారుగా స్కూటీని ఆపింది. వెంటనే రాజకీయ నాయకుడు దూసుకు వచ్చి “అమ్మా! అమూల్యమైన మీ ఓటు నాకే వెయ్యాలి! ఎన్నికల్లో మా పార్టీనే బలపరచాలి”! అంటూ ఒక్కసారిగా ఆమె కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.

ఊహించని ఈ చర్యకి అరుణ విస్తుబోయింది!

నడిరోడ్డు మీద ఒక వ్యక్తి ఇలా కాళ్ళమీద పడటం ఏహ్యత పుట్టించింది. ఓటు వెయ్యమని అభ్యర్థించొచ్చు కానీ మరీ ఇలా… ఇంత దిగజారిపోయి. అసలు ఒక మనిషి మరో మనిషి కాళ్ళమీద పడి అంతలా దేబిరించటం సభ్యతా? ఆత్మగౌరవం లేదా?

అరుణ షాక్ లోంచి తేరుకుని చూస్తే దూరంగా ఆ నేత మరో వ్యక్తి కాళ్ళ మీద పడ్డానికి సమాయత్తమవుతున్నాడు.

ఛీ! ఛీ! దేశంలో ఎందుకిలాంటి లీడర్స్ పుట్టుకొస్తున్నారు? ఇది ప్రజల తప్పా పార్టీల తప్పా? ప్రజలు ఒకరినొకరు ఎందుకిలా కించపరచుకుంటున్నారు? హుందాతనం లోపిస్తున్నదెందుకని? దిగజారుడతత్వం, చవకబారుతనం పెరుగుతున్న వెందుకని??

ఆమె కాన్ఫరెన్స్ గదిలో కెళ్ళేసరికే సైంటిస్టులంతా కూర్చుని జీన్స్ పరిశోధనా వివరాల్ని, ఎదురవుతున్న చేదు ఫలితాల్ని విశ్లేషిస్తున్నారు!

చివరిగా అరుణని మాట్లాడమన్నారు. అరుణ ప్రారంభించింది.

“అందరికీ నమస్కారం! మీరంతా మీ మేధనుపయోగించి జీన్స్‌ని ప్రేరేపించే అద్భుతమైన ఔషదాన్ని కనుగొన్నారు. అయితే ఈ ఔషధం మూలాన ఆరునెలలబాటు దీర్ఘనిద్రలో కెళ్తామన్న విషయం అర్థమైన అక్రమార్కులంతా ఎలాగూ ఆరునెలలబాటు అవకాశం లేదు! ఉన్న కాలంలోనే అందినంత మేర దోచ్చేద్దాం అని అబగా అక్రమాలకి దిగారు! దాని ఫలితమే పెరిగిన అవినీతి!”.

సైంటిస్టులందరికీ భూమిలోకి కుంగి పోతున్నట్టనిపించింది. వాళ్ళ భావాల్ని అర్థం చేసుకున్న అరుణ ప్రసంగాన్ని తిరిగి కొనసాగిస్తూ –

“వెల్! జరిగిందేదో జరిగింది! ఇప్పుడు, నాదో కొత్త ప్రతిపాదన – మీరు కనుగొన్న ఆ జీన్స్ ఔషధం అవినీతికి అక్రమాలకి పాల్పడేవారిని దీర్ఘనిద్రలోకి జారిపోయేలా చెయ్యగలిగింది! కానీ అలా కాకుండా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేదిగా, అవినీతి అక్రమాలకి పాల్పడే వారిని ధైర్యంగా ఎదుర్కొనే ఓ కొత్త జీన్స్ ఔషధం తయారుచేయ్యగలరా?” సూటిగా అందర్నీ పరికిస్తూ ప్రశ్నించింది.

సురేష్ భార్య కేసి విగ్ర్భాంతిగా చూశాడు. అరుణ సీరియస్‌గా కొనసాగించింది. “మనుషుల్లో ఈ రకమైన వివేకం, వివేచన, అవగాహన రావాలి అంటే అది కూడా తప్పకుండా మరో రకమైన జీన్స్ మూలానే అయ్యుంటుంది కదా! ఆ జీన్స్‌ని మీరు కనుగొనండి. కొందరిలో ఆ జీన్స్ ఎందుకని పని చెయ్యకుండా, దాని ప్రభావం ఏ మాత్రం లేకుండా నిద్రాణంగా శరీరంలో ఎందుకని ఉండిపోయాయో ప్రయోగాలు చేపట్టగలరా? ఆ దిశగా ఆలోచించగలరా??”

