[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 6వ భాగం. [/box]
[dropcap]రే[/dropcap]పల్లె కెగువన తీర ప్రాంతమంతా విస్తరించి వున్న అడవుల్ని నరికేస్తున్నారనే వార్త వచ్చింది. ఆ డివిజన్ ఎఫ్.డి.ఓ. చాలా ప్రయత్నాలు చేశాడు కాని దొంగల్ని అరికట్టడం చాలా కష్టంగా వున్నదన్న వార్తలు వచ్చాయి. అక్కడున్న గ్రామీణుల్నే కూలీలుగా నియమించుకుని కలప మాఫియా చెట్లను కొట్టిస్తున్నది. చెట్లను కొట్టేయడం వలన నేలంతా కోసుకుపోతున్నది. పశువుల మేతా దొరకడం లేదు. మేత చాలక పాల ఉత్పత్తీ పడిపోయింది. ఇంట్లో వాడకానికీ పాలు చాలకుండె. తీరప్రాంతంలోని వాళ్ళకు పొయ్యి లోకి పుల్లలూ కరువయ్యాయి. అక్కడి వాళ్ళకు ఆ అడవులతో అవినాభావ సంబంధమున్నది. అక్కడుండే చెట్లే వాళ్ళకి ఆత్మీయులతో సమానం. ఆ అడవుల్లో నుండి వచ్చే చిన్న, చితక జంతువులకు కూడా హాని తలపెట్టకుండా చూసుకునే ప్రజలు వాళ్ళు. ఇప్పుడీ కలప మాఫియా రావడంతో ఈ మార్పులన్నీ జరిగినాయి. ఇన్ని నష్టాలు జరుగుతాయని తెలియక మాఫియాకు స్థానిక ప్రజలు సహకరిస్తున్నారని అర్థమయింది.
స్నేహలత పరిస్థితినంతా అర్థం చేసుకున్నది. స్వయంగా రంగంలోకి దిగింది. ఆ ఏరియా ఎఫ్.డి.ఓ. తోనూ, మిగతా సిబ్బందితోనూ కలిసి అక్కడి కెళ్ళింది. ‘రాజకాల్వ’ అనే ఊరి ప్రజలు ఎక్కువగా కలప నరకటంలో పాల్గొంటున్నారని చెప్పారు.
అందుబాటులో వున్న జనాల్ని సమీకరించారు. “చూడండి. ఇక్కడి అడవిని నాశనం చేస్తుంటే జరిగే నష్టాలు నాకంటే మీకే బాగా తెలుసు. అడవిని కాపాడటం మనందరి బాధ్యత. మా సిబ్బంది ఎంత జాగ్రత్తగా వున్నా మీరు వాళ్ళ కళ్ళు గప్పి మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు. ఇక్కడ వన రక్షణ సమితి అనే దొకటి వున్నది. దాన్నింకా బలోపేతం చేసున్నాం. మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి. అవసరమయితే కాపలా కాయండి. మీ దగ్గరున్న ఆయుధాలనే వుపయోగించండి. మీకు తోడుగా వుండడానికి కుక్కల్నీ పెంచుకోండి. ఒక్కొక్కళ్ళూ ఒక్కక్క యోధునిగా మారండి. మనందరిదైన అటవీ సంపదను కాపాడండి. కలప మాఫియానే తరిమికొట్టండి. ఈ ఏరియా అంతా తిరిగాను. చాలా విషయాలు తెలిసాయి. ఇక్కడివన్నీ చిన్న చిన్న గ్రామాలు. వాటిని అటవీశాఖ దత్తత తీసుకొనేటట్టుగా నేను ప్రయత్నిస్తాను. మీకు ఇక్కడ మంచి నీటి కరువు బాగా వున్నట్టు అర్థమయింది. అలాగే, ఇక్కడ జాలర్ల కుటుంబాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడి పిల్లలకు చదువూ చాలా అవసరం. గ్రామాలను అటవీశాఖ దత్తత తీసుకున్నప్పుడు మంచినీటి సౌకర్యమూ ఏర్పాటవుతుంది. పిల్లల చదువులకు ప్రభుత్వ పాఠశాలా ఏర్పాటవుతుంది. ఇవన్నీ అమలు జరిగేటట్లు నేను చూస్తాను. మీ వంతు సహకారం మీరూ అందించండి” అన్నది.
అక్కడి ఆఫీసర్‍నూ సున్నితంగా హెచ్చరించింది “మీరు గుంటూరు నుండి రేపల్లె వరకు ట్రైన్‌లో వెళ్ళి రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు చేరుకుని ఈ కాపలాదారుల్ని హెచ్చరించి రావడం కాదు. మీరూ పర్యవేక్షిస్తూ వుండాలి. ప్రజలు బాధ్యతగానే వుంటారు, మనం వాళ్ళను ముందుండి నడిపిస్తే చాలండీ. అలాగే వాళ్ళక్కావలసిన సౌకర్యాలు అందజేయటంలోనూ మనం చాలా బాధ్యతగా వుండాలి.”
“యస్ మేడమ్. మరింత కట్టుదిట్టంగా వుంటాము” అని చెప్పాడు.
స్నేహలత పర్యటనా, ఆమె ఇచ్చిన హామీలు జనం మీద బాగా ప్రభావాన్ని చూపాయి. త్వరలోనే కలప మాఫియా ఆగడాలు తగ్గాయన్న రిపోర్టులు అందసాగాయి. అటు ఆఫీసర్లు, ఇటు ప్రజలు అప్రమత్తంగా వుండటం వలన మాఫియా ఆగడాలు అరికట్టబడ్డాయి.
తను ఇచ్చిన మాట ప్రకారం రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభింపజేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటయింది. అంతకు ముందున్న పాఠశాల వాళ్ళ ఇళ్ళకు దూరం కావడంతో చాలామంది పిల్లలు చదువుకూ దూరంగా వుండిపోయారు. ప్రాథమిక పాఠశాల అందుబాటులో వుంటే దాంట్లో చేరి చదువుకుంటారు. ఆ తర్వాత ఉన్నత పాఠశాల ప్రారంభించవచ్చు అనుకున్నది స్నేహలత. వన రక్షణ సమితిలో సభ్యుల సంగతి పెరుగుతున్నది. కేవలం అటవీ సంపదను కాపాడటమే కాదు, దాన్ని ఆశ్రయించుకున్నవారి బాగోగులు కూడా తన బాధ్యత కిందకే వస్తాయనుకున్నది. ఇక్కడ చుట్టుపక్కలా చాలా పాలేలు వున్నాయి. క్రమేణా ప్రజల్ని చైతన్యపరుస్తుపోవాలి అని ఆలోచించింది. మనసుకు సంతృప్తి అనిపించింది.
***
“ఉద్యోగాల కోసం జిల్లాలు మారుతున్నాం. మీ నాన్న తిప్పినప్పుడు మీ నాన్న తిప్పారు. ఇప్పుడు నువ్వు తిప్పుతున్నావు. ఝార్ఖండ్ నుండి ఇక్కడికొచ్చిపడ్డాం. ఎప్పుడూ పని, ఉద్యోగ బాధ్యతలు. అందరూ చెయ్యటంలా ఉద్యోగాలు. ఆయనేమో రిటైరయ్యారు. వేళకింత తిని పుస్తకాల్లో తలదూర్చుకుంటారు. నువ్వేమో తెల్లారి లేస్తూనే ఉరుకులు పరుగులు. ఆ అడవి అంచులో చెంచుల సమస్యలు, ఈ అడవిలో ఎరుకలో, యానాదులో ఇబ్బందులు పడటం. అడవిలో కలప దొంగలు అక్రమంగా ప్రవేశించారు. మరెవరో అడవి జంతువుల్ని కాల్చి చంపారు. ఏ రోజు చూసినా ఇవే మాటలు. ఇవి తప్పితే వేరే మాటొక్కటి ఈ చెవులకు వినబడదు కదా? తండ్రీకూతుళ్ళిద్దరూ అడవిలోనే కాపురం పెట్టేట్టున్నారు చూడబోతే. ఇద్దరికిద్దరు సరిపోయారు. అడవికి దగ్గరగా వున్న లోతట్టు గ్రామాల్లో గిరిజనులూ వాళ్ళ సమస్యలూ… వినీ వినీ చెవులు దిబ్బెళ్ళు వేసుకుపోతున్నాయి. ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు. నువ్వేమో అడవో అంటూ చెవుల్లో ఫోన్ పెట్టుకుని మరీ మాట్లాడుతూ వుండు. మీ నాన్నేమో పుస్తకాలు రాస్తూ కూర్చుంటారు. నేనేమో ఇల్లు పట్టుకుని అఘోరిస్తాను” అంటూ ఆ వేళ మరీ నిష్ఠూరంగా మాట్లాడింది వాళ్ళమ్మ కుంజలత.
“కుంజమ్మకీ వేళ ఆగ్రహమెందుకు వచ్చిందో మీకేమైనా తెలుసా నాన్నా!” అంటూ తల్లి దగ్గరగా వచ్చి ప్రేమగా ఆమె గడ్డం పైకెత్తూ, “నిజంగా నీకేమయినా యాత్రలు చేయాలని వుంటే తప్పకుండా పంపిస్తాను. పోనీ తమ్ముడి దగ్గర కెళ్ళి కొన్ని రోజులు వుండి వస్తావా?” అన్నది.
“మోకాళ్ళ నొప్పులతో ఎక్కడికీ దూరాలు వెళ్ళలేనని నీకు బాగా తెలుసుగా. నువ్వంటే చిన్నదానివి. కాని మీ నాన్నగారికీ ఏం పట్టకపోతుండే. ఉద్యోగం చేసేటప్పుడూ పుస్తకాలే, రిటైరయ్యింతర్వాత ఇప్పుడూ పుస్తకాలతోనే రోజంతా. నేనెవరికని చెప్పేది? ఎంతకని చెప్పేది?” అంది విసుగ్గా.
“మీ అమ్మకు తీర్థయాత్రలు చెయ్యాలని లేదు. కొడుకు దగ్గరకూ వెళ్ళాలని లేదు. నేను పుస్తకాలు వ్రాసుకుంటూ కూర్చుని ఇంటి సంగతులు పట్టించుకోవటం లేదని కొంత కోపం, నువ్వు పెళ్ళి చేసుకోవటం లేదని మరింత కోపం. నువ్వు నీ మనసుకి నచ్చినవాణ్ణి పెళ్ళి చూసుకుని ఒక ఇంటిదానివయితే మీ అమ్మకు ఎక్కడ లేని సంతోషమూ ఉత్సాహమూ వచ్చేస్తాయి. అయినా ఎప్పుడో కావాలనుకున్నవాడు వేరే పెళ్ళి చేసుకున్నాడని నువ్విలా వుండిపోవటం ఫూలిష్‌నెస్ స్నేహా. వాడి మొహాన కొట్టినట్టు వేరేవాళ్ళను చేసుకుని కాపురం పెట్టి వాడి కళ్ళముందే తిరిగితే గొప్పని కుంజమ్మ అభిప్రాయం, అవునా?”
“పెళ్ళి సంగతి తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం. మీరిద్దరూ రేపు నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కోటప్పకొండకు వెళ్ళిరండి. ఈ ఏరియాలో ఆ గుడి చాలా ఫేమస్. నేనైతే చూడలేదు గాని పుస్తకాల్లో చదివాను. నాన్నగారికీ విషయాలు బాగా తెలుసు. ఏం నాన్నా, అమ్మను తీసుకెళతారుగా?”
“వెళ్ళమంటున్నావు. కోటప్పకొండ అంటున్నావు. ప్రయాణం తేలికేనా? ముందు అది చెప్పు. మీ నాన్నగారయితే ఏదైనా దాన్దేముంది ఈజీయే అనేస్తారు”
“ఆంధ్రాలో చాలా చోట్లకెళ్ళాం గాని ఈ టెంపుల్ కెందుకో వెళ్ళలేదు. గుంటూరు నుంచి నరసరావుపేటకు పోతే అక్కడ్నుంచి పది కిలోమీటర్లుంటుందేమో?”
“అంతే నాన్నా. మంచి రోడ్డు పడింది. కొండ పై దాకా వెహికల్ హాయిగా వెళుతుంది. గుళ్ళోకి వెళ్ళి దైవదర్శనానికి మాత్రం మెట్లెక్కి పోవాలి. అమ్మా ఒక రోజుకు ఎట్లాగో ఓపిక చెయ్యి.”
“శివలింగం బాగా పెద్దగా వుంటుందా? పూజలవీ బాగా చేస్తారంటనా? అభిషేకమేదైనా చేయిద్దాం.”
“ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తిగా వెలసిన శైవక్షేత్రం కుంజలతా. ఈ కొండ మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే పేర్లున్న శిఖరాలుండడం వలన త్రికూట పర్వతమని అంటారు. అయితే అన్ని శిఖరాలలోనూ ఈశ్వరుడే కొలువై ఉంటాడు. కొండ మీద కోనేరూ వుందని చెబుతారు. కాకులుండవు కాని, కోతులు మాత్రం వుంటాయట. జాగ్రత్త కుంజలతా. ఏ కొబ్బరికాయలున్న సంచో అజాగ్రత్తగా పట్టుకున్నావంటే ఇట్టే లాక్కుపోతాయి.”
“ఈమధ్యే ఈ గడి చరిత్ర నేనూ కొంత చదివాను నాన్నా. ఆనందవల్లి అనే ఆమె రోజూ పాలు తెచ్చి శివుణ్ణి సేవించిందనీ, సాలంకయ్య అనే భక్తుడు మొట్టమొదటిసారి ఈ ఆలయాన్ని కట్టించాడనీ వ్రాశారు. శివరాత్రప్పుడు తిరునాళ్ళ బాగా చేస్తారట. ప్రభలు గుడికెళ్ళటం ప్రత్యేకమైన విషయమట. వెదురుబొంగులతో శివలింగ ఆకారాన్ని ఎత్తుగా పేర్చి ప్రభను కడతారట. ఆ ప్రభను ఒక ఎడ్ల బండి మీద అమర్చితే ఆ బండిని ఎడ్లు మోసుకుపోతూ వుంటాయట. ఈ మధ్య గవర్నమెంటు బాగా శ్రద్ధ తీసుకుంటున్నది. ఈ కొండనొక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నారు. మంచి జూపార్క్‌తో సహా ఏర్పాటు చేశారు. అమ్మా! నీకు బాగా నచ్చుతుంది. తప్పకుండా రేపే వెళ్ళిరండి. బాగా పొద్దు పోయింది. వెళ్ళి పడుకోండి” అని తల్లిదండ్రులకు చెప్పి తనూ తన గదిలోకి వచ్చేసింది.
“నేనెక్కడ మొదలెట్తాను? మీ కూతురు నన్ను మాయ చేసి గుడి చరిత్ర అంతా చెప్పి, రేపెళ్ళి చూసి రండి అని చెప్పి వెళ్ళిపోయింది. మీకైనా దాని పెళ్ళి విషయంలో శ్రద్ధ లేకపోతే ఎలాగండీ?”
“గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం గాని బలవంతాన నీళ్ళు తాగించలేం కుంజలతా! దాని మనసు నెమ్మదిగా మారాలి. ఇదివరకు అస్సలు ఆ టాపిక్కే ఇష్టపడేది కాదు, ఇప్పుడు కాస్త వింటోంది. నువ్వన్నట్టు ట్రై చేద్దాం”
***
మంచం మీద పడుకున్న స్నేహలతను ఆలోచనలు చుట్టుముట్టాయి. అమ్మను తను బాగా బాధపెడుతున్నానేమో అనిపిస్తోంది. నాన్నగారు పైకి కనిపించరు, అంతే. రిటైరయ్యింతర్వాత తన జ్ఞానాన్నంతా పుస్తకాల రూపంలో వ్రాస్తున్నారు. నాన్నగారికున్న జ్ఞానం అపారం. ఆ బుక్స్ వ్రాయటం అయింతర్వాత ‘నీల్‌కమల్ పబ్లికేషన్స్’ వారిని సంప్రదించాలి అనుకున్నది.
ఎందుకో ఈ రోజు సౌందర్య జ్ఞాపకమొస్తున్నది. తనుండాల్సిన స్థానంలో ఆమె వున్నది. ఆమె మీద కోపం తెచ్చుకోవటం కాని, అసూయ పడే అధికారం కాని తనకు లేవు. అసలా ఫీలింగ్సే తనలో లేవు.
“ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగినదాన్ని మీ వాళ్ళు కోడలిగా అంగీకరిస్తారా?” అని తను మొదటినుండీ అంటూనే వున్నది.
“మీరిప్పుడుండేది ఆంధ్రానే కదా! నీకేమైనా డౌట్ వుంతే మనంతట మనమే పెళ్ళి చేసుకుందాం” అనేవాడు.
“లేదు లేదు కిషోర్. నీకొక చెల్లి వుంది. మీ పేరెంట్స్ నీ మీద చాలా ఆశలు పెట్టుకుని వుంటారు. వాళ్లతో చెప్పే చేద్దాం. ముందు మన ట్రైనింగ్ పూర్తికానీ. అదయ్యాక ఆలోచిద్దాం” అనేది తను.
ట్రైనింగ్ అయ్యీ, కాకముందే కిషోర్ ఇంట్లో పెళ్ళి ప్రస్తావన వచ్చేసింది. ఆ తర్వాత మధుర పెళ్ళి జరిగింది. మధుర పెళ్ళికి కొంతమంది మిత్రులతో కలసి తనూ వెళ్ళింది. ఆ పెళ్ళిలోనే సౌందర్య ఇంటి కోడలిలాగా, ఎంతో చనువుగా మెసలసాగింది. తను అదంతా గమనించింది. తనకప్పుడే డౌట్ వేసింది. తనను కిషోర్ పరిచయం చేస్తాడేమోనని వెయిట్ చేసింది. ప్రెండ్సందరిలో ఒకదానిగా మాత్రమే మిగిలిపోయింది. తనకే ప్రత్యేకతా దక్కనే లేదు. తనూ అతి చనువేం తీసుకోలేదు. మధుర పెళ్ళి కాగానే తిరిగొచ్చేసింది. ఆ తర్వాత తనకొక క్షమాపణ పత్రాన్ని మెయిల్ చేసి తన పెళ్ళి శుభలేఖ పంపాడు కిషోర్. ఆ రోజు మాత్రం తనకు ఏడుపు ఆగలేదు. కొండ మీద నుంది జాలువారే జలపాతంలాగా తనలో రోదన పెల్లుబికింది. కొద్దిగా భారం తగ్గాక గ్రీటింగ్స్ మాత్రం పంపింది.
‘ఎందుకిలా జరిగింది? తన అతి మంచితనం వలనా? కిషోర్ చేతగానితనం వలనా? ఎంత పెద్ద చదువులు చదివారు తామిద్దరూ? జీవితంలో మాత్రం ఓడిపోయారు. పల్లెటూరి పెద్దవాళ్ళ ఆశలూ, వారి కోరికల చక్రబంధంలో కిషోర్ బందీ అయిపోయాడు. తాను నిస్సహాయంగా వెలుపలే నిలబడిపోయింది. ఆ నిలబడి పోవటం ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయింది. ఒంటరితనమే బాగున్నట్టనిపిస్తుంది. అది నిజమైంది కాదని, అసంపూర్ణమనీ, తన ఆలోచనలు అర్థం లేనివనీ అందరూ అంటున్నారు. తీరిగ్గా ఆలోచించుకొవాలి. జీవితంలో ప్రేమ అనేది ఒకసారే పుడ్తుందని, అది మళ్ళీ మళ్ళీ చిగురించదని తను అనుకుంటున్నది. ప్రేమ లేకుండా రొటీన్ జీవితం గడపటం తనకి చాతనవుతుందా? చూద్దాం. రోజులు ఇలా గడుస్తుంటే అనుకోకుండా మళ్ళా కిషోర్ కనబడ్డాడు, వెనుకటి విషయాలన్నీ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నా విషయంలో ఇంకా ఫీల్ అవుతునే వున్నాడు. సౌందర్య చాలా మంచిదానిలాగా వున్నది. ఆమె కొచ్చిన జబ్బు గర్భాశయ ముఖద్వార కేన్సర్. ఆ కేన్సర్ వ్యాధికి ఇంకా ఐదారు సెషన్ల కీమోథెరపీ, పదులసార్లు రేడియేషన్ ఇవ్వవలసి వుంటుంది. ఇదంతా తట్టుకోవటానికి ఎంత మానసిక, శారీరక బలం కావాలి? కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కేన్సర్ కణాలు మిగిలి వుండటం జరుగుతుంది. మరికొన్ని కేసుల్లో ఆ కేన్సర్ కణాలు ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదమూ వుంటుంది. ఆ మెటాస్టాటిస్ జరక్కూడదు. ఆమెకేదైనా అయితే కిషోర్ మరీ డీలా పడిపోతాడు. పిల్లలు తల్లిని కోల్పోతారు. ఏ అనర్థం జరగకుండా అంతా మంచిగానే అవ్వాలి. ఎందుకోగాని సౌందర్యను చూడగానే నా తోబుట్టువును చూసినట్లే అనిపించింది. ఆమె అనారోగ్యానికి బాధ వేస్తున్నది. రేపొకసారి ఫోన్ చేసి పలకరించాలి’ అనుకున్నది.
***
“హలో, కిషోర్! నేను స్నేహలతను. బిజీనా?”
“లేదు. లేదు. ఫ్రీగానే వున్నాను. నీ నుంచి ఫోన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు”
“సౌందర్యగారి ఫోన్ నెంబరు నా దగ్గర లేదు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవటం కోసం చేశాను. ఆమె బెంగుళూరు వచ్చేశారా? ఇంకా అక్కడే వున్నారా?”
“ప్రస్తుతాని కక్కడే వుంది. వచ్చే వారం వస్తుంది.”
“సౌందర్యకు అల్లోపతితో పాటు ఆయుర్వేదం మందులు కూడా వాడిస్తున్నారుగా? ఈ విషయం మీకు తెలియనిది కాదు.”
“ష్యూర్. ష్యూర్. అదే పని చేస్తున్నాం. నువ్వింత కన్సర్న్ చూపిస్తున్నందు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడంలేదు. నీతో మాట్లాడుతుంటే మరలా అకాడమీలో ట్రైనింగ్‌లో వున్నామా అనిపిస్తోంది.”
“ఊహల్లోనే వుండిపోవటానికి మనమేం చిన్నపిల్లలం కాదు. బాధ్యతగల ఆపీసర్లమయ్యాం. రాష్ట్రానికీ, జిల్లాకూ బాధ్యత వహించాలి. మీ ప్రయోగత్మక వనాల పెంపకం ఎలా వున్నది? మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటితో పాటు ఔషధ వనాల పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. క్రమేపీ ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. మూలికల వైపుకు, ఔషధుల వైపుకు చూడటం ఎక్కువవుతున్నది.”
“ఆ మాట చాలా కరెక్ట్. నాకూ ఆ ఆలోచన వున్నది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడి గిరిజనుల చేత నర్సరీలు పోషణ చేయిస్తున్నాం. నారు బాగా తయారుకాగానే నాటించే పని పెట్టుకుంటాం.”
“పిల్లలెలా వున్నారు?”
“వాళ్ళమ్మను మిస్ అవుతున్నామని బాగా గొడవ పెట్టుకుంటున్నారు. ఆంధ్రా వెళ్ళి అమ్మని తీసుకొద్దామని రోజూ యుద్ధమే. అటువైపు వస్తే మాత్రం గుంటూరులో మీ ఆఫీసుకొస్తాను. ష్యూర్.”
“వస్తానన్నందుకు థాంక్స్”
“నేనే మీరు ఎన్నో థాంక్స్ చెప్పాలి. ఏం అనుకోకపోతే ఒక్కమాట. అప్పుడప్పుడూ ఫోన్ చేసి మీతో మాట్లాడచ్చా? స్నేహలతా, మీతో మాట్లాడుతుంటే ఎంతో ఊరటగా, ప్రశాంతంగా అనిపిస్తుంది”
“తప్పకుండా మాట్లాడొచ్చు. మనం ఎప్పటికీ ఫ్రెండ్స్‌మే. శత్రువులం కాదుగా. బై వుంటాను” అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహలత.
(సశేషం)