ఏకవాక్య కథలు-2

0
3

స్కూల్ బస్సులో వెళ్తూ ఉంటే ఎనిమిదేళ్ల పల్లవి పరధ్యానంగా
ఎందుకు నాన్నమ్మనుండి ఫోన్ కాని ఉత్తరం కాని రాలేదో,
ఇంట్లో మిగిలిన వాళ్లందరు “పల్లూ” అని పిలిస్తే
నాన్నమ్మ మాత్రం “లవీ” (లవ్ యీ) అని పిలుస్తూంటే ఎంత ఆనందంగా ఉండేదో
అని పదే పదే కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తుండగా,
“ఏ లోకంలో ఉన్నావ్” అని వనజ పల్లవిని కుదుపుతూ ఉంటే
పల్లవి లేచి బ్యాగ్ భుజానికి తగిలించుకొని, బస్సు దిగి
ఆరోజు స్పెషల్ ట్రిప్ కారణాన ఇంకో బస్ ఎక్కి
మళ్లీ అవే ఆలోచనలతో
“నాన్నమ్మ ఎప్పుడు వస్తుందంటే”
“వస్తుం”దని అమ్మా, మౌనంగా నాన్నా,
వస్తుందో రాదో అనే భయంతో తాను,
ఇలా అనుకొంటూ ఉంటే,
బస్ “ఆనందాశ్రమం” గేటు ముందు ఆగినప్పుడు
అందరు బస్సు దిగి టీచర్ మాడంతో లోపలికి వెళ్లి
అక్కడ ఉండే అవ్వలను తాతలను చూచి
వాళ్లతో నవ్వుతూ ఆడుతూ పాడుతూ
వాళ్లను నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ
వాళ్లిచ్చిన మిఠాయీలు తినీ, జూస్ తాగీ
సంతోషంగా కాలం గడిపీ
బయటికి వచ్చి మళ్లీ స్కూల్ బస్ ఎక్కాలని వెళ్లుతూ ఉంటే
అక్కడ ఒక చెట్టుకింద పల్లవి నాన్నమ్మ
తాను లవికి చెప్పే కథలోని సీతాదేవిలా
కళ్లద్దాలతో యూనిఫార్మ్ లాటి తెల్లని చీరలో కనబడగానే
పల్లవి “నాన్నమ్మా” అంటు పరుగెత్తికెళ్లి
ఆ ముసలావిడను కౌగిలించుకొని
“నువ్విక్కడున్నావా” అంటే
“లవీ” అంటూ నాన్నమ్మ ఏడుస్తూ పల్లవి కన్నులు తుడుస్తుండగా
ఆ చెట్టు రెండు పూలను నాలుగు ఆకులను వాళ్లపై రాల్చి
“ఈ ఆనందాశ్రమం అనే అనాథాశ్రమంలో
ఇంకా ఎన్నాళ్లు నేను ఈ కష్టాలను చూడాలో,
రెండు హృదయాలలో ఒకే రీతిగా మోగుతుండే
ఈ ఏకస్వర వ్యధను ఇంకా ఎన్ని సార్లు వినాలో
నువ్వే చెప్పాలి పుడమి తల్లీ” అంటూ
తలవంచి భూదేవిని ప్రార్థించినట్లు కొమ్మలను ఆడించగా
“ఒంటరిగా వచ్చిన మనిషి
ఒంటరిగానే కదా కడ చేరాలి, నీలా”-
అన్న ధ్వనిలో ఆకాశంలోని మేఘాలు ఉరుమురూపంలో వంత పాట పాడి
ఒక రెండు కన్నీటి చుక్కలను జార్చాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here