సురేష్ దిగ్ర్భాంతికి గురయ్యాడు! ఏ సైంటిస్టుకీ రాని గొప్ప ఆలోచన!!

“ఈ ప్రయోగం ఫలిస్తే ప్రజలు చైతన్యవంతులవుతారు! హుందాగా వ్యవహరిస్తారు! బానిస బుద్దుల్నించి బైటపడతారు. నిస్వార్థంతో, ధర్మబద్ధంగా ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలనుకుంటారు! నిజమైన సంఘజీవనం, సహజీవనం అలవాటు చేసుకుంటారు! నీతిమంతులు వివేచనతో ఆలోచించేవారినే నేతలుగా ఎంపిక చేసుకుంటారు!

మన సమాజంలో మంచివారు, మేధావులు అన్నిటికీ మించి మానవత్వం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. కానీ కొద్దిమందిలో హీనగుణాలు, సంకుచితభావాలు, కరుడు గట్టిన స్వార్థం, అమానుషత్వం ఉన్నాయి! వీరితోనే అనేక సమస్యలు వస్తున్నాయి! అభివృద్ధికి అర్థం లేకుండా పోతోంది! అభిరుచులు పలచబడి పోతున్నాయి! వీరివల్ల ప్రభావితమై సమాజంలో విలువలు క్షీణిస్తున్నాయి! స్వార్థం పెరిగి జాతి వక్రమార్గంలో పయనిస్తోంది! ఆత్మగౌరవం తగ్గిపోతుంది! దేశభక్తి నశిస్తోంది! ఉదాసీనత పెరుగుతోంది! ఉగ్రవాదం రెచ్చిపోతోంది! రాంగే రైటై పోతుంది! ఏ సమస్యకీ ‘ఇదీ పరిష్కారం’ అని చెప్పే పరిస్థితి లేకుండా పోతోంది! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే సమాజం ఛిద్రమవుతుంది! మనుగడ దుర్భరమవుతుంది! వైరస్‌లా వ్యాపిస్తున్న చెడుగుని ఇప్పుడే అదుపు చెయ్యలేకపోతే మానవత్వం మృత పదమైపోతుంది!

సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ, న్యాయ, చట్ట వ్యవస్థలు అదుపు చెయ్యలేకపోతున్న ఈ రుగ్మతల్ని, జాడ్యాల్ని విజ్ఞానశాస్త్రవేత్తలైన మీరు సరిచెయ్యగలరేమో దయచేసి ఆలోచించండి! ఏ జీన్స్ మూలాన మనిషిలో సక్రమ పద్ధతిలో కాక అన్నీ అక్రమంగా సంపాదించాలన్న ఆలోచనలు పుడుతున్నాయో ఆ జీన్‌ని మీరు పసిగట్టి దాన్ని నిర్వీర్యం చెయ్యండి. ఇది చెయ్యగలిగితే ఓ కొత్త మానవజాతి అవతరిస్తుంది! ఓ గొప్ప నాగరికతకి దారితీస్తుంది! అవినీతి, పరపీడన లేని ఆరోగ్యకరమైన ఆదర్శవంతమైన ప్రపంచం అవతరిస్తుంది!”

అరుణ విశ్లేషిస్తుంటే శాస్త్రవేత్తలందరూ అద్భుతంగా చూశారు! అపూర్వమైన ఒక గొప్ప నాగరికత వెల్లివిరిసే ముందు నాందీ వాక్యాల్లా ఉన్న ఆమె ప్రసంగం ఆలోచనల్లో పడేసింది! ఆశ్చర్యచకితుల్ని చేసింది! దశాదిశ నిర్దేశం చేసింది!!

అందరూ అప్రయత్నంగా లేచి నిలబడి అభినందనా పూర్వకంగా చప్పట్లు చరిచారు! అయితే అరుణకి ఇవేమీ వినిపించటంలేదు!

ఈ ప్రయోగం ఫలిస్తుందా! ప్రజలు చైతన్యవంతులయి సమాజం నిజమైన ప్రగతిని సాధిస్తుందా?

విజ్ఞాన పరిశోధనలకే కొత్తబీజాలు వేసి సరికొత్త జన్యుసిద్ధాంతానికి తెరలేపిన అరుణ అంకురం కోసం ఆసక్తిగా చూస్తోంది! భర్త రాక కోసం వరండాలో నిలబడి చూస్తూనే ఉంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here