గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 51: నంబూరు

0
4

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 51” వ్యాసంలో నంబూరు లోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

దశావతార వెంకటేశ్వరస్వామి

ఉప్పుటూరు చేరేసరికే చీకటి పడ్డది. అక్కడ శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత అమరేశ్వరస్వామి ఆలయం దర్శించాము. అయితే ఉప్పుటూరు ప్రకాశం జిల్లాలోది కనుక ఇక్కడ వివరాలు ప్రస్తావించటంలేదు. ఉప్పుటూరులో రాత్రి 7 గంటలకు బయల్దేరి 8-15కి గుంటూరు జిల్లాలోని పెద కాకాని మండలంలో, నంబూరు పంచాయతిలో నూతనంగా నిర్మింపబడ్డ శ్రీ భూ సమేత దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఈ ఆలయం గుంటూరు నుంచి విజయవాడ వస్తుంటే రహదారి మీదే ఎడమవైపు కనబడుతుంది. మేము వెళ్ళేసరికి హారతి జరుగుతున్నది.

శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం

విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి పక్కన, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా అతి విశాలమైన స్ధలంలో, అందంగా, ఆకర్షణీయంగా, నూతనంగా నిర్మింపబడిన ఆలయం ఇది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి. ఈ స్వామి ఆకారంలోనే దశావతారాలను దర్శింపచేసే అద్భుతమైన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు.

దాదాపు ఇలాంటి విగ్రహాన్నే మేము ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు జిల్లా వేపంజెర్లలోని దశావతార పుష్కరిణిలో చూశాము. అయితే అది తెల్లరాతి విగ్రహం. దాని పేరు మహావిష్ణు (దశావతారాలు). చిత్తూరు జిల్లాలోని వేపంజెర్ల అనే గ్రామంలో లక్ష్మీనారాయణ ఆలయానికి సమీపంలో ఒక పుష్కరిణి దాని ఒడ్డునే అనేక దేవతా మూర్తుల విగ్రహాలు, పుష్కరిణిలో కాళీయమర్దనుని విగ్రహమేకాక చుట్టూ అనేక దేవతా విగ్రహాలు వున్నాయి. అందులో 12 అడుగుల ఎత్తున్న ఈ మహావిష్ణు (దశావతారాలు) విగ్రహం కూడా వున్నది. విగ్రహం ముందు స్వామి నామం అందంగా తీర్చి దిద్దారు.

దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయం లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడ్డది. విగ్రహ ప్రతిష్ఠను 2018, జూన్ 22న అతి వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి మరో నాలుగు ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్‌, విష్వక్సేనుడివి వున్నాయి. అందుకే దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగానూ పిలుస్తున్నారు.

ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పటానికి లింగమనేని రమేశ్ కుటుంబం 18 ఏళ్ళు అవిరామ కృషి చేసింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం లింగ‌మ‌నేని పూర్ణ‌భాస్క‌ర్‌, లింగ‌మ‌నేని వేంక‌ట సూర్యరాజ‌శేఖ‌ర్‌, లింగమనేని రమేశ్, గ‌ద్దె శ్రీ‌ల‌క్ష్మి గార్లు అత్య‌ద్బుత ఆల‌యం నిర్మించాల‌న్న ఆశ‌యంతో గణపతి సచ్చిదానంద స్వామివారిని సంప్ర‌దించారు. అసలు ఈ మహత్తర ఆలయ నిర్మాణ సంకల్పానికి బీజం కూడా తిరుమల కొండపైనే పడింది. కలియుగ దేవదేవుని నిత్యం దర్శించుకునే లింగమనేని కుటుంబ సభ్యులు ఆ తిరుమల కొండపైనే ఒక మహోన్నత ఆలయాన్ని నిర్మించాలని భావించారు. 2000 సంవ‌త్స‌రంలో ఆయనలో మొద‌లైన అపూర్వ క‌ల‌, తిరుమ‌ల స్వామివారి ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌లిగిన ఆలోచ‌న, కార్య‌రూపం దాల్చ‌డం ఆయన పూర్వ‌జ‌న్మ సుకృతంగా చెప్పుకున్నారు. ఈ విగ్ర‌హ రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి ఆరేళ్లు ప‌ట్టింది. దశావ‌తారం అనుకోవటంతో మ‌రో ఆరేళ్లు నిర్విరామ కృషి.

త‌ర్వాత 2012లో దీని నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఇంకో నాలుగేళ్లు శిల్పుల క‌ష్టంతో ఈ ఆల‌య వాస్తవ రూపం దాల్చింది. ఈ ఆలయ నిర్మాణంతో న‌వ్యాంధ్ర‌కే నిత్య శోభ తీసుకొచ్చారు.

ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం

మొత్తం ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానందస్వామి పర్యవేక్షణలో జరిగింది. శిల్పి రమణ, స్వామి వారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా గీయగా, కోయంబత్తూరు సమీపంలోని తిరుమురుగన్‌ పూండి వాస్తవ్యులు స్థపతి ఎస్‌. కనకరత్నం శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విష్వక్సేనాళ్వార్‌, గరుడాళ్వార్‌, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన శిల్పి వి.సుబ్రమణ్య ఆచార్యులు రాతితో ఈ ఆలయం నిర్మించారు. ఈ మండపంలో లక్ష్మీదేవి ఉపాలయం ఎదురుగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారమూర్తులను, గణపతి ఉపాలయానికి ఎదురుగా పరుశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అవతారాల మూర్తులను, ఆలయ మండపంలో కేశావాది చతుర్వింశతి మూర్తులను అందంగా అమర్చారు. ఈ మూర్తులన్నీ చాలా అందంగా, జీవకళ ఉట్టి పడుతూ వున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా అంగర గ్రామానికి చెందిన వీరబాబు సప్తదళ రాజగోపురాన్ని, 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా నిర్మించారు. దేవాలయానికి దిగువ భాగంలో స్వామీజీ ప్రవచనాల నిమిత్తం వేదికతో కూడిన విశాలమైన హాలును నిర్మించారు.

ఏకశిలా విగ్రహం

స్వామి విగ్రహం ఏకశిలతో నిర్మింపబడింది. దశావతారాలను ఇందులో ఎలా ప్రతిబింబచేశారంటే, శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో మూడు ముఖాలు, విగ్రహం ఎనిమిది చేతుల్లో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. ఈ విలక్షణ మూర్తి ఎత్తు 11 అడుగులు.

 

అక్కడ వున్న సమాచారం ప్రకారం ఆలయ నిర్మాత, శాశ్వత ధర్మకర్త లింగమనేని పూర్ణ భాస్కరరావు, స్వర్ణ కుమారి.

ఇక్కడితో ఇవాళ్టి మా చాంద్రాయణం పూర్తయ్యి ఇంటికి చేరేసరికి రాత్రి 9-30 అయింది. ఇవాళ మొత్తం 310 కిలో మీటర్లు తిరిగాం. 14 ఊళ్ళు, 19 ఆలయాలు చూశాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